బిఆర్ఎస్ కు మరో షాక్...  ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డికి  కాంగ్రెస్ తీర్థం

పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ సత్పలితాలను ఇస్తోంది. ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు,ఆరుగురు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయారు.  తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ... ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా పార్టీని వీడుతున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ లేకుండా ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంఎల్ సిలను చేర్చుకుని ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఎన్నికల్లో బిఆర్ ఎస్ మెజార్టీ స్థానాల్లో గెలిచినప్పటికీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ముల్లును ముల్లుతో తీయాలి అన్నట్టు రేవంత్ రెడ్డి సైతం అదే పని చేస్తున్నారు. బిఆర్ఎస్ ను కోలుకోని దెబ్బతీయాలని సంకల్పించి గత కొన్ని రోజులుగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఒకే రోజు ఆరుగురు ఎమ్మెల్సీలను  చేర్చుకుని బిఆర్ఎస్  ను దొంగ దెబ్బతీశారు.   తాజాగా, బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరోవైపు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే... ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది.

బీఆర్ఎస్ విపక్ష హోదాకు ఎసరు?

తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతున్నది. ఆ పార్టీ నుంచి వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  ఎవరు చేసిన ఖర్మ వారనుభవింపక తప్పదన్నట్లుగా.. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ అధినేత ఆపరేషన్ ఆకర్ష్ పేరిట విపక్షాలను ఏ విధంగా  చేర్చుకుందో  అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గాలానికి చిక్కారు అని చెప్పడం కంటే ఆ పార్టీ అధినేత  కేసీఆర్ తీరుతో విసిగిపోయే ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విపక్షాల గొంతు అసలు వినపడొద్దు అన్న రీతిలో వ్యవహరించిందనీ, అదే ఇప్పుడు రివర్స్ అవుతోందని అంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నా పట్టించుకోకుండా ఫామ్ హౌస్ కే పరిమితమై మౌనముద్ర వహించిన కేసీఆర్  తీరు నచ్చకే ఎమ్మెల్యేలు వలస బాట పట్టారని అంటున్నారు.   మరో వైపు బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసేందుకు కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తున్నది.  ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఇటీవలి లోక్ సభ ఎన్నికలలో కనీసం ఖాతా తెరవలేదు. ఆ పార్టీ ప్రాతినిథ్యం లోక్ సభలో జీరో.  ఇంత క్లిష్టపరిస్థితుల్లో సైతం కేసీఆర్  ఫామ్ హౌజ్ దాటడంలేదంటూ ఆయనపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోగా, మరింత మంది అదే దారిలో ఉన్నారని అంటున్నారు.   కడియం శ్రీహరితో మొదలైన  వలసలు,  తెల్లం వెంకట్రావు (భద్రాచలం), దానం నాగేందర్ (ఖైరతాబాద్), పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ), కాలె యాదయ్య (చేవెళ్ళ), తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేరికదాకా దారితీశాయి.   పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయలో బీఆర్ఎస్  తెలుగుదేశం, కాంగ్రెస్ శాసనసభాపక్షాలను విలీనం చేసుకున్నది. ప్రస్తుతం బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నది. శాసన సభలోనే కాకుండా శాసనమండలిలో సైతం బీఆర్ఎస్ ఆధిపత్యం కొల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకే సారి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు  కాంగ్రెస్‌లో చేరిపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.   మరో వైపు బీజేపీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు గాలం వేస్తున్నది. కమలం గూటికి చేరాలనుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే రెడ్ కార్పెట్ వెల్ కమ్ చెబుతామంటూ తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రకటనకు కారణం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లోకి రావడమేనని అంటున్నారు.   మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ లోకో అటు బీజేపీలోకో  చేరిపోవడం ఖాయమని అంటున్నారు. మహా మిగిలితే బీఆర్ఎస్ లో ఓ ఐదారుగురు మిగులుతారనీ, వారితో బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాను కాపాడుకోవడం అసాధ్యమని చెబుతున్నారు.   

కవిత ఆశలు అడియాశలు... అందుకే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు 

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో కింగ్ పిన్  అయిన   బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆమె తీహార్ జైల్లో 120 రోజులు దాటడంతో బెయిల్ అవకాశాలు సన్నగిల్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో  కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరించడం, తాత్కాలిక బెయిల్ కూడా మంజూరు చేయకపోవడంతో కవిత తరఫున ఆమె లాయర్లు ఈ పిటిషన్ వేశారు. నిర్ణీత వ్యవధిలోగా సీబీఐ దర్యాఫ్తు పూర్తిచేయలేకపోయిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ క్లయింట్ కు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.  డిఫాల్ట్ బెయిల్ అంటే.. నిర్ణీత వ్యవధిలోగా పోలీసులు, దర్యాఫ్తు సంస్థలు కేసు విచారణ పూర్తిచేయడంలో విఫలమైతే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తికి బెయిల్ పొందే హక్కును క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్ పీసీ) కల్పిస్తోంది. సీఆర్ పీసీ సెక్షన్ 167(2) ప్రకారం.. నిర్దిష్ట గడువులోగా విచారణ పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేయడంలో పోలీసులు విఫలమైతే బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉంటుంది. అయితే, ఇది కేసు తీవ్రతను బట్టి దర్యాఫ్తు గడువు వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా నిందితులను అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లో విచారణ పూర్తిచేయడం సాధ్యం కాదని పోలీసులు భావిస్తే నిందితులని కోర్టులో ప్రవేశ పెట్టి కస్టడీకి కోరాల్సి ఉంటుంది. జడ్జి 15 రోజుల వరకు కస్టడీకి (పోలీస్ లేదా జ్యుడీషియల్) అప్పగిస్తారు. ఆ గడువులోగా కూడా విచారణ పూర్తికాకుంటే కేసు తీవ్రతను బట్టి కస్టడీ గడువును జడ్జి పొడిగిస్తారు. మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష లేదా కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో కస్టడీ గడువు గరిష్ఠంగా 90 రోజులు.. మిగతా కేసుల విషయంలో.. దర్యాఫ్తు అధికారి/ సంస్థ మరో అత్యవసర కేసును కూడా విచారిస్తుంటే గరిష్ఠంగా 60 రోజుల కస్టడీ విధించవచ్చు. ఈ గడువు పూర్తయినా కూడా కేసు విచారణ కంప్లీట్ కాని సందర్భంలో నిందితులు పొందే చట్టబద్ధమైన హక్కునే డిఫాల్ట్ బెయిల్ అంటారు. కవిత కేసుకు సంబంధించి ఈ గడువు పూర్తవడంతో ఆమె తరఫున లాయర్లు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత సంవత్సరం  ఆగస్టు 11న  సీఆర్పీసీ  స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత  బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కొత్త నేర చట్టం ప్రకారం కవితకు బెయిల్ వస్తుందో రాదో వేచి చూడాల్సిందే. 

భారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ!

తెలంగాణ ప్రభుత్వంఒకే సారి 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కాణంగా నిలిపివేసిన జీవోను తెలంగాణ ప్రభుత్వం సోమవారం (జులై 8)  విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం వివిధ  కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమితులైనవారు రెండేళ్ల పాటు పదవుల్లో కొనసాగనున్నారు.  రేవంత్ సర్కార్ తాజాగా నియమించిన కార్పొరేషన్ల చైర్మన్ల జాబితా ఇలా ఉంది.  హౌసింగ్ కార్పొరేషన్ - ఆర్. గురునాథ్ రెడ్డి,  ఆర్యవైశ్య కార్పొరేషన్ - కాల్ప సుజాత,  గ్రంథాలయ పరిషత్ - ఎండీ రియాజ్, ఫారెస్ట్ డెవలప్ మెంట్ - పోడెం వీరయ్య, స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్ - ఎన్. గిరిధర్ రెడ్డి,  మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డ్ - జనక్ ప్రసాద్. ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - ఎం. విజయబాబు, అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్ - చల్లా నరసింహారెడ్డి, శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - కె. నరేందర్ రెడ్డి,  కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - ఇ. వెంకట్రామిరెడ్డి,  హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ - నాయుడు సత్యనారాయణ,  మైనారిటీస్ కార్పొరేషన్ - ఎం.ఏ. జబ్బార్,  రోడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - రాంరెడ్డి మల్ రెడ్డి,  మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - అనిల్ ఎరావత్,  ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ - ఐతా ప్రకాశ్ రెడ్డి, పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ - నిర్మల జగ్గారెడ్డి (జగ్గారెడ్డి సతీమణి).  బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ - నూతి శ్రీకాంత్,  రాష్ట్ర సాంకేతిక సేవల అభివృద్ధి కార్పొరేషన్ - మన్నె సతీశ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ - ఎన్. ప్రీతమ్,  షెడ్యూల్డ్ ట్రైబ్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - బెల్లయ్య నాయక్,  గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - కె. తిరుపతి,  మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - జె. జైపాల్,  టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ - పటేల్ రమేశ్ రెడ్డి,  ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - బంద్రు శోభారాణి,  ఫుడ్ కార్పొరేషన్ - ఎం.ఏ. ఫహీం,  సంగీత నాట్య అకాడెమీ - అలేఖ్య పుంజల,  తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ - కె. శివసేనా రెడ్డి,  వికలాంగుల కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - ఎం. వీరయ్య,  విత్తనాల అభివృద్ధి సంస్థ - ఎస్. అన్వేష్ రెడ్డి, వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ - కాసుల బాలరాజు,  కోఆపరేటివ్ యూనియన్ - మనాల మోహన్ రెడ్డి, ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ - జ్ఞానేశ్వర్ ముదిరాజ్,  రాష్ట్ర సహకార ఆయిల్ సీడ్స్ ఉత్పత్తిదారుల ఛైర్మన్ - జంగా రాఘవరెడ్డి, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ - రాయల నాగేశ్వరరావు,  రాష్ట్ర మత్స్య సహకార సంఘం ఛైర్మన్ - మెట్టు సాయి కుమార్.

నిండా నాలుగు నెలలు లేవు... అప్పుడే నోబెల్ వరల్డ్ రికార్డు  సాధించిన తెలుగు చిన్నారి 

కొందరు చిన్నారులు ఏకసంతా గ్రహులు ఉంటారు.  నెలల వయసులో అద్భుతమైన గ్రాస్పింగ్‌ పవర్‌ ప్రదర్శిస్తారు. ఏదైనా ఒక్కసారి చెబితే ఇట్టే గ్రహించడమే కాకుండా దానిని మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడం.. గుర్తించడం కూడా చేస్తుంటారు. ఇటీవల ఇలాంటి చిన్నారులు చాలామంది గురించి నెట్టింట చూశాం. వారికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లాంటి వారు గుర్తించి సత్కరించారు కూడా. తాజాగా నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు  4నెలల చిన్నారి సాధించింది.  జగిత్యాల జిల్లా  కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్, మౌనిక దంపతుల కూతురు ఐరా వయసు నాలుగు నెలలు కూడా నిండలేదు. అప్పుడే  135 ప్లాష్ ఐడెండిటి కార్డులను గుర్తుపట్టింది. దీంతో నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు చోటు సంపాదించుకుంది.కూరగాయలు, పక్షులు, జంతువులు, జాతీయ జెండాలు, దేశాలను సైతం గుర్తిస్తోంది.చిన్నారికి ఎంతో ప్రతిభ ఉందని కొనియాడారు. చిన్నారి వీడియోను చూసిన నెటిజన్లు సైతం చిన్నారికి ఆశీర్వదిస్తున్నారు

శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు

తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. గత ఐదేళ్లుగా జగన్ పాలనలో నత్తతో కూడా పోటీ పడని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పుడు శరవేగంతో జరుగుతున్నాయి. ఐదేళ్ల జగన్ నిర్వాకం వలన కాఫర్ డ్యామ్ డ్యామేజీ అయిన సంగతి తెలిసిందే. ఇక కాఫర్ డ్యామ్ మరమ్మతులకు అవకాశం లేదనీ, కొత్తగా నిర్మించాల్సిందేనని తేలిపోయింది. దానికి ఎక్కడ నిర్మించాలి అన్న విషయం నిపుణులు తేల్చాల్సి ఉంది.  అయితే అది వినా మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని తెలుగుదేశం కూటమి సర్కార్ నిర్ణయించింది. దీంతో పనులు జోరందుకున్నాయి. పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యాం, స్లూయిజ్ పనులు ఇప్పుడు శరవేగంతో జరుగుతున్నాయి.  ఎన్నికలలో విజయం సాధించిన తరువాత తెలుగుదేశం కూటమి తన ప్రాధాన్యతలేమిటన్నది స్పష్టమయ్యే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలి పర్యటన పోలవరం, మలి పర్యటన అమరావతిలో చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఇప్పుడు పోలవరం, అమరావతిలో నిర్మాణ పనులు జోరందుకున్నాయి.  ఇటీవల రాష్ట్ జలవనరుల మంత్రి నిమ్మల రామారాయులు పోలవరం ప్రాజెక్టును పరిశీలించి దిగువ కాఫర్ డ్యాం ద్వారా సీపేజీ జలాలు బయటకు పంపేందుకు నిర్మిస్తున్న స్లూయిజ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వరద ఉధృతి పెరగడానికి ముందే ఈ పనులను పూర్తి చేయాలని విస్ఫష్ట ఆదేశాలు జారీ చేశారు. స్లూయిజ్ పనులు వరద ఉధృతి పెరగడానికి ముందుగానే పూర్తి చేయడం ద్వారా జలాలు కాఫర్ డ్యాంల మధ్య నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని నిమ్మల రామానాయుడు ఆదేశించారు.   ఈ నేపథ్యంలోనే  స్లూయిజ్‌ నిర్మాణం పనులను వేగవంతం చేశారు. కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అనుమతుల మేరకే పనులు ప్రారంభమయ్యాయని అధికారులు చెప్పారు. రెండు రోజుల్లో స్లూయిజ్ గేట్ల అమరికి పూర్తవుతుందని చెబుతున్నారు. అదే జరిగితే గోదావరి జలాలు కాఫర్‌ డ్యాంల మధ్యకు వచ్చే అవకాశాలు ఉండవు.   ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడి ప్రభుత్వం కొలువుదీరగానే  పోలవరం పనులు జోరందుకున్నాయి.  స్లూయిజ్ పనులు పూర్తి అవుతే.. స్పిల్‌వే బ్యాక్‌ వాటర్‌.. కాఫర్‌ డ్యాంలోకి రాకుండా నివారించవచ్చు, డీవాటరింగ్‌ ద్వారా కాఫర్‌ డ్యాం నడుమ సీపేజీ జలాలను తొలగించవచ్చని.. తద్వారా ఎర్త్‌కం రాక్‌ఫిల్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ పనులకు ఎలాంటి ఆటకం ఉండదని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. 

పరారీలో మాజీ మంత్రి జోగి రమేష్!

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, పెడన మాజీ ఎమ్మెల్యే  జోగి రమేష్ పరారీలో ఉన్నారా? అంటే పోలీసులు ఔననే అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి ఇంటిపై దాడి యత్నం కేసులో కీలక పాత్రధారి, సూత్రధారి అయిన జోగి రమేష్ అరెస్టు భయంతో పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.  కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన జోగి రమేష్ ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ సోమవారం (జులై 8)న విచారణకు రానున్నది. అయితే చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దాడికి యత్నించిన ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టుకు రంగం సిద్ధం చేశారన్న సమాచారంతో జోగి రమేష్ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.   జోగి రమేష్ అరెస్టు విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీలు సహా పక్కా ఆధారాలను సేకరించిన పోలీసులు జోగి రమేష్ అరెస్టుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే  జోగి రమేష్ అజ్ణాతంలోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. 

నిర్లక్ష్యపు నీడలో 800 ఏళ్ల నార్నెపాడు శాసనం!

12వ శతాబ్దపు నార్నెపాడు శాసనాన్ని కాపాడుకోవాలి! అలనాటి శాసనానికి ఆదరణ కరువు  నార్నెపాడు శాసనాన్ని భద్రపరచాలంటున్న శివనాగిరెడ్డి పల్నాడు జిల్లా, ముప్పాళ మండలం, నార్నెపాడు భీమేశ్వరాలయం బయట క్రీ.శ.12వ శతాబ్ది శాసనం నిర్లక్ష్యానికి గురవటం పట్ల, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్ర అభిమానులు మణిమేల శివశంకర్‌, స్వర్ణ చినరామిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదివారం (జులై7) ఆ శాసనాన్ని పరిశీలించారు. ఆలయ జీర్ణోద్ధరణ సందర్భంగా, ఈ శాసనాన్ని రోడ్డుపై పడేశారని, కింద పీఠం, పైన శాసన రాయి, దానిపైన నంది, విగ్రహం అలనాటి శాసన విధానాన్ని తెలియ జేస్తున్నదన్నారు. శాసన రాయిపై క్రీ.శ.1151 నాటివి రెండు, క్రీ.శ.1198 నాటి ఒకటి, క్రీ.శ.12వ శతాబ్ది తేదీ లేని రెండు, క్రీ.శ.1266 నాటి ఒకటి, కలిపి మొత్తం ఆరు శాసనాలున్నాయని, వీటిని 1933లో నకళ్లు తీయగా ఇటీవల కేంద్ర పురావస్తు శాఖ, శాసన విభాగ సంచాలకులు, డాక్టర్ కె. మునిరత్నం రెడ్డి ప్రచురించారని, శివనాగిరెడ్డి చెప్పారు.  శ్రీ నారాయణపాడు అని శాసనంలో పేర్కొన్న నార్నెపాడులో క్రీ.శ.1151 శాసనాల్లో వొరిగొండ పోలనామాత్యుడు, మందాడి కొమ్మినామాత్యుడు, క్రీ.శ.1198 శాసనంలో వల్లూరి నామనాయకుడు స్థానిక సోమేశ్వర (సోమనాథ), కేశవస్వామి అఖండ దీపాలకు గొఱ్ఱెల్ని దానం చేసిన, గ్రామంలోని సోమనాథాలయంలో అదే కాలంలో, మండెపూడి సూరమనాయుడు నందిని ప్రతిష్టించిన వివరాలున్నాయని ఆయన చెప్పారు.  క్రీ.శ.12వ శతాబ్దనాటి వెలనాటి రాజేంద్రుని శాసనంలో, బాపట్ల సమీపంలోని చందోలు నుంచి పాలిస్తున్న రెండో గొంకరాజు, ఆయన భార్య ప్రోలాంబిక, మంత్రి కొమ్మనామాత్యులు, రెమ్మన అనే కమ్మదేశాధిపతి ప్రస్తావనలు వున్నట్లు తెలిపారు. ఇంకా అదే గ్రామంలో ద్రోణ (దొర) సముద్రమనే చెరువును తవ్వించిన వివరాలున్నాయని చెప్పారు. కమ్మదేశాన్ని (కమ్మనాడు) ప్రస్తావిస్తున్న చారిత్రక ప్రాధాన్యత గల చారిత్రక ప్రాధాన్యత గల 800 ఏళ్ల నాటి ఈ శాసనాన్ని ఆలయంలోకి తరలించి, మళ్లీ యధావిధిగా నిలబెట్టి కాపాడు కోవాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

గచ్చిబౌలి సభను మరచిపోలేను: చంద్రబాబు

జగన్ ప్రభుత్వం తనను అన్యాయంగా జైల్లో వేసినప్పుడు పార్టీలకు సంబంధం లేకుండా అనేకమంది నాకు సంఘీభావం పలికారు. ముఖ్యంగా గచ్చిబౌలిలో నిర్వహించిన సభను నేను మరచిపోలేను అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాలుగోసారి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కి చంద్రబాబు మొదటిసారి వచ్చారు. కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం విజయానికి తెలంగాణ తెదేపా శ్రేణులు పరోక్షంగా కృషి చేశాయి. తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందన్న నమ్మకం నాకుంది.  ఏపీలో తెలుగుదేశం విజయానికి సహకరించిన ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని వచ్చాను. మీ అభిమానం చూస్తుంటే నాకు ఉత్సాహం పెరుగుతూ వుంటుంది. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీని వదల్లేదు. పార్టీ నుంచి నాయకులు వెళ్ళారే తప్ప కార్యకర్తలు వెళ్ళలేదు. ఎన్టీఆర్ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఆయన. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా తెలుగుజాతి ఉన్నంతవరకు రెపరెపలాడుతుంది. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చాం. నన్ను జైల్లో పెట్టినపుడు తెలుగుదేశం శ్రేణులు చూపించిన చొరవ మరువలేను. నా అరెస్టుకు వ్యతిరేకంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో గచ్చిబౌలిలో నిర్వహించిన సభను నేను మరిచిపోలేను. హైదరాబాద్‌లో నాకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనలను టీవీలో చూసి గర్వపడ్డా. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంస ప్రభుత్వం వచ్చింది. విభజన కంటే జగన్ పాలనతో జరిగిన నష్టమే ఎక్కువ. యువగళం, నిజం గెలవాలి కార్యక్రమాలు ప్రాచుర్యం పొందాయి. ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి 70 రైళ్లలో ప్రజలు తరలివచ్చారు. రూ.లక్షలు ఖర్చు పెట్టుకుని ఎన్ఆర్‌ఐలు వచ్చారు. అందరూ ఓటు వేయడంతో ఏపీ ఎన్నికల్లో సునామీ వచ్చింది. గతంలో ఏపీలో ఉన్న భూతాన్ని చూసి కంపెనీలు రాలేదు. రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కృషి చేస్తా’’ అని చంద్రబాబు అన్నారు., తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం వుందని చంద్రబాబు చెబుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లు. నాలెడ్జి ఎకానమీకి తెలుగుదేశం హయాంలో నాంది పలికాం. నా తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ అభివృద్ధిని కొనసాగించాయి. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నాను. దాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఆయనకు మరోసారి కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహం ఉండాల్సిన అవసరముంది. తెలుగు భాష, జాతి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధే తెలుగుదేశం ధ్యేయం. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువ. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యలు పరిష్కారమవుతాయి. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఆలోచనలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగుజాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాం’’ అన్నారు.

50 పెళ్ళిళ్ళ ‘నిత్య పెళ్ళికూతురు’ అరెస్ట్!

తమిళనాడులోని తిరుపూర్‌కి చెందిన ఒక యువకుడికి 35 ఏళ్ళు. పెళ్ళి సంబంధాల అన్వేషణలో భాగంగా ఒక మాట్రిమోనీ వెబ్‌సైట్‌ని ఆశ్రయించాడు. ఆ వెబ్‌సైట్ సూచించిన విధంగా సంధ్య అనే మహిళని పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళయిన మూడు నెలల పాటు వీరి కొత్త కాపురం సజావుగానే సాగింది. మూడు నెలల తర్వాత సంధ్య ప్రవర్తన అతనికి ‘ఏదో తేడాగా వుందే’ అనిపించింది. దాంతో పెళ్ళికి ముందు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ పెళ్ళయిన మూడు నెలల తర్వాత చేశాడు. ఆధార్ కార్డు చెక్ చేస్తే, అందులో సంధ్య పేరు వేరేగా వుంది. అందులో భర్త పేరు కూడా వుంది. ఇదేంటని సంధ్యని నిలదీస్తే, చప్పుడు చేయకుండా కూర్చో.. లేకపోతే చంపేస్తానని ఆమె బెదిరించింది. దాంతో అదిరిపోయిన ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకి ఇలాంటి కేసులు దొరికితే రెచ్చిపోయి ఇన్వెస్టిగేషన్ చేసేస్తారు కదా.. మన సంధ్య విషయంలో కూడా అలాగే చేశారు. అప్పుడు పోలీసులు కూడా కళ్ళు తిరిగి పడిపోయే రేంజ్‌లో వాస్తవాలు బయటికొచ్చాయి. ఈ సంధ్య అప్పటి వరకు 50 మందిని పెళ్ళి చేసుకున్నట్టు బయటపడింది. ఈ మహా ఇల్లాలు ‘నిత్యపెళ్ళికూతురు’ అనే బాంబులాంటి విషయం వెల్లడయింది. పెళ్ళి చేసుకోవడం, వేధించడం, డబ్బు, నగలు చేజిక్కించుకోవడం... ఆ తర్వాత జంప్ అవడం... ఇదీ సంధ్య హాఫ్ సెంచరీ పెళ్ళిళ్ళ వెనుక వున్న అసలు మేటర్. సంధ్య ఇప్పటి వరకు పెళ్ళి చేసుకున్న వారిలో ఒక డీఎస్పీ, ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్, మదురైలోని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, కరూర్‌లో ఒక ఫైనాన్స్ అధికారి... ఇలా ఇప్పటి వరకు 50 మంది లెక్క తేలారు. సంధ్య అకౌంట్లో ఇంకా ఎంతమంది వున్నారో ఆమెకైనా గుర్తుందో లేదో.. ఏది ఏమైనప్పటికీ 50 పెళ్ళిళ్ళు చేసుకోవడమే కాకుండా... పోలీస్ ఆఫీసర్లని కూడా పిచ్చోళ్ళని చేసిన సంధ్య గుండె చాలా గొప్పది.. ఆ గుండె బతకాలి!

తెలంగాణ‌లో చంద్ర‌బాబు అడుగు.. భయంతో కేసీఆర్ వణుకు!

తెలంగాణ రాజ‌కీయ ముఖచిత్రం మార‌బోతుందా? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ‌వైభ‌వం రాబోతోందా? తెలంగాణ గ‌డ్డ‌పై చంద్ర‌బాబు అడుగు పెట్ట‌డంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అల‌ర్ట్ అయ్యారా? తెలుగుదేశం ఫామ్‌లోకి వ‌స్తే  రాజ‌కీయంగాఉనికి కోల్పోతామని బీఆర్ఎస్ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారా?  అంటే అవున‌నే స‌మాధానం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలంగాణ‌లో తెలుగుదేశం ఓ బలమైన శక్తి.  ఓ వెలుగు వెలిగింది. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత జ‌రిగిన మొద‌టి ఎన్నిక‌ల్లోనూ టీడీపీ అభ్య‌ర్థులు ఏకంగా ప‌దిహేను అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించారు. తొలి ఎన్నిక‌ల్లో బొటాబొటీ మెజార్టీతో సీఎం పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్‌  తెలంగాణ‌లోతెలుగుదేశం బలంగా ఉంటే  బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్)కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని భావించారు. అనుకున్న‌దే త‌డ‌వుగా తెలుగుదేశంలోని కీల‌క నేత‌ల‌ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు.   తెలంగాణ‌లో తెలుగుదేశం నాయ‌క‌త్వాన్ని బ‌ల‌హీన‌ప‌ర్చ‌డంలో కేసీఆర్ స‌ఫ‌ల‌మ‌య్యారు. అయితే, కేసీఆర్ ను ఇప్ప‌టికీ ఓ భ‌యం వెంటాడుతోంది. తెలుగుదేశం నాయ‌క‌త్వాన్ని బ‌ల‌హీన‌ప‌ర్చినా ఆ పార్టీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నారు. అదే కేసీఆర్ భయం, ఆందోళన.  ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలంగాణ తెలుగుదేశం ప‌గ్గాలను ప్ర‌జాబ‌ల‌మున్న నాయ‌కుడు చేప‌డితే బీఆర్ఎస్ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ముప్పు  ఏర్పడుతుందని కేసీఆర్‌, బీఆర్ఎస్ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. దీంతో తెలంగాణ‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అడుగు పెట్ట‌గానే కేసీఆర్ అల‌ర్ట్ అయ్యారు.   తెలంగాణ‌లో ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ‌లు త‌గులుతున్నాయి. 2014 నుంచి ఏక‌దాటిగా ప‌దేళ్లు సీఎంగా ఆధిపత్యం చెలాయించిన కేసీఆర్ కు 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు షాకిచ్చారు. బీఆర్ఎస్ ని గ‌ద్దెదింపి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో తెలంగాణ‌ రాష్ట్ర  రెండో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించ‌డంలో తెలుగుదేశం పాత్ర‌ కూడా ఉంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. చంద్ర‌బాబు నాయుడు, తెలుగు దేశం పార్టీపై ప‌లు సంద‌ర్భాల్లో కేసీఆర్ నోరుపారేసుకున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో మొద‌టి నుంచి కేసీఆర్‌ స‌ఖ్య‌త‌గా ఉంటూ వ‌చ్చారు. చంద్ర‌బాబు జైలుకెళ్లిన స‌మ‌యంలో తెలంగాణ‌లో తెలుగుదేశం నేత‌లు, చంద్ర‌బాబు అభిమానులు రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న తెలిపేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అనుమ‌తివ్వ‌లేదు. కేటీఆర్ సైతం చంద్ర‌బాబు ఏపీలో అరెస్ట్ అయితే.. ఇక్క‌డ మీ ఆందోళ‌న ఏమిటంటూ అహంకార‌పూరిత వ్యాఖ్య‌లు చేశారు. దీంతో తెలంగాణ‌లోని తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు, చంద్ర‌బాబు అభిమానులు ఏక‌మై 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. త‌ద్వారా ఆ పార్టీ అధికారంలోకి రావ‌డంలో త‌మ‌వంతు పాత్రను పోషించారు.  తెలంగాణ‌లో కేసీఆర్ అధికారం కోల్పోగా.. ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినిసైతం అక్క‌డి ప్ర‌జ‌లు గ‌ద్దె దింపారు. చంద్ర‌బాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్య‌మ‌ని భావించి..తెలుగుదేశం కూట‌మికి భారీ విజయాన్ని చేకూర్చి పెట్టారు. ఇప్పుడు ఏపీలో చంద్ర‌బాబు, తెలంగాణ‌లో రేవంత్ రెడ్డిలు సీఎంగా ఉన్నారు. రాజ‌కీయంగా కేసీఆర్ కు న‌చ్చ‌ని వ్య‌క్తుల జాబితాలో చంద్ర‌బాబు, రేవంత్ మొద‌టి వ‌రుస‌లో ఉంటారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌లు చేప‌ట్టిన కొద్దికాలంకే బీఆర్ఎస్ టార్గెట్ గా రాజ‌కీయాల‌కు తెర‌లేపారు. త‌ద్వారా బీఆర్ఎస్ పార్టీ నుంచి విజ‌యం సాధించిన ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే  ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు  బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. మ‌రో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారాల్లో కేసీఆర్ పై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనికితోడు మద్యం కుంభకోణం కేసులో కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎంపీ క‌విత జైలులో ఉన్నారు. అన్ని వైపుల నుంచి ముప్పేట దాడితో కేసీఆర్ స‌త‌మ‌త‌మ‌వుతున్న వేళ‌.. విభజన సమస్యల పరిష్కారం కోసం చంద్ర‌బాబు తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ తో  చర్చలు జరపడం, అందుకోసం ఆయన స్వయంగా తెలంగాణ గడ్డపైకి రావడం కేసీఆర్ లో వణుకు పుట్టించింది. ఇప్పటికే  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా క‌ప్పుకోవడానికి వరుస కడుతున్న తరుణంలో రాజ‌కీయ చాణుక్యుడిగా పేరున్న చంద్ర‌బాబు తెలంగాణలో టీడీపీ బ‌లోపేతంపై దృష్టి పెడితే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్ధకమౌతుందని ఖంగారు పడుతున్నారు‌. దీంతో చంద్ర‌బాబు తెలంగాణ‌లో అడుగుపెట్టిన స‌మ‌యం నుంచి ఆయనను ఎవ‌రెవ‌రు క‌లిశారు.. వారిలో బీఆర్ఎస్ సానుభూతిప‌రులు ఎంత‌మంది ఉన్నారనే విష‌యాల‌పై కేసీఆర్ ఆరా తీసిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో తెలుగుదేశం బ‌లోపేతం అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన, తెలుగుదేశం క‌లిసి పోటీచేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అదే జ‌రిగితే బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు  తెలుగుదేశం భారీగా గండికొట్ట‌డం ఖాయం. దీంతో భ‌విష్య‌త్ రాజ‌కీయ ప‌రిణామాల‌ను ప‌సిగ‌ట్ట‌డంలో దిట్ట‌గా పేరున్న కేసీఆర్.. తెలుగుదేశం నుంచి  బీఆర్ఎస్ కు ఎదురయ్యే ముప్పును తలచుకుని భయంతో వణికి పోతున్నారు.

వైఎస్‌ఆర్ జయంతి కానుక... జగన్ రాజీనామా?

పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సోమవారం (08-07-24) నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని, ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి దగ్గర జగన్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తారని వదంతులు వినిపిస్తున్నాయి. జగన్ రాజీనామా తర్వాత పులివెందుల స్థానం నుంచి జగన్ భార్య భారతిని అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. జగన్ రాజీనామా చేసి, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మొదట జగన్ అసెంబ్లీకి, అవినాష్ రెడ్డి పార్లమెంట్‌కి రాజీనామాలు చేసి, ఆ తర్వాత ఒకరి స్థానంలో మరొకరు పోటీ చేయాలని అనుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప పార్లమెంట్ స్థానం నుంచి రిస్క్ చేయడం కరెక్ట్ కాదని తాను పులివెందుల స్థానానికి రాజీనామా చేసి, ఆ స్థానం నుంచి భారతిని నిలపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. జగన్‌కి అసెంబ్లీకి వెళ్ళడం ఎంతమాత్రం ఇష్టం లేదని, అందువల్లే రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఇవన్నీ ఊహాగానాలుగానే వినిపిస్తున్నాయి. వైఎస్సార్ జయంతి అయిన సోమవారం దాటితేగాని ఇవన్నీ ఊహాగానాలా? వాస్తవాలా అనే విషయం తెలుస్తుంది.

ముఖ్యమంత్రుల సమావేశం సంపూర్ణం..!

విభజన సమస్యల పరిష్కారమే ప్రధానాంశంగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు  సాగిన భేటీలో పది కీలక అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు వుండాలని సమావేశంలో నిర్ణయించారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయపరంగా తలెత్తే చిక్కుల గురించి కూడా చర్చించారు. షెడ్యూలు 10లోని అంశాల పైనే ప్రధానంగా చర్చ జరిగింది. నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఏడీజీ ఇంటెలిజెన్స్ శేషాద్రి, ఐఏఎస్ అధికారులు రఘునందన్ రావు, కృష్ణభాస్కర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి  శ్రీనివాసరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బి.సి.జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, ఐఏఎస్ అధికారులు జానకి, కార్తికేయ మిశ్రా (సీఎంఓ), ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్ బిల్లులు, విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన 15 ప్రాజెక్టులకు సంబంధించి వాటి అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చులకు చెల్లింపులు, హైదరాబాద్‌లో వున్న మూడు భవనాలను ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించే అంశం, లేబర్ సెస్ పంపకాలు, ఉద్యోగుల విభజన అంశాల గురించి చర్చించారు. అనంతరం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చల వివరాలను వెల్లడించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీ, ముగ్గురు అధికారులతో రెండు వారాల్లోగా అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత మంత్రులతో కూడా కమిటీ ఏర్పాటు అవుతుందని తెలిపారు. డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి రెండు రాష్ట్రాలూ సంయుక్త కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు.

బొత్స కుళ్ళు జోకు!

మొన్నటి ఎలక్షన్లలో చీపురుపల్లి ఓటర్లు చీపుళ్ళు, చేటలు పుచ్చుకుని కొట్టేసరికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకి బుర్ర తిరిగిపోయినట్టుంది. అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, కుళ్ళు  జోకులు వేస్తున్నారు. అసలే ఈయన మామూలుగా మాట్లాడినా ఒక్క ముక్క కూడా అర్థం కాదు.. ఇక కుళ్ళు జోకులు కూడా వేస్తే, వినేవాళ్ళకి డోకులు తప్పనిసరిగా వస్తాయి. ఇంతకీ బొత్స వేసిన కుళ్ళు జోకు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయాలట. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకునే మాటలు ఎప్పటికప్పుడు జనం వినాలట. అప్పుడు అంతా పారదర్శకంగా, పలుగు దర్శకంగా వుంటుందట. వీళ్ళ నాయకుడు జగన్ అధికారంలో వున్నప్పుడు ఏనాడైనా మీడియాలో మాట్లాడిన దాఖాలు వున్నాయా? ఎప్పుడైనా రికార్డెడ్ వీడియోలు జనం మొహం మీద వేస్తారే తప్ప డైరెక్ట్.గా మాట్లాడిన సందర్భం ఏదైనా వుందా? పైగా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా జగన్ మీడియా ముందుకు వచ్చి, చంద్రబాబును నాలుగు తిట్లు తిట్టి, మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే పారిపోతున్నారు. అలాంటి పిరికివాడి నాయకత్వంలో వున్న బొత్స ఇలా మాట్లాడ్డం మరీ వింతగా వుంది.  బొత్స వేసిన ఈ కుళ్ళు జోకుకి మంత్రి అచ్చెన్నాయుడు ట్విట్టర్లో కౌంటర్ ఇస్తూ, ‘‘భలే జోకులేస్తున్నారు బొత్స గారూ.! పారదర్శకత గురించి మీరు, జగన్ మాట్లాడితే జనం నవ్విపోతారు.. వద్దులెండీ..! పారదర్శకతకు పాతరేసిందే మీరు. మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పని చేస్తున్నారు. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దు.. నౌ ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్... డోన్ట్ వర్రీ.. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు.. సమావేశమయ్యాక.. అన్ని విషయాలూ తెలుస్తాయి’’ అన్నారు.

22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ 23వ తేదీన లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు 22 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ జరుగుతాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు  ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అక్కౌంట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల వత్సరం కావడంతో పూర్తి స్థాయి బడ్జెట్ కు బదులుగా సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యేవరకూ పద్దుల నిర్వహణకు వెసులుబాటు కలిగే విధంగా ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తై కొత్త ప్రభుత్వం కొలువుదీరటంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సమాయత్తమయ్యారు.  ఇప్పటికే బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 23న లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా నిర్మలా సీతారామన్ కొత్త రికార్డు సృష్టించనున్నారు. వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనతను సొంతం చేసుకుంటారు. ఇంతకు ముందు మాజీ ప్రధాని మొరార్జీదేశాయ్ పేరిట  ఈ రికార్డు ఉండేది. ఆయన వరుసగా ఐదుసార్లు లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.  

కార్పొరేటర్ల పిచ్చకొట్టుడు.. అమ్రపాలి షాక్!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్పొరేటర్ల సమావేశం శనివారం నాడు జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్,బీఆర్ఎస్, ఎంఐఎం కార్పొరేటర్లు సమానంగా ఆవేశం ప్రదర్శించి ఒకరినొకరు పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఎవర్ని ఎవరు కొడుతున్నారో తెలియనంతగా ఒకరిమీద మరొకరు పడి కొట్టుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు వీరబాదుడు బాదుకుంటున్న కార్పొరేటర్లను కంట్రోల్ చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రయత్నించారు. వాళ్ళని కంట్రోల్ చేయడం తనవల్ల కాకపోవడంతో మీటింగ్ హాల్‌ని వదిలి వెళ్ళిపోయారు. కొత్తగా జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి అమ్రపాలి ఈ వీరబాదుడు కార్యక్రమం చూసి షాకైపోయారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తనది కాకపోవడంతో ఆమె దారిన ఆమె వెళ్ళిపోయారు. ఈరోజు ఉదయం కార్పొరేటర్ల సమావేశం ప్రారంభమైనప్పటి నుంచే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కార్పొరేటర్లు యుద్ధానికి సిద్ధం అన్నట్టుగానే ప్రవర్తిస్తూ వచ్చారు. కొత్త కమిషనర్ అమ్రపాలి కార్పొరేటర్లను ఉద్దేశించి కూర్చునే మాట్లాడారు. దాంతో కార్పొరేటర్లు చాలా సీరియస్ అయ్యారు. ఆమె నిల్చుని మాట్లాడాలని డిమాండ్ చేశారు. దాంతో అమ్రపాలి నిల్చుని మాట్లాడారు. జోనల్ కమిషనర్లు కూడా నిల్చుని మాట్లాడి, తమను తాము పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత కార్పొరేటర్ల మధ్య మాటామాటా పెరిగి, కొట్లాటకు దిగారు. ఈ బాదుడు కార్యక్రమం ఎంత కంట్రోల్ చేసినా తగ్గకపోవడంతో మేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి సమావేశం నుంచి వెళ్ళిపోయారు.