జగన్ చెక్కభజనలో తరించిన కేటీఆర్!
posted on Jul 9, 2024 @ 4:36PM
కల్వకుంట్ల తారకరామారావుకు గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ బీఆర్ఎస్ పరాజయం ఏమంత ఆశ్చర్యం కలిగించలేదుట కానీ ఈ ఏడాది ఏపీ ఎన్నికలలో జగన్ పార్టీ వైసీపీ ఘోరంగా పరాజయం పాలు కావడం ఆశ్చర్యం కలిగించిందట. అసలు జగన్ ను ఏపీ ప్రజలు ఓడించడం వెనుక కారణమేమిటో అర్ధం కావడం లేదని కేటీఆర్ చెబుతున్నారు. 40శాతం ఓట్లు వచ్చిన వైసీపీకి కేవలం 11 స్థానాలే దక్కడమేంటని దిగ్భ్రమ చెందుతున్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జగన్ ఓటమిని నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చారు.
ఇదే కేటీఆర్ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఆయన తమ పార్టీ పని తీరును గోప్పగా చెప్పుకోవడానికి జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఉండే వారు. ఏపీలో రోడ్ల దుస్థితిని ప్రస్తావిస్తూ తెలంగాణలో రహదారులు అద్దంలా ఉంటాయని చెప్పుకునే వారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అధమస్థానానికి పడిపోయిన ఏపీని ఎత్తి చూపుతూ తాము అగ్రస్థానంలో ఉన్నామని జబ్బలు చరుచుకునే వారు. ఇలా ప్రతి విషయంలోనూ జగన్ వైఫల్యాలను, జగన్ ప్రభుత్వ అసమర్ధతను చెబుతూ తాము గొప్పగా పాలన సాగిస్తున్నామని తమ భుజాలు తామే చరుచుకున్న కేటీఆర్... అంత గొప్పగా పాలన చేసిన తమనే జనం ఓడిస్తే అధ్వాన పాలనను అందించిన (ఈ మాట ఆయనే పలు సందర్భాలలో చెప్పారు.) జగన్ పార్టీని ఎందుకు గెలిపిస్తారన్న అనుమానం ఆయనకు ఏపీ ఎన్నికలకు ముందూ తరువాతా కూడా రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జగన్ పాలనపై సెటైర్లు వేయడంలో ఒక్క కేటీఆర్ అనే కాదు, అధికారంలో ఉండగా కేసీఆర్ సైతం ఏపీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ తన పాలనలో తెలంగాణ ఎలా దూసుకుపోతోందో చెప్పడానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకునే వారు కారు. ఒక సందర్భంలో కేసీఆర్ ఏపీ పరిస్థితిని ఎత్తి చూపుతూ గతంలో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో రెండెకరాలు కొనేవారనీ, కానీ తన హయాంలో పరిస్థితి రివర్స్ అయ్యిందనీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో రెండెకరాలు కొనొచ్చనీ వ్యాఖ్యానించారు.
ఆయన తనయుడు మరో రెండాకులు ఎక్కువ చదివినట్లుగా.. గతంలో అవకాశం ఉన్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్ ను చులకన చేస్తూ మాట్లాడే వారు. జగన్ హయాంలో ఏపీలో ఐటీ పరిశ్రమ తిరోగమనదిశలోకి వెళ్లింది. ఆ విషయంపై కేటీఆర్ ఎంత హేళనగా మాట్లాడారో ఒక సారి గుర్తు చేసుకుందాం. ఐటీ కంపెనీల యాజమాన్యాలతో ఆయన కాస్త ఏపీలో కూడా పెట్టుబడులు పెట్టండి.. కావాలంటే ఆ రాష్ట్రముఖ్యమంత్రితో స్వయంగా నేనే మాట్లాడి సెట్ చెస్సానని చెప్పారు. అలాగే ఏపీలో రోడ్లు, మౌలిక వసతుల పరిస్థితి అయ్యో పాపం అన్నట్లుగా ఉందనీ, అయినా ఆ రాష్ట్రం పట్ల కూడా కాస్త దయచూపండి అంటూ ఏపీని, ఏపీ దుస్థితినీ హేళన చేయడం ద్వారా తమ ప్రభుత్వాన్ని, తమ పాలనను తానే పొగిడేసుకుని తన భుజాలు తానే చరిచేసుకున్నారు. అటువంటి కేటీఆర్ తన ఓటమి కంటే గతంలో తాను ఛీ అన్నా, చులకన చేసినా దులుపుకుపోయిన మిత్రుడు జగన్ పట్ల ప్రేమ ఒలకబోయడం, జగన్ చెక్క భజన చేయడంలో తరించడం విడ్డూరమే.