ఉత్తరఖండ్ లో కొండచరియలు విరిగి ఇద్దరు హైదరాబాద్ వాసులు మృత్యువాత 

ఒకప్పుడు.యాత్రలు చేయడానికి ఇప్పుడున్నన్ని ప్రయాణ సౌకర్యాలు  లేవు.  ఎడ్లబండ్లమీదనో, కాలి నడకనో తీర్థ యాత్రలకు వెళ్ళేవారు. తెలుగు రాష్ట్రాలకు  కాశి చాల దూర ప్రయాణం. కనుక కాశీకి వెళ్ళడానికి కొన్ని నెలలు పట్టేది.  అలా వెళ్ళిన వారు తిరిగి వస్తే రావొచ్చు లేదా అక్కడే కాలం చేయ వచ్చు. పైగా కాశీలో మరణిస్తే పుణ్యమని ప్రజలు బలంగా నమ్మే వారు.   కాశీకి పోయిన వాడు కాటికి పోయిన వాడు ఒకటే  అనే జాతీయం తెలుగునాట పుట్టుకొచ్చింది. ప్రస్తుతం కాశీ ప్రయాణానికి రవాణా సౌకర్యాలు మరింత మెరుగయ్యాయి. కాశీ వెళ్లి శివైక్యం చెందారని మనం అరుదుగా వింటున్నాం. అయితే   ఇపుడు ఉత్తరఖండ్  వెళితే చావు మినిమం గ్యారెంటీగా మారింది. ఉత్తర ఖండ్ వెళ్లిన వారు బతికే చాన్స్ తక్కువైంది. ఉత్తరఖండ్ వెళ్లిన వాడు కాటికి వెళ్లిన వాడు ఒకటే అనే కొత్త జాతీయం పుట్టుకొస్తుందేమో మరి. ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాలు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. కుండ‌పోత వ‌ర్షాల‌కు ప‌లు ప్రాంతాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. తాజాగా చ‌మోలీ జిల్లాలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌లో హైద‌రాబాద్‌కు చెందిన ఇద్ద‌రు యాత్రికులు మృత్యువాత ప‌డ్డారు.  మృతుల‌ను నిర్మ‌ల్ షాహీ (36), స‌త్య నారాయ‌ణ (50) గా అక్క‌డి పోలీసులు గుర్తించారు. వీరిద్ద‌రూ బ‌ద్రీనాథ్ ఆల‌యాన్ని ద‌ర్శించుకుని ద్విచ‌క్ర‌వాహ‌నంపై తిరిగి వ‌స్తున్న స‌మ‌యంలో మార్గ‌మ‌ధ్యంలో కొండ‌చ‌రియ‌లు వారిపై విరిగి ప‌డ్డాయి. దీంతో వారిద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. క‌ర్ణ‌ప్ర‌యాగ‌, గౌచ‌ర్ మ‌ధ్య‌లోని బ‌ద్రీనాథ్ నేష‌న‌ల్ హైవేపై శ‌నివారం ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. కాగా, భారీ వ‌ర్షాల కార‌ణంగా ఉత్త‌రాఖండ్ వ్యాప్తంగా ప్ర‌ధాన న‌దుల‌న్నీ ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ప్ర‌వ‌హిస్తున్నాయి. రుద్ర‌ప్ర‌యాగ్‌-కేదార్‌నాథ్ జాతీయ ర‌హ‌దారిపై కూడా రాక‌పోక‌లు పూర్తిగా నిలిచిపోయాయి. ఇవాళ‌, రేపు కూడా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. అందుకే ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఈ నేప‌థ్యంలోనే రుద్ర‌ప్ర‌యాగ్‌లో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా అన్ని పాఠ‌శాల‌ల‌కు శ‌నివారం సెల‌వు ఇచ్చేశారు. 

అమెరికా వరాహ పురాణం!

అమెరికాలోని కాలిఫోర్నియా పోలీసుల ముందుకు ఒక పెద్ద కేసు వచ్చింది. ఈ కేసుని పరిష్కరించాలని వాళ్ళు గత వారం రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇంతకీ పోలీసులని ముప్పుతిప్పలు పెడుతున్న ఆ కేసు ఏంటంటే, పదకొండు పందులకు ఓనర్ ఎవరో కనుక్కోవడం. కాలిఫోర్నియాలోని శాన్ డీగో కౌంటీలోకి వారం రోజుల క్రితం సడెన్‌గా ఒక తల్లి పంది తన సంతానమైన పది పిల్ల పందులతో ఈ కౌంటీలోకి వచ్చేసి సెటిలైంది. కౌంటీలో వాళ్ళందరూ ఈ పిగ్స్ ఫ్యామిలీని చూసి బిత్తరపోయారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పో్లీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ పంది ఫ్యామిలీ ఓనర్ ఎవరో కనుక్కునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎంత ఎంక్వయిరీ చేసినా ఈ వరాహ అవతారాల అసలు ఓనర్ ఎవరో మాత్రం అంతు చిక్కడం లేదు. దాంతో గత వారం రోజులుగా కాలిఫోర్నియా పోలీసులే ఈ పందుల బాధ్యతలు తీసుకుని, పోలీస్ స్టేషన్ పక్కనే ఈ పందులకు ఎకామిడేషన్ ఏర్పాటు చేశారు. వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. అదేంటో, కాలిఫోర్నియా పోలీసులు ఈ పందులతో ఎమోషనల్‌గా కూడా ఎటాచ్ అయిపోయారు.

వలసల జోరు... బీఆర్ఎస్ బేజారు!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రేవంత్ సర్కార్ సమాయత్తమౌతోంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు.. రైతు బంధు, రుణమాఫీ తదితర అంశాలపై సభ వేదికగా విస్తృత చర్చకు సైతం సిద్ధమౌతోంది. అదే సమయంలో  తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బీఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్రంలో ఉనికి కోసం నానా పాట్లూ పడుతోంది. కనుసైగతో రాష్ట్ర రాజకీయాలను శాశించిన స్థితి నుంచి పార్టీ నుంచి వలసలను నిరోధించలేని దుస్థితికి చేరుకుంది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు కారు దిగి చేయందుకుని కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. మరింత మంది అదే దారిలో ఉన్నారన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీలో బీఆర్ఎస్ గట్టిగా గళమెత్తే అవకాశాలు అంతంతమాత్రమేనన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అసలిప్పుడు బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్న సీరియస్ విషయమేమిటంటే ఈ సమావేశాలకైనా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరౌతారా అన్నదే. ప్రస్తుతం బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవడానికే కష్టపడాల్సి వస్తున్నది. గతంలోలా అధినేత మాటే శిరోధార్యం అనే పరిస్థితి లేదు.  గతంలో తాను కలవాలని భావిస్తే తప్ప మంత్రులకు కూడా ప్రగతి భవన్ లోకి అడుగుపెట్టనిచ్చేవారు కాదు కేసీఆర్. అటువంటిది ఇప్పుడు ఆయన స్వయంగా ఆహ్వానించినా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు.  తాజాగా తెలంగాణ భవన్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన గ్రేటర్ బీఆర్ఎస్ నేతల సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. అలా డుమ్మా కొట్టిన వారంతా బీఆర్ఎస్ ను వీడడానికి రెడీ అయిపోయారనీ, ముహూర్తం కోసం వేచి చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలలో    మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, గూడెం మహిపాల్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. వీరంతా కూడా  హస్తం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. అదే జరిగితే అసెంబ్లీలో బీఆర్ఎస్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది. వీరి బాటలోనే మరింత మంది నడిచే అవకాశాలనూ పరిశీలకులు కొట్టి పారేయడం లేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే బీఆర్ఎస్ కు సభలో ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి వచ్చే అవకాశాలే ఉన్నాయంటున్నారు. అంతే కాకుండా బీఆర్ఎస్ నుంచి వలసలు ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్పీ కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడానికి కూడా పెద్ద సమయం పట్టదని అంటున్నారు. గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే విపక్షాల బలాన్ని తగ్గించేందుకు, అసలు విపక్షమనేదే లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారో అదే దారిలో ఇప్పుడు  రేవంత్ రెడ్డి కూడా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీయడంతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.   

గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి బిఆర్ఎస్ కు గుడ్ బై 

బిఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పేశారు. ఇప్పటివరకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరుగురు , ఎమ్మెల్సీలు ఆరుగురు కారు దిగి హస్తాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.  బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ నేతలు వరుసబెట్టి బీఆర్ఎస్ కు గుడ్ బై చెపుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. ఇటీవలే ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.  ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు షాకిచ్చారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు ఆయన రాజీనామా చేశారు. కారు దిగిన ఆయన... హస్తాన్ని అందుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో... ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 7కు చేరుకుంది.

మనీష్ సిసోడియా కస్టడీ పొడగింపు 

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా కుదిపేసింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి  కెసీఆర్ తనయ ఈ స్కాంలో కింగ్ పిన్. ఈ కేసులో ఇరుక్కున్న వారు తప్పించుకునే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి.  ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్య మంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో శనివారం అధికారులు ఆయనను వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆయన కస్టడీని మరోమారు పొడిగించింది. ఈ నెల 15 వరకు కస్టడీని పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు.. విచారణను అదేరోజుకు వాయిదా వేసింది. ఈమేరకు శనివారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియాను గతేడాది మార్చిలో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు నిందితుల్లో ఒకరైన అరుణ్ పిళ్లై చేసిన అప్పీల్, ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా వాదనలను వాయిదా వేసింది. ఈ నెల 15న మళ్లీ విచారణ జరుపుతామని పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై  ఈ నెల 8న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మద్యం పాలసీ కేసుపై కోర్టు ఈరోజు విచారణ జరిపింది. దర్యాఫ్తులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మద్యం పాలసీ కేసులో జూన్ 7న కవితపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.  మద్యం పాలసీ రూపకల్పన కేసులో కవితను ప్రధాన సూత్రధారిగా సీబీఐ పేర్కొంది.

బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ కు సీతక్క జలక్ ... లీగల్ నోటీసులు జారీ 

ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయాల్లో మామూలే. అయితే బిఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ నేతలు సీరియస్ గానే స్పందిస్తున్నారు. గత కెసీఆర్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.  రిటైర్డ్ హైకోర్టు జడ్జి నర్సిరెడ్డి నేతృత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ వేసింది.  విచారణ జరపాలని  కమిషన్ నియమించింది. ఈ  కమిషన్ రద్దు చేయాలని కెసీఆర్ హైకోర్టు నాశ్రయించి భంగపడ్డారు.   తాజాగా  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియో పెట్టారని ఆరోపించారు. తనపై చేసిన తప్పుడు ప్రచారానికి గాను లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.  ఇందిరమ్మ రాజ్యం... ఇసుకరాళ్ల రాజ్యం పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారని పేర్కొన్నారు. జూన్ 24వ తేదీన బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టారు. నిరాధార ఆరోపణలు చేశారని, ఇది సరికాదని ఆమె పేర్కొన్నారు. తమపై చేసిన ఆరోపణలకు గాను తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు

వైఎస్ వారసత్వానికి పోటీ .. విజయం షర్మిలదేనా?!

దివంగత సీఎం రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఇప్పుడు నిట్టనిలువుగా చీలిపోయిందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. వైఎస్ కుమారుడు జగన్ ఒక వైపు ఉంటే.. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, ఇతర బంధువులు మరో వైపు నిలిచారు. వైఎస్ మరణం తరువాత కుటుంబం మొత్తం జగన్ కు అండదండగా నిలిచి వైఎస్ వారసుడిగా ఆయనను జనం ముందు ప్రొజెక్ట్ చేసింది. జగన్ కాంగ్రెస్ తో విభేదించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటించిన సమయంలో కూడా వైఎస్ కుటుంబం మొత్తం జగన్ వెనుకే నిలిచింది. సరే జగన్ ను జనం వైఎస్ వారసుడిగా భావించి 2019 ఎన్నికలలో ఘన విజయాన్ని కట్టబెట్టారు. అయితే జగన్ మాత్రం జనం నమ్మకాన్నీ నిలుపుకోలేదు. కష్ట సమయంలో తనకు అండదండగా నిలిచిన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలనూ దూరం పెట్టారు.   వైసీపీ అనేది  జగన్  చెందిన సొంత కంపెనీ. ఆ పార్టీకి ఒక రాజకీయ సిద్ధాంతం ఉన్నట్లు కనిపించదు. జగన్ తాను ముఖ్యమంత్రి అవ్వాలన్న ఏకైక లక్ష్యంతో ఆ పార్టీని ప్రారంభించారు. అందుకు అప్పట్లో ఆయన కుటుంబమూ వంత పా డింది. వైఎస్ అభిమానులు సైతం జగన్ పక్కన నిలబడ్డారు. ఈ విషయంలో అనుమానాలకు తావు లేదు. కానీ జగన్ అధికార అందలం అందుకున్న తరువాత తన వైసీపీ పార్టీలో వైఎస్ బ్రాండ్ ను కనుమరుగు చేసి సొంత ఇమేజ్ పెంచుకోవాలని భావించారు. ఈ విషయంలో కూడా ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు.  అయితే  అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తన పెత్తనాన్ని, పార్టీపై ఆధిపత్యాన్ని పదిలం చేసుకోవడానికి అధికారంలో వాటా అడుగుతుందన్న భయంతో సొంత చెల్లి షర్మిలను పార్టీ నుంచే కాదు రాష్ట్రం నుంచి కూడా వెళ్లిపోయేలా పొగబెట్టారు. ఆమెకు మద్దతుగా మాట్లాడారంటూ తల్లి విజయమ్మను కూడా దూరంపెట్టారు. పండుగలా జరుపుకోవలసిన పార్టీ ప్లీనరీ వేదికగా మెలో డ్రామాకు తెరలేపి తల్లి చేత వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయించి పంపేశారు. షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని రాజకీయాలు చేసినంత కాలం వైఎస్ వారసత్వం విషయంలో షర్మిలను ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వైఎస్ వారస్త్వం విషయంలో జగన్ కు పోటీ అనేదే లేకుండా పోయింది. అయితే ఎప్పుడైతే షర్మిల ఏపీ రాజకీయాలలోకి అడుగు పెట్టారో అప్పుడే అన్నా చెళ్లెళ్ల మధ్య వారసత్వ పోరు షురూ అయ్యింది. ఇటీవలి ఎన్నికలలో జగన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో వారసత్వ పోరులో ఆయన చతికిలబడిపోయారు. ఆ ఎన్నికలలో షర్మిల కూడా  విఫలమయ్యారు. రాష్ట్రంలో  ఆ పార్టీ జీరో అక్కౌంట్ పరిస్థితిలో మార్పు ఏమీ రాలేదు. అయినా రాజకీయంగా షర్మిల జగన్ పై పైచేయి సాధించారు. ఇందులో ఎలాంటి సందేహాలకూ తావులేదు.   పైపెచ్చు రాజకీయంగ వైఎస్ ఎదుగుదలకు, ఆయన ముఖ్యమంత్రి కావడానికీ, అన్నిటికీ మించి చివరి వరకూ ఆయన కొనసాగిన పార్టీలో ఉండటం  షర్మిలకు వైఎస్ రాజకీయవారసత్వ రేసులో ఒక అడ్వాంటేజ్ గా మారింది. ఇప్పుడు వైఎస్ జయంతి కార్యక్రమాన్ని ఆమె కాంగ్రెస్ బ్యానర్ కింద నిర్వహించడంతో ఇంకా ఎవరికైనా ఏ మూలనైనా అనుమానాలు మిగిలి ఉంటూ అవన్నీ నివృత్తి అయిపోయాయి. దీంతో వైఎస్ వారసత్వ పోరులో షర్మిల జగన్ ను వెనక్కు నెట్టేసి ముందుకు దూసుకుపోతున్నారు. 

జగనన్న అగ్గిపెట్టెలపై విచారణ!

పులివెందులలో అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళని నిర్మించడానికి ఉద్దేశించిన జగనన్న మెగా లేఔట్‌లో అక్రమాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. ఈ లేఔట్ పేరుతో 8,400 ఇళ్లను మంజూరు చేసి, వాటిని అనర్హులను లబ్దిదారులుగా ఎంపిక చేశారన్న విమర్శలు వున్నాయి. ఈ లేఔట్ మీద ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో సీఎం విచారణకు ఆదేశించారు. మూడేళ్ళ క్రితం ఇక్కడ స్థలాలు మంజూరయ్యాయి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ద్వారా కాంట్రాక్టర్‌కి 60 కోట్ల బిల్లులు వెళ్ళాయిగానీ, పనులు జరగలేదు. ఆ తర్వాత మరో ఏడు సంస్థలను ఎంపిక చేసి దాదాపు 85 కోట్ల బిల్లులు చెల్లించారు. 6,990 ఇళ్ళ నిర్మాణం జరగాల్సి వుండగా, కేవలం 99 ఇళ్ళను మాత్రమే నిర్మించారు. 

లోటస్‌పాండ్‌కు జగన్ మకాం మార్పు!?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్ ను వీడి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసానికి మకాం మార్చనున్నారా? అంటే ఆయన సన్నిహితుల నుంచే కాదు పరిశీలకుల నుంచి కూడా ఔననే సమాధానమే వస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణకు హైకోర్టు సీబీఐ కోర్టును ఆదేశించిన నేపథ్యంలో జగన్ తాడేపల్లి నుంచి లోటస్ పాండ్ కు మకాం మార్చక తప్పదని అంటున్నారు. ఇంత కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటూ కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్ కు ఇకపై ఆ అవకాశం ఉండదు.   దీంతో ఆయన ఇకపై కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందే అవకాశాలు దాదాపు మృగ్యమే.  జగన్ రెడ్డి ఉన్మాదమే కావచ్చు. పిచ్చితనమే కావచ్చు కానీ ఆయన ఊరికో ప్యాలెస్ చొప్పున కట్టేసుకున్నారు.   నిధులు, నిబంధనలు అనే సంగతెలా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రిగా ఆయన పాలనతో ఎంతగా వివాదాస్పదుడయ్యారో.. తన ప్యాలెస్ ల పిచ్చితో అంతగా పాపులర్ అయ్యారు. అవి  నిర్మించింది సొంత సొమ్ముతోనా? ప్రజాధనంతోనా అన్నది పక్కన పెట్టేస్తే ఆయన ఎక్కడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది.    బెంగళూరు, తాడేపల్లి, విశాఖపట్నం.. పులివెందులలో కూడా ప్యాలెస్ పలాంటి భవనం ఉంది లెండి.  అయితే జగన్ రెడ్డి గద్దెదిగిన తరువాత ఇటు తాడేపల్లి ప్యాలెస్ లో కానీ, పులివెందుల వాసంలో కానీ, ఆఖరికి రాష్ట్రం దాటిపోయి తన బెంగళూరు ప్యాలెస్ కు కూడా వెళ్ల లేని పరిస్థితి కొని తెచ్చుకున్నారు.   ఎన్నికలలో ఓటమి తరువాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపులపాయకు అక్కడ నుంచి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిన జగన్ అక్కడెక్కడా స్థిమితంగా ఉండలేకపోయారు. మళ్లీ తాడేపల్లికి తిరిగి వచ్చారు.  ఓటమి దిగులు నుంచి తేరుకున్నారా అనిపించేలా ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజుల తరువాత ఆయన బయటకు వచ్చారు. పాపం ముఖ్యమంత్రి హోదా లేదు కదా!  దాంతో పరదాలు కట్టించుకునే అవకాశం ఉండదని తెలిసి ఆయన నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లిని పరామర్శించడానికి హెలికాప్టర్ లో వచ్చారు. అక్కడ మీడియాతో కూడా మాట్లాడి నవ్వులపాలయ్యారు. అది వేరే సంగతి. మళ్లీ ఆయన నివాసాల వద్దకు వస్తే.. ఇప్పుడాయన లోటస్ పాండ్ కు మకాం మార్చక తప్పని పరిస్థితి. కేసుల రోజువారీ విచారణే కాకుండా... గతంలోలా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లక తప్పని పరిస్థితి కూడా రావడం తథ్యం. ఈ పరిస్థితుల్లో ఆయన తాడేపల్లిలో స్థిమితంగా ఉండగలిగే అవకాశం లేదు. దీంతో ఆయన ఇప్పుడు ఏపీని వదిలేసి తెలంగాణకు బిచాణా ఎత్తేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో కూడా ఆయనకు మనస్థిమితం ఉండే అవకాశాలు లేవు.   

పిల్లలు కాదు.. పిశాచాలు!

విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో వుండే తొమ్మిదో తరగతి చదివే ఒక అమ్మాయిని, ఇంటర్మీడియట్ చదువుతున్న మరో అమ్మాయిని, ఎనిమిదో తరగతి చదువుతున్న మరో అబ్బాయిని వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో పేరెంట్స్ మందలించారు. ఎందుకు మందలించారంటే ఈ ముగ్గురూ చదువుకోకుండా సెల్ ఫోన్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నారు. దాంతో ముగ్గురికీ కోపం వచ్చింది. ముగ్గురూ ఒకచోట చేరారు. భారీ ప్లాన్ వేశారు. ఇంట్లోంచి పారిపోవాలని డిసైడ్ అయ్యారు. ముగ్గురూ వాళ్ళవాళ్ళ ఇళ్లలోంచి బంగారం, డబ్బు దొంగతనం చేసి తీసుకొచ్చారు. విజయవాడ రైల్వేస్టేషన్‌కి చేరుకున్నారు. అక్కడ ప్లాట్‌ఫామ్ మీద వున్న జన్మభూమి ఎక్స్.ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్‌కి చేరుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే ప్లాట్‌ఫామ్ మీద పోలీసులకు వీళ్ళ మీద అనుమానం వచ్చింది. వాళ్ళని ఆపి ప్రశ్నించారు. అప్పుడు వాళ్ళు తమ ఘనకార్యాన్ని బయటపెట్టారు. ఈలోపు తమ పిల్లలు కనిపించడం లేదని వాళ్ళ పేరెంట్స్ విజయవాడలో పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఈ ముగ్గురు పిల్లల్నీ.. కాదు.. కాదు... పిశాచాల్ని విజయవాడకి పంపించారు. సికింద్రాబాద్‌లో పోలీసుల కంటపడ్డారు కాబట్టి సరిపోయింది.. లేకపోతే ఏమయ్యేదో!

హల్లో మిస్.. అది ఎర్రబస్సు కాదు.. ఎయిర్‌బస్!

మన ఇండియాలో ఎర్రబస్సు ఆపాలంటే ఏం చేస్తాం? ఆ బస్సుకి ఎదురుగా నిలబడి చెయ్యి ఊపుతాం.. అప్పుడు ఆ బస్సు ఆగుతుంది.. మనం బస్సు ఎక్కుతాం. అయితే, ఈమధ్య ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో ఒక లేడీ... మనం ఎర్రబస్సు విషయంలో ఏం చేస్తామో.. ఆమె ఎయిర్‌బస్సు విషయంలో అలా చేసింది. కదులుతున్న విమానం ముందుకు వెళ్ళి ఆపండి.. ఆపండి అన్నట్టుగా చేతులు ఊపింది. టేకాఫ్‌కి రెడీ అవుతున్న పైలెట్ విమానానికి ఎదురుగా వచ్చిన ఈ లేడీని చూసి బిత్తరపోయి ఫ్లైట్ ఆపేశాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి, ఆమెని అరెస్టు చేశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఆ లేడీ ఆ ఫ్లైట్లోనే ఎక్కాల్సి వుంది. అయితే ఆమె ఎయిర్‌పోర్టుకి ఆలస్యంగా వచ్చింది. అప్పటికే విమానం డోర్లు క్లోజ్ చేశారు. టేకాఫ్ అవడానికి విమానం కదిలింది కూడా. తాను ఎక్కాల్సిన విమానం వెళ్ళిపోతూ వుండేసరికి ఆ లేడీ కంగారుపడిపోయింది. లేడిలాగా రన్‌వే మీదకి దూసుకెళ్ళింది. ఎయిర్ పోర్టు స్టాఫ్ బిత్తరపోయి ఆపేలోపే ఆమె విమానం ముందుకు వచ్చేసి ‘స్టాప్.. స్టాప్..’ అని అరిచింది. పైలట్ అలెర్ట్ అయి విమానాన్ని ఆపేశాడుగానీ, లేకపోతే ఈ లేడీ పచ్చడైపోయేదే. 

అమరావతికి అడ్డంకుల్లేవ్.. ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్డులకు కేంద్రం ఓకే

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు లేకుండా పరుగులు పెట్టనుంది. అమరావతి విషయంలో రాష్ట్ర వినతులన్నిటికీ కేంద్రం దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ముఖ్యంగా రాజధాని అమరావతికి మణిహారంలాంటి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకు కూడా కేంద్రం అంగీకారం తెలిపింది.  ఖర్చు ఎంతైనా  అమరావతి కోసం వ్యయం చేయడానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విస్పష్ట హామీ ఇచ్చారు. హస్తిన పర్యటనలో భాగంగా గడ్కరీతో చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే.   ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిమీ పొడవైన ఓఆర్‌ఆర్‌ను  కేంద్రమే చేపట్టేందుకు అంగీకారం తులిపింది. పెరిగిన ట్రాఫిక్‌, నూతన వాహనాల తీరును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో ఔటర్‌ నిర్మాణం చేపడతామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ సీఎం చంద్రబాబుకు స్పష్టమైన హామీఇచ్చారు. ఖర్చు ఎంతైనా అమరావతికి అద్భుతమైన రహదారిని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఔటర్‌ నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణ ప్లాన్‌ రెడీ అయ్యింది. రూ.18 వేల కోట్లతో ఈ రోడ్డు  నిర్మించాలని 2017-18లోనే ప్రతిపాదించగా కేంద్రం అప్పట్లోనే అంగీకరించింది. అయితే జగన్‌ వచ్చాక ఈ ప్రాజెక్టును మూలనపడేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఔటర్‌ మళ్లీ పట్టాలెక్కనుంది.  రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టాల్సిన రహదారులపై  చంద్రబాబు గడ్కరీకి ప్రతిపాదనలు సమర్పించారు.  అమరావతి ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డుతోపాటు, విజయవాడలోని కీలక ప్రాంతాలను కలిసే తూర్పు బైపాస్‌ చేపట్టాలన్న చంద్రబాబు వినతికి సానుకూలంగా స్పందించిన గడ్కరీ ప్రజలకు, మౌలిక రంగం మరింత బలోపేతమయ్యేందుకు అవసరమైన సహకారమందిస్తామన్న విస్పష్ట హామీ ఇచ్చారు.    రాష్ట్రంలో 7 వేల కిమీపైనే జాతీయ రహదారులున్నాయి. ప్రస్తుతం స్టేట్‌ హైవేలుగాఉన్న 3,200 కిమీ రోడ్లను కూడా జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని గడ్కరీకి చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇంకోవైపు జాతీయ, రాష్ట్ర రహ దారులను ఆధునిక టెక్నాలజీతో నిర్మిద్దామని గడ్కరీ ప్రతిపాదించారు. రోడ్లపై ఐదేళ్లకోసారి నిర్వహణ పేరిట కోట్లు ఖర్చుపెట్టడం, వర్షాలకు అవి దెబ్బతినడం జరుగుతోందని, ఇకపై సిమెంట్‌ (సీసీ) రోడ్లు నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో కూడా కొత్తగా చేపట్టే పెద్ద ప్రాజెక్టులు, జాతీయ రహదారులను అవసరాన్ని బట్టి సీసీ టెక్నాలజీతో నిర్మించేలా ప్రతిపాదనలు ఉండాలని ఆయన సూచించినట్లు తెలిసింది. ఆధునిక టెక్నాలజీతో రహదారుల నిర్మాణంపై టాటా కన్సల్టెన్సీతో అధ్యయనం చేయిస్తున్నట్లు ఆయన చంద్రబాబుకు తెలిపారు.   

బెయిలు కోసం సుప్రీంకు కవిత!

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిలు కోసం దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. ఢిల్లీ హైకోర్టు కవిత బెయిలు పిటిషన్లను తిరస్కరించిన నేపథ్యంలో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. ఇలా ఉండగా మద్యం కుంభకోణంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితతో శుక్రవారం (జులై 5) తెలంగాణ మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, హరీష్ రావు ములాఖత్ అయ్యారు.  అనంతరం ఢిల్లీలో వారు న్యాయనిపుణులలో సుప్రీం కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేయడంపై చర్చించారు. సుప్రీం కోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిలు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆమె బెయిలు పిటిషన్ దాఖలు అయ్యే వరకూ కేటీఆర్, హరీష్ రావులు హస్తినలోనే మకాం వేసే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 8న కవిత బెయిలు కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా తీహార్ జైలులో కవితతో ములాఖత్ అయిన కేటీఆర్, హరీష్ రావులు కవితకు ధైర్యం చెప్పారు. ఆమెక త్వరలోనే బెయిలు వస్తుందని భరోసా ఇచ్చారు.  మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  

బ్రిటన్ ఎన్నికలలో భారత సంతతి విజయకేతనం!

బ్రిటన్ సాధారణ ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 26 మంది భారత సంతతికి చెందిన వారు హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవి చూసిన కన్జర్వేటివ్ పార్టీ నుంచి అరడజను మంది భరత సంతతికి చెందిన సభ్యులు ఎన్నికవ్వగా, విజయం సాధించిన లేబర్ పార్టీ నుంచి హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికైన వారు ఏకంగా 19 మంది ఉన్నారు. ఇక లేబర్ డెమొక్రటిక్ పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికయ్యారు.  పార్టీల వారీగా ఎన్నికైన భారత సంతతికి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. కన్జర్వేటివ్ పార్టీ నుంచి బ్రిటన్ మాజీ ప్రధాని  రిషి సునక్, బ్రావెర్ మేన్, ప్రీతీ పటేల్. క్లారీ కౌంటినో, గగన్ మొహీంద్రా,  షివానీ రాజాలు హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికయ్యారు. ఇక లేబర్ పార్టీ నుంచి ఎన్నికైన భారత సంతతికి చెందిన  సీమా మల్హోత్రా, వలేరీ వాజ్, లిసా నాండీ, ప్రీత్ కౌర్, తన్మన్ జీత్ సింగ్ దేశి, నవెందు మిశ్రా, నాడియా విట్ హోం, జాస్ అథ్వాల్. బాగీ శంకర్, సత్వీర్ కౌర్, హర్ ప్రీత్ ఉప్పల్, వారిందర్ జుస్, గురీందర్ జోసాన్, కనిష్కనారాయణ్, సోనియాకుమార్, సురీనా బ్రాకెన్ బ్రిడ్జి, కీర్తి కీర్తి ఎన్టవిజిల్, జీవన్ సంధీర్, సోజన్ జోసెఫ్ ఉన్నారు. అలాగే లేబర్ డెమొక్రాట్స్ నుంచి మునీరా విల్సన్ హౌస్ ఆఫ్ కామర్స్ కు ఎన్నికయ్యారు. 

చంద్రబాబు-రేవంత్ భేటీ.. ప్రధానాంశాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య శనివారం (06-07-24) నాడు జరిగే చారిత్రక సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అపరిష్కృతంగా వున్న సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో వున్న సంస్థల విభజన విషయంలో చర్చించే అవకాశం వుంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న బకాయిల మీద చర్చ జరగనుంది. తనకు 24 వేల కోట్లు ఏపీ చెల్లించాలని తెలంగాణ చెబుతోంది. కానీ,7 వేల కోట్లు తెలంగాణ చెల్లించాల్సి వుందని ఆంధ్రప్రదేశ్ అంటోంది. ఈ చిక్కుముడిని విడిపించడానికి చర్చ జరుగుతుంది. రెండు రాష్ట్రాల మధ్య ఢిల్లీలో ఏపీ భవన్‌కి సంబంధించిన విభజన వివాదాన్ని రేవంత్ రెడ్డి ఇప్పటికే పరిష్కరించారు. మైనింగ్ కార్పొరేషన్‌కి సంబంధించిన చిక్కుముడి కూడా ఈమధ్యే వీడిపోయింది.  తొమ్మిదో షెడ్యూల్లో వున్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబేడీ కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేవీ లేవు. మిగతా 23 సంస్థల  పంపిణీపై చర్చ జరిగే అవకాశం వుంది. పదో షెడ్యూల్లో వున్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీ విషయంలో కూడా చర్చ జరగాల్సి వుంది. కీలకమైన ఈ భేటీలో రెండు రాష్ట్రాల అధికారులూ పాల్గొంటున్నారు. వివిధ అంశాలకు సంబంధించిన వివరాలను రెండు రాష్ట్రాల అధికారులు సిద్ధం చేసుకున్నారు.

చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన హైదరాబాద్!

నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌కి వచ్చిన చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ నగరం ఘన స్వాగతం పలికింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కి చేరుకున్ చంద్రబాబుకి తెలంగాణ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సీఎంగా మొదటిసారి నగరానికి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు హైదరాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం దగ్గర నుంచి ప్రత్యేక వాహనంలో ప్రయాణిస్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి జూబిలీహిల్స్.లోని చంద్రబాబు నివాసం వరకు చంద్రబాబు ర్యాలీ జరిగింది. వర్షంలోనూ ర్యాలీ కొనసాగింది.