నరేంద్ర మోడీ ‘దేశ’ముదురు!
posted on Jul 10, 2024 @ 11:35AM
విదేశ పర్యటనలు భారీగా చేస్తూ వుండే మన ప్రధాని నరేంద్ర మోడీని గిట్టనివాళ్ళు ‘దేశదిమ్మరి’ అంటూ వుంటారుగానీ, ఆయన నిజానికి ‘దేశ’ముదురు! ప్రధానిగా గత పదేళ్ళ కాలంలో ప్రపంచంలోని ప్రధాన దేశాలన్నిటినీ ఒక చుట్టు చుట్టేశారు. కొన్ని దేశాలనయితే రెండుమూడు సార్లు కూడా చుట్టేశారు. అంటే కుళ్ళుకుంటున్నామని అనుకుంటారుగానీ, ఏవేవో టుమ్రీ దేశాలు తప్ప ప్రపంచంలోని అన్ని దేశాలనూ ప్రధానమంత్రి మోడీ కవర్ చేసేశారు. ఇక మిగిలిన దేశాలకు టిక్ పెట్టే పనిలో ఈ మూడో టర్మ్.లో వున్నారు. ఈ టర్మ్ పూర్తయ్యేసరికి ఈ ప్రపంచంలో నరేంద్ర మోడీ పర్యటించని దేశమే వుండదు అంటే అతిశయోక్తి కాదేమో! జనరల్‌గా అంతర్జాతీయ సమిట్లు ఏవైనా విదేశాలలో వున్నాయంటే మన ప్రధానమంత్రి కంపల్సరీగా వెళ్తారు. అక్కడకి వచ్చిన వివిధ దేశాల నాయకులు మోడీ గారిని ‘‘సార్.. మా దేశం రావచ్చు కదా’’ అని అంటారు. అలా పిలిచిందే తడవుగా మోడీ గారు సదరు దేశం టూర్ ప్లాన్ చేసుకుంటారు. రెండ్రోజుల క్రితమే రష్యా వెళ్ళి పుతిన్‌ని ఆలింగనం చేసుకున్న మోడీ, ఇప్పుడు ఆస్ట్రియా టూర్లో వున్నారు. ఆస్ట్రియా ఛాన్స్.లర్ కార్ల్ నెహమ్మర్‌తో దిగిన సెల్ఫీని మీడియాకి విడుదల చేశారు. ఇండియా, ఆస్ట్రియా మధ్య స్నేహ సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మోడీ అక్కడకి వెళ్ళారు. 49 ఏళ్ళ తర్వాత ఆస్ట్రియా వెళ్ళిన మొదటి ప్రధానమంత్రిని నేనే అని తన సోషల్ మీడియాలో ప్రకటించుకున్నారు.
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తనను తాను సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ చేసుకుంటారు. సదరు దేశాధ్యక్షుడో, ప్రధానమంత్రో పురుషుడు అయితే గట్టిగా ఆలింగనం చేసుకుంటారు. ఆ తర్వాత సెల్ఫీ దిగడం తప్పనిసరి. ఏ మహిళామూర్తో అయితే చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ దిగుతారు. ఎలా అవుతాయో ఏమోగానీ, సదరు ఆలింగనాలు, సెల్ఫీలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతూ వుంటాయి. మన మీడియా అయితే, మన మోడీ గారి గొప్పతనాన్ని చూసి ప్రపంచ నాయకులు స్పెల్ బౌండ్ అయ్యారని, ‘విశ్వగురు’ అంటే మరెవరో కాదు.. మోడీ గారే అని కథనాలు వండి వడ్డిస్తూ వుంటాయి. ఏది ఏమైనప్పటికీ ఇంట మాత్రమే కాకుండా.. రచ్చలో కూడా గెలుస్తున్నట్టు కనిపిస్తున్న మన మోడీ గారు నిజంగానే ‘దేశ’ముదురు!