ఏపీలో ఇసుక పాలసీపై రాద్దాంతం.. వైసీపీని తిప్పికొడుతున్న జనం
posted on Jul 10, 2024 6:07AM
ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తిరగగలుగుతున్నారు. మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కో హామీని సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పెంచిన పెన్షన్లను ఒకటో తేదీనే అందజేసిన చంద్రబాబు సర్కార్.. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీని రద్దు చేసి కొత్త ఇసుక పాలసీకి సంబంధించిన జీవోను విడుదల చేసింది. ఈ జీవో ద్వారా ఇప్పటి వరకు నిల్వ ఉన్న ఇసుకను ఉచితంగా అందిస్తుంది. ప్రభుత్వానికి ఎలాంటి రాబడి లేకుండా కేవలం నిర్వహణ ఖర్చులు మాత్రమే చెల్లించి ఇసుకను తీసుకెళ్లేలా వీలు కల్పించింది. అయితే, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో విధంగా ఈ చార్జీలు ఉన్నాయి. ర్యాంపులకు దగ్గరగా ఉన్న చోట ఒకలా, దూరంగా ఉన్నచోట మరోలా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే, ఐదేళ్లు పాలనలో ఇసుక దోపిడీకి అలవాటుపడ్డ వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం ఏమాత్రం రుచించడం లేదు. దీంతో ఇసుక ఉచిత పాలసీపై నానా రాద్దాంతం చేస్తున్నారు.
అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు అనట్లుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో కొనసాగిన వైసీపీ నేతలు ఇసుక దోపిడీతో కోట్లాది రూపాయలు దండుకున్నారు. ఇసుకను బంగారం తరహాగా మార్చేశారు. దీంతో ఏపీలో గడిచిన ఐదేళ్ల కాలంలో ఇసుక పేరెత్తితేనే ప్రజలు వామ్మో అనే పరిస్థితి ఉంది. ఇసుకను కొనుగోలు చేయలేని మధ్య తరగతి ప్రజలు.. ఇళ్లు, ఇతర నిర్మాణాలను వాయిదా వేసుకున్నారు. దీంతో ఏపీలో నిర్మాణ రంగం కార్మికులు పనులకోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. వైసీపీ హయాంలో పది టన్నుల లారీ ఇసుకకు యాభై వేలు నుంచి డెబ్బై వేలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అది పదివేలకే వస్తోంది. దూరాన్ని బట్టి కాస్త పెరగవచ్చు. అయితే, ఇంటి నిర్మాణ దారులకు భారీగా డబ్బులు ఆదా అవుతున్నాయి. ఈ విషయం ఇసుక తీసుకెళ్లేవారికి తెలుసు. అయినా వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా, వారి అనుకూల మీడియా కూటమి ప్రభుత్వం ఇసుక పాలసీపై పెద్ద ఎత్తున రాద్దాంతం చేస్తున్నాయి.
ఉచిత ఇసుక అంటూ హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కిందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ రాద్ధాంతం చేస్తోంది. ఇదేనా మీరు ఇచ్చే ఉచిత ఇసుక అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ తప్పుడు ప్రచారానికి నెటిజన్లు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఈ దుష్ప్రచారానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఇసుకకు కేవలం రవాణా, లోడింగ్ చార్జీలు మాత్రమే ఉండటంతో చిత్తూరులో 20 టన్నుల ఇసుక రూ.4వేలకు వస్తుంది.. గత ప్రభుత్వంలో ఇదే ఇసుక రూ.60వేలకు విక్రయించారని ఆధారాలతో సహా వివరించారు. ఇలా పలు జిల్లాల్లో ఇసుక తక్కువ ధరకు అందుబాటులోకి రావటం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాన్ని పరిశీలిస్తే.. వైసీపీ హయాంలో ఇసుక బంగారంగా మారింది. ఈ విషయం ఏపీలో ఎవర్ని అడిగినా చెప్పేస్తారు. గత ప్రభుత్వంలో టన్ను ఇసుక రూ. 8వేల నుంచి రూ. 10వేలు పలికింది. దీనికితోడు ప్రభుత్వానికి చెల్లించాల్సి సొమ్మును కేవలం నగదు రూపంలోనే తీసుకున్నారు. దీంతో వైసీపీ నేతలు ఇసుక విక్రయాలతో పెద్దమొత్తంలో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ముకు గండి కొట్టి దోచుకున్నారు.
వైసీపీ హయాంలో ఇసుక ధర, టీడీపీ హయాంలో ట్రాన్స్‌పోర్టు ఛార్జీలతో ఇసుక ఎంత ధరకు లభిస్తుందనే విషయాలపై వాస్తవాలను పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. అల్లూరి జిల్లాలో వైసీపీ హయాంలో టన్ను ఇసుక రూ.749 నుంచి 1600 పలికితే.. ఇప్పుడు రూ. 300లకు లభిస్తోంది. అనకాపల్లిలో రూ. 1600కు లభిస్తే.. ప్రస్తుతం రూ. 1225కు లభిస్తోందిది. అనంతపురం జిల్లాలో రూ. 818కి లభిస్తే.. ఉచిత ఇసుక విధానంలో రూ. 195కే అందుబాటులోకి వచ్చింది. బాపట్ల జిల్లాలో వైసీపీ హయాంలో టన్ను ఇసుక రూ. 553 నుంచి రూ. 1088కి లభిస్తే ఇప్పుడు తెలుగుదేశం హయాంలో రూ. 665కే లభిస్తున్నది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లో ఇసుక ధరను పరిశీలిస్తే గత ప్రభుత్వం కంటే ప్రస్తుతం చాలా తక్కువ ధరలో లభిస్తుంది. పారదర్శకంగా గనులు భూగర్భ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా ఇసుకను ప్రజలకు అందిస్తున్నాసరే వైసీపీ నేతలు మాత్రం టీడీపీపై విష ప్రచారం చేసే కార్యక్రమాన్ని ఆపడం లేదు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని జనం ఛీ కొడుతున్నారు. వైసీపీ ప్రచారంలోని డొల్లతనాన్ని స్వచ్ఛందంగా ఎండగడుతున్నారు.