ఏపీలో కాంగ్రెస్ కు వైఎస్ బ్రాండే దిక్కు?
posted on Jul 10, 2024 @ 12:16PM
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్వ వైభవం సంగతి అలా ఉంచి కనీసం ఉనికి మాత్రంగానైనా నిలబడాలంటే వైఎస్ బ్రాండే దిక్కని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. అందుకే ఇంత కాలం లేని విధంగా ఇప్పుడు వైఎస్ 75వ జయంతిని విజయవాడ వేదికగా ఘనంగా నిర్వహించింది. వైఎస్ కుమార్తె షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా ఉండటం ఆ పార్టీకి ఒకింత కలిసి వచ్చే అంశంగా భావిస్తోంది. ఆమె ద్వారానే వైఎస్ కాంగ్రెస్ సొత్తు అని చెప్పించడం ద్వారా వైఎస్ బ్రాండ్ ను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుందని భావించవచ్చు.
విజయవాడ వేదికగా జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమానికి పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ మొత్తాన్ని తీసుకుని రావడం ద్వారా ఒక బలమైన సందేశం ఇచ్చారు. రాష్ట్రంలో వైఎస్ ఫొటోలతో వైసీపీ చేస్తున్న హంగామాను తిప్పికొట్టడానికి, వైఎస్ ఎంత మాత్రం వైసీపీకి చెందిన వ్యక్తి కాదనీ, ఆయన కుమారుడు వైఎస్ రాజకీయవారస్వానికి అనర్హుడు అని చాటడమే లక్ష్యంగా ప్రసంగించడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ రాజకీయవారసురాలిగా షర్మిలను గుర్తించిందని చెప్పడంలో సఫలీకృతులయ్యారు. 2029 ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, షర్మిల సీఎం అవుతారు అనడం ద్వారా ఇటీవల ఏపీ ఎన్నికలలో కాంగ్రెస్ జీరో రిజల్ట్ కారణంగా షర్మిలపై మొలకెత్తుతున్న అసమ్మతిని మొగ్గలోనే తుంచేసినట్లైంది.
రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రంలో ఉనికి మాత్రంగా మిగిలి, గత వైభవాన్ని పూర్తిగా కోల్పోయిన ఏపీ కాంగ్రెస్ లో జవసత్వాలు నింపి, క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపేందుకు రేవంత్ ప్రసంగం నిస్సందేహంగా దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత జరిగిన మూడు ఎన్నికలలోనూ ఏపీలో కాంగ్రెస్ కు వచ్చినది జీరో రిజల్టే. అయితే ఈ సారి ఆ పార్టీకి ఓట్ల శాతం పెరిగింది. అదే సమయంలో జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ గతంలో కంటే బలంగా పుంజుకుంది. కేంద్రంలో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించకుండా నివారించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది.
ఇక ఏపీలో వైసీపీ ఓటమిలో కాంగ్రెస్ కూడా కీలక పాత్ర పోషించింది. వైఎస్ జయంతి సభలో వైఎస్ ఆత్మగా చెప్పబడే కేవీపీ రామచంద్రరావు చాలా మంది వైసీపీ నాయకులు తనతో టచ్ లో ఉన్నారనీ, ఏ క్షణంలోనైనా వారంతా కాంగ్రెస్ గూటికి చేరతారంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపడం ఖాయం.
తాజా ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం కారణంగా ఆ పార్టీ ఇప్పుడు నిస్తేజంగా మారింది. ఆ గ్యాప్ ను కాంగ్రెస్ ఫిల్ చేసే అవకాశాలే ఉన్నాయి. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండటం, ఆమెకు వైఎస్ ఆత్మ అండగా నిలవడంతో రాష్ట్రంలో వైఎస్ లెగసీని కాంగ్రెస్ సొంతం చేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.