జగన్-బాబు ఇన్ సైడర్ ఫైట్... చివరికి గెలిచేదెవరు?
posted on Dec 29, 2019 8:41AM
రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం... సీబీఐ విచారణ దిశగా అడుగులేస్తోంది. రాజధానిగా అమరావతిని ప్రకటించకముందు జరిగిన భూ కొనుగోళ్లపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వడంతో సీబీఐ విచారణ కోరాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
రాజధానిగా అమరావతిని ప్రకటించడానికి కొద్దిరోజులు ముందు 4వేలకు పైగా ఎకరాలను టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. అమరావతి ప్రకటనకు ముందే తెలుగుదేశం లీడర్లు, బినామీలు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారని తేల్చారు. ఎవరెవరు ఎన్ని ఎకరాలు కొనుగోలు చేశారో ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం ఆ వివరాలనే నివేదికలో పొందుపర్చింది. అయితే, ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై మండిపడ్డ టీడీపీ.... దమ్ముంటే నిరూపించాలని వైసీపీ ప్రభుత్వానికి సవాలు విసిరింది. చంద్రబాబు అండ్ టీడీపీ నేతలు పదేపదే సీబీఐ విచారణ కోరడం, ఇన్ సైడర్ ట్రేడింగ్ ను నిరూపించాలని సవాలు విసురుతుండటంతో ఇక వెనక్కి తగ్గకూడదని జగన్ సర్కారు భావిస్తోంది.
అయితే, అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారంటూ పలువురి టీడీపీ నేతల పేర్లను మంత్రివర్గ ఉపసంఘం తమ నివేదికలో చేర్చింది. ముఖ్యంగా బాబు అండ్ లోకేష్ కి అత్యంత సన్నిహితుడైన వేమూరు రవికుమార్... పరిటాల సునీత... జీవీఎస్ ఆంజనేయులు... లింగమనేని రమేష్.... పయ్యావుల కేశవ్ పేర్లను ప్రస్తావించింది. అలాగే, లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్‌రావు, పుట్టా మహేష్ యాదవ్, మాజీ మంత్రి నారాయణ, కొమ్మాలపాటి శ్రీధర్, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, నారా లోకేష్, కోడెల శివప్రసాదరావు పేర్లను చేర్చింది. సీఆర్డీఏ సరిహద్దులను మార్చడం ద్వారా టీడీపీ నేతలకు, కంపెనీలకు లబ్ధి చేకూర్చారంటూ మరో లిస్టును రూపొందించారు. అలాగే, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సంస్థలకు కేటాయించిన 850 ఎకరాల్లోనూ భారీ అవకతవకలు జరిగినట్లు కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది.