ఏపీ రాజధాని ఏదో చెప్పని బొత్స... మీడియా ప్రశ్నలకు తత్తరపాటు...
posted on Dec 28, 2019 8:48AM
అమరావతి రైతులకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. అమరావతి రైతులకు వచ్చిన నష్టమేమీ లేదని, ఇక్కడ్నుంచి ఒక్క సచివాలయం మాత్రమే తరలుతోందని అన్నారు. అయితే, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రతి అంశంలోనూ బాధ్యతగా పనిచేస్తున్నామని... గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం ఎక్కడా ఇన్ సైడర్ ట్రేడింగ్ చేయబోదని తేల్చిచెప్పారు. గ్రాఫిక్సూ, సినిమాలు అసలేం చూపించబోమన్నారు. అన్ని వాస్తవాలే చెబుతామన్న బొత్స... అమరావతిలో 50శాతం దాటిన నిర్మాణాలను పూర్తి చేస్తామని స్పష్టత ఇచ్చారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని... అందరికీ న్యాయం చేస్తామన్నారు. అయితే, రైతులిచ్చిన 33వేల ఎకరాలను ఏం చేయబోతున్నామో త్వరలో చెబుతామన్నారు.
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ...చంద్రబాబు అమరావతిలో ఇల్లు కట్టుకోలేదని... రాష్ట్రాభివృద్ధిపై ఆయకున్న చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టే అర్ధమవుతుందన్నారు. చంద్రబాబులాగా రైతులను మోసం చేయబోమయని అన్నారు. మూడు ప్రాంతాల్లో రాజధానుల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందో మంత్రివర్గ సమావేశం తర్వాత చెబుతామన్నారు. అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వం దాదాపు 6వేల కోట్లు ఖర్చు చేసిందని... ఇందులో సుమారు 350కోట్లు కన్సల్టెంట్లకే కట్టబెట్టిందని బొత్స అన్నారు. రాజధానిని పూర్తిగా నిర్మించి ఇస్తామని విభజన చట్టంలో ఎక్కడా చెప్పలేదని... అందుకే ఐదేళ్లలో కేంద్రం 1500కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్ర ఆదాయం, కేంద్రంతో సంబంధాల ఆధారంగా ముందుకెళ్తోందన్నారు. నిధులన్నీ ఒక్క రాజధానికే ఖర్చు చేస్తే విద్య వైద్యం ఇతర సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు ఎక్కడ్నుంచి తేవాలన్నారు. అయితే, అమరావతి, కర్నూలు, విశాఖల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానం దాటవేశారు.