ఎన్నికల్లో విజయానికి కారు గుర్తు చాలు : కాంగ్రెస్ కి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
posted on Dec 28, 2019 @ 11:35AM
మునిసిపల్ ఎన్నికల కసరత్తులో టిఆర్ఎస్ దూకుడు పెంచింది. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్య వర్గం భేటీ అయ్యింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు అనుబంధ సంఘాల అధ్యక్షులు హాజరయ్యారు. ఎన్నికల ఇన్ చార్జిలను కూడా నియమించింది టీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశా నిర్దేశం చేశారు కేటీఆర్. రిజర్వేషన్లు కలిసొచ్చిన చోట తెలంగాణ ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ నిర్ణయించారు. ఎమ్మెల్యేలతో స్థానిక నాయకత్వానికీ ఇబ్బందులుంటే సమన్వయం చెయ్యాలని మునిసిపల్ ఇన్ చార్జిలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.
మున్సిపల్ చైర్మన్లు , కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు కేటీఆర్. మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధులు కరువయ్యారా అంటూ చురకలంటించారు. రిజర్వేషన్ ఏదైనా ఎన్నికల పార్టీ గుర్తు మీద జరుగుతాయని ఎద్దేవా చేశారు కేటీఆర్. మరోవైపు అధికార పార్టీ ఎంత హడావుడి చేస్తున్న ప్రతిపక్షాలు మాత్రం మల్లగుల్లాలు పడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ఎన్నికల కసరత్తులో అంత ఉత్సాహాన్ని చూపడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
నామినేషన్ కు ఒక్క రోజు ముందు రిజర్వేషన్ లు ప్రకటిస్తే ఎలా అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రశ్నిస్తున్నారు. ఓటర్ల జాబితా పూర్తి కాకుండా ఎవరైనా షెడ్యూల్ ఇస్తారా అని ప్రశ్నించారు. ఇక బిజెపి కూడా ఎన్నికల కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్టు కనిపించటంలేదు. జనవరి 22 న జరకాబోయే మునిసిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. జనవరి 5 న పోలింగ్ స్టేషన్ ల జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 7 మునిసిపాలిటీల్లోని ఆయా పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. పోలింగ్ స్టేషన్ ల జాబితాపై 8 వరకు సలహాలు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 9 న సాయంత్రం జాబితాను కలెక్టర్లకు అందజేయాలి. 10 న పోలింగ్ స్టేషన్ ల జాబితాను కలెక్టర్లు ఖరారు చేస్తారు. 13 న తుది జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు.