మునిసిపల్ ఎన్నికలే టార్గెట్ :-ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఊపందుకున్న రాజకీయం
posted on Dec 28, 2019 @ 11:05AM
రాజకీయ చైతన్య కేంద్రమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న తొమ్మిది మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తేదీ ఖరారు కావడంతో ప్రజాప్రతినిధులు అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించడంలో తలమునకలయ్యారు. మున్సిపాలిటీలల్లో తెగ తిరుగుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధి పనుల్లో , శంకుస్థాపనలు చేసే పనుల్లో ఎమ్మెల్యేలు తెగ బిజీ అయిపోయారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 9 మునిసిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా మంత్రులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నర్సంపేట , భూపాలపల్లి , పరకాల మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనుల పై సమీక్షించారు. మరో మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లాలో వరుస పర్యటనలకు సంసిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలపై పూర్తిగా దృష్టి సారించారు. ఒక వైపు జిల్లాలోని కీలక నేతలతో కలిసి వ్యూహ రచన చేస్తూనే మరోవైపు ఆయా మున్సిపాలిటీలలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను ఆరా తీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఉదయం వేళల్లో మునిసిపాలిటీల్లోనే ఆయా కాలనీల్లో పర్యటించి పారిశుధ్య పనులు స్వయంగా పరిశీలిస్తున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలైతే ఏకంగా డ్రైనేజ్ మోరీలు శుభ్రం చేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. మరో పక్క జిల్లాలోని అధికార పార్టీ కీలక నేతలు గెలుపు అంచనాలపై లెక్కలు వేసుకుంటూ పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో వారు నిమగ్నమయ్యారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్ల లెక్కలు తీస్తూ వారిని ఆకట్టుకునేందుకు సమాలోచనలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ చార్జిలను నియమించి క్యాడర్ లో జోష్ పెంచుతున్నారు. మున్సిపాల్టీల్లో టిఆర్ఎస్ తరుపున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశవహులు ఇప్పట్నుంచే వార్డుల్లో సందడి చేస్తున్నారు. తమకు పార్టీ టికెట్ ఖరారు కాక ముందే వారు అంతర్గతంగా ప్రచారం మొదలు పెట్టారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుర పోరుకు టీఆర్ఎస్ తరవాత బీజేపీలో జోరు ఎక్కువగా కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు లోక్ సభ స్థానాలను బిజెపి గెలుచుకుంది. ఈ నేపథ్యంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలపై కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కసరత్తు ప్రారంభించారు. పరకాల , వర్థన్నపేట నియోజకవర్గాల్లో గతంలో బిజెపి నేతలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.కనుక ఈ రెండు మునిసిపాలిటీల్లో తమ పార్టీ మార్పు చూపాలని బిజెపి నేతలు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. అలాగే మహబూబాబాద్, జనగాం మునిసిపాలిటీలపైన ప్రత్యేక దృష్టి సారించినట్లు వినికిడి. ఇదిలా వుంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం ఇంకా తడబడుతూనే ఉందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇప్పటి వరకు మునిసిపాలిటీలపై హస్తం పార్టీ ఎలాంటి ప్రణాళిక రూపొందించుకోలేదని సమాచారం. కేవలం పార్టీ స్థానిక నేతలు కొంత హడావుడి కనిపిస్తోంది.
ఇక ఉమ్మడి జిల్లాలో వామపక్షాలు సైతం పూర్వ పోరు బరిలో దిగేందుకు సై అంటున్నాయి. ప్రధానంగా మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, డోర్నకల్, నర్సంపేట మున్సిపాల్టీల్లో సిపిఐ, సిపిఎం పోటీ చేయనున్నట్టు తెలిసింది. అలాగే తొర్రూరు, మరిపెడ, నర్సంపేట తదితర మున్సిపాలిటీలపై దృష్టి సారించాయి. ఈసారి మున్సిపోల్స్ లో వామపక్షాల పొత్తు పెట్టుకుని పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తుంది.