ఆ మూడు జిల్లాలు మావే.. మునిసిపల్ ఎన్నికలపై ధీమాతో ఉన్న బీజేపీ
posted on Dec 28, 2019 @ 10:39AM
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ స్థానాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున మెజార్టీ సీట్లు గెలవాలనే పట్టుదలతో ముందుకు పోతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పర్సనల్ ఎజెండాపై వీరు గెలిచారు అనే వాదన ఉంది. దీంతో ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి తమ సత్తా చాటాలని ఈ నేతలు భావిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికలు కరీంనగర్ ఎంపీ సంజయ్ కు మరింత కీలకంగా మారాయి.
మోదీ హవా..సంజయ్ ఇమేజ్ తో.. కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో బిజెపి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఇప్పుడు జరిగే మునిసిపల్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని సంజయ్ భావిస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ మినహా ఎక్కడా బీజేపీ పెద్దగా సీట్లు సాధించలేదు. కౌన్సిలర్ నుంచి ఎంపీగా విజయం సాధించిన సంజయ్ పై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేస్తామని ధీమా బీజేపీలో కనిపిస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి మొన్నటి ఎన్నికల్లో కాలం కలిసొచ్చింది. పసుపు బోర్డు విషయం తేలక పోవడంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనితో ఈ సారి ఆయన లోకల్ సెంటిమెంట్ ప్లే చేసే పనిలో పడ్డారు. కార్పొరేషన్ గెలిస్తే నిజామాబాద్ పేరు మారుస్తామని ప్రచారం చేస్తున్నారు. అయితే లోకల్ సెంటిమెంట్ అరవింద్ కు కలిసి వస్తుందా లేదా అనేది ప్రశ్నగా మారింది.
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తుడుం దెబ్బ అధ్యక్షుడు, ఎన్నికల ముందు కాంగ్రెస్ నుండి బిజెపికి మారిన ఆయన ఆదివాసీ సెంటిమెంట్ తో ఎంపీ అయ్యారు. ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ లో బలమైన ఓటు బ్యాంకు సోయం సొంతం. లోకల్ ఎలక్షన్స్ లో పట్టుమని పది సీట్లు కూడా బీజేపీ గెలవలేకపోయింది. అయితే ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని సోయం బాపురావు ప్రయత్నిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన మూడు నియోజక వర్గాల నుంచి ఎంపీలుగా తెచ్చిన ఈ ముగ్గురు నేతలు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సానుకూల ప్రకటనలకు తీసుకోలేక పోయారు. విమర్శలను ఎదుర్కొని.. ఈ ముగ్గురు ఎంపీలు మునిసిపాలిటీల్లో ఎలా నెగ్గుకొస్తారో వేచి చూడాలి.