దొంగలు దొరుకుతారా?.. రాజధాని అవకతవకలపై నివేదిక సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం
posted on Dec 28, 2019 @ 11:56AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత సీఆర్డీఏ అవినీతిపై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. 2019 అసెంబ్లీ సమావేశాల్లో బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆ వివరాలను చివరి రోజున ప్రకటించారు. నివేదికలో ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు కూడా అందుకు స్పందించారు. కొంత మంది తాము ఎప్పుడు కొన్నామో చెప్పగా.. మరికొంతమంది ఆ భూములు మీరే తీసుకోవాలంటూ బుగ్గనకు సవాల్ చేశారు. సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని సిబిఐ విచారణకు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సిబిఐ విచారణ జరిపిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై చంద్రబాబు స్పందించారు.
హై కోర్టు జడ్జితో అయినా సిబిఐతోనైనా విచారణ చేయించాలన్నారు. సీబీఐ విచారణను 3 నెలల్లో పూర్తయ్యేలా కేంద్రాన్ని కోరాలన్నారు. అదే సమయంలో విశాఖలో మీ అవకతవకలపై కూడా సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ చేశారు. విశాఖలో వైసీపీ నేతలు ఇన్ సైడ్ ట్రేడింగ్ చేశారని బయటపెడుతుంటే అమరావితిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందంటున్నారని విమర్శలు గుప్పించారు. సీబీఐ విచారణపై జగన్ కు అంత గౌరవం ఉంటే శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. గత ఏడు నెలలుగా తవ్వుతున్నామంటున్నారు కానీ ఏం బయటపెట్టారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారని అన్నారు చంద్రబాబు. అందుకు అనేక విచారణ కమిటీలు వేశారని కూడా గుర్తుచేశారు.
పోలవరం పీపీఏలపై నిపుణుల కమిటీలు నియమించారు కానీ చివరికి తామే పోలవరంలో అవినీతి జరగలేదని కేంద్రానికి చెప్పాల్సి వచ్చిందన్నారు. రాజధాని భూములపై పలు రకాల విచారణలు వేశారు. మొదట రిజిస్ర్టేషన్ శాఖ ద్వారా వివరాలు మొత్తం బయటకు తెప్పించారన్నారు. ప్రతి రైతు ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లి విచారణ జరిపడమే కాకుండా మధ్యలో క్యాబినెట్ సబ్ కమిటీని కూడా నియమించారు. నిజంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు ఎవరైనా పాల్పడి ఉన్న బినామీ పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేసి ఉన్న సులువుగా దొరికిపోతరని వెల్లడించారు. అలా తమ నేతలు ఎవరైనా దొరికివుంటే ప్రభుత్వం ఇప్పటి వరకు వేచిచూసేది కాదన్నారు.
ఇప్పుడు రాజధానిని తరలించాలనుకునే నిర్ణయం తీసుకోవటానికి సిద్ధమై వాయిదా వేసుకున్న తరువాత ఈ క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికను తెరపైకి తీసుకువచ్చారని తెలిపారు చంద్రబాబు. రాజధానిని ఎందుకు మార్పు చేస్తున్నామో ప్రజలకు పూర్తిగా వివరించి వారిలో సానుకూలత వచ్చాకే ముందడుగు వేద్దామని ఈలోగా ఇన్ సైడర్ ట్రేడింగ్ ఇతర అవకతవకలపై ముందుకెళ్లాలని సీఎం జగన్ సూచించారు. రాజధాని భూములపై సీఐడీ విచారణ ఇప్పటికే జరిగింది. లోకాయుక్తకు ఇలాంటి కేసులను విచారించడానికి అధికారం ఉండదని అంటున్నారు విశ్లేషకులు. ఇక సిబిఐ ప్రభుత్వ సిఫార్సు చేయడమే మిగిలిందన్న చర్చ జరుగుతోంది.