మూడు రాజధానులు వద్దు..అమరావతే ముద్దు.. రైతుల నినాదాలతో హోరెత్తుతున్న అమరావతి
posted on Dec 28, 2019 @ 3:26PM
అమరావతిలో రైతుల ఆందోళనలు వరుసగా 11వ రోజు కొనసాగుతున్నాయి. 3 రాజధానుల పై ప్రభుత్వ ప్రకటన విరమించుకునే వరకు వెనక్కి తగ్గేదిలేదంటున్న అన్నదాతలు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి కేంద్ర హోంమంత్రిని కలిసి విజ్ఞాపనలు ఇవ్వాలని నిర్ణయించారు. ఢిల్లీలో మేధావి వర్గాన్ని , పత్రిక సంపాదకులని కలిసి దేశం దృష్టికి సమస్యను తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. క్యాబినేట్ భేటీలో జీఎన్ రావు కమిటీ నివేదిక సిఫారసులపై నిర్ణయం వాయిదా పడినా సర్కారు వాటిని అమలు చేసే ఉద్దేశంతోనే ఉన్నందున పోరాటానికి విరామం ప్రకటించరాదని రైతులు నిర్ణయించారు.
శుక్రవారం ( డిసెంబర్ 27న ) రాజధాని గ్రామాల్లో అక్కడికక్కడ విభిన్న రీతుల్లో ఆందోళనలు కొనసాగాయి. కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకోవటం.. రైతులు ప్రతిఘటించటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సచివాలయానికి సీఎం వెళ్లే సమయంలో పోలీసులు గ్రామస్థులను అదుపులోకి తీసుకోవడాన్ని రైతులు తప్పుబట్టారు. రహదారి పైకి రాకుండా నిర్భంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు కట్టడి చేసినా ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. రైతులతో పాటు రాజకీయ పక్షాలూ, న్యాయవాదులు కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు. అమరావతిలో రాజధాని కొనసాగించాలని మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఆపడంలో విజయం సాధించినట్టుగా రైతులు భావిస్తున్నారు. ఆందోళనలు కొనసాగించేలా రైతులు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. మందడంలో మహాధర్నా, వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు యథాతథంగా కొనసాగుతాయని రైతులు పేర్కొన్నారు.
తుళ్లూరులో మహాధర్నాతో పాటు వంటా వార్పు కార్యక్రమం తలపెట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షలు కొనసాగుతాయని రాజధాని రైతుల పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు. సోమవారం నుంచి గుంటూరు నగరంలో రిలే దీక్షలు ప్రారంభించాలని నిర్ణయించారు. రాజధాని కోసం రైతులు చేస్తున్న నిరసనల్లో మీడియా ప్రతినిధులపై జరిగిన దాడి దురదృష్టకరమని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది. మీడియా ప్రతినిధులు రైతుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటం సరి కాదని పేర్కొన్నారు. రాజధాని అమరావతిపై స్పష్టమైన ప్రకటన చేయకుండా ప్రజల్లో మరింత అయోమయం గందరగోళం సృష్టించేలా మంత్రిమండలి నిర్ణయం ఉందనీ అమరావతి రాజధాని పరిరక్షణ కమిటీ ఆక్షేపించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 30 న గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రిలే నిరహార దీక్షలు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. రాజధానిపై ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ కడప జిల్లా రాజంపేటలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. 3 రాజధానులు వొద్దు అమరావతే ముద్దు అంటూ నినదించారు. ఒక రాష్ట్రం 3 రాజధానులు ప్రజలకు వరమా భారమా అన్న అంశంపై తిరుపతి ప్రెస్ క్లబ్ లో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాజధాని అమరావతిలో కొనసాగాలని..అలా కాకుండా మార్చాలని ప్రభుత్వం నిర్ణయిస్తే రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని వివిధ పార్టీల నేతలు మేధావులు అభిప్రాయపడ్డారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అఖిల పక్ష కమిటీ తీర్మానం చేసింది.