కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యేపై తిరగబడ్డ కార్యకర్తలు!!
posted on Dec 28, 2019 @ 10:26AM
కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, తమను పట్టించుకోవడం లేదంటూ స్థానిక వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆగ్రహంతో ఎమ్మెల్యే ఫ్లెక్సీలకు కార్యకర్తలు నిప్పు పెట్టి తగులబెట్టారు. కల్లూరు మండలం, తాండ్రపాడు గ్రామంలో నాడు- నేడు కార్యక్రమానికి ఆయన వెళ్లారు. ఇందిరా గాంధీ కాలనీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యేని తమ కాలనీకి రావాలని ఆహ్వానించగా.. ఆయన అక్కడికి వెళ్లకుండా పక్కకాలనీ లోకి వెళ్లారు. దీంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఎమ్మెల్యే ప్లెక్సీలను దగ్ధం చేశారు. కొత్తగా పార్టీ లోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని.. కొన్నేళ్లుగా పార్టీలో ఉంటున్న తమను పట్టించుకోవడం లేదని పాత క్యాడర్ విమర్శిస్తోంది. ఈ ఘటన జిల్లా వైసీపీలో పెను దుమారమే రేపింది. జిల్లాలోని ముఖ్య నేతలు జోక్యం చేసుకొని తాండ్రపాడులో ఫ్లెక్సీలను దగ్ధం చేసిన కార్యకర్తలతో.. కొత్తగా పార్టీలోకి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడి అందరి మధ్య రాజీ కుదిర్చి వివాదానికి తెరదించినట్లు సమాచారం.
ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకర్ కి మాజీ ఎమ్మెల్యేలు మురళీ కృష్ణ , మణిగాంధీ మధ్య వైరం ఉంది. ముగ్గురు నేతలు ఎవరి దారిలో వారు వెళ్తున్నారు. దీంతో కోడుమూరు వైసీపీ క్యాడర్ లో చీలికలు ఏర్పడ్డాయి. చివరకు పార్టీ కార్యక్రమాల్లో కూడా ముగ్గురు కలిసి పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. కోడుమూరు నియోజక వర్గం వైసీపీ ఇన్ చార్జి కోట్ల హర్షవర్దన్ రెడ్డి కూడా ఎన్నికల ఫలితాల నాటి నుంచి సుధాకర్ కు దూరంగా ఉన్నారు. అయితే పార్టీ పెద్దల ఆదేశాల ప్రకారం ఇద్దరూ రాజీకొచ్చి జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అప్పటి నుంచి వీరి క్యాడర్ కూడా ఏకమయ్యారు. అయితే ఎమ్మెల్యే సుధాకర్ తో కలిసి పని చేసేందుకు మాజీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపడం లేదని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు వర్గపోరును వీడకపోవడంపై చర్చ జరుగుతోంది. వీరి వ్యవహారాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు జిల్లా ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారు.