మరో వివాదంలో టీటీడీ... స్వరూపానంద కోసం రూల్స్ బ్రేక్
టీటీడీ అధికారులు మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మంటగలిపారు. తిరుమల శ్రీవారి ఆలయ సంప్రదాయాలకు తూట్లు పొడుస్తూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుమల ఆలయ సంప్రదాయాలకు, టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామికి స్వాగతం పలికారు. ఆనవాయితీ ప్రకారం పీఠాధిపతులు, మఠాధిపతులు ఎవరైనా తిరుమల వస్తే, శ్రీవారి ఆలయం ముందు వేద మంత్రాలతో ఇఫ్తికఫాల్ స్వాగతం పలుకుతారు. కానీ, ఆలయ నిబంధనలను, అనాదిగా వస్తోన్న సంప్రదాయాలను పక్కనబెట్టేసిన టీటీడీ అధికారులు ఏకంగా అలిపిరి గేటు దగ్గరకే వెళ్లి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామికి స్వాగతం పలికారు. కేవలం స్వాగతమే కాదు... వేద మంత్రాలతో ...టీటీడీ వేద పారాయణ అర్చకుల చేత ఆహ్వానం పలికించారు. అదే సమయంలో, అలిపిరి గేటు దగ్గరే స్వరూపానందేంద్రను మంత్రి బుగ్గన, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కలుసుకున్నారు. అయితే, టీటీడీ అధికారుల నిర్వాకమంతా బుగ్గన, చెవిరెడ్డి సమక్షంలోనే జరిగిందో ఏమో తెలియదు గానీ, అలా స్వాగతం పలికారో లేదో అంతలోనే మంత్రి, ఎమ్మెల్యే కలిసి స్వరూపానందను శాలువాతో సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు.
అయితే, అనాదిగా వస్తోన్న సంప్రదాయాలకు విరుద్ధంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రకు అలిపిరి గేటు దగ్గర వేద మంత్రాలతో టీటీడీ వేద పారాయణ అర్చకుల చేత స్వాగతం పలికించడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. అసలు, ఎవరి మెప్పు కోసం టీటీడీ అధికారులు ఇలా అత్యుత్సాహం ప్రదర్శించారని ప్రశ్నిస్తున్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులను గౌరవించడం హిందూ సంప్రదాయమైనప్పటికీ, టీటీడీ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించడం అపచారమంటున్నారు. అంతేకాదు, శ్రీవారి గర్భాలయంలోని ఏ వస్తువును కూడా బయటికి తీసుకురాకూడదు. శ్రీవారికి అలంకరించిన పూలదండలను కూడా బయటికి తేకూడదు. అలాంటిది గర్భాలయంలో శ్రీవారి శంఖం దగ్గర అలంకరించే బంగారు చిలుకను తీసుకొచ్చి స్వరూపానంద చేతిలో పెట్టారని, ఇది ఆలయ నిబంధనలకు విరుద్ధమని మండిపడుతున్నారు.
టీటీడీ అధికారులు శ్రీవారికి సేవ చేయాలే గానీ, ఇలా మఠాధిపతులు, పీఠాధిపతులకు సేవకులుగా మారకూడదని మండిపడుతున్నారు. సంప్రదాయం ప్రకారం శ్రీవారి ఆలయం ముందు స్వాగతం పలికితే తమకు అభ్యంతరం లేదు కానీ... ఇలా అలిపిరి గేటు దగ్గరకు, విమానాశ్రయానికి వెళ్లిమరీ రాజకీయ పార్టీ కార్యకర్తల్లా టీటీడీ అధికారులు వ్యవహరించడమంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మంటగలపడమేనని మండిపడుతున్నారు. టీటీడీ అధికారుల తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని, ధర్మానికి విరుద్ధంగా... ఆలయ సంప్రదాయాలను తుంగలో తొక్కడం మంచిదికాదని అంటున్నారు. టీటీడీ అధికారులు తమ పరిపతిని పెంచుకునేందుకు, స్వార్థ ప్రయోజనాల కోసమే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండిపడుతున్నారు.