ఆర్ఎస్ఎస్, ఎంఐఎంకు అనుమతి... కాంగ్రెస్ కు మాత్రం నిరాకరణ...
posted on Dec 29, 2019 8:47AM
పౌర బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన ర్యాలీపై రగడ జరుగుతోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఏఏకి వ్యతిరేకంగా టీకాంగ్రెస్ తలపెట్టిన తిరంగా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కవాతుకు, ఎంఐఎం సభలకు అనుమతిచ్చిన ప్రభుత్వం.... తమ శాంతియుత ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వరంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అనుమతి ఇచ్చినా... ఇవ్వకపోయినా... ర్యాలీ నిర్వహించి తీరుతామని తెగేసి చెబుతున్నారు. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ ర్యాలీపై ఉత్కంఠ కొనసాగుతోంది.
సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్... ఇలా ఇటీవల మోడీ సర్కారు తెరపైకి తెచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో అయితే పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టింది. అలాగే భారీ బహిరంగ సభను సైతం ఆర్గనైజ్ చేసి సక్సెస్ అయ్యింది. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ ఆందోళనలతో కాంగ్రెస్ కు కొంత మైలేజ్ కూడా వచ్చింది. దాంతో, ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. అయితే, తెలంగాణలో గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్ వరకు టీకాంగ్రెస్ తలపెట్టిన ర్యాలీకి మాత్రం పోలీసులు అనుమతి నిరాకరించారు. సేవ్ డెమోక్రసీ-సేవ్ కానిస్టిట్యూషన్ పేరిట శాంతియుత ర్యాలీకి అనుమతి కోరినా డీజీపీ అండ్ హైదరాబాద్ సీపీ పర్మిషన్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కవాతుకు, ఎంఐఎం సభలకు అనుమతిచ్చిన పోలీసులు.... తమ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోవడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే అనుమతి నిరాకరించారని ఫైరవుతున్నారు.
ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై టీకాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇండియన్ పోలీస్ సర్వీసును ... కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ గా మార్చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆర్ఎస్ఎస్ కవాతుకు అనుమతిచ్చిన పోలీసులు... శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే తమకెందుకు పర్మిషన్ ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఎవరికీ ఇబ్బంది లేని చోట సభ నిర్వహించుకుంటామన్నా వినిపించుకోవడం లేదని మండిపడుతున్నారు. అయితే, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ర్యాలీ నిర్వహించి తీరుతామంటోన్న కాంగ్రెస్ నేతలు.... పెద్దఎత్తున హైదరాబాద్ తరలిరావాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరి, కాంగ్రెస్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీస్తుందో... లేక ప్రశాంతంగా సాగుతుందో చూడాలి.