అమరావతిలో యుద్ధ వాతావరణం... పెద్దఎత్తున బలగాల మోహరింపు
posted on Dec 28, 2019 9:22AM
అమరావతిలో వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాజధాని గ్రామాల ఆందోళనలతో అమరావతి అట్టుడుకుతోంది. మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో అమరావతి అంతటా పోలీసులు మోహరించారు. మూడు రాజధానులపై కేబినెట్ లో చర్చించి అధికారికంగా ప్రకటన చేయనున్న నేపథ్యంలో అమరావతి 29 గ్రామాల్లో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. అధికారిక ప్రకటన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ పెద్దఎత్తున బలగాలను మోహరించారు. దాంతో, అమరావతి మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా సచివాలయానికి చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు కవాతు కూడా నిర్వహించారు. తుపాకులు, లాఠీలు, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్, అగ్నిమాపక వాహనాలతో సచివాలయం చుట్టూ భద్రత కల్పించారు. దాంతో, రాజధాని ప్రాంతంలో అప్రకటిత యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.
అయితే, రాజధాని గ్రామాల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించడంపై రైతులు మండిపడుతున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తమను రెచ్చగొట్టేవిధంగా పోలీసుల చర్యలు ఉన్నాయని ఫైరవుతున్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా, లాఠీఛార్జీలు చేసినా అమరావతిని రాజధానిగా కొనసాగించేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. అయితే, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినాసరే యువత మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ బైకులు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు, అమరావతిలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని టీడీపీ సీనియర్ లీడర్ యనమల ఆరోపించారు. రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చేసి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. తనకు ఓట్లేసిన వాళ్లనే తొక్కుకుంటూ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారని, తన పని తీరును విమర్శించినా ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్నారని అన్నారు. భూములిచ్చిన రైతులను దొంగలుగా చూస్తారా? రైతుల ఇళ్లకు నోటీసులు అంటిస్తారా? ఇంటింటికీ నోటీసులంటించే తప్పులు వాళ్లేం చేశారో చెప్పాలన్నారు. అయినా, రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన రాజధానిని ఏవిధంగా మారుస్తారని యనమల ప్రశ్నించారు. జగన్ తన స్వార్ధం కోసమే సచివాలయాన్ని విశాఖకు తరలిస్తున్నారని, ఆర్నెళ్ల ముందు నుంచే విశాఖలో వైసీపీ రౌడీలు భూదందాలు మొదలుపెట్టారని, ఇటీవల విశాఖలో జరిగిన భూ కొనుగోళ్లను బయటపెడితే గుట్టు మొత్తం బయట పడుతుందన్నారు.