గడ్డం ఒకటే మిగిలింది...ఉత్తముడిగా మారిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
posted on Dec 28, 2019 @ 1:18PM
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల తరువాతే పీసీసీ నుంచి తప్పుకోవాలని అనుకున్నారు. కానీ ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో అలానే కొనసాగించారు. కానీ దేశమంతా పార్టీ పరిస్థితి ఇదే విధంగా ఉండటంతో మళ్ళీ సైలెంటయ్యారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా హర్ట్ అయ్యారు. ఉప ఎన్నికల్లో ఓటమిని అవమానంగా ఫీలవుతున్నారు. తాను నమ్ముకున్న చోటే భారీ తేడాతో ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ఫలితాల వెంటనే ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. పీసీసీ చీఫ్ గా ఉంటూ ఉప ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో ఓటమి ఆయనని మరింత కుంగదీసింది. ఇప్పుడు కొత్త పిసిసి చీఫ్ ను ఎంపిక చెయ్యమంటూ అధిష్ఠానానికి సూచించారు. ఇటీవల రాహుల్ గాంధీకి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలిసింది.
త్వరలోనే అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాబోతోందని సమాచారం. వీటన్నింటి నుంచి బయటకు రావాలని బెంగుళూరు ప్రకృతి వైద్యానికి వెళ్లారు ఉత్తమ్. అతిగా హడావుడి చేయడం కంటే ఉన్న ఎంపీ పరిధిలో పనులు ప్రశాంతంగా చేసుకుంటూ హాయిగా గడిపేయాలనుకుంటున్నారు ఉత్తమ్. బెంగుళూరు ప్రకృతి వైద్యం తరువాత నిత్యం 30 కి పైగా సిగరెట్లు తాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మొత్తానికే మానేశారు. మద్యం అలవాటు కూడా ఉత్తమ ఉండేది, కార్గిల్ యుద్ధం సమయంలో వెన్నుకు గాయమవడం ఆ నొప్పి ఇంకా వేధిస్తోంది.
దాని నుంచి రిలీఫ్ అవ్వడానికి కొంత ఆల్కహాల్ తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఆల్కహాల్ ని కూడా మానేశారు. ఇక మాంసాహారం కూడా ఇష్టంగా తినే ఉత్తమ్, ఇప్పుడు కాయగూరలకు పరిమితమయ్యారు. ఉడికించిన కూరగాయలు తక్కువ కారంతో వండిన కూరలను అలవాటు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు ఉన్న ఉత్తమ్ ఇప్పుడు మొత్తానికీ మారిపోవాలని డిసైడ్ అయ్యారు. అందుకే మనసే కాదు ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. పీసీసీ నుంచి తప్పుకొని ఢిల్లీ నియోజకవర్గానికే పరిమితమవ్వాలని నిర్ణయించుకున్నారు ఉత్తమ్. మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మారిపోయారు. రాజకీయాల్లో కేవలం తన పార్లమెంటు సీటు వరకే పరిమితం కావాలనుకుంటున్నారు.