ఒడిషాలో ఘోరం... స్పాట్‌లో ఆరుగురు... ఆస్పత్రిలో ముగ్గురు... మృత్యువాత

ఒడిషాలో ఘోరం జరిగింది. బస్సుకు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వివాహ నిశ్చితార్ధ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. గంజాం జిల్లా గొలంత్రలోని మంద్ రాజ్ పూర్ దగ్గర పెళ్లి బస్సుకు 11కేవీ విద్యుత్ వైర్లు తగిలాయి. దాంతో, స్పాట్లోనే ఆరుగురు మృత్యువాత పడగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రాంతం భయానకంగా మారింది. విద్యుత్ షాక్ తో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బస్సులో మొత్తం 40మంది ఉండగా, తొమ్మిది మరణించారు. అలాగే, మరో 30మంది గాయపడ్డారు. దాంతో, క్షతగాత్రులను బరంపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఘటన జరిగిన తీరు హృదయ విదారకరంగా మారింది. ఎంతో సంతోషంగా వివాహ నిశ్చితార్ధ వేడుకలో పాల్గొనడానికి బయల్దేరినవారిలో తొమ్మిది మంది మృత్యువాత పడటం... 30మంది గాయపడటంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. బంధువులు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ ఘటనను చూసిన స్థానికులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.

కరోనా కంటే డేంజర్ వైరస్ కనిపెట్టిన చంద్రబాబు...

ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. కరోనా కల్లోలంతో చైనా అల్లకల్లోలమవుతోంది. కరోనా కారణంగా ఇప్పటికే ఏడెనిమిది వందల మంది మరణించగా, వేలాది మంది వైరస్ బారినపడ్డారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఒక్కటి వైరస్ కాదు... రెండు వైరస్ లు గడగడలాడిస్తున్నాయి. ఈ వైరస్ లు జనాన్ని కంటే ఎక్కువగా రాజకీయ పార్టీలను వణికిస్తున్నాయి. ఇంతకీ ఈ వైరస్ లను కనిపెట్టింది... సృష్టించింది కూడా పొలిటికల్ పార్టీలే. అంతేకాదు, ఈ వైరస్ లు కరోనా కంటే డేంజర్ అంటున్నాయి. అధికార వైసీపీ.... ఎల్లో వైరస్ ను కనిపెడితే... ప్రతిపక్ష నేత చంద్రబాబు...  వైసీపీ వైరస్ ను సృష్టించారు. ఇంతకీ ఈ వైరస్ లు ఏంటో ఇఫ్పటికే మీకు అర్ధమై ఉంటుంది. అదేనండీ పొలిటికల్ వైరస్ లు. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే... ఈ వైసీపీ వైరస్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టిపీడిస్తోందని జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. కరోనా... చైనాను అతలాకుతలం చేస్తుంటే.... దానిని మించిన వైసీపీ వైరస్ ఎనిమిది నెలలుగా ఏపీని చెల్లాచెదురు చేస్తోందని బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వైరస్ పేరెత్తితేనే పెట్టుబడిదారులు భయపడి పారిపోతున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ వైరస్ దెబ్బకు కంపెనీలన్నీ ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిపోతున్నాయని అన్నారు. ఏడెనిమిది నెలలుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని మండిపడ్డారు. అయితే, చంద్రబాబు విమర్శలకు వైసీపీ నేతలు రివర్స్ కౌంటరిస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కన్నా ఎల్లో వైరస్ మరింత ప్రమాదకరమని సెటైర్లు వేస్తున్నారు. చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే... ఆంధ్రప్రదేశ్ ను ఎల్లో వైరస్ పట్టి పీడిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రపంచానికి కరోనా వైరస్ పడితే, ఏపీకి చంద్రబాబు వైరస్ వేధిస్తుందని విమర్శిస్తున్నారు. మొత్తానికి, ఏపీలో కొత్త వైరస్ లను సృష్టించిన టీడీపీ, వైసీపీలు... కరోనా పేరుతో కొత్త తరహాలో వైరస్ యుద్ధం చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్త వైరస్... మీరు కారణమంటే మీరు కారణమంటూ బాబు, జగన్ ఆరోపణలు...  

ఏపీలో ఏబీవీ కలకలం... జగన్ దుస్సాహసం..!

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం ఏపీలో కలకలం సృష్టిస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీకి అనుకూలంగా పని చేశారని... దేశ రక్షణ వ్యవస్థను దెబ్బతీశారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.... ఉద్యోగులను వేధిస్తోందని చంద్రబాబు అంటున్నారు. ముఖ్యంగా ఏబీ వెంకటేశ్వరరావుపై ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు వైసీపీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏబీ వెంకటేశ్వరరావు కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేశారని ఆరోపించారు. వైసీపీని దెబ్బతీయడానికే నిఘా వ్యవస్థను ఉపయోగించారని సజ్జల విమర్శించారు. అయితే, పోస్టింగులు ఇవ్వకుండా ఉద్యోగులను, పోలీసు అధికారులను ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ట్విట్టర్‌లో ఫైరయ్యారు చంద్రబాబు. గత ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన చినరాజప్ప కూడా జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఏబీ వెంకటేశ్వర్రావును ప్రభుత్వం సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు.... ముఖ్యమంత్రి, అలాగే, ఇతర ముఖ్య నేతలతో సన్నిహితంగా ఉండటం సాధారణమేనని అన్నారు. అంతమాత్రాన తర్వాత వచ్చిన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదన్నారు. ఒక ప్రభుత్వంలో పని చేశారని... మరో ప్రభుత్వంలో కక్ష సాధించడం గర్హనీమయమన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. కులం పేరుతో, పార్టీ పేరుతో ఉద్యోగులను బలిపెట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.  మరోవైపు ఏపీ ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్ వేటుపై ఏబీ వెంకటేశ్వర్రావు స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మానసికంగా తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. బంధుమిత్రులను ఉద్దేశించి వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. అక్రమాల కారణంగా తనపై చర్య తీసుకున్నారనేది అవాస్తవమన్నారు. మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్ పై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. సస్పెన్షన్ పై చట్టపరంగా ముందుకు వెళ్తానన్నారు. ఆ తర్వాత ఏంటి అనేది క్రమంగా అందరికీ తెలుస్తుందన్నారు. అయితే, ఏబీ వెంకటేశ్వరరావుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయంటోంది ప్రభుత్వం. మొత్తానికి, ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం ఏపీలో ముదురుతోంది. ఏబీపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరుపాలన్న ఆలోచనలో సర్కార్‌ కనిపిస్తోంది. మరి, ఏబీ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక... దయచేసి వినండి...కాదు, చదవండి..!

కృపయా ధ్యాన్ దే... దయచేసి వినండి... ప్రయాణికులకు ముఖ్య గమనిక... ఇలాంటి అనౌన్స్ మెంట్స్ ఎక్కువగా రైల్వే స్టేషన్లలో మాత్రమే వినబడుతుంటాయి. ఇఫ్పుడు మీరు చదవబోయే వార్త కూడా రైల్వే ప్రయాణికులకు సంబంధించినదే. అంతేకాదు, కచ్చితంగా తెలుసుకోవాల్సిన వార్తే. ఎందుకంటే, దక్షిణమధ్యరైల్వే పెద్దఎత్తున రైళ్లను రద్దు చేసింది. ఏడు రోజులపాటు పలు రైళ్లను పూర్తిగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ముద్కేడ్-పర్బని మధ్య డబ్లింగ్ పనులు... అలాగే, నాన్ ఇంటర్ లాకింగ్ కారణంగా దక్షిణమధ్యరైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి పది నుంచి పదిహేను వరకు 37 రైళ్లను పూర్తిగా.... 33 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. రద్దయిన రైళ్లలో హైదరాబాద్‌-ఔరంగాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, ఔరంగాబాద్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, మేడ్చల్‌-హెచ్‌ఎస్‌, నాందేడ్‌-మేడ్చల్‌, ఆదిలాబాద్‌-పూర్ణ-ఆదిలాబాద్‌, నిజామాబాద్‌-పంధర్‌పూర్‌-నిజామాబాద్‌, తిరుపతి-అమరావతి-తిరుపతి, ఆదిలాబాద్‌-పర్లి-ఆదిలాబాద్‌ తదితర రైళ్లు ఉన్నాయి. అయితే, రైళ్ల ప్రయాణికులు  రద్దయిన రైళ్ల వివరాలు తెలుసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణమధ్యరైల్వే సూచించింది. 

ఆంధ్రప్రదేశ్ లో కుక్కకు ఓటు హక్కు... అధికారులకు జనం నీరాజనం... 

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కుక్క కూడా ఓటు వేయబోతోంది. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తనకూ ఓటు హక్కు ఉందని ఓటర్ లిస్ట్‌లో తన ఫొటో చూపించి మరీ ఓటు హక్కును వినియోగించుకోబోంది. అదేంలటీ... కుక్కకు ఓటా... అని నోరెళ్ల బెడుతున్నారా? మీరు చదువుతున్నది నిజమే. ఇప్పటివరకు హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు, సెలబ్రిటీలకు మాత్రమే పలు గ్రామాల్లో ఓటు హక్కు కల్పించిన అధికారులు... ఈసారి గ్రామ సింహం కుక్క గారికే ఏకంగా ఓటు హక్కు కల్పించేశారు. ఇంతకీ, కుక్కకు ఓటు ‍హక్కు కల్పించిన ఆ ప్రబుద్దులు ఎవరనే కదా మీ సందేహం. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ అధికారులు చేసిన నిర్వాకం ఇదీ. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోన్న అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేపట్టారు. అయితే, ఫైనల్ ఓటరు లిస్టును విడుదల చేసిన ఏలూరు కార్పొరేషన్ అధికారులు... ఓటరు జాబితాలో కుక్క ఫొటో ఓటు హక్కు కల్పించారు. ఏలూరు 12వ డివిజన్ లో బన్నీ గార పేరుతో 5928 సీరియల్ నెంబర్ తో పోలింగ్ స్టేషన్ నెంబర్ 194లో కుక్కకు ఓటు ఉన్నట్లు చూపించారు. అయితే, అధికారులు పంపిన ఓటరు జాబితాలో కుక్క బొమ్మతో ఓటు హక్కు కల్పించినట్లు ఉండటంతో లీడర్లు నోరెళ్లబెడుతున్నారు. ఆహా మన అధికారులు ఎంత గొప్పోళ్లో... కుక్కకు కూడా ఓటు హక్కు కల్పించారంటూ నోరెళ్ల బెడుతున్నారు. కుక్కకు ఓటు హక్కే కాదు... ఏలూరు కార్పొరేషన్ లో పలుచోట్ల వేర్వేరు సీరియల్ నెంబర్లు, పోలింగ్ బూతుల్లో ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు కల్పించారు. కొందరికైతే, ఏకంగా ఏడేసి ఓట్లు ఉండటాన్ని చూసి పొలిటికల్ లీడర్స్ తోపాటు జనం అవాక్కవుతున్నారు. అధికారుల పనితీరు గొప్పగా ఉందంటూ నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా కుక్కకు ఓటు హక్కు కల్పించడాన్ని చూసి ఇదేం విడ్డూరమంటూ నవ్వుకుంటున్నారు. మన అధికారుల పనితీరు భలేగుందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా, కుక్కకు ఓటు హక్కు కల్పించిన ఘనత ఏలూరు అధికారులకు దక్కిందంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

మోడీని పట్టించుకోని ఢిల్లీ ప్రజలు... కమలాన్ని ఊడ్చిపారేసిన చీపురు...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మహా యుద్ధాన్ని తలపించాయి. కనీవినీ ఎరుగని రీతిలో భారీ సైన్యాన్ని మోహరించింది కమలదళం. 56 మంది కేంద్రమంత్రులు, 11 మంది ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపీలను యుద్ధక్షేత్రంలో నిలిపింది. దీనికితోడు ఆరెస్సెస్, వీహెచ్‌పీ కరసేవకులు. ఇంకోవైపు ఏకంగా నరేంద్ర మోడీ ప్రచారాన్ని హోరెత్తించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ ‌షా సమర వ్యూహాన్ని రచించారు. అటు కేజ్రీవాల్‌ మాత్రం తనే ఒక సైన్యంగా కదిలారు. ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎలక్షన్స్ స్థాయిలో మోడీ వర్సెస్ కేజ్రీవాల్‌గా సాగాయి. అయితే, ఢిల్లీ అసెంబ్లీ సమరంలో చీపురు మరోసారి శివాలెత్తబోతోందని ఎగ్జిట్‌పోల్స్‌... సింగిల్ వాయిస్‌తో హోరెత్తించాయి. ఆమ్‌ ఆద్మీకి....బీజేపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిందని చాటిచెప్పాయి. సీఏఏ సహా హిందూత్వ అస్త్రాలు ఎన్ని సంధించినా, జనం మాత్రం మోడీని పట్టించుకోలేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలన్నీ చీపురు పార్టీకి మళ్లీ పట్టాభిషేకం చేయడాన్ని చూస్తుంటే... బీజేపీ ఎత్తులు పని చేయలేదని అర్థమవుతోంది. ఇక, ఎలాగూ ఆప్‌-బీజేపీ మధ్యే పోటీ అని గ్రహించిన కాంగ్రెస్..., కమలం ఓడితే చాలని, లోపాయికారీగా కేజ్రీవాల్‌కు సపోర్ట్ ఇచ్చిందంటున్నారు. ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలే నిజమైతే, చీపురు పార్టీ ...దేశానికి కొత్త నిర్దేశం ఇచ్చిందనుకోవాలి. సకల భారత సమాహారమని చెప్పుకునే హస్తినలో, మోడీ ప్రభావం కనిపించకపోతే కమలానికి చిక్కులు మొదలైనట్లే. ఎందుకంటే, దేశవ్యాప్తంగా గాలి మారుతోందని, మోడీ హవా తగ్గుతోందన్న విమర్శలు పెరుగుతాయి. ఢిల్లీ ఫలితాలతో విపక్షాలకు కేజ్రీవాల్‌ కొత్త దారి చూపొచ్చని...అలాగే, మోడీని ఢీకొట్టగల నాయకుడిగా, అరవింద్ కేజ్రీవాల్‌ అవతరించవచ్చంటున్నారు విశ్లేషకులు.

లగే రహో కేజ్రీవాల్... ఇదే ఆప్ సునామీకి కారణం...

ఢిల్లీ పీఠం మళ్లీ కేజ్రీవాల్‌దేనని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి ఎదురే లేదని తేల్చిచెప్పాయి. మరోసారి  బంపర్ మెజారిటీతో  కేజ్రీవాల్ అధికారంలోకి రావడం ఖాయమని బల్లగుద్దిమరీ చెప్పాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో  60 సీట్లకు అటూఇటుగా ఆప్ గెలుచుకుంటుందని అంచనా వేశాయి. అయితే, కేజ్రీవాల్ సునామీకి కారణమేంటి? ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, మొత్తం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు... ఇంతమంది రంగంలోకి దిగినా... హిందుత్వ ఆయుధాన్ని ప్రయోగించినా... ఎగ్జిట్ పోల్స్ అన్నీ కేజ్రీవాల్ వైపే ఉండటానికి కారణాలేంటి? అంటూ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే, తన ఐదేళ్ల పాలనలో చేపట్టిన వివిధ పథకాలనే ప్రచారంలో ప్రజల ముందు పెట్టారు కేజ్రీవాల్. పేదలకు ఆధునిక సౌకర్యాలతో వైద్య సేవలందించే మొహల్లా క్లినిక్స్‌‌ను ఏర్పాటు చేశారు. అలాగే కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. మహిళల భద్రత కోసం సీసీటీవీలు, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. అలాగే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ఉచిత వైఫై ఇచ్చారు. అవీనీతి రహిత పాలన అందించానని చెప్పుకున్నారు. ఇలా తన పాలన గురించే చెప్పుకునే ఓట్లు అడిగారు కేజ్రీవాల్. తన ఐదేళ్ల పాలన గురించి లగే రహో కేజ్రీవాల్ అంటూ అదిరిపోయే పాటను విడుదల చేసి జనాల్లోకి వెళ్లారు. అయితే, మరోసారి ఢిల్లీని చీపురు ఊడ్చేస్తుందని ముందే గ్రహించిన కమలం, ఆఖరి వరకు సకల అస్త్రాలూ సంధించింది. చావోరేవోనన్నట్లుగా పోరాడింది. మోడీ పౌరసత్వ ఆయుధాన్ని వదిలితే... స్వచ్చమైన నీటి సరఫరా చూడండి అన్నారు కేజ్రీవాల్. అమిత్‌ షా షహీన్‌ బాగ్‌ టెర్రరిస్టు అంటే, నిరంతరం కారుచౌకగా ఇస్తున్న కరెంటు చూడండి అంటూ ఓటర్లకు విన్నవించారు కేజ్రీవాల్. ఆఖరికి మోడీ రామబాణం, హనుమాన్‌ ఆయుధం సంధించినా, కేజ్రీవాల్ మాత్రం, తన హయాంలో సకల సదుపాయాలతో నెలకొల్పిన సర్కారీ బడులను చూడండంటూ ప్రచారాన్ని హోరెత్తించారు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన బ్రహ్మాస్త్రమైన హిందూత్వకు సంబంధించిన సకల ఆయుధాలనూ సంధిస్తే, కేజ్రీవాల్‌ మాత్రం, కేవలం తన సుపరిపాలన గురించి మాత్రమే వివరించారు. బీజేపీ పన్నిన సెంటిమెంట్‌ ఉచ్చులో మాత్రం పడలేదు. అదే హస్తిన జనాలను ఆలోచింపజేసినట్టుంది. ఎగ్జిట్‌ పోల్స్‌‌ను బట్టి, ఆమ్‌ ఆద్మీని మరోసారి పీఠమెక్కిస్తున్నవి, కేజ్రీవాల్‌ గుడ్‌ గవర్నెన్స్ అని అర్థమవుతోంది.

కేజ్రీవాల్‌దే ఢిల్లీ పీఠం... బీజేపీ ఆశలు గల్లంతు... కాంగ్రెస్ డిపాజిట్లే గల్లంతు..!

ఢిల్లీ పీఠం మళ్లీ కేజ్రీవాల్‌దేనని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. సర్వే సంస్థలన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కట్టాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి ఎదురే లేదని తేల్చిచెప్పాయి. ఇక, జాతీయ ఛానెల్స్ కూడా కేజ్రీవాల్‌దే మళ్లీ అధికారమని స్పష్టంచేశాయి. బంపర్ మెజారిటీతో మరోసారి కేజ్రీవాల్ అధికారంలోకి రావడం ఖాయమని లెక్కగట్టాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో దాదాపు 60వరకు సీట్లను ఆప్ గెలుచుకుంటుందని అంచనా వేశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ భారీ విజయం సాధిస్తుందని తెలిపిన టైమ్స్ ‌నౌ.... ఆప్‌కి 51.... బీజేపీకి 18.... కాంగ్రెస్‌కి ఒక స్థానం వస్తాయని తేల్చిచెప్పింది. ఇక, రిపబ్లిక్ టీవీ కూడా ఆప్‌కే పట్టంకట్టింది. కేజ్రీవాల్ మరోసారి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తారని తెలిపింది. రిపబ్లిక్ టీవీ అంచనా ప్రకారం.... ఆప్‌కు 48 నుంచి 61 సీట్లు...  బీజేపీకి 9 నుంచి  21 స్థానాలు..... కాంగ్రెస్‌కు ఒక స్థానం రావొచ్చని లెక్కగట్టింది. మరో ప్రముఖ ఛానెల్ ఎన్డీటీవీ కూడా కేజ్రీవాల్‌దే అధికారమని తేల్చిచెప్పింది. ఆమ్ ఆద్మీకి 49 సీట్లు.... బీజేపీకి 20 స్థానాలు.... కాంగ్రెస్‌కు ఒక సీటు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో ప్రకటించింది. ఇక, ఇండియా టీవీ కూడా కేజ్రీవాల్ బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తారని తెలిపింది. ఆప్ 44... బీజేపీ 26 స్థానాలు గెలుచుకుంటాయని తెలిపింది.  అయితే, ఒక్క సర్వే కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పలేదు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే బీజేపీ మెరుగైన స్థానాలు సాధిస్తుందని తేల్చాయి. ఇక, కాంగ్రెస్ అయితే చాలాచోట్ల డిపాజిట్లు కోల్పోతుందని ఎగ్జిట్ పోల్ సర్వేల్లో తేలింది.

నో హెయిర్ నో బ్రెయిన్.. టీడీపీ ఎంపీ-వైసీపీ ఎంపీ ఫైట్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మధ్య మాటల యుద్ధం లోక్ సభ నుంచి ట్విట్టర్ కి చేరింది. ఇద్దరు నేతలు ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వారి విమర్శలు చినికిచినికి వ్యక్తిగతంగా దూషించుకునే వరకు వెళ్లాయి. మిథున్‌రెడ్డిని అవివేకి అని గల్లా జయదేవ్.. జయదేవ్ తలకి జుట్టులేదు, తలలో మెదడు లేదంటూ మిథున్ ఇలా ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ డమ్మీ కంపెనీ అని, ఆ సంస్థకు రూ.1000 కోట్లు విలువ చేసే భూమిని, గత టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.30 కోట్లకు కేటాయించిందని లోక్‌సభలో మిథున్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా గల్లా జయదేవ్ స్పందించారు. 1947లో ఏర్పాటు చేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌ను డమ్మీ కంపెనీగా వ్యాఖ్యానించడం అవివేకం అని గల్లా ట్వీట్ చేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌ కంపెనీ ఇండియాలో కూడా గత రెండు దశాబ్దాలుగా సేవలందిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఆ కంపెనీ ఏపీలో పెట్టుబడులు ఉపసంహరించుకోవడంలో ఎలాంటి అనుమానం లేదని గల్లా వ్యాఖ్యానించారు. గల్లా జయదేవ్ ట్వీట్‌కు మిథున్‌రెడ్డి ఊహించని సమాధానమిచ్చారు. ‘‘మీకు తలపై జుట్టే లేదనుకున్నా.. ఇప్పుడే తెలిసింది, మెదడు కూడా లేదని’’ అని సెటైర్లు వేశారు. ఏపీ నుంచి పెట్టుబడిదారులు వెళ్లిపోవాలంటూ ఎందుకు వెంటబడతావు? అని ప్రశ్నించారు. అవివేకి మీరేనని గల్లాపై మిథున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు చేసిన మిథున్‌రెడ్డికి గల్లా జయదేవ్ కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. తన శరీరం, తెలివితేటలపై మీరు చేసిన వ్యాఖ్యలను ప్రజలకే వదిలేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో ఎవరు గెలిచారో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు. అలాగే పెట్టుబడిదారులను ఎవరు బెదిరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తూ.. కియా ప్రారంభోత్సవంలో ఆ కంపెనీ ప్రతినిధిని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరిస్తున్నట్లు ఉన్న ఫోటోను గల్లా జయదేవ్ జోడించారు. మొత్తానికి టీడీపీఎంపీ-వైసీపీ ఎంపీ మధ్య ట్విట్టర్ వేదికగా టామ్ అండ్ జెర్రీ లాంటి ఫైట్ జరిగిందనే చెప్పాలి.

ఏకంగా కంపెనీ మహిళా సీఈఓకే అసభ్యకరమైన మెయిల్స్ పంపిన ఉద్యోగి!!

తాను పని చేసిన సంస్థ మహిళా సీఈఓ కు అసభ్యకరమైన మెయిల్స్ పంపుతూ ఓ ఉద్యోగి కటకటాలపాలయ్యాడు. కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మికాంత్ హైదరాబాద్ చిక్కడపల్లిలో నివాసముంటున్నాడు. అతనికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆన్ లైన్ బిజినెస్ కంపెనీల్లో డిజైనర్ గా పని చేస్తున్నాడు. ప్రేమిస్తున్నానంటూ ఏకంగా తను పని చేస్తున్న కంపెనీ సీఈవో కు కొన్ని రోజులుగా అసభ్యకరమైన ఈమెల్స్ పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడు.  లక్ష్మీకాంత్ ఉద్యోగానికి సరిగా రాకపోవడంతో కొన్ని రోజుల క్రితం తొలగించారు. ఆ తరవాత నకిలీ ఇ-మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకుని ప్రేమిస్తున్నానంటూ సీఈఓకు మెసేజ్ లు పెడుతున్నాడు. అశ్లీల ఫోటోలు పంపుతున్నాడు. దీంతో విసిగిపోయిన ఆమె హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా లక్ష్మీకాంత్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మాకు నమ్మకం లేదు సార్.. విశాఖ ల్యాండ్ పూలింగ్ విషయంలో ప్రభుత్వానికి చుక్కెదురు

విశాఖ జిల్లాలో భూ సమీకరణ రసాభాసగా మారింది. ల్యాండ్ పూలింగ్ లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. పద్మనాభం మండలం తునివలసలో అధికారుల గ్రామ సభలో రసాభాస జరిగింది. ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తూ గ్రామసభను రైతులు బహిష్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. చివరకు భూములిచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. ఇలా పలు గ్రామాల్లో రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని తెలుస్తోంది.  ఉగాది రోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. దానికి తగ్గట్టుగానే 6000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చెయ్యాలని భావించింది. అందులో భాగంగానే ఇప్పుడు విశాఖలో ఉన్న గ్రామీణ ప్రాంతాలైన పద్మనాభం, అనకాపల్లి, సబ్బవరం పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అనకాపల్లి మండలం మామిడిపాలెంలో ముందుగా భూ సేకరణకు వెళ్లిన ఆర్డీవో సీతారాం అలాగే ఎమ్మార్వో ఎస్ ప్రసాద్, గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన సభలో కూడా భూసేకరణ పై రైతులు ఆందోళన చేశారు. గతంలో అమరావతిలో రైతుల దగ్గర భూ సేకరణ చేసి వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఇస్తామని చెప్పిన మాట అతీగతీ లేకుండా పోయిందని.. ఇప్పుడు విశాఖ జిల్లాలో అలాగే పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం పేరుతో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో రైతులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న అతీగతీలేకుండాపోయింది. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది రేపు తమకు అదే పరిస్థితి అవుతుందని ఎక్కడికక్కడికి గ్రామ సభల్లో వ్యతిరేకత వస్తుందని సమాచారం. 

ఫిల్మ్ నగర్ కి తాకిన అమరావతి ఉద్యమ సెగ.. సినీ పరిశ్రమ మద్దతు కోసం ఆందోళన

రాజధాని రైతుల ఆందోళనలకు తెలుగు సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలని కోరుతూ విద్యార్థుల ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ వద్ద ఆందోళన జరిగింది. రాజధాని అమరావతికి సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలని కోరుతూ ఏపికి చెందిన ఏపి జెఏసి అదేవిధంగా మరి కొంతమంది స్టూడెంట్స్ కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా ప్రముఖుల ఫోటోలు పట్టుకొని, అమరావతికి మద్దతివ్వాలని కోరుతూ.. పెద్ద ఎత్తున జై అమరావతి నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు సీపీఐ మద్దతుగా నిలిచింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా 50 రోజులకు పైగా పెద్దఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. ఆ ఉద్యమానికి సినీ పరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని రాజధాని రైతులు కోరుతున్నారు. ప్రజల తరపున నిలబడే బాధ్యత కవులు, కళాకారులు, సాంస్కృతిక బృందము పై బాధ్యత ఎంతో ఉందని.. ప్రతి ఒక్కరు ఆ బాధ్యతను తీసుకొని ముందడుగు వేయాలని అమరావతి జేఏసీ కోరుతోంది. ప్రజలు అమరావతిని రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏక పక్షంగా రాజధానిని తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రజలు చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ముందుకు రావాలని వారు కోరుతున్నారు.

నాయుడు మాజీ పీ.ఎస్. పెండ్యాల శ్రీనివాస్ చెప్పిన ఆ ఇద్దరూ ఎవరు?

ఒక ఇన్ ఫ్రా మేజర్ ద్వారా జరిగిన లావా దేవీ ల వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అప్పటి పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ తలకు చుట్టుకుంటోందా? 36 గంటల పైబడి జరుగుతున్న విచారణ లో పెండ్యాల ఇంతకీ ఎంఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈ.డీ) కి ఏమి సమాచారం చేరవేశారు? కిలారు రాజేష్, గుత్తా కిరణ్ లనూ ఇదే విషయమై విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మూడో రోజు కూడా శ్రీనివాస్ ఇంటిలో ఈ.డీ. చేస్తున్న సోదాలకు , డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డి.ఆర్.ఐ.), ఇన్ కమ్ ట్యాక్స్ (ఐ.టీ.) బృందాలు కూడా తోడవటం తెలుగుదేశం పార్టీ సీనియర్లను కలవరపెడుతోంది. పెండ్యాల శ్రీనివాస్ నివాసం లోని రహస్య లాకర్ల నుంచి కీలకమైన ఓత్రాలను స్వాధీనం చేసుకున్న ఈ.డీ. , డీ.ఆర్.ఐ. , ఐ.టీ . బృందాలు ప్రస్తుతం వాటిని అధ్యయనం చేసే పనిలో పడినట్టు సమాచారం. వాస్తవానికి, తమ నాయకుల నివాసాలు, వ్యాపార సంస్థలపైన లోగడ ఐ.టి. దాడులు జరిగినప్పుడు హడావుడిగా మీడియా సమావేశాలు నిర్వహించి కేంద్ర సంస్థలను ఏకిపారేసిన తెలుగుదేశం అగ్రనాయకత్వం ఇప్పుడు జరుగుతున్న సోదాల మీద మాత్రం ఏ రకమైన వివరణ ఇచ్చే ప్రయత్నం కానీ, కేంద్ర సంస్థల తీరును ప్రశ్నిచే ప్రయత్నం కానీ చేయకపోవటం రాజకీయ వర్గాలను విస్తుపోయేలా చేస్తోంది. వాస్తవానికి, నిరుడు అక్టోబర్ లో జరిగిన సోదాల్లోనే ప్రముఖ ఇన్ ఫ్రా మేజర్ పేరు వెలుగులోకి వచ్చింది. అమరావతి నిర్మాణ కాంట్రాక్టులు దక్కించుకున్న ఆ సంస్థ, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ ద్వారా జరిపిన లావా దేవీల వ్యవహారం అంతా గమనించిన సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సి.బి.డి.టి.), ఇంకా ఐ.టి. అధికారులు ఆ ఇన్ఫ్రా మేజర్ ద్వారా అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ సంస్థ నుంచి దాదాపు 750 కోట్ల రూపాయల విరాళాలు వెళ్లినట్టు గుర్తించారు. అప్పటి నుంచే, దీనిపైన నిఘా వుంచిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈ.ఓ. డబ్ల్యు. ) ఆ దరిమిలా చేపట్టిన విచారణలో... అప్పటి ముఖ్యమంత్రి పెర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ పేరు ప్రముఖం గా ఫిగర్ అయింది. అలాగే, నారా లోకేష్ కుడి భుజం, ఎడమ భుజాలుగా వ్యవహరించిన కిలారు రాజేష్, గుత్తా కిరణ్ ల వ్యవహారం పైన కూడా ఈ నిఘాసంస్థలన్నీ దృష్టి సారించాయి. ముంబై కి చెందిన ఇన్ఫ్రా మేజర్ నుండి 150 కోట్ల రూపాయల  విరాళం తెలుగుదేశం పార్టీకి విరాళంగా వెళ్ళిందంటూ వచ్చిన వార్తల దరిమిలా, ఈ ఎపిసోడ్ లో కీలకపాత్ర పోషించినట్టుగా చెబుతున్న పెండ్యాల శ్రీనివాస్ ను పూర్తి స్థాయి లో విచారించటానికే, ఆయన్ను హైదరాబాద్ తరలించినట్టు సమాచారం. ఐదేళ్ల పదవికాలం లో ఆ సంస్థకు దాదాపు 2230 కోట్ల రూపాయలు పనుల కాంట్రాక్టు పనులు అప్పజెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం లో కీలకమైన శాఖలకు మంత్రులుగా వ్యవహరించిన డాక్టర్ నారాయణ, నారా లోకేష్ అనుయాయులపైనా, వారి ఆర్ధిక లావాదేవీల కు సంబంధించిన డాక్యుమెంట్ల పైన లోతైన అధ్యయనం చేయటం కోసమే నిఘాసంస్థలు ఇంత సమయం తీసుకుంటున్నామని సమాచారం. పనులు ఇచ్చినందుకు గాను అప్పట్లో గవర్నమెంట్ కు చెందిన వ్యక్తి కి 700 కోట్లు చెల్లించాలని, అందులో భాగంగా అప్పటి అధికార పార్టీకి ఎన్నికల సమయంలో 150 కోట్ల రూపాయల డబ్బులు అందాయని  దర్యాప్తు సంస్థల విచారణ లో ప్రాధమికంగా వెల్లడైన అంశం. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, ఈరోడ్, ఆగ్రా, పూణే, గోవాలతో పాటు 42 చోట్ల, నిరుడు నవంబరు లో జరిపిన సోదాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రముఖ వ్యక్తికి 150 కోట్లు ఇచ్చినట్లు లెక్కలు తేలినట్టు దర్యాప్తు సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. ఎన్నికల సమయం లో 150 కోట్ల రూపాయల డబ్బు  హైదరాబాద్ మీదుగా విజయవాడ కు చేరినట్టు గుర్తించిన ఐటీ అధికారులు, తర్వాతి విచారణ నిమిత్తం, ఈ.డీ., డీ.ఆర్. ఐ. ల సాయం కోరినట్టు సమాచారం. నిజానికి, ఇంత భారీ స్థాయిలో సోదాలు జరుగుతుంటే, అందునా... తన మాజీ పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ నివాసం లోనూ, లోకేష్ ఆంతరంగికుడు కిలారు రాజేష్, అలాగే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి నివాసాల్లోనూ ఈ సోదాలు గడిచిన 36 గంటలుగా జరుగుతుంటే, తెలుగుదేశం అగ్రనాయకత్వం కిక్కురుమనకుండా కూర్చోవడం ఆశ్చర్యంగా ఉంది. వాస్తవానికి, ఇప్పటికే వైఎస్ఆర్సిపీ ని ఈ ఎపిసోడ్ లో దోషిగా నిలబెట్టే ప్రయత్నం తెలుగుదేశం చేసి ఉండేదనీ, అయితే, అవతల దర్యాప్తు సంస్థలు పక్కా ఆధారాలతో రంగంలోకి దిగటం తో ఏమి జరుగుతుందో వేచి చూద్దామనే ధోరణిలోకి తెలుగుదేశం వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే, ఈ పరిణామాలేవీ వైఎస్ఆర్సిపీ కి కూడా మింగుడుపడటం లేదు..కారణమేమిటంటే , రాబోయే రోజుల్లో తమ వ్యాపార, వాణిజ్య సంస్థలపైనా కేంద్ర సంస్థలు ఈ రకమైన సోదాలు నిర్వహించవచ్చునేమోననే సందేహాలు ఆ పార్టీ లోనూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం బట్టి పెండ్యాల శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు పారిశ్రామిక వేత్తల పేర్లు మాత్రమే ...దర్యాప్తు సంస్థల అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.

19 లక్షల కుటుంబాలకు రేషన్ కట్ చేసిన జగన్ ప్రభుత్వం!!

ఏపీలో రేషన్ కార్డుల వడపోత పూర్తయ్యింది. కొత్తగా ఇవ్వబోతున్న బియ్యం కార్డులకు అర్హుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఒకటి రెండు కాదు ప్రస్తుతం తెల్లకార్డులు ఉన్న వారిలో ఏకంగా 18 లక్షల 72 వేల కుటుంబాలను అనర్హులుగా ప్రభుత్వం తేల్చింది. ఒక్కో కుటుంబానికి సగటున ముగ్గురు సభ్యుల చొప్పున చూసినా సుమారు 55 లక్షల మందికి నెలనెలా బియ్యం ఇతర సరుకుల పంపిణీ నిలిచిపోనుంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా బియ్యం రూపంలోనే రూ.1449 కోట్లు ఆదా కానుంది. పంచదార, గోధుమలు, పామోలిన్, చిరుధాన్యాలు లాంటి ఇతర నిత్యావసరాలు కలిపితే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది.  అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2,26,000 , కృష్ణాలో 2,11,000 , తూర్పు గోదావరి జిల్లాలో 1,94,000 కుటుంబాలకు అర్హత లేదని తేల్చారు. రాష్ట్రంలో గుర్తించిన అనర్హుల్లో మూడోవ వంతు ఈ మూడు జిల్లాల నుంచే ఉన్నారు. తర్వాత స్థానాల్లో అనంతపురం 1,62,000 , చిత్తూరు 1,55,000 , నెల్లూరు 1,49,000 , విశాఖపట్నం 1,34,000 , ప్రకాశం, కర్నూలు 1,31,000 , పశ్చిమ గోదావరి 1,25,000 , కడప 1,12,000 , శ్రీకాకుళం 74,000 , విజయనగరం జిల్లాలో 64,000 కుటుంబాల చొప్పున ఉన్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా బియ్యం కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాలకు అర్హులను వేరువేరుగా గుర్తిస్తుంది. ఇందుకోసమే వైఎస్సార్ నవోదయ పథకాన్ని ప్రారంభించింది. ఇంటింటి సర్వే చేయించింది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల వివరాలు వాలెంటీర్ లకు ఇచ్చి జాబితాలు తయారు చేయించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, నెలకు 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారు, 750 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లున్న వారిని అనర్హులుగా తేల్చింది. వాటి ఆధారంగా జనవరి రెండు వరకు అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా రూపొందించింది. కార్డుదారులు అందరి వివరాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయాలు క్లస్టర్ ల వారీగా మ్యాపింగ్ చేస్తున్నారు. వారందరికీ ఈ నెల 15 నుంచి కొత్త బియ్యం కార్డులు ఇచ్చి మార్చి నుంచి రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇంకా అర్హులుంటే దరఖాస్తులు తీసుకుని ప్రతినెలా కొత్త కార్డులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఆకతాయిలు జాగ్రత్త... దిశా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన సీఎం జగన్

రాజమండ్రిలో తొలి దిశా మహిళా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. మహిళలకు బాలికలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించటానికి.. పటిష్ఠ భద్రత కల్పించటానికి తక్షణ సాయం చేయడానికి దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసేంది ఏపీ సర్కార్. అందులో భాగంగానే తొలి దశ పోలీసు స్టేషన్ ను కొద్ది సేపటి క్రితం ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.  ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రతకు రక్షణకు దిశా మహిళా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు.ఈ పోలీస్ స్టేషన్ల ద్వారా మహిళలకు సత్వర రక్షణ భద్రత ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోబోతున్నారు. మహిళలు చిన్నారుల పై లైంగిక దాడులు ,వేధింపుల కేసులో ఐపీసీ 354 ఎఫ్, 354 జీ సెక్షన్స్ ను అదనంగా చేర్చారు. ఈ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైతే ఏడు రోజుల్లో దర్యాప్తు చేస్తారు. 14 పని రోజుల్లో విచారణను పూర్తి చేస్తారు. దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు.  అదే విధంగా దర్యాప్తు కోసం రాష్ట్రవ్యాప్తంగా 18 దిశా పోలీస్ స్టేషన్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా దిశా కోర్టులు ఉంటాయి. ఇందుకోసం 13 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లను నియమిస్తున్నారు. రేప్ లకు , గ్యాంగ్ రేప్ లకు పాల్పడితే గనక ఉరిశిక్ష విధిస్తారు. అదే విధంగా చిన్నారుల పై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు ఉంటుంది. సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ మహిళలను వేధిస్తే మొదటిసారైతే రెండేళ్లు జైలు శిక్ష , అదే తప్పు రెండోసారి రిపీట్ చేస్తే నాలుగేళ్ల జైలు శిక్షను విధించబోతున్నారు. అదే విధంగా అత్యాచారం కేసులో శిక్ష పడ్డ దోషుల అప్పీలు చేసుకోవడానికి గడువును 180 రోజుల నుంచి 45 రోజులకు కుదించడం జరిగింది.

హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో మరణమృదంగం... ప్రాణాలు కోల్పోతున్న ప్రయాణికులు...

మీరు చదువుతున్నది నిజమే, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తొందరగా వెళ్లాలనే ఆత్రుత... షార్ట్ కట్లో గమ్యాన్ని చేరాలన్న ఆశ... మరోవైపు నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... హెచ్చరిస్తున్నా... మైకుల్లో అనౌన్స్ మెంట్స్ చేస్తున్నా... పట్టించుకోకుండా తప్పటడుగులు వేస్తున్న ప్రయాణికులు తమతమ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు. రైల్వేస్టేషన్లలో ట్రాక్ దాటడం నేరం... అందుకు వెయ్యి రూపాయల జరిమానాతోపాటు ఏడాది జైలుశిక్ష పడుతుంది. అయితే, జరిమానా, జైలుశిక్షను పక్కనబెడితే... రైల్వే ట్రాక్ దాటుతున్న ఎంతోమంది ప్రయాణికులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఎక్కువగా ఈ మరణాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా కనీసం ఐదారుగురు రైల్వే పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, పట్టాలు దాటుకుండా రైల్వే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... హెచ్చరిస్తున్నా... పోలీసులను కాపలాగా పెడుతున్నా... ప్రయాణికులు మాత్రం లెక్కచేయడంలేదు... రైల్వే ట్రాక్ దాటడం ప్రమాదకరమని తెలిసినా.... నిర్లక్ష్యంగా ముందుకెళ్తున్న ఎంతోమంది తమ నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. తాజాగా భరత్ నగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లో కేవలం రెండే రెండ్రోజుల వ్యవధిలో పట్టాలు దాటుతూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రైల్వే ట్రాక్ దాటుతూ హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య నిజంగానే భీతిగొల్పుతోంది. ఎందుకంటే ట్రాక్ దాటుతూ గతేడాది162మంది మరణించగా... పలువురు గాయపడ్డారు. ఇక, ట్రాక్ దాటుతున్న ప్రయాణికులపై 2432 కేసులు నమోదు చేసి 9 లక్షల 45 వేల రూపాయల జరిమానా వసూలు చేశారు. అయితే, తొందరగా వెళ్లాలన్న ఆత్రుతలో ప్రయాణికులు చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లే చివరికి వాళ్ల ప్రాణాలు తీసేస్తున్నాయి. ట్రాక్ దాటుతూ మరణిస్తున్నవాళ్లలో ఎక్కువగా ఫోన్ మాట్లాడుతూ వెళ్లడం... ఇయర్ ఫోన్లు చెవిలో పెట్టుకుని ట్రాక్ దాటటమే కారణంగా గుర్తించారు.  అందుకే, దయచేసి వినండి... రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక... రైల్వే స్టేషన్లలో ఉన్నప్పుడు ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ఫ్లాట్ ఫామ్ పైకి వెళ్లడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను వినియోగించుకోండి... త్వరగా వెళ్లాలన్న ఆత్రుతతో రైలు పట్టాలను దాటుతూ మీ విలువైన ప్రాణాలను కోల్పోకండి.

జగన్మోహన్ రెడ్డిపై... షకీలా సెన్సేషనల్ కామెంట్స్

షకీలా. పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు శృంగార దేవతగా కుర్రాళ్ల గుండెల్లో నిలిచిన తార. ఇప్పటికీ పోర్న్‌ స్టార్‌గా యూట్యూబ్‌లో చెక్కుచెదరని పేరు. అందుకే, షకీలాకు భాషాభేదం లేకుండా శృంగారాభిమానుల్లో పేరుంది. అన్ని భాషాల్లోనూ షకీలాకు వీరాభిమానులున్నారు. మళయాళ చిత్రసీమను ఒక ఊపు ఊపిన చరిత్ర ఆమెది. మమ్ముట్టి, మోహన్‌లాల్‌ను సైతం గడగడలాడించిన బాక్సాఫీసు రికార్డులు ఆమె సొంతం. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ షకీలా అంటే తెలియనివాళ్లే ఉండరు. పోర్న్ మూవీలోనే కాకుండా పలు తెలుగు చిత్రాల్లో షకీలా నటించి మెప్పించింది. అయితే, షకీలా తాజాగా పేల్చిన డైలాగ్సే ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అభిమానులకు మంట పుట్టిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానులపై షకీలా సెటైర్లు పేల్చారు. అయితే, ఈ సెటైర్లు డైరెక్ట్ గా వేయలేదు. తన లేటెస్ట్ సినిమా ట్రైలర్ లో ఏపీ మూడు రాజధానుల నిర్ణయంపై పంచ్ లు పేల్చింది. షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో షకీలా చేత ఈ డైలాగ్స్ చెప్పించారు. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో షకీలా పేపర్‌ చదువుతూ ఉంటుంది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులంటూ వచ్చిన వార్తను చదువుతూ ....ఏంటి? ఏపీకి మూడు రాజధానులా? అంటూ తన అసిస్టెంట్‌ని అడుగుతుంది. అవును మేడం! జగనన్న మూడు రాజధానులు చేశాడు కదా అంటూ అసిస్టెంట్‌ సమాధానం చెప్తాడు. అయితే, ఇక్కడే మూడు రాజధానులపై షకీలా చేత సెటైర్లు వేయించాడు దర్శకుడు. ఏంటీ ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులా అంటూ ప్రశ్నించిన షకీలా....పోను పోనూ ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులైనా ఆశ్చర్యం అవసరం లేదంటూ సెటైర్ వేసింది. అయితే, ఈ మూవీ డైరెక్టర్ కావాలనే సినిమాలో ఈ డైలాగ్ చెప్పినట్లు కనిపిస్తోంది. పైగా ఆ డైలాగ్ ను షకీలా చేత చెప్పించి వివాదానికి తెరలేపాడు. దాంతో ఈ మూవీ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. ఈ సినిమా కథ షకీలానే రాశారని చెబుతున్నారు. అంటే ఈ డైలాగ్‌ కూడా షకీలా అభిప్రాయమే అనుకోవాలి. అంటే, షకీలాకు మూడు రాజధానులు ఇష్టంలేదన్న మాట. మరి సినిమాలో పొలిటికల్‌ డైలాగ్స్‌ వెయ్యాలంటే, అందులోనూ అధికారంలో వున్న పార్టీకి వ్యతిరేకంగా వివాదాస్పద సన్నివేశాలు పెట్టాలంటే, ధైర్యముండాలి. ఈ విషయంలో షకీలా సాహసం చేశారని సినిమా ప్రేక్షకులంటున్నారు. అయితే, కేవలం సినిమా పబ్లిసిటీ కోసమే షకీల మూడు రాజధానులపై వివాదాస్పద సన్నివేశాలు, డైలాగ్స్ పెట్టి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కారణం ఏదైనా షకీల కొత్త సినిమా ట్రైలర్‌లో పంచ్‌లు, సోషల్ మీడియాలో వైసీసీ, టీడీపీ మధ్య అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. తెలుగుదేశం సోషల్ మీడియా ఫాలోవర్స్‌, షకీల్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. షేర్లమీద షేర్లు చేస్తూ, వైసీపీ మీద షకీల సైతం సెటైర్లు వేశారంటూ, కామెంట్లు చేస్తున్నారు. అయితే, షకీల ట్రైలర్‌పై వైసీపీ అభిమానులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. టీడీపీ మెప్పు కోసమే, ట్రైలర్‌లో త్రీ క్యాపిటల్స్‌ను షకీల వ్యతిరేకించారని కౌంటర్ వేస్తున్నారు. చివరకు షకీలను సైతం, మూడు రాజధానుల వివాదంలో టీడీపీ లాగిందని, ఆమెతోనూ విమర్శలు చేయించే నీచమైనస్థాయికి దిగజారిందని వైసీపీ ఫాలోవర్స్ అంటున్నారు.

టీడీపీ నేతలకు షాక్ తప్పదా... 106మంది పేర్లతో ఐటీకి లేఖ రాసిన సీఐడీ!

అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఇచ్చింది సీఐడీ. రాజధాని పరిధిలోని అసైన్డ్ భూముల కొనుగోళ్ల కేసులో విచారణ జరపాలని ఐటీ డిపార్ట్ మెంట్ కు లేఖ రాసింది ఏపీ సీఐడీ. ఇప్పటికే తెల్లరేషన్ కార్డుల భూముల కొనుగోళ్లలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ దృష్టికి తీసుకెళ్లింది సిఐడి. దీనిపై విచారణకు ఈడీ కూడా అంగీకరించింది. తాజాగా ఐటీ వింగ్ కూడా ఫోకస్ పెట్టాలన్న సీఐడీ అడిషనల్ డైరెక్టర్ సునీల్ కుమార్ లేఖతో పాటు 106 మంది కొనుగోలు దారుల పేర్లను జత చేశారు. వాళ్ల పేర్లు అడ్రస్ వివరాలను అందించారు. అంతేకాదు 2018, 2019 వరకు రెండు లక్షలకు మించి జరిగిన ట్రాన్సాక్షన్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని అడిగారు. 2018,19 వరకు కొనుగోలు చేసిన దాని మీద కూడా విచారణ చేయాలంటూ ఈ లేఖలో పేర్కొనటం జరిగింది.  అయితే రాజధాని ప్రాంతం గ్రామాలకు సంబంధించిన అసైన్డ్ భూములకు సంబంధించి భారీగా భూమి కొనుగోలు విక్రయాలు జరిగినాయి కాబట్టి, రూ. 2లక్షలకు మించి జరిగిన లావాదేవీలపై దర్యాప్తు చేయాలని కూడా ఆ లేఖలో సునీల్ కుమార్ పేర్కొన్నారు. అయితే చట్టాలను ఉల్లంఘిస్తూ అసైన్డ్ భూములు అమ్మకాలు, కొనుగోలు చేసినట్టుగా సీఐడీ అధికారులు ఆ లేఖలో క్లియర్ గా రాయటం జరిగింది. ఈ లేఖతో పాటు ఒక ఎక్సెల్ షీట్ లో మొత్తం 106 మందికి సంబంధించిన అసైన్డ్ భూముల కొనుగోళ్లల్లో ఉన్న వారి పూర్తి వివరాలు.. వారి అడ్రస్ లు సర్వే నంబర్ తో సహా మొత్తం ఐటీ అధికారులకి సమర్పించడం జరిగింది.

అమ్మాయిల పిచ్చే అతని ప్రాణం తీసింది... జూబ్లీహిల్స్ మర్డర్ కేసులో కొత్త కోణం

హైదరాబాద్ బోరబండ చేపల వ్యాపారి రమేష్ హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. అయితే, రమేష్ మర్డర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిలపై అతనికున్న పిచ్చే రమేష్ ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని పోలీసులు గుర్తించారు. చేపల వ్యాపారి రమేష్ కు ఉన్న బలహీనతను ఆసరాగా చేసుకునే నిందితుడు హత్యకు ప్లాన్ చేశాడని తెలిపారు. రమేష్ ఇంట్లో అద్దెకుండి ఖాళీ చేసిన రాజు నాయకే ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈజీ మనీకి అలవాటుపడ్డ నిందితుడు రాజు నాయక్.... రమేష్ ను హానీ ట్రాప్ చేశాడు. తన దగ్గర అమ్మాయి రెడీగా ఉందని... రూముకు రావాలని ఫోన్ చేశాడు. రాజు నాయక్ మాటల నమ్మిన రమేష్... అతని రూముకు వెళ్లాడు. ఆ తర్వాత మద్యంలో మత్తు మందు కలిపి చంపేశాడు. అనంతరం రమేష్ ఒంటిపైనున్న బంగారాన్ని తీసుకుని తాకట్టు పెట్టాడు.  అయితే, మళ్లీ రూముకి వచ్చిన నిందితుడు రాజునాయక్.... రమేష్ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి 90లక్షలు ఇస్తే విడిచిపెడతానని, లేదంటే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. మరోవైపు, డెడ్ బాడీ డీకంపోజ్ అవుతుండటంతో ఎలాగైనాసరే బయటికి తరలించాలనుకున్నాడు. మృతదేహంలో కొన్ని భాగాలు నరికి ప్లాస్టింగ్ కవర్లో ప్యాక్ చేశాడు. అయితే, భారీ కాయం కావడంతో డెడ్ బాడీని బయటికి తరలించలేక రూమ్ లోనే వదిలేసి పరారయ్యాడు. చివరికి రూము నుంచి దుర్వాసన రావడంతో రమేష్ హత్య బయటపడింది. అయితే, సీసీటీవీ ఫుటేజ్, రూములో దొరికిన క్లూస్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు రాజు నాయక్ ను అతనికి సహకరించిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.  అయితే, సమాజంలోనే ప్రతి సంఘటన నుంచి ప్రతి ఒక్కరూ గుణపాఠం నేర్చుకుని అప్రమత్తం కావాల్సిన అవసరం కచ్చితంగా కనిపిస్తుంది. ఇలా, అమ్మాయిలపై పిచ్చితో హానీ ట్రాప్ లో చిక్కుకుని ప్రముఖ వ్యాపారవేత్త జయరాం అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. మీడియాలో జయరాం హత్య పెద్దసంచలనమైంది. అమ్మాయిలపై పిచ్చే అతని ప్రాణాలు తీసిందని తెలిసింది. తెలిసినే వ్యక్తే హానీ ట్రాప్ తో ఇంటికి రప్పించుకుని కొట్టిచంపేశాడు. ఇలాంటి ఘటనలు రోజూ మన కళ్లే ముందే కనిపిస్తున్నా జాగ్రత్తపడకుండా మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం శోచనీయమే.