తెలంగాణలో పసుపు యుద్ధం... స్పైసీ వద్దంటోన్న గులాబీ నేతలు...
posted on Feb 6, 2020 @ 11:26AM
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పసుపు యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ టార్గెట్ గా గులాబీ నేతలు విరుచుకుపడుతున్నారు. పసుపు బోర్డు తీసుకొస్తానంటూ రైతులను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన అర్వింద్... ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపాడని విమర్శిస్తున్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానన్న ధర్మపురి అర్వింద్... ఇప్పుడు స్పైస్ సెంటర్ పై ప్రకటన చేయించి ఏదో సాధించినట్లు సంబరాలు చేసుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
నిజామాబాద్ లో స్పైస్ సెంటర్ ఏర్పాటుతో రైతులకు ఒరిగేదేమీ ఉండదని విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇఛ్చినట్లుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సిందేనని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, పసుపునకు మద్దతు ధర కల్పించి కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు. బీజేపీ జాతీయ నేతలు, అలాగే ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పినట్లుగా నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయకుండా... కేవలం ఇద్దరు అధికారులతో స్పైస్ సెంటర్ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగమంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే, వరంగల్‌లో ఉన్న స్పైస్ బోర్డును కదిలిస్తే మాత్రం ఊరుకునేది లేదని టీఆర్ఎస్ హెచ్చరించింది. మరోవైపు, నిజామాబాద్ లో స్పైస్ సెంటర్ ఏర్పాటులో అర్వింద్ పాత్రేమీ లేదంటున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. మాజీ ఎంపీ కవిత కృషి వల్లే నిజామాబాద్లో స్సైస్ బోర్డు ఏర్పాటవుతోందని అంటున్నారు.