రాష్ట్ర అధ్యక్షుడిని మార్చనున్న ఏపీ టిడిపి..కళా వెంకట్రావు స్థానంలో వచ్చేదెవరు..?

ఏపి టిడిపిలో జోష్ నింపడానికి భారీ మార్పులకు రెడీ అయ్యారు చంద్రబాబు. రాష్ట్ర అధ్యక్షుడ్ని త్వరలోనే మార్చబోతున్నారు అనే వార్తలు పొలిటికల్ సర్కిల్ లో తిరుగుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే కళా వెంకట్రావు స్థానంలో వచ్చే ఆ నేత ఎవరు, రాష్ట్ర కమిటీ కసరత్తు ఎప్పటికి పూర్తవుతుంది. ఏపి టిడిపిలో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడు మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకటరావును నియమించారు. తరువాత ఆయన కేబినెట్ లోకి తీసుకున్నారు కానీ, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో నెలకొన్న నిస్సత్తువను పోగొట్టేందుకు సమూల మార్పులు చేయాలని చూస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగానే కళా వెంకట్రావు స్థానంలో మరో నేతకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లోనే టిడిపి రాష్ట్ర కమిటీ ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలు మూడు రాజధానుల వివాదం నేపథ్యంలో ఆ పని పక్కన పడింది. అయితే ఇప్పటికే ఆలస్యం అవడంతో ఈ నెలాఖరు లోగా పార్టీ కమిటీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను నియమించారు. పార్టీ అధ్యక్ష మార్పు జరిగితే శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. 

దీంతో అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రకు చెందిన కళా వెంకట్రావు స్థానంలో అదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే, అచ్చెన్నాయుడు పేరును పరిశీలిస్తున్నారు. ఆయనతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కూడా పార్టీ అధ్యక్ష రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచే అధ్యక్షుడిని తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటే అచ్చన్నకే ఎక్కువ అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సామాజిక కోణంలో చూసుకున్న బీసీలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉంటుందనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. అధ్యక్ష పదవి అచ్చెన్నకిచ్చిన, రవిచంద్రను ఎంపిక చేసిన కలిగే లాభ నష్టాలపై పార్టీ అధిష్టానం లెక్కలు వేసుకుంటోంది. ఈ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినప్పటికీ మరోవైపునుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం లేదు. ఒకవేళ అచ్చెన్నకు రాష్ట్ర అధ్యక్షుడు పదవిస్తే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఆయన స్థానంలో వేరేవారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి కమిటీలపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Teluguone gnews banner