పుతిన్ ప్రత్యర్థి పై విషప్రయోగం.. రష్యాలో పెను దుమారం
posted on Aug 20, 2020 @ 5:47PM
రష్యాలో ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ(44)పై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో పెను దుమారం రేగింది. సైబీరియాలోని టోమస్క్ సిటీ నుంచి మాస్కోకు విమానంలో వెళ్తుండగా అలెక్సీ ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మార్గమధ్యంలో విమానంలో బాత్రూంకి వెళ్లిన అయన అపస్మారక స్థితిలో పడిపోయారు. అలెక్సీ బాత్రూమ్ నుంచి ఎంతకూ రాకపోవడంతో సిబ్బంది వెళ్లి చూడగా.. ఆయన కిందపడి పోయి ఉన్నారు.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ఓమస్క్ సిటీలో అత్యవసరంగా ల్యాండ్ చేసి అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. కోమాలో ఉన్నారని డాక్టర్లు తెలిపారు. అంతేకాకుండా ఆయన శరీరంలో విషం అవశేషాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఐతే ఈ రోజు ఉదయం అలెక్సీ కేవలం టీ మాత్రమే తాగారని ఆయన అధికార ప్రతినిధి కిరా యార్మిష్ తెలిపారు. ఈ నేపథ్యంలో క్యాంటిన్‌లోనే ఎవరో టీలో విషం కలిపారని భావిస్తున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేఫ్‌ను మూసివేసి.. ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు .
"రష్యా ఆఫ్ ద ఫ్యూచర్" రాజకీయ పక్షానికి చెందిన అలెక్సీ నావల్నీ అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండడంతో ప్రజల్లో బలమైన నేతగా గుర్తింపు వచ్చింది. ఇపుడు ఏకంగా అధ్యక్షుడు పుతిన్ పైనే ఆరోపణలు చేస్తూ పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఆయనపై చాల సార్లు దాడులు కూడా జరిగాయి. గతంలో కూడా ఓసారి విషప్రయోగం జరిగింది.