జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన.. మాన్సాస్ ట్రస్ట్ చరిత్రలో ఈ పరిస్థితి ఎప్పుడైనా ఉందా?
posted on Aug 20, 2020 @ 6:01PM
తమకు మార్చి నుంచి జీతాలు ఇవ్వడం లేదు అంటూ ఇటీవల విజయనగరం కోట ముందు మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు భిక్షాటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. 62 ఏళ్ల మాన్సాస్ ట్రస్ట్ చరిత్రలో ఈ దయనీయ పరిస్థితి ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు.
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు 5 నెలలుగా జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలిచివేసింది అన్నారు. 62ఏళ్ల మాన్సాస్ ట్రస్ట్ చరిత్రలో ఈ దయనీయ పరిస్థితి ఎప్పుడైనా ఉందా? 879 కుటుంబాలు ఇలా రోడ్డెక్కడం గతంలో చూశామా? అని ప్రశ్నించారు. ఇప్పుడెందుకిలా ట్రస్ట్ కు అప్రదిష్ట తెచ్చారు? అని మండిపడ్డారు.
ఎంతో ఆర్ధిక పరిపుష్టి ఉన్న మాన్సాస్ వంటి సేవాసంస్థ ఇప్పుడిలా కావడానికి కారణం ఎవరు? సజావుగా అందుతున్న సంస్థ సేవలను గాడి తప్పించింది ఇందుకేనా..? అని చంద్రబాబు నిలదీశారు.
"ఇలాంటి దుస్థితి మాన్సాస్ ట్రస్ట్ కు ఎప్పుడూ ఎదురు కాకూడదనే విజయనగరం రాజా పివిజి రాజు వేలాది ఎకరాల భూములతో, వందల కోట్ల నగదు ఫిక్స్ డ్ డిపాజిట్లతో ట్రస్ట్ ను ఆర్థికంగా పరిపుష్టి చేసారు. అటువంటి సంస్థ ఇప్పుడిలా దిగజారడం చూస్తే ఎవరికైనా ఆత్మ క్షోభించక తప్పదు." అని చంద్రబాబు పేర్కొన్నారు.