సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దు.. జరిగింది ప్రమాదమా? కుట్రా?
posted on Aug 21, 2020 @ 12:56PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ శ్రీశైలం పర్యటన రద్దు అయింది. తెలంగాణ లెఫ్ట్ పవర్ హౌస్ లో అగ్నిప్రమాదం సంభవించడం వల్ల జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సీఎంవో అధికారులు ప్రకటించారు.
శ్రీశైలంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్న సందర్భంగా.. రాయలసీమతో పాటు పలు ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు అంశంతో పాటు, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు ఇవాళ సీఎం జగన్ శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ పరిధిలో ఉన్న లెఫ్ట్ పవర్ హౌస్ లో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్ని సీఎంఓ అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని సీఎం భావించినట్టు తెలుస్తోంది. తెలంగాణ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నుంచి, యంత్రాంగం నుంచి.. తెలంగాణ అధికారులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.
కాగా, నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్ లో షాట్ సర్క్యూట్ కారణంగా భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 8 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. మిగిలిన 9 మంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే చిక్కుకున్నారు. ఏడు ఫైరింజన్‌ల ద్వారా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. దాదాపు మంటలు అదుపులోకి వచ్చాయి. సాయంత్రానికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జరిగింది ప్రమాదమా? కుట్రా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ జల దోపిడికి కేసీఆర్ సహకరించేలా.. తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని ముందే చెప్పామని రేవంత్ ఆరోపించారు. ప్రమాదం జరిగిన తీరు అనుమానాలకు తావిస్తోందని, ప్రమాదం పేరుతో కుట్రను కప్పిపెట్టే ప్రయత్నం ఉందేమో అనిపిస్తోందని అన్నారు. నిజానిజాలు తేలాలంటే ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.