శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం.. లోపలే చిక్కుకున్న సిబ్బంది
posted on Aug 21, 2020 @ 9:37AM
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి 10:30 కి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ జెన్‌కో మొదటి యూనిట్‌లోని ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు ఎగిశాయి. పవర్ హౌస్ లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో పలువురు టీఎస్ జెన్‌కో ఉద్యోగులు అక్కడే చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న 17 మందిలో 8 మంది ఎగ్జిట్ ద్వారానికి దగ్గరగా ఉండటంతో, వారంతా పరుగులు పెడుతూ బయటకు వచ్చేశారు. మిగతా వారు పొగలోనే చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. మూడు సార్లు లోపలికి వెళ్లి దట్టమైన పొగ కారణంగా మళ్లీ వెనక్కి వచ్చారు. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి ఎదురవకపోవడంతో, రాత్రి 2 గంటల నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం ఆక్సిజన్ మాస్క్ లు ధరించి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ తీవ్రమైన పొగ కారణంగా.. ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నారు.. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలంలో సహాయక చర్యలను మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షిస్తున్నారు.
అయితే ఈ ఉదయం ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యలు కొంత వేగవంతమయ్యాయి. ఈ సహాయక చర్యలలో సింగరేణి నుంచి భూ గర్భంలో కిలోమీటర్ల కొద్దీ వెళ్లి పనిచేసే నైపుణ్యమున్న సిబ్బంది , ఎన్డీఆర్ఎఫ్ కు సహాయంగా వచ్చి చేరాయి. అయితే రాత్రి నుంచీ లోపల ఉన్న వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు, అధికారుల్లో ఆందోళన నెలకొంది.
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్రిప్రమాదంపై తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. గురువారం రాత్రి ప్రమాదం జరగగా 1200 కేవీ లైన్‌ను ఐసోలేట్ చేశామని.. ఈ క్రమంలోనే ట్రిప్ అయ్యి ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగినట్లు వెల్లడించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని ఆయన చెప్పారు. లోపల అంతా పొగతో నిండిపోయిందని.. ఎంత నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు ప్రభాకర్ రావు. పవర్ హౌస్ లోపల చిక్కుకున్న ఉద్యోగులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌కు కూడా వివరించామని ఆయన తెలిపారు.