గవర్నర్ కు క్షమాపణలు చెప్పాలి
posted on Aug 20, 2020 @ 3:05PM
రాష్ట్ర ప్రథమ పౌరురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని సస్పెండ్ చేయాలి
కేసీఆర్ దండు పేరుతో గవర్నర్‌పై ట్రోలింగ్ ఆపండి
-మహిళా మోర్చా డిమాండ్
రాష్ట్ర ప్రథమ పౌరురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని సస్పెండ్ చేయాలని భారతీయ జనతాపార్టీ మహిళామోర్చా డిమాండ్ చేసింది. ఈ మేరకు అసెంబ్లీ సమీపంలోని గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కోవిద్ 19 వైరస్ వ్యాప్తి నివారణపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని, ఈ విషయంపై ఎన్నోసార్లు గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్ ప్రభుత్వానికి, అధికారులకు సూచనలు చేశారని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి గీతా మూర్తి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన తప్పిదాలను చక్కదిద్దుకోకుండా రాష్ట్ర ప్రథమ పౌరురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. రాజ్యాంగ బద్దంగా పనిచేస్తున్న గవర్నర్ కు రాజకీయాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని సస్పెండ్ చేయాలని, గవర్నర్ తమిళసైకి సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో కేసీఆర్ దండు పేరుతో గవర్నర్‌పై ట్రోలింగ్‌ను డీజీపీ అడ్డకోవాలని ఆమె కోరారు. ప్రజల సమస్యలను, ఆరోగ్యాన్ని పట్టించుకోని ప్రభుత్వ పనితీరును విమర్శిస్తే గవర్నర్ అన్న మర్యాద కూడా లేకుండా ట్రోల్ చేస్తారా అని మహిళా మోర్చా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైదిరెడ్డిని సస్పెండ్ చేసి, గవర్నర్ కు క్షమాపణ చెప్పాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.