ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నకు డబ్బు చేరినట్లు ఆధారాల్లేవు
posted on Aug 20, 2020 @ 1:30PM
ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి డీలర్ల నుంచి డబ్బులు చేరినట్లు తమ దర్యాప్తులో ఎక్కడా బయట పడలేదని ఏసీబీ వెల్లడించింది. ఆర్థికపరమైన లావాదేవీలపై ఆధారాలు లభించలేదని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ పేర్కొన్నారు.
"మంత్రి వద్దకు పలు కంపెనీలు వస్తుంటాయి.. అధికారులకు సిఫారసు చేయవచ్చు, పరిశీలించి అర్హులైన వారికి అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ ఒప్పందం చేసుకోవాలంటూ అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. టెండర్‌కు వెళ్లాల్సిన వాటిని ఇలా చేయకూడదు. అందుకే ఆయనతో పాటు ఈఎస్‌ఐ డైరెక్టర్ రమేశ్‌కుమార్ ను కూడా అరెస్టు చేశాం" అని రవికుమార్ చెప్పారు.
ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అచ్చెన్నాయుడుకు నగదు ముట్టినట్లుగా ఎలాంటి ఆధారాల్లేవని.. చెప్పడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోనూ ఈఎస్‌ఐ స్కాం జరిగింది. అక్కడ ఏసీబీ చురుగ్గా వ్యవహరించి.. అవినీతి లావాదేవీలను వెలికి తీసింది. కానీ ఏపీలో ఈఎస్ఐ స్కాంలో వందల కోట్ల అవినీతి జరిగిందంటున్న ఏసీబీ అధికారులు.. అక్రమ సొమ్ము అచ్చెన్నాయుడుకి చేరింది అనడానికి ఎలాంటి ఆధారాల్లేవంటున్నారు. పోనీ అరెస్ట్ చేసిన ఇతర అధికారుల వద్దనైనా అక్రమ లావాదేవీల సొమ్ము కనిపెట్టారా అంటే అదీ లేదు.
అచ్చెన్నాయుడు కేవలం మూడు లేఖలు మాత్రమే రాశారని.. ఏసీబీ అధికారి రవికుమార్ చెబుతున్నారు. ఆ లేఖల కారణంగానే అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు. ఈ స్కామ్‌లో అచ్చెన్నాయుడు సహా పన్నెండు మంది అరెస్ట్ చేసి ఇప్పటికే రెండు నెలలు దాటిపోయింది. ఇంత వరకూ ఏసీబీ చార్జిషీటు దాఖలు చేయలేదు. ఏ3 నిందితుడుగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. ఆయనను ఇంకా అరెస్ట్ చేయలేదని చెబుతూ.. ఇప్పటి వరకూ అరెస్ట్ చేసిన నిందితులకు బెయిల్ రాకుండా.. ఏసీబీ అధికారులు ఓ ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వందల కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు, కానీ ఆర్థికపరమైన లావాదేవీలపై ఆధారాలు లభించలేదని చెబుతున్నారు. కోట్ల అవినీతి జరిగిందని చెప్తూ, ఆ అవినీతి సొమ్మును బయట పెట్టకుండా ఇలానే జాప్యం చేస్తే అధికారులపై నమ్మకం పోయే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.