స్వీడన్ లో ఎంపీల జీతమెంతో తెలుసా..!
posted on Aug 21, 2020 @ 2:35PM
ప్రైమరీ టీచర్ జీతం కన్నా తక్కువే..
కాఫీకి కూడా బిల్లు చెల్లించాల్సిందే ..!
అధికారం ఉన్నవారు జవాబుదారీగా ఉండాలి. ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండాలి అన్నది స్వీడన్ లో మనం చూస్తాం. ఇక్కడి ప్రజాప్రతినిధుల జీతభత్యాలను, వారి జీవనవిధానాన్ని పరిశీలిస్తే షాక్ కావల్సిందే..
స్వీడిష్ ఎంపీలకు కార్యదర్శులు ఉండరు. వారి వేతనాలు కూడా చాలా తక్కువ. అంతేకాదు.. పార్లమెంటరీ క్యాంటిన్ లో వారు తాగే కాఫీకి కూడా బిల్లు వారి జేబు నుంచి చెల్లించాల్సిందే..
స్వీడిష్ పార్లమెంటు లో కేవలం మూడు కార్లు మాత్రమే ఉంటాయి. అవి కేవలం అధికారిక పర్యటనల కోసం మాత్రమే ఉపయోగించాలి. స్వీడిష్ ఎంపీలు ప్రజా రవాణా సౌకర్యాల కోసం ఎదురుచూడాల్సిందే. వారికి ఇయర్లీ టికెట్ జారీ చేస్తారు. 1957 వరకు ప్రజాప్రతినిధులకు వేతనాలు కూడా లేవు. ఆ తర్వాతే వారికి వేతనం ఇస్తున్నారు. ఇది అక్కడి కరెన్సీలో నెలకు 40వేల స్వీడిష్ క్రోనాలు(3,22,000 రూపాయలు) ఇది అక్కడ పనిచేసే ఒక ప్రైమరీ టీచర్ జీతం కన్నా తక్కువ. అంతకు మించి వారికి ఓవేతనం వచ్చే అవకాశం లేదు.
ఎంపీల నివాసం కోసం అపార్ట్ మెంటు సదుపాయాలు కల్పిస్తారు. అవి కూడా దేశ రాజధాని స్టాక్ హోమ్ వెలుపలే ఉంటాయి. ఇవి 45 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఒక రూం ప్లాట్స్ మాత్రమే. విడిగా బెడ్ రూం అంటూ ఉండదు. వాషింగ్ మిషిన్, డిష్ వాషర్ గాని ఉండవు. ఎంపీలు వారి స్నేహితులను ఇక్కడికి అనుమతించకూడదు. వారి కుటుంబ సభ్యులైనా వచ్చి వుండేందుకు వీలు లేదు. ఎవరైనా వచ్చి ఒక రోజు ఉన్నా అందుకు అయ్యే ఖర్చు ఎంపీనే భరించాలి.
పార్లమెంటు కేఫటేరియాలో వెయిటర్స్ ఉండరు. ఎంపీలు వారికి కావల్సిన ఆహారాన్ని వారే డబ్బు చెల్లించి తీసుకోవాలి. తిన్న తర్వాత వారి ప్లేట్స్ వారు శుభ్రం చేయాలి.
ఎంపీలకు కార్యదర్శులు, వ్యక్తిగత సిబ్బంది ఉండరు. పార్టీ పరంగా మాత్రమే నియమించే కార్యదర్శులకు నిర్ధిష్ట మొత్తం వేతనంగా ఉంటుంది. ఎవరికీ వారు వ్యక్తిగతంగా నియామకాలు చేసుకోవడానికి వీలులేదు. తమ కార్యక్రమాల షెడ్యూల్ ను స్వయంగా వారే తయారుచేసుకోవాలి. అంతేకాదు వారికి వచ్చే ఫోన్ కాల్స్ కూడా వారే మాట్లాడాలి.
పార్లమెంటు భవనం ఆవరణలో వార్తపత్రికలు, మ్యాగజైన్స్ మాత్రం ఉచితంగా అందుబాటులో ఉంటాయి. మిగతా ఎంపీలతో కలిసి వాటికి షేర్ చేసుకోవాలి. అన్ని ప్రముఖ మీడియాల వార్తప్రతికలకు పార్లమెంటే చందా చెల్లిస్తుంది. ఎంపీలు ఎటైనా అధికారిక పర్యటనకు వెళ్ళాల్సి ఉన్నప్పుడు అతి తక్కువ ఖర్చు అయ్యే రవాణా వ్యవస్థను ఎంచుకోవాలి. ప్రైవేటు కారు అద్దెకు తీసుకున్నప్పుడు తక్కువ దూరం చూపించే మార్గంలోనే వెళ్లాలి. ఒకవేళ విదేశాలకు వెళ్లాల్సి వస్తే వారి మొత్తం పర్యటన ఖర్చు 50వేల స్వీడిష్ క్రోనాలు(4,30,000 రూపాయలు)లోపే ఉండాలి. మాజీ ఎంపీలకు జీవితాంతం ఫించన్ ఉండదు. పదవీ విరమణ తర్వాత రెండు సంవత్సరాలు వారి వేతనంలో 85శాతం ఇస్తారు. ఆ లోగా వారు కొత్త ఉద్యోగంలో చేరాలి.
ప్రాంతీయ రాజకీయ నాయకులకు ఈ మాత్రం జీతాలు కూడా ఉండవు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవ్వడం ప్రజలకు మంచి చేయడానికి అని భావిస్తారు. ఇందుకోసం ప్రతిఫలం ఆశించరు. ప్రజలకు సేవ చేయడం అనేది ప్రతిష్టాత్మకంగా భావించరు. దీనిని లాభదాయకంగా కూడా చూడరు.
ఇలాంటి నియమాలు పాటిస్తున్నారు కాబట్టే అక్కడ అవినీతికి ఆస్కారం లేదు. నాణ్యమైన జీవనశైలి, ఆరోగ్యం, విద్య, పౌర హక్కుల రక్షణ, సమానత్వం, మానవ అభివృద్ధి వంటి అనేక అంశాల్లో స్వీడన్ ముందుంది.