సోము వీర్రాజు వ్యూహంతో ఏపీలో టీడీపీ పతనం ఖాయమా..?
posted on Aug 21, 2020 @ 11:10AM
కొద్ది రోజుల క్రితం వరకు స్తబ్దుగా ఉన్న ఏపీ బీజేపీ, కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిననాటి నుండి కొత్త జోష్ తో ముందుకు సాగుతోంది. అధ్యక్షడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మీడియాతో మాట్లడుతూ తమకు ఉన్న సొంత బలానికి జనసేన, ఇతర పార్టీల నుండి వచ్చే కొందరు నేతల బలం తోడైతే వచ్చే ఎన్నికలలో అధికారం బీజేపీ జనసేన కూటమిదేనని చెప్పి విపక్షాలలో సంచలనమ్ సృష్టించారు.
తాజాగా దీని పై అయన తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీని కోసం అయన కొంత మంది తో ఒక టీమ్ ను ఏర్పాటు చేసి ముందుగా ఇతర పార్టీలలో ఉండి గుర్తింపు పొందని ముఖ్య నేతలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లీడర్లను ఏదో ఒక రకంగా బిజెపి లోకి తీసుకురాగలిగితే పార్టీ మరింత పటిష్టం అవుతుందని ఆయన ప్రయత్నం. అయితే దీనికంటే ముందు ఇప్పటికే ఇతర పార్టీల నుండి వచ్చి బీజేపీలో చేరిన కొంతమంది పైనా అలాగే మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గంగా పేరుపడ్డ వారిని వీలయితే పార్టీ నుండి తప్పిస్తూ.. ఒకవేళ అలా సాధ్యం కానివారిని పార్టీ అధిష్టానం తో చెప్పి సైలెంట్ చేసే పనిలో వీర్రాజు బిజీగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
ఇతర పార్టీ నేతలను ఆకర్షించే క్రమంలో అయన చూపు ప్రస్తుతం టిడిపి పై ఉందని.. ఆ పార్టీ లో ఉండి బిజెపి అంటే ఆసక్తి ఉన్న వారి జాబితాను కూడా అయన సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ లిస్టులో ప్రముఖంగా మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయనను కనుక తీసుకురాగలిగితే ఆయనతో పాటు మరి కొందరు ముఖ్య నాయకులు కూడా వస్తారని అయన ఆశాభావంతో ఉన్నారు. అలాగే రాయలసీమ నుండి జగన్ ప్రభుత్వం తాకిడికి విలవిలలాడుతున్న జేసి కుటుంబం, పరిటాల కుటుంబాలను కూడా వారితో సన్నిహితంగా మెలిగే బీజేపీ నేతలతో లాబీ నడుపుతున్నారని టాక్ నడుస్తోంది. ఇక కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మంచి పదవులు అనుభవించి ఇపుడు సైలెంట్ గా ఉన్న నేతల పై సోము వీరాజు గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఇలా టీడీపీ ముఖ్య నేతలను కనుక చేర్చుకోగలిగితే వారి వెంట ఉండే పార్టీ కేడర్ కూడా వచ్చి చేరతారు కాబట్టి బీజేపీకి తిరుగు ఉండదని.. అదే సమయంలో తెలంగాణాలో లాగా ఏపీలో కూడా టీడీపీ మటాష్ అవుతుందని అయన వ్యూహం గా కనిపిస్తోంది. ఇక తటస్థుల విషయానికి వస్తే సబ్బంహరి, హర్షకుమార్, అలాగే వైసిపి నేత దాడి వీరభద్రరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది. బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యూహం కనుక విజయవంతమైతే బీజేపీ బలోపేతం సంగతేమో కానీ సీఎం జగన్ పార్టీ అయిన వైసిపి నెత్తిన పాలు పోసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే టీడీపీలోని కొంత మంది నాయకులు బీజేపీ లో చేరినా ఆ పార్టీ కేడర్ మాత్రం వచ్చే పరిస్థితి లేదని విశ్లేషకులు చెపుతున్నారు. అంతేకాకుండా ఎపి ప్రస్తుతం ఎదుర్కొంటున్న రాజధాని, ప్రత్యేక హోదా వంటి ముఖ్య సమస్యల పై బీజేపీ గోడమీద పిల్లిలాగా వ్యవహరిస్తున్న తీరుతో అసలు ఏపీ ప్రజలు ఎంతవరకు బీజేపీని ఆదరిస్తారనేది ఒక పెద్ద ప్రశ్న అని.. దీనికి కాలమే సమాధానం చెప్పగలదని విశ్లేషకుల అభిప్రాయం.