జగన్ సర్కార్ కు మరో ఎదురు దెబ్బ.. రాజధాని తరలింపు పై స్టే పొడిగించిన హైకోర్టు
posted on Aug 14, 2020 @ 2:27PM
ఏపీలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై వేసిన పిటిషన్ల పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వం నిన్న హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని అఫిడవిట్‌లో పేర్కొంది. ఇదే విషయాన్నీ కేంద్రం తన అఫిడవిట్‌లో స్పష్టం చేసిందని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది.
ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా ఈ చట్టాల అమలుపై న్యాయస్థానం ఇచ్చిన స్టేటస్ కో ను ఎత్తివేయాలని ప్రభుత్వం తరుఫు న్యాయవాది రాకేష్ త్రివేది కోర్టును కోరారు. స్టేటస్ కో విధించడం వల్ల సీఎం క్యాంప్ కార్యాలయం తరలించే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. దీంతో పాటు వేరే కార్యాలయాలను తరలించుకోవాలన్నా కోర్టు ఉత్తర్వులు అడ్డంకిగా మారాయని రాకేష్ త్రివేది కోర్టుకు విన్నవించారు.
ఇదే సందర్భంలో పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ.. అసలు మూడు రాజధానులు అనేది విభజన చట్టానికి విరుద్ధమని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా విభజన చట్టంలో కూడా ఒక్క రాజధాని ప్రస్తావనే ఉందని అయన తెలిపారు. ఈ నేపథ్యంలో తాము జారీ చేసిన స్టేటస్ కో ఉత్తర్వులను ఈ నెల 27 వరకు పొడిగిస్తున్నట్టుగా న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది.
దీంతో కేసు వాయిదా వేయండి కానీ... స్టే పొడిగింపు వద్దని ప్రభుత్వ న్యాయవాది రాకేష్ త్రివేది న్యాయస్థానాన్ని కోరారు. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా సమయంలో అంత అర్జెంటు ఏముందని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వానికి తన విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని న్యాయవారికి కోర్టుకు వివరించారు. కాగా, ఆన్ లైన్ విచారణలో పలు సమస్యలు ఉన్నాయని, కాబట్టి తమ పిటిషన్లను ప్రత్యక్ష పద్ధతిలో విచారణ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే, దీని పై ప్రభుత్వం తరఫు న్యాయవాది రాకేశ్ త్రివేది స్పందిస్తూ.. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా తాము నేరుగా హైకోర్టులో వాదనలు వినిపించలేమని, అందువల్ల ప్రభుత్వం తరఫున తమ వాదనలను డిల్లీ నుండి వినిపిస్తానని తెలిపారు.