ముగిసిన రాజస్థాన్ సంక్షోభం... విశ్వాస తీర్మానం లో గట్టెక్కిన గెహ్లాట్ సర్కార్
posted on Aug 14, 2020 @ 5:32PM
రాజస్థాన్ లో దాదాపు నెలకు పైగా సాగిన రాజకీయ సంక్షోభం ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంతో ముగిసిపోయింది. రాష్ట్ర పార్టీలోని అంతర్గత విభేదాలను పరిష్కరించుకుని అసెంబ్లీకి వచ్చిన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఈ రోజు జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ప్రతిపక్ష బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా.. గెహ్లాట్ నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూజువాణి ఓటు(వాయిస్ ఓటింగ్)తో నెగ్గింది. ఈ విశ్వాస పరీక్ష ముగిసిన తరువాత రాజస్థాన్ అసెంబ్లీ ఈ నెల 21కి వాయిదా పడింది.
కొద్ది కాలం క్రితం సీఎం అశోక్ గెహ్లాట్ కు, అప్పటి డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తడంతో అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా చేసుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ శతవిధాలుగా ప్రయత్నించినా, కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి సచిన్ పైలట్ తో మాట్లాడి తిరిగి వెనక్కు తీసుకు వచ్చి అశోక్ గెహ్లాట్ సర్కార్ ను గట్టెక్కించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర శాసన సభ వ్యహారాల మంత్రి కుమార్ ధారివాల్ మాట్లాడుతూ గోవా, మధ్యప్రదేశ్ తరహాలో బీజేపీ ఇక్కడ కూడా దొడ్డి దారిన అధికారం కైవసం చేసుకోడానికి ప్రయత్నించిందని ఐతే ఇక్కడ దాని ఆటలు సాగలేదని అన్నారు. కరోనా సమయంలో మధ్యప్రదేశ్ లో బీజేపీ చేసిన నిర్వాకం వల్ల కరోనా విజృంభించింది అని అయన విమర్శించారు.