బీజేపీ నేత సాధినేని యామినిపై కేసు నమోదు
posted on Aug 14, 2020 @ 2:27PM
ఏపీ బీజేపీ మహిళా నేత సాధినేని యామినిపై కేసు నమోదైంది. ఇటీవల జరిగిన అయోధ్య రామమందిర భూమిపూజ కార్యక్రమం ఎస్వీబీసీ చానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500ల కింద కేసు నమోదు చేశారు.
రామమందిరం భూమి పూజను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంపై సోషల్ మీడియా వేదికగా యామిని మండిపడ్డారు. హిందూ మనోభావాలను ఎస్వీబీసీ చానల్ పట్టించుకోలేదని ఆరోపించారు. హిందువులు ఇచ్చే కానుకలు, దానాలతో నడిచే టీటీడీ ఈ రకంగా వ్యవహరించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. అయితే ఆమె వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న టీటీడీ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యామినిపై కేసు నమోదైంది.