ఆధార్ కార్డు తరహాలో.. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డు
posted on Aug 15, 2020 9:23AM
దేశంలోని ప్రజలందరికీ ఆరోగ్య భద్రత అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. 74వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ వన్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ స్కీమ్‌ను ప్రకటించారు. ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ కొత్త పథకాన్ని ప్రకటించారు. వన్ నేషన్ వన్ హెల్త్ కార్డు నినాదంలో రూపొందించిన ఈ పథకం ద్వారా దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ ఫార్మెట్‌లో భద్రపరుస్తారు. ఒక వ్యక్తి పూర్తి ఆరోగ్య పరిస్థితి సమీక్షించడానికి, మెడికల్ హిస్టరీ రికార్డులన్నీ డిజిటల్ ఫార్మెట్‌లో భద్రపరచడానికి ఉపయోగపడుతుంది.
కోవిద్ 19 వైరస్ వ్యాప్తి కారణంగా నేర్చుకున్న గుణపాఠాల్లో భాగంగా ఈ పథకం రూపొందిందని చెప్పవచ్చు. దేశంలోని దవాఖానాలు, క్లినిక్ లను సెంట్రల్ సర్వర్ కు అనుసంధానం చేస్తారు. గ్రామాల్లో మరిన్ని వెల్ నెస్ సెంటర్లను ప్రారంభిస్తారు. దశలవారీగా అమలు చేసే ఈ పథకానికి మొదటి దశలో రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తారు.
ఈ పథకం అమలులోకి వస్తే దేశంలోని ఒక వ్యక్తి ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా, దవాఖానకు వెళ్ళినా అంతకు ముందు తన హెల్త్ హిస్టరీకి సంబంధించిన ఎలాంటి రిపోర్టులు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తికి కేటాయించిన యూనీక్ ఐడీ కార్డు నెంబర్ చెప్పితే చాలు. అతని హెల్త్ హిస్టరీ మొత్తం డాక్టర్ తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఆధార్ కార్డు తరహాలోనే ఈ ఆరోగ్య కార్డ్ కూడా రూపొందించనున్నారు. అయితే ఈ కార్డు తీసుకోవాలా, వద్దా అన్న నిర్ణయం ఆయా వ్యక్తులకు ఇచ్చారు. అంతేకాదు ప్రజల వ్యక్తిగత, ఆరోగ్య సమాచారాన్ని పూర్తి భద్రంగా, రహాస్యంగా ఉంచుతారు.