వర్షపు నీరు తూర్పు పడమరగా..
posted on Aug 15, 2020 @ 1:54PM
రెండు సముద్రాల సరిహద్దు శిఖరం
మూడు వైపుల సాగరతీరాలు, ఒక వైపు హిమగిరులతో ఉండే భారతదేశ భౌగోళిక స్వరూపం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది. పెట్టనిగోడలా రక్షణ నిచ్చే పర్వతశ్రేణులు, అమృత ధారలు కురిపించే జలపాతాలు, సస్యశ్యామం చేరే నదీజలాలు ఆహ్లదానిస్తాయి. దేశ సరిహద్దుల్లోనే కాదు భారతదేశంలోనూ ఎన్నో అద్భుతమైన అంశాలు దాగి ఉన్నాయి. ప్రతి ప్రాంతానికో చరిత్ర. ప్రతి అంశానికో ప్రత్యేకత భారతదేశ విశిష్టత.
పశ్చిమ కనుమల్లోని ఒక శిఖరం పై పడే వర్షపు నీరు రెండు గా విడిపోయి భిన్న దిశల్లో ప్రవహించి రెండు వేరువేరు సముద్రాలకు చేరుతుంది. ఈ విషయాన్ని భౌగోళిక సర్వేలో గుర్తించిన బ్రిటిష్ అధికారులు ఈ ప్రాంతంలో శిలాశాసనం ఏర్పాటు చేశారు. దానిపై " రిడ్జ్ అరేబియా సముద్రం బే ఆఫ్ బెంగాల్ " పదాలను చెక్కారు. మరి ఈ శిఖరం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా..
కర్ణాటకలో హసన్ జిల్లాలోని పశ్చిమ కనుమల్లో బిస్లే ఘాట్ నుంచి సక్లేష్పూర్ వెళ్లే దారిలో మంకనహళ్లి అనే చిన్న గ్రామం ఉంటుంది. బిస్లే నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన కాంక్రీట్ ప్లాట్ ఫాం పై ఈ శాసనం ఉంటుంది.
ఈ శాసనం ఉన్న పాయింట్ కు ఎడమపైవు పడే వర్షపు నీరు పడమటి వైపు ప్రవహించి కుమారధార, నేత్రావతి నదుల్లో చేరుతుంది. ఆ నదులు చిక్ మంగుళూరు సమీపంలో అరేబియా సమద్రంలో కలుస్తాయి. ఇక కుడి వైపు పడే వర్షపు నీరు తూర్పు దిశగా ప్రవహించి హేమావతి ఉపనదుల్లో చేరుతుంది. సమీప ప్రాంత ప్రజల తాగు, సాగు నీటి అవసరాలను తీర్చుతూ పరుగులు తీస్తాయి. కావేరి నదిలో కలిసి వందలాది కిలోమీటర్లు ప్రయాణించి తమిళనాడులో బంగాళ ఖాతంలో కలుస్తాయి.
పశ్చిమ కనుమల్లో ఎన్నో ప్రకృతి సుందర దృశ్యాల మధ్య తూర్పుపడమర సముద్రాల శిఖరంగా ఉన్న ఈ భౌగోళిక వింత తప్పక చూడాల్సిన ప్రదేశం.