రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ పడితే అక్కడ కరోనా వ్యాక్సిన్ కొనవద్దు.. జాతీయ నిపుణుల కమిటీ

ప్రపంచం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ లు చివరి దశ ట్రయల్స్ లో ఉండడంతో పాటు ఇప్పటికే రష్యా తాను కనిపెట్టిన కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసిన నేపథ్యంలో మన దేశం లో ఈ వ్యాక్సిన్ల సేకరణ, పంపిణీల పై కేంద్రం దృష్టి పెట్టి.. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కమిటీ నిన్న సమావేశమై వ్యాక్సిన్ల సేకరణ, పంపిణీ విధానం, నిర్వహణ తదితర అంశాలపై కీలక చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ప్రపంచంలో ఏ దేశంలో వ్యాక్సిన్ విడుదలైనా రాష్ట్రాలు తమ సొంత మార్గాల ద్వారా దాన్ని తెప్పించుకునే ప్రయత్నాలు చేయవద్దని కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.   వ్యాక్సిన్ లభ్యత, సరఫరా విధానం, దాన్ని చేరవేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దీని కోసం అందుబాటులోని మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై నీతి ఆయోగ్.. జాతీయ నిపుణుల బృందం నుండి వివరాలను అడిగి తెలుసుకుంది. మన దేశ పరిస్థితులకు అనువైన వ్యాక్సిన్ సేకరణ, దాని పంపిణీ ప్రక్రియను ట్రాక్ చేసేందుకు అందుబాటులోని వ్యవస్థలపైనా ఈ కమిటీ చర్చలు జరిపింది. వ్యాక్సిన్ ను సేకరించినప్పటి నుండి, దాన్ని ప్రజలకు చేరవేసేందుకు మార్గదర్శకాలపై దృష్టి పెట్టిన కమిటీ, దీని భద్రత, నిఘా తదితర విషయాల పైన చర్చించింది. దేశం మొత్తానికి కేంద్రం తరఫునే వ్యాక్సిన్ ఎంపికను చేయాలని రాష్ట్రాలు తమ మార్గాల్లో దీన్ని సమీకరించే ప్రయత్నాలు చేయవద్దని కమిటీ కోరింది.

గుంటూరులో పేదలకు నాట్స్ సాయం

100 కుటుంబాలకు బియ్యం పంపిణీ   కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సహాయం చేసింది. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న 100 కుటుంబాలకు నెలకు సరిబడ్డ బియ్యాన్ని పంపిణీ చేసింది. అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగునాట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. లాక్ డౌన్ సమయంలోనూ అనేక మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన నాట్స్ ఇప్పుడు పేదరికంలో మగ్గుతున్న వారికి చేయూత నిస్తోంది.   కరోనా మహమ్మారిలో పని లేక ఇబ్బందులు పడుతున్న గుంటూరు నగరంలో 100 కుటుంబాలకు నాట్స్ న్యూజెర్సీ విభాగం నెలకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసింది. నాట్స్ సెక్రటరీ రంజీత్ చాగంటి సహకారంతో న్యూజెర్సీ నాట్స్ విభాగం వరుసగా ఇలా పేదలకు చేయూతనిచ్చే కార్యక్రమాలు చేపట్టింది. గుంటూరు లోని నెహ్రునగర్, డొంక రోడ్డు ప్రాంతాల్లో నాట్స్ ఇలా నిత్యావసరాలు పంపిణీ చేసి పేదలకు భరోసా ఇచ్చింది. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు రంజిత్ చాగంటి చూపిన చొరవను నాట్స్ జాతీయ నాయకత్వం ప్రశంసించింది. ఒక వైపు పనుల్లేక ఇబ్బందులు పడుతున్న తమకు నాట్స్ మేమున్నామంటూ సాయం చేయడం చాలా సంతోషంగా ఉందని పేదలు హర్షం వ్యక్తం చేశారు.

"నెల్లూరులో నాడు ఒక హెడ్మాస్టరు ఉండేవారు.. నేడు లేరు.."  సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మెరుగు పరిచేందుకు "నాడు నేడు" అనే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే కార్యకమాన్ని ప్రస్తుత కరోనా పరిస్థితులతో పోల్చుతూ తీవ్ర విమర్శలు చేసారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ హెడ్ మాస్టర్ తనకు కరోనా సోకిందని, దయచేసి ఆస్పత్రిలో చేర్చుకోవాలంటూ విజ్ఞప్తి చేసి.. ఫలితం లేక చివరకు చనిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.    ఈ సందర్భంగా "గురుదేవో భవః" అని భావించే సమాజం మనది అని అయన గుర్తు చేస్తూ.. నెల్లూరులోని మనుబోలు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రమేష్‍కుమార్ తనకు కరోనా పాజిటివ్ అని, దయచేసి ఆసుపత్రిలో చేర్చుకుని తన ప్రాణాలను కాపాడమని అటు ఆసుపత్రి సిబ్బందిని, ఇటు అధికారులను, వైసీపీ నేతలను ఎంత వేడుకున్నాఎవరూ కూడా పట్టించుకోలేదని దాంతో చివరికి రమేష్ కన్నుమూశారు అని పేర్కొన్నారు. ఈ దారుణమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని "నాడు ఒక హెడ్మాస్టర్ ఉండేవారు. నేడు లేరు. ఇదేనా మీ నాడు-నేడు? " అంటూ రాష్ట్ర ప్రభుత్వం పై మండి పడ్డారు.    "అసలు ఈ రాష్ట్రంలో పాలనాయంత్రాంగం అంటూ ఉందా? తమ ప్రాణాలను కాపాడమని వేడుకుంటూ చనిపోడానికా ప్రజలు మీకు ఓట్లేసి అధికారమిచ్చింది. ఇలాంటి వీడియోలు చూస్తుంటే బాధేస్తోంది. ప్రభుత్వంలో మాత్రం స్పందన లేదు." అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా తగ్గినందుకు కాదు.. ఎన్నికలు వస్తున్నందుకు

న్యూజిలాండ్ ప్రధాని హిందూ దేవాలయాన్ని సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 100రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు రాకపోవడంతో కరోనా ఫ్రీకంట్రీగా న్యూజీలాండ్ ను ప్రకటించిన తర్వాత దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఆమె హిందూ దేవాలయాన్ని సందర్శించారని అనేక సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే వాస్తవానికి ఆమె హిందు దేవాలయాన్ని సందర్శించిన కారణం వేరే ఉందని అంటున్నారు ఆ దేశంలోని భారత రాయబారి ముక్తేష్ పర్దేషి. సోషల్ మీడియోలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన వివరణ ఇచ్చారు. న్యూజీలాండ్ లో వచ్చెనెల (సెప్టెంబర్) 19 న ఎన్నికలు జరగనున్నాయని ఈ నేపధ్యంలోనే ఆమె హిందూ దేవాలయాన్ని సందర్శించారని అన్నారు. ఈ నెల 6న జాకిందా అక్లాండ్ లోని రాధాకృష్ణ మందిరానికి వెళ్లారు. ఆమెతో పాటు ఈ ఆలయాన్నిభారత రాయబారి ముక్తేష్ పర్దేషి కూడా సందర్శించారు. కరోనా విపత్కర పరిస్థితి నుంచి బయట పడినందుకు ఆమె దేవాలయానికి రాలేదని ఆయన స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో జూన్ 8ననే కరోనా ఫ్రీ కంట్రీగా ప్రకటించి అన్ని ఆంక్షలు ఎత్తివేశారని ఆయన చెప్పారు. అయితే తాజాగా నాలుగు  పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మళ్లీ ఆంక్షలు విధించే అవకాశం ఉందన్నారు.   పెరిగిన హిందువుల జనాభా 2018 జనాభా లెక్కల ప్రకారం, న్యూజిలాండ్‌లో భారతీయులు నాల్గవ అతిపెద్ద సమాజంగా అవతరించారు. గతంలో ఇక్కడ హిందువుల జనాభా 89,000 ఉండేది, 2018 నాటికి 1.23 లక్షలకు పెరిగింది. న్యూజిలాండ్ 40 వ ప్రధాన మంత్రిగా, లేబర్ పార్టీ నాయకురాలిగా ఉన్న జాకిందా మరోసారి ఎన్నికల బరిలో నిలువనున్నారు. ఇప్పటికే కరోనాను అదుపుచేసి ప్రజల అభిమానం చూరగొన్న ఆమె హిందువు ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే హిందూ దేవాలయాన్ని సందర్శించడంతో పాటు ఇండియన్  వంటకాలైన పూరీ, చోలే తిన్నారు అంటున్నారు స్థానిక హిందువులు.

మాజీ మంత్రి గంటాకు జగన్ ఝలక్..!

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు త్వరలో వైసిపిలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఐతే తాజాగా అందుతున్న సమాచార ప్రకారం అయన డైలమాలో పడ్డట్టుగా తెలుస్తోంది. గంటా వైసిపిలోకి ఎంట్రీ ఖాయం కావడంతో విశాఖకు చెందిన మంత్రి అవంతి గంటా చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన గంటా తాజాగా సీఎం జగన్ ను కలిసి పార్టీలో చేర్చుకున్న తరువాత తనకు పదవి కావాలని కోరినట్లుగా సమాచారం. ఐతే మంత్రి పదవి కావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిస్తే తప్పకుండా చూస్తానని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరుల పై కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గంటా దీంతో ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది.    తాను ఏ పార్టీలో ఉన్నా కూడా అధికారానికి దూరంగా ఏమాత్రం ఉండలేని గంటా సీఎం తాజా ప్రతిపాదనతో గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత మూడు ఎన్నికలలో మూడు వేర్వేరు నియోజకవర్గాల నుండి పోటీ చేసి గెలిచిన అయన సీఎం ప్రపోజల్ తో ఎటు పాలుపోని పరిస్థితిలో పడ్డారు. ఇప్పటికే టీడీపీ నుండి బయటకు వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేల మాదిరిగా అయన కూడా ఏ పదవి ఆశించకుండా ఎదో విధంగా సర్దుకు పోయేటట్లైతే.. ముందుగా అనుకున్నట్లుగా ఈ నెల 16 న గంటా వైసిపిలో ఎంట్రీ పక్కా... అలా కాక పదవి కోసం చూస్తే మాత్రం ఎంట్రీ డౌటేనని వార్తలు వస్తున్నాయి.

ఎపి సీఎస్ కు ఎంపీ రఘురామ రాజు హెచ్చరికతో కూడిన లేఖ

గత కొంత కాలంగా వైసిపికి కొరకరాని కొయ్యగా తయారైన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వరుసగా రాష్ట్ర ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలు, వైఫల్యాల పై ప్రశిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అయన ఎపి సీఎస్ కు ఒక లేఖ రాసారు. తాజాగా తనపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎపి సమాచార పౌర సంబంధాల శాఖలోని చీఫ్ డిజిటల్ డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖ‌లో ఆయన కోరారు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తూ ఆయన పోస్టు చేశారని ర‌ఘురామ‌కృష్ణంరాజు ఆ లేఖలో ఆరోపించారు. ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా నిబంధనలకు వ్యతిరేకంగా తనపై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టడంపై అయన మండి పడ్డారు. ఆ అభ్యంతరకర పోస్టులపై విచారణ జరిపించి దేవేందర్‌రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని రఘురామరాజు సీఎస్ ను కోరారు. ఒక వేళ ఎటువంటి చర్యలు తీసుకొని పక్షంలో దేవేందర్ రెడ్డికి ప్రభుత్వం, అలాగే ఛీఫ్ సెక్రటరీ కార్యాలయం మద్దతు ఉందని భావించి, ఈ విషయాన్ని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఆ లేఖలో అయన తెలిపారు.   ఇప్పటికే ఎపి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో కేవలం ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టిన వారి పైన మాత్రమే చర్యలు చేపడుతూ వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వైసిపి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని గగ్గోలు పెడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఎంపీ రఘురామ కృష్ణం రాజు రాసిన ఈ లేఖ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

రూపాయి డాక్టర్ ఇకలేరు

గుండెపోటుతో మరణించిన డాక్టర్ జిజియా   నామమాత్రపు ఫీజుతో లక్షలాది మందికి వైద్యసేవలు అందించిన డాక్టర్ జిజియా గుండెపోటుతో మరణించారు. ఆరు దశాబ్దాలుగా పాలకొల్లులో వైద్యసేవలందించిన ఆమె ఒక రూపాయి డాక్టర్ గా ఎంతో పేరు పొందారు. కొద్దిరోజుల క్రితం వరకు ఆమె ఫీజు ఒక్కరూపాయి నే. ఇటీవలే పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఫీజు ఐదురూపాయలు చేశారు. లాక్ డౌన్ సమయంలో సైతం వైద్యసేవలు అందించిన ఆమె కొన్నిరోజుల కిందట హైదరాబాద్ వచ్చారు. నిన్న(ఆగస్టు 11, మంగళవారం)గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు.   డా. చలసాని జిజియా గారి నాన్నగారు విశాఖపట్నంలో 1940లలో స్థిరపడ్డారు. ఆమె అన్నయ్య డా. శిరిపురపు మల్లిఖార్జున రావు  తూర్పుగోదావరి జిల్లా DMHOగా కూడా పనిచేశారు. జిజియా గారు మద్రాస్ లో  వైద్య విద్య ను అభ్యసించారు. కృష్ణా డెల్టాలో ఆమె మొదటి మహిళా వైద్యురాలు. ప్రముఖ వైద్యులు డా. సౌభాగ్యాలక్ష్మి, మంగపతిరావు, విజయావాడ మాజీ మేయర్ డా. జంధ్యాల శంకర్, హృద్యోగ నిపుణులు కీశే. డా. వెంకయ్య చౌదరి గారు జిజియాగారికి సహాధ్యాయులే.   డాక్టర్ జిజియా బహుముఖ ప్రజ్ఞాశాలి.  వైద్యసేవ ఆమె వృత్తి అయితే సంగీత, సాహిత్య, చిత్రలేఖనం ఆమె ప్రవృత్తి.  వైద్య సేవలు అందించడంలో ఎప్పుడూ బిజీగా ఉంటే ఆమె ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా చిత్రాలు వేసేవారు, రచనలు చేసేవారు. నాటి గృహాలక్ష్మి నుంచి అనేక పత్రికలలో వారి కవితలు, రచనలు ప్రచురించబడ్డాయి. కవయిత్రి, రచయిత్రిగా ఎంతో పేరు సంపాదించారు. అంతేకాదు సంగీతం లో ప్రావీణ్యురాలు. వారి కుమారుడు తెలుగుజాతి ఉద్యమకారుడు, రచయిత చలసాని శ్రీనివాస్. తెలుగురాష్ట్రాల్లో అందరికి సుపరిచితులే. రెండో కుమారుడు ఇండియన్ అర్ధో డెంటిస్ట్స్  సొసైటీ అధ్యక్షులు.   ఆమె మరణం వైద్యరంగానికే కాదు సాహిత్యలోకానికి తీరని లోటని పలువురు సంతాపం ప్రకటించారు.

విశాఖలో వరుసగా పెద్దల చేతుల్లోకి బడా సంస్థలు!!

పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి తరలించడానికి ఏపీ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజధాని తరలింపు కంటే ముందే విశాఖలోని బడా సంస్థలను కొందరు పెద్దలు హస్తగతం చేసుకుంటున్నారని తెలుస్తోంది.   విశాఖలోని కీలకమైన ప్రాజెక్టులను చేజిక్కించుకోవడానికి అధికార పార్టీ నాయకులు యత్నిస్తున్నారట. ముఖ్యంగా ప్రభుత్వ, పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో భూములు తీసుకుని వ్యాపారాలు నడుపుతున్న వారిపై దృష్టి సారించారని తెలుస్తోంది. ఇప్పటికే కార్తీకవనం ప్రాజెక్టులో కొంత వాటా దక్కించుకున్నారు. విశాఖ-భీమిలి బీచ్‌ రోడ్డులో సాగర్‌నగర్‌ సమీపాన బీచ్‌ రిస్టార్‌ను పీపీపీలో అభివృద్ధి చేయడానికి ఓ సంస్థ పదేళ్ల క్రితం ఒప్పందం చేసుకోగా.. అది ఇప్పటికి పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అందులో కొంత వాటాను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో కొనుగోలు చేయించారని ప్రచారం జరుగుతోంది.   తాజాగా అదే ప్రాంతంలో కొండపై నడుస్తున్న 'బే పార్క్‌' ఎకో టూరిజం ప్రాజెక్టును కూడా చేజిక్కించుకున్నారని తెలుస్తోంది. పర్యాటక శాఖకు చెందిన స్థలంలో ఎకో టూరిజం ప్రాజెక్టు పెడతామని ఇండో అమెరికన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ సంస్థ 33 ఏళ్లకు లీజుకు తీసుకుంది. ఈ కొండపై అంతర్జాతీయ ప్రమాణాలతో వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. సుమారు 138 గదులతో, ప్రకృతి సిద్ధమైన విధానాలతో ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్యం అందించే రిసార్ట్‌గా అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు సుమారు రూ.120 కోట్లు వెచ్చించారని అంచనా. ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగి 18 ఏళ్లు కావస్తున్నా.. ఇది అందుబాటులోకొచ్చి మూడు, నాలుగేళ్లే అయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపైనే అధికార పార్టీ నాయకుల దృష్టిపడిందని తెలుస్తోంది.    రాజధానిని విశాఖకు మారుస్తున్నందున సీఎం నివాసం కోసం బే పార్క్ భవనాలను కూడా పరిశీలించారట. ఆ తర్వాత విశాఖ సమీపంలో భారీ ఫార్మా కంపెనీలు నడుపుతున్న రెండు సంస్థలు బే పార్కులో అధిక శాతం వాటాను చేజిక్కించుకున్నాయి. నిర్వాహకులు బ్యాంకు నుంచి తీసుకున్న రూ.100 కోట్ల రుణాన్ని కొత్త భాగస్వాములు తీర్చేలా, పాతవారికి కొంత శాతం వాటా ఇచ్చేలా అంగీకారం కుదిరిందని సమాచారం. అంతేకాదు, బే పార్క్‌లోని కొంత భాగాన్ని సీఎం నివాసంగా మారుస్తారని ప్రచారం జరుగుతోంది.   రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం ప్రభుత్వ భూమిని ఎవరైనా అభివృద్ధి చేయడానికి తీసుకుంటే.. పదేళ్ల తర్వాత కావాలనుకుంటే దాన్ని కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. కార్తీకవనం ఒప్పందం జరిగి పదేళ్లు దాటింది, అలాగే బే పార్క్‌ ఒప్పందం జరిగి 18 ఏళ్లు అయింది. దీంతో కొత్త విధానం కింద ఈ రెండింటినీ అధికార పార్టీ నాయకులు నామమాత్రపు ధరకు పూర్తిగా చేజిక్కించుకునే అవకాశం ఉందని, అందుకే కొత్త పాలసీలో ఆ నిబంధన చేర్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   కాగా, విశాఖలోని బడాసంస్థలు చేతులు మారడంపై ప్రతిపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా దీనిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "విశాఖలో వరుసగా 'పెద్దల' చేతుల్లోకి బడాసంస్థలు. మొన్న కార్తీకవనం, నేడు బేపార్క్. ఇండస్ట్రియల్ విధానంలో నిబంధనల మార్పు ఫార్మాకంపెనీలకు ఉపయోగపడ్డాయా? వాటాకొన్న ఫార్మాకంపెనీలు ఏవి? అప్పులు ఎవరు తీరుస్తున్నారు? ముఖ్యమంత్రి కార్యాలయంకోసం ఏర్పాట్లు నిజమేనా? ప్రజలకి చెప్పండి వైఎస్ జగన్ గారు" అంటూ సీఎం వైఎస్ జగన్ పై దేవినేని ప్రశ్నల వర్షం కురిపించారు. మరి గతంలో అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపించిన అధికార పార్టీ నేతలు.. ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

అన్నవరం దేవస్థానంలో కలకలం.. 50 మందికి కరోనా

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో కరోనా కలకలం రేపుతోంది. బుధవారం నిర్వహించిన పరీక్షల్లో 50 మందికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ఒక్కసారిగా అలజడి నెలకొంది. కరోనా సోకినవారిలో అధికంగా వ్రత పురోహితులు, అర్చకులున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈవో త్రినాథ రావు దేవదాయశాఖ అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ నెల 23 వరకు అన్నవరం ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.    శుక్రవారం వరకు 10 మంది అర్చకులు, సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. శనివారం 300 మందికి పరీక్షలు నిర్వహించగా మరో 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 14 వరకు దర్శనాలు, వ్రతాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు ప్రకటించారు. అయితే కరోనా కేసుల ఉధృతి తగ్గని కారణంగా ఈ నెల 23 తేదీ వరకు భక్తులకు ఆలయంలో దర్శనాలను నిలిపివేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకొంది. స్వామి వారికి ఏకాంతంగా నిత్యసేవలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ప్రతి ఇద్దరు యువతలో ఒకరు

నేడు అంతర్జాతీయ యువ దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలను, అన్ని స్థాయిల ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసిన కోవిద్ 19 వైరస్ కారణంగా ప్రపంచ యువ జనాభాలో సగం మంది నిరాశలో, మూడోంతుల మందిలో భవిష్యత్ కెరీర్ అవకాశాలపై అనిశ్చిత ఉందని ఇంటర్నేషనల్ సర్వే వెల్లడించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ  'యూత్ అండ్ కోవిడ్ 19'  అంశంపై నిర్వహించిన సర్వేలో  ఫలితాలు వెల్లడించారు. 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు వారిలో మహమ్మారి తక్షణ ప్రభావం తెలుసుకునేందుకు వీలుగా ఈ సర్వే నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇద్దరిలో ఒకరు నిరాశ, ఆందోళనకు లోనవుతున్నారని ఐఎల్‌ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్ వెల్లడించారు. కోవిద్ 19 మహమ్మారి ప్రజల జీవితంలోని ప్రతి అంశాన్ని తాకింది. ఈ సంక్షోభం కన్నా ముందే యువతలో విద్యా, ఉపాధి, సామాజిక, ఆర్థిక సమస్యలు ఉండగా కొత్తగా వచ్చిన ఈ వైరస్ మరింత అనిశ్చిత పరిస్థితిని తీసుకువచ్చిందని ఆయన పేర్కోన్నారు. ఆరోగ్య సంక్షోభంతో పాటు వారి విద్యాఉపాధి అవకాశాలపై తీవ్రమైన ప్రభావం పడటంతో యువతలో మానసిక ఆందోళన పెరిగిందని స్పష్టం చేశారు. 112 దేశాల నుంచి 12వేల మందికి పైగా ఈ సర్వేలో పాల్గొన్నారు. కరోనా రాకముందు ఉద్యోగం చేస్తున్న ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోయారు అంటే 17శాతం మంది యువత నిరుద్యోగులయ్యారు. ఉద్యోగాలు చేసే యువతలో పని గంటలు తగ్గాయి. ఐదుగురిలో ఇద్దరి ఆదాయం పడిపోయింది. అంటే 42శాతం యువత పని గంటలు తగ్గడంతో వారి ఆదాయం తగ్గిపోయింది. ఇక విద్య విషయానికి వస్తే ఆన్ లైన్ విద్యాబోధన అంటున్నప్పటికీ దాదాపు 65శాతం యువత తమ ఆసక్తిని కోల్పోతున్నారు. 51శాతం మంది తమ చదువులు ఆలస్యం అవుతుందన్నాయన్న నిరాశలో ఉన్నారు. 9శాతం మంది విద్యా సంవత్సరం నష్టపోతున్నామన్న మానసికఒత్తిడితో ఉన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడంతో పాటు భవిష్యత్ లో యువతలో మానసిక సమస్యలు రాకుండా ఉండాలంటే వారిని నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములను చేయాలి. వారి ఆలోచనలను, అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశాలు ఇవ్వాలని ఐఎల్‌ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్ అంటున్నారు. ఏది ఏమైనా కరోనా కోరల నుంచి భవిష్యత్ తరాన్ని కాపాడుకోవడానికి ప్రపంచమానవాళి సిద్ధం కావాలి.

నెల రోజుల్లో 2 లక్షలకు పైగా కేసులు.. ఏపీలో పరిస్థితి చేయి దాటి పోతుందా?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల విషయంలో పరిస్థితి చేయి దాటిపోతున్నట్టుగా కనిపిస్తోంది. గత నెల రోజుల్లో రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయంటే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.   ఏపీలో తొలి కేసు మార్చి 12న నమోదైంది. ఏప్రిల్ 10 నాటికి 381కి కేసులు పెరిగాయి. మే 10 నాటికి ఆ కేసులు 1,910కి పెరిగాయి. జూన్ 10 నాటికి కేసుల సంఖ్య 4,126కి పెరిగింది. ఇక లాక్‌డౌన్ సడలింపులు, ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన వారితో ఏపీలో కేసులు అమాంతంగా పెరగడం ప్రారంభమైంది. దాంతో జూలై 10 నాటికి మొత్తం కేసుల సంఖ్య 24,422కి చేరింది. అంటే ఒకే నెలలో ఆరు రెట్లు కేసులు పెరిగాయి.   ఆ తర్వాత మరిన్ని లాక్‌డౌన్‌ సడలింపులు తోడుకావడంతో కరోనా ఉదృతి భారీగా కనిపిస్తోంది. గడిచిన నెల రోజులు గమనిస్తే దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత వేగంగా కేసులు పెరగటం లేదు. ఆగస్టు 10 నాటికి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,35,525కి చేరింది. అంటే జూలై 10 తర్వాత నెల రోజుల్లోనే రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.   ప్రస్తుతం దేశంలో అత్యధిక కేసులున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత ఏపీ మూడో స్థానంలో ఉంది. కానీ యాక్టివ్ కేసులను గమనిస్తే ఏపీ రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 1.63 లక్షల యాక్టివ్ కేసులుండగా, ఏపీలో 87,773 యాక్టివ్ కేసులతో రెండో స్థానంలో ఉంది.   పరీక్షలు ఎక్కువగా చేయడం వల్లనే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పటికీ అవసమైన వారికి, ప్రైమరీ కాంటాక్టులకి కూడా సకాలంలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.   ప్రస్తుతం ఏపీలో రోజుకి సగటున 50 వేలకు పైగా శాంపిల్స్ ను పరీక్షిస్తుండగా.. దాదాపు పది వేల కేసులు వస్తున్నాయి. అయితే పది వేల కొత్త కేసులు వస్తుంటే దానికి తగ్గట్టుగా ప్రైమరీ కాంటాక్టులే 50 వేల మందికి పైగా ఉంటారని అంచనా. ఇక ఇతరులలో లక్షణాలు కనిపించిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. వారందరికీ సకాలంలో పరీక్షలు నిర్వహించడం పెద్ద సమస్య అవుతోంది. కరోనా బాధితుల ఇళ్లల్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా టెస్టుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. మిగతా రాష్ట్రాలలో పోలిస్తే పరీక్షల విషయంలో ముందున్నప్పటికీ, నమోదవుతున్న కేసులకి, ప్రైమరీ కాంటాక్టులకి అవి సరిపోవడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

శిరోముండనం బాధితుడి లేఖ పై సీరియస్ గా రియాక్టయిన రాష్ట్రపతి

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసులు ఒక దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సీరియస్ గా స్పందించారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన విభాగానికి ఈ కేసుకు సంబంధించిన ఫైల్ బదిలీ చేస్తూ ఏపీ జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబును కలవాలని బాధితుడు ప్రసాద్ కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. ఈ కేసుకు సంబంధించిన కాల్ రికార్డ్స్, వీడియో క్లిప్పింగులతో కూడిన పూర్తి వివరాలు జనార్దన్ బాబుకు అందించాలని బాధితుడు ప్రసాద్ కు రాష్ట్రపతి భవన్ తెలిపింది.    కొద్దీ రోజుల క్రితం తనకు శిరోముండనం చేసిన ఘటనలో ముఖ్య కారణమైన వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు ప్రసాద్ నేరుగా రాష్ట్రపతికి లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని దాంతో రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోతున్నానని.. మావోయిస్టుల్లో చేరి తన పరువు కాపాడుకుంటానని దానికి అనుమతివ్వాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఐతే బాధితుడి లేఖ అందుకున్న 24 గంటల్లోనే రాష్ట్రపతి కార్యాలయం స్పందించడం గమనార్హం.

కరోనా వారియర్స్ కు సన్మానం

కరోనాను జయించి విధుల్లో చేరిన పోలీసులకు సన్మాన కార్యక్రమాన్ని రాచకొండ కమిషనరేట్ లో నిర్వహించారు. కరోనా వారియర్స్ గా ముందువరుసలో నిలబడి ప్రజలకు సేవలందించిన పోలీసులు కరోనా బారిన పడ్డారు. దాదాపు 500మంది పోలీసులు కరోనాను జయించి తిరిగి విధుల్లో చేరారు. వారందరినీ రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సన్మానించారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో విధి నిర్వాహ‌ణలో భాగంగా  వీరంతా క‌రోనా వారియ‌ర్స్‌గా ముఖ్య‌పాత్ర పోషించారు. రాచ‌కొండ క‌మిస‌న‌రేట్ ప‌రిధిలోనే దాదాపు 500 మంది పోలీసులు క‌రోనా బారిన పడ్డారు. చికిత్స తీసుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి విధుల్లోకి చేరారు. వారందరినీ కమిషనర్ అభినందిస్తూ స‌న్మానం చేశారు.  ఈ కార్య‌క్ర‌మంలో అడిషనల్ సీపీ సుధీర్ కుమార్, డిసిపి మల్కాజిగిరి రక్షిత మూర్తి తదితర పోలీసు ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. కరోనా సోకిన వారిని ఆదరించాలని,  కరోనా నుంచి బయడపడిన వారు ప్లాస్మా దానం చేయాలని ఈ సందర్భంగా సీపీ పిలుపునిచ్చారు.

విశాఖ పోలీస్ కమిషనర్ ఆకస్మిక బదిలీ 

ఒక పక్క విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిగా సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సమయంలో నగర్ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఆకస్మిక బదిలీ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కొంత‌కాలంగా విశాఖ‌ప‌ట్నం క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో నిత్యం ఎదో ఒక ప్ర‌మాదం జ‌రుగుతుండ‌టం, అంతేకాకుండా ప్ర‌తి అంశంలోనూ పోలీసుల వైఫ‌ల్యంపై విమ‌ర్శ‌లు వస్తున్న నేపథ్యంలో ఈ బదిలీ జరిగింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఆర్కే మీనాను బ‌దిలీ చేసి మంగ‌ళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయన స్థానంలో విశాఖ కొత్త పోలీస్ క‌మిష‌న‌ర్ గా ఇంట‌లిజెన్స్ లో ఐజీగా ప‌నిచేస్తున్న మ‌నీష్ కుమార్ సిన్హాను ప్ర‌భుత్వం నియ‌మించింది. ఇక విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ రెడ్డిని ఇంట‌లిజెన్స్ అడిష‌న‌ల్ డిజీ గా అద‌నపు బాధ్య‌తలు అప్పగించింది.

కరోనా వ్యాక్సిన్ పై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సెన్సేషనల్ కామెంట్స్  

కరోనా విలయతాండవంతో ప్రపంచం మొత్తం కుదేలవుతున్న సంగతి తెలిసిందే. క‌రోనా వైరస్ ధాటికి భారత ఆర్ధిక రంగం కూడా ప్రభావితమైంది. తాజాగా క‌రోనా వ్యాక్సిన్, క‌రోనా వైర‌స్ దేశంలో సృష్టిస్తున్న ఆర్ధిక విధ్వంసం పై ఇన్ఫోసిస్ అధినేత నారాయ‌ణ మూర్తి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. భారత్ లో వచ్చే తోలి వ్యాక్సిన్ ఆక్స్ ఫర్డ్ దే కావచ్చని అది కూడా రావడానికి ఆరు నుండి తొమ్మిది నెలల సమయం పట్టవచ్చని అయన తెలిపారు. భార‌త్ లో ఇప్ప‌టికిప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా దానితో రోజుకు కోటిమంది చొప్పున వ్యాక్సిన్ ఇవ్వ‌టం ప్రారంభించినా, మొత్తం దేశ ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సిన్ అందాలంటే కనీసం 140 రోజులు ప‌డుతుంద‌న్నారు. ఐతే వ్యాక్సిన్ కోసం నిరీక్షించకుండా క‌రోనా చికిత్స కోసం ఆసుప‌త్రుల్లో మ‌రిన్ని ఏర్పాట్లు చేయాల‌ని, మరీ ముఖ్యంగా టైర్-2,3 సిటీస్ లో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయ‌ని ఆయన వ్యాఖ్యానించారు. మన దేశంలో మొదటి నుండి ప్రజా ఆరోగ్య వ్యవస్థ పై ప్రభుత్వాలు సరిగా దృష్టి పెట్టలేదని దాంతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించడం ద్వారా మాత్రమే మనం కరోనాను ఎదుర్కోగలమని అయన అన్నారు.  లీడింగ్ ఇండియా డిజిట‌ల్ రివ‌ల్యూయేష‌న్ లో చ‌ర్చ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న దేశంలో జీడీపీ వృద్ధి 1947నాటికి ప‌డిపోయే ప్ర‌మాదం ఉంద‌ని, అసలు మైన‌స్ లోకి పోయినా ఆశ్చ‌ర్య‌మేమీ లేదంటూ వ్యాఖ్యానించారు. అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యాయ‌ని, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌ళ్ళీ గాడిలో ప‌డాలంటే సొంతూర్ల‌కు వెళ్లిపోయిన 14 కోట్ల మంది జ‌నాభా తిరిగి ప‌నుల‌కు చేరుకోవాల‌ని అయన అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొత్త వ్య‌వ‌స్థ‌ల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉందని అయన అన్నారు.

ద‌ళితుల చదువుకు అడ్డుపడటం ఫ్యాక్షనిస్టుల దుష్ట సంస్కృతి

ఏపీలో కొద్దిరోజులుగా దళితులపై దాడులు జరుగుతున్న ఘటనలు, కుల వివక్ష ఎదుర్కొంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, ఆంధ్రా యూనివర్సిటీ లో ఆరేటి మహేష్‌ అనే దళిత పరిశోధక విద్యార్ధి.. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగడం సంచలనంగా మారింది. తన పరిశోధన గ్రంధంపై ఉద్దేశపూర్వకంగా వీసీ సంతకం చేయలేదని ఆరోపిస్తూ దీక్షకు దిగారు. ఒక దళిత ప్రొఫెసర్ కి అన్యాయం జరిగితే.. తాను బలపర్చానని కక్షకట్టారని ఆరోపించారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీని ప్రభుత్వం వెంటనే భర్తరఫ్‌ చేయాలని ఆరేటి మహేష్‌ డిమాండ్‌ చేశారు.   ఆరేటి మ‌హేష్ చేస్తున్న దీక్షకు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు తెలిపారు. మహేష్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ భారత పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఏపిలో కాలరాస్తున్నారు అని మండిపడ్డారు. ఆంధ్ర విశ్వ‌విద్యాల‌య దళిత విద్యార్ధి, రిసెర్చ్ స్కాలర్ ఆరేటి మ‌హేష్ ఉన్నత చ‌దువులకు ఆటంకాలు కల్పించడం విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ఈ విధమైన క‌క్ష‌సాధింపు గర్హనీయం అన్నారు.    ద‌ళితుల చదువుకు అడ్డుపడటం ఫ్యాక్షనిస్టుల దుష్ట సంస్కృతి అని విమర్శించారు. దళిత వైద్యులపై అమానుషాలు, దళిత జడ్జిపై రాళ్లదాడి, దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు, దళితుల భూములు బలవంతంగా లాక్కోవడం.. వంటి ఈ పాలకులగతి తప్పిన, మతిమాలిన చర్యలను దళిత సమాజమే నిగ్గదీయాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిరాహార దీక్ష చేస్తున్న మ‌హేష్‌కి తక్షణమే న్యాయం చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రష్యా వ్యాక్సిన్ కోసం భారత్ రిక్వెస్ట్.. పరిశీలిస్తున్నామన్న రష్యా

కరోనా ప్రపంచం మొత్తం అతలాకుతలమౌతున్న సమయంలో సైలెంట్ గా రష్యా తన వ్యాక్సిన్ ను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలతో ట్రయల్స్ కాల పరిమితిని కుదించి ఈ వ్యాక్సిన్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ వ్యాక్సిన్ పనితీరుపై డబ్ల్యుహెచ్ఓ తో పాటు, ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను స్వయంగా పుతిన్ కుమార్తెకు కూడా ఇవ్వడంతో నమ్మకం ఏర్పడి దీనిని తమకు కూడా అందించాలని భారత్ సహా మరో 20 దేశాలు కోరాయి. ఈ విషయాన్ని స్వయంగా రష్యా ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. "స్పుత్నిక్ వీ" గా పిలవబడుతున్నఈ వ్యాక్సిన్ కోసం భారత్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బ్రెజిల్, మెక్సికో, టర్కీ, క్యూబా వంటి దేశాలు తమను కోరాయని ఆ ప్రకటనలో తెలిపింది.   రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఎఫ్) సహకారంతో తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ను ఈరోజు తొలిసారిగా 2 వేల మంది ప్రజలకు ఇవ్వనున్నారు. అంతేకాకుండా సెప్టెంబర్ లో వ్యాక్సిన్ తయారీని భారీ ఎత్తున మొదలుపెట్టి, ఈ సంవత్సరం చివరకు దాదాపు 20 కోట్ల డోస్ లను తయారు చేసి అందించాలని రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యాక్సిన్ ఫార్ములాను కనుక తమకు అందిస్తే, మేము కూడా తయారు చేస్తామంటూ కొన్ని దేశాల ఫార్మా కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయని, ఐతే ఈ విషయాన్ని ఇంకా పరిశీలిస్తున్నామని రష్యా పేర్కొంది. ఇక రాబోయే ఐదేళ్ల కాలంలో వివిధ దేశాల సహకారంతో ఏటా 50 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను తయారు చేస్తామని ఆర్డీఐఎఫ్ చీఫ్ కిరిల్ దిమిత్రీవ్ తెలిపారు.

బీజేపీ గండమే కేటీఆర్ పట్టాభిషేకం ఆలస్యానికి కారణమా?

జగన్ ను ఏం చేయబోతున్నారు?   తెలుగు రాష్ర్టాలలో బీజేపీ ఏం చేయబోతోంది? ఇది చాలా కాలంగా నలుగుతున్న మిలియన్ డాలర్ ప్రశ్న. ముఖ్యంగా తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు వచ్చినపుడు ఇక్కడ పాగా వేయడానికి నయానో భయానో లేదా ఎన్నికల ద్వారానో ప్రయ్నతిస్తుందని చర్చనడుస్తూనే ఉంది. ఏపీలో మూడు రాజధానులు విషయంలో కమలనాధుల తలాతోకా లేని ప్రకటనలతో ఒక విషయం అర్ధం అవుతోందని అంటున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా ప్రాంతీయ పార్టీల పని పట్టే ఛాన్స్ వచ్చే వరకు వేచి ఉండటమే హైకమాండ్ వ్యూహమట. దానర్ధం అంటే ముఖ్యమంత్రి వీక్ అయినపుడో, లేదా ప్రాంతీయ పార్టీలో ముసలం పుట్టినపుడో తప్ప డైరెక్టుగా జాతీయ స్థాయి నాయకులు అంటే షా లాంటి వారు రంగంలోకి దిగరట. దీనికి ఉదాహరణగా తమిళనాడులో జయలిలిత మరణం తరువాత అన్నాడీఎంకేను పూర్తిగా గుప్పిట్లోకి పెట్టుకున్న వ్యవహారాన్ని ఉదహరిస్తున్నారు.    మధ్య ప్రదేశ్లోను కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ బలంగా లేకపోవడంతో జ్యోతిరాదిత్య సింథియా తరహా అపోజిషన్ శిబిరంలోని నాయకుడిని తమ వైపు తిప్పుకుని మళ్ళీ గద్దెనెక్కారు. నిజానికి మధ్య ప్రదేశ్లో బీజేపీ నాలుగు సార్లు పైగానే వరుస పెట్టి అధికారంలోకి వచ్చింది. శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే సరికి  ప్రజలకు కూడా మొహం మొత్తింది. దానితో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓడిపోయింది. అయితే కాంగ్రెస్ యంగ్ ఫైర్ బ్రాండ్ నాయకుడు జ్యోతిరాదిత్య సహాయంతో ఆ పార్టీని చీల్చి మళ్ళీ చౌహాన్ ను గద్దె మీద కుచోబెట్టారు. కర్నాటకలో అదే తరహా రాజకీయం జరిగింది. కాంగ్రెస్ ను కూలగొట్టారు. ఇక ఎన్ సీపీ ,శివసేన భాగస్వామిగా ఉన్న మహారాష్ర్టలో ఏదో ఒక రోజు మధ్య ప్రదేశ్ లాంటి ఎపిసోడ్ జరగక తప్పదని అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.దీనిని బట్టి అర్ధం అయింది ఏంటంటే ఇపుడు బీజేపికి ప్రధాన్య ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు బీజేపీ ఏతర స్టేట్స్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలే. అయినా ఇపుడపుడే ఏం చేయకపోవచ్చని వినికిడి.    ఒడిశా, ఎపీ, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థానలో బీజేపీ ప్రభుత్వాలు లేవు. ఆప్ , వైసీసీ, టీఆర్ ఎస్, తృణమూల్ కాంగ్రెస్ లే ఇపుడు కాషాయ పార్టీకి కొరకురాని కొయ్యలు. బీజేపీ కంచుకోట అయిన గుజరాత్ లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచానా ఓట్ల శాతం గణనీయంగా తగ్గింది. వీటన్నిటి కారణంగా బీజేపీ ఇతర స్టేట్స్ మీద ఫోకస్ పెట్టక మానదు. పైగా ఆర్ ఎస్ ఎస్ ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం, అవి తమ సుదూర లక్ష్యమైన అఖండ్ భారత్ ( పాకిస్తాన్, ఇతర సరిహద్దు ప్రాంతాలను కలుపుకున్న పెద్ద దేశం) స్థాపనకు సహకరించవనేది ఆర్ ఎస్ ఎస్ యోచన. అయితే దక్షిణాదిలో బీజేపీ ఎపుడు ప్రాంతీయ పార్టీల తోకపార్టీ గానే ఉంది, తమిళనాడులో కాంగ్రెస్ లా ఆయా శాఖల ప్రెసిండెట్లు ఎవరితో సఖ్యతతో ఉంటే, వారి కులపరమైన ఈక్వేషన్ కారణంగా ఆయా పార్టీలతో వెడుతోంది. ( ఏపీలో ముందు కమ్మలతో టీడీపీతో, ఇపుడు కాపులు జనసేనతో లా). అయితే స్వంతగా పార్టీ జెండా ఎగరేయడానికి ఈ ధోరణి సరపోదని పార్టీ హైకమాండ్ కు తెలిసినా తెలియకపోయినా ముఖ్యమంత్రుల దగ్గర ముసలం వచ్చే వరకు వేచి చూడటం ఖాయమని అంటున్నారు.    ఈ పరమార్ధం గ్రహించిన కేసీఆర్, కేటీఆర్కు నెంబర్ వన్ సీట్ కట్టబెట్టడంలో సమయం తీసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. అటువంటి చర్య హారీష్ రావు రూపంలో పార్టీలో ముసలానికి దారితీయవచ్చని, కమలనాధులు అందుకు ఆజ్యం పోసే అవకాశమూ లేదని టీఆర్ఎస్ పెద్దల అనుమానం. ఇక ఏపీ కి వస్తే ,జగన్ కు పూర్తి మెజార్టీ ఉంది. ఆయన క్రిస్టియన్ మద్దతు పట్ల ఆర్ ఎస్ ఎస్కు రుసరస గానే ఉన్నా ఇప్పటికపుడు ఏం చేయలేకనే ఊరుకుంటున్నారు. బీజేపీ జాతీయ ముఖ్య నాయకుడొకరు కొంత కాలం క్రితం హైదరాబాద్ లో మీడియాతో అంతర్గతంగా మాటాడుతూ, మాకు టీడీపీ, వైసీపీ రెండూ బలహీన పడటం ప్రధానంగా కావాలి అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందాకా మూడు రాజధానులు, అమరావతి , ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్న వివాదాస్పద అంశాల మీద కమలనాధులు కప్పదాట్ల స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పదు. ఆ విషయం తెలిసే జగన్ కూడా కాన్ఫిడెంట్ గా ముందుకు వెడుతున్నారనీ అంటున్నారు. పైగా వైసీపీని బలహీనం చేస్తే కొద్దో గొప్పో తమ మాట వినే జనసేన, టీడీపికి కానీ తమకు కానీ ఆ ఓట్లు వెళ్ళవనే భయం కూడా కమలనాదులలో లేకపోలేదని అందుకే అంతా ప్రస్తుతనికి వెయిట్ అండ్ సీ నే. 

అమెరికా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భార‌త సంత‌తి మహిళ పోటీ

అమెరికా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు మహిళ పోటీ చేయబోతున్నారు. గతంలో సెనెటర్ గా ఎన్నుకోబడిన కమలాదేవి హారిస్ ఈ సారి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా డెమొక్రాటిక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా పేరు నమోదు చేసుకుంటారు. గత ఎన్నికల్లో అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ ను బరిలోకి దింపిన డెమొక్రాటిక్ పార్టీ ఈ సారి ఉపాధ్యక్షురాలిగా మహిళ పేరు ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నుంచి అధ్యక్షస్థానానికి పోటీ చేస్తున్న జో బిడెన్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.   కమలాదేవి హారిస్ ఓక్లాండలో జన్మించారు. ఆమె తల్లి డాక్టర్ శ్యామల గోపాలన్. రొమ్ము క్యాన్సర్ శాస్త్రవేత్త. తమిళనాడు నుంచి 1960లో యుసి బర్కిలీలో ఎండోక్రినాలజీలో డాక్టరేట్ చేయడానికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తండ్రి డోనాల్డ్ హారిస్. జమైకా నుంచి అమెరికా వచ్చారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ఎమెరిటస్ ప్రొఫెసర్. భారత్ ఆఫ్రో-జమైకా సంతతికి చెందిన హారిస్ అమెరికాలో పుట్టి పెరిగారు.   కమల హోవార్డ్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. హేస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా నుంచి న్యాయవిద్యను పూర్తి చేసిన ఆమె శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గాను విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఆమె సెనేటర్ గా ఎన్నికయ్యారు. అమెరికా సెనేటర్ గా పనిచేసిన తొలి దక్షిణాసియా అమెరికన్ సెనేటర్ గా పేరు నమోదు చేసుకున్నారు. అయితే 2020 ఎన్నికల్లో అధ్యక్షపదవి రేసులో ఆమె పేరు ఉంది. తాజాగా జరిగిన పరిణామాల అనంతరం ఆమె ఉపాధ్యక్షురాలిగా, జో బిడెన్ అధ్యక్షుడిగా పోటీ చేయనున్నారు.