మేక్ ఇన్ ఇండియా తో పాటు మేక్ ఫర్ వరల్డ్ నినాదంతో..
posted on Aug 15, 2020 @ 9:37AM
25ఏండ్లు వచ్చిన కొడుకు సొంత కాళ్లపై నిలబడాలని ఆ కుటుంబం కోరుకుంటుంది. కానీ 75ఏండ్లు వచ్చినా దేశం మాత్రం స్వయం సమృద్ధి సాధించలేకపోయిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటపై తివర్ణ పతాకాన్నిఆయన ఎగుర వేశారు. ఆ తర్వాత దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశమంతా ఒక్కటై నిలిచిందన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపై ఈ విపత్తును ఎదుర్కోవడానికి శాయశక్తుల కృషి చేస్తున్నాయని ప్రజలు ఎంతో సహకరిస్తున్నారన్నారు. కరోనా ఒక్కటే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయన్నారు. చుట్టుముట్టిన సమస్యలన్నింటీని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి పని చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
దేశసరిహద్దుల్లో రక్షణ దళాలు, దేశంలో పోలీసులు దళాలు నిరంతరం దేశ భద్రతను, ప్రజలను రక్షిస్తున్నాయన్నారు. ఎదురయ్యే సవాళ్లు మన సంకల్పాన్ని మరింత ధృడం చేస్తాయన్నారు.
కరోనా విపత్కర పరిస్థితి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుండి దేశంలోని అన్నిరంగాల వారిని ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ భారత్ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఇప్పుడు 130 కోట్ల మంది భారతీయుల సక్సెస్ మంత్రగా మారిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైందన్నారు. భారత్ అంటే క్రమశిక్షణ మాత్రమే కాదని, ఉన్నత విలువలతో కూడిన జీవనమన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంగా మిగిలిపోకూడదని, అది అందరి సంకల్పం కావాలని మోడి పిలుపునిచ్చారు.
మేక్ ఇన్ ఇండియా తో పాటు మేక్ ఫర్ వరల్డ్ నినాదంలో దేశం ముందుకు పోతుందన్నారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంలో భారత్ తయారు చేస్తున్న వస్తువులను ప్రపంచం ఆదరించేలా నాణ్యమైన వస్తువుల ఉత్పత్తి కొనసాగించాలన్నారు.