కాంట్రాక్టర్లకు డబుల్ పేమెంట్ పై బుగ్గన రాజీనామా కోరిన దేవినేని ఉమా
posted on Aug 14, 2020 @ 6:33PM
గత నెలలో ఎపి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబులు పేమెంట్లు చేసిందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేసారు. ఈరోజు జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడిన ఆయన పొరపాటున రూ.649 కోట్లు గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు బదిలీ అయ్యాయని ఎలా చెబుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే పెన్షనర్ల చెల్లింపులో కూడా జూలై 30న డబుల్ పేమెంట్ జరిగిందని ఆయన చెప్పారు. అలాగే చిత్తూరు జిల్లాలో కొందరు కాంట్రాక్టర్లకు కూడా డబుల్ పేమెంట్ జరిగిందన్నారు. ఇప్పటి వరకు బ్యాక్ ఎండ్ పేమెంట్స్ రూపంలో.. ఎంత మొత్తం చెల్లింపులు జరిపారో ఆర్ధిక మంత్రి బుగ్గన వివరణ ఇవ్వాలని ఉమా డిమాండ్ చేశారు.
ఈ మొత్తం వ్యవహారంపై ఆర్ధిక మంత్రి బుగ్గన సమాధానం చెప్పి తీరాల్సిందేనని.. అసలు ఆర్ధిక శాఖ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. ఎలా సమర్థిస్తారని దేవినేని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి బుగ్గన వెంటనే రాజీనామా చేయాలని ఉమా డిమాండ్ చేశారు.