మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు..!!

మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు పోలీసుల ముందు లొంగిపోయారని తెలుస్తోంది. 70 ఏళ్లు దాటిన గణపతి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. ఆ కారణం చేతనే ఆయన లొంగిపోయారని తెలుస్తోంది.   తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా సారంగాపూర్‌కు చెందిన గణపతి దాదాపు మూడు దశాబ్దాల పాటు నక్సల్‌ కార్యకలాపాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు కేంద్రకమిటీ కార్యదర్శిగా పనిచేసిన గణపతి.. 2018 చివరిలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. కాగా, దేశంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ వ్యక్తిగా జాతీయ పరిశోధన సంస్థ(ఎన్‌ఐఏ) ఆయనను ప్రకటించి, ఆయనను పట్టిచ్చిన వారికి 15 లక్షల రూపాయల రివార్డ్ ని ప్రకటించింది. మొత్తంగా ఆయనపై 36 లక్షల రివార్డ్ ఉండటం గమనార్హం.    వయోభారం, అనారోగ్యం కారణంగా కేంద్రకమిటీ కార్యదర్శి బాధ్యతల నుంచి 2018లో వైదొలిగిన గణపతి.. ఇప్పుడు పూర్తిగా లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం, ఇప్పటికే పలువురు నేతలు లొంగిపోవడం, మావోయిస్టు పార్టీ ప్రభావం కూడా రోజురోజుకి తగ్గిపోతుండం.. వంటి కారణాల చేత గణపతి లొంగిపోయారని సమాచారం. ఆయన లొంగుబాటు మావోయిస్టు పార్టీకి తీరని దెబ్బ అని, ఆయన బాటలోనే మరికొందరు నడిచే అవకాశముందని తెలుస్తోంది. 

సంక్షోభ పరిష్కర్త.. భారత రాజకీయాల్లో భీష్మాచార్యులు

విపక్షాలను సైతం మెప్పించిన నేత   ప్రణబ్ ముఖర్జీ (11 డిసెంబర్ 1935 - 31 ఆగస్టు 2020)   మాజీ రాష్ట్రపతి, సీనియర్ కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ మరణం దేశ రాజకీయాలకు తీరనిలోటు. అర శతాబ్దం పైగా దేశరాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ఆయన మూడు దశాబ్దాలకు పైగా నెహ్రు కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అనేక కీలకపదవులను ఆయన నిర్వహించారు. పార్టీలో అంతర్గత సంక్షోభాలు తలెత్తినప్పుడు వాటిని చాకచక్యంతో ఆయన సరిదిద్దేవారు. అందుకు ఆయనను సంక్షోభ పరిష్కర్త, భీష్మాచార్య అంటూ నాయకులు ప్రేమగా పిలుచుకునేవారు. ఆయన సేవలను కాంగ్రెస్ నేతలే కాదు దేశప్రజలంతా గుర్తుంచుకుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం నియమించిన కమిటీకి ఆయన నేతృత్వం వహించారు. తెలుగు రాష్ట్రల విభజనలోనూ కీలకపాత్ర పోషించారు.   ప్రణబ్ ముఖర్జీ 11 డిసెంబర్ 1935లో పశ్చిమబెంగాల్ లోని మిరాఠీ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి రాజ్యలక్ష్మి ముఖర్జీ, తండ్రి కమద కింకర ముఖర్జీ దేశ స్వాతంత్య్రపోరాటంలో కీలకపాత్ర పోషించారు. ఆయన 1952 నుంచి 1964 వరకు పశ్చిమబెంగాల్ శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు.   ప్రణబ్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో, చరిత్రలో ఎం.ఎ, ఆ తర్వాత ఎల్ఎల్ బి  పూర్తిచేశారు. కలకత్తాలోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో యుసిడిగా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత అధ్యాపకునిగా పనిచేశారు. అంతేకాదు రాజకీయాలకు రాకముందు దేషెర్ దక్ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు.   1969లోరాజకీయాల్లోకి.. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. 1969లో మిడ్నాపూర్ ఉపఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి వరకు పార్టీకి విధేయుడిగా ఉన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి నమ్మిన బంటుగా పార్టీలో పేరు తెచ్చుకున్న ఆయన 34ఏండ్ల వయసులోనే రాజ్యసభకు ఎన్నికైయ్యారు. ఆ తర్వాత 1973లో కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1975,1981,1993,1999లో వరుసగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1991లో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా పని చేసిన ప్రణబ్ ముఖర్జీ  పార్టీకి అండగా ఉన్నారు. 1998లో సోనియా పార్టీ అధ్యక్షురాలు కావడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.   2004లో తొలిసారి.. అనేక సార్లు రాజ్యసభకు నామినేట్ చేయబడిన ప్రణబ్ ముఖర్జీ 2004లో తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2012 వరకు యూపీఏ ప్రభుత్వంలో నెంబర్ 2గా గుర్తింపు పొందారు. కేంద్రంలో కీలకమైన రక్షణ, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య శాఖలు నిర్వహించిన ప్రణబ్.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందారు. పార్టీలకు అతీతంగా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకెవరూ సాటి రారని విపక్ష నేతలు సైతం ఆయన సేవలను కొనియాడతారు.   13వ రాష్ట్రపతిగా.. 2012లో జరిగిన  రాష్ట్రపతి ఎన్నికల్లో 70 శాతం ఓట్లను పొంది ప్రత్యర్థి పి.ఎ.సంగ్మాను ఓడించారు. భారత దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎన్నికయ్యారు. 25 జూలై 2017న రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. అయితే తిరిగి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచించినా ఆయన  ఆరోగ్య సమస్యలరీత్యా రాజకీయాల నుండి పదవీ విరమణ చేయాలని భావించారు. పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ సూచనలు ఇవ్వాలని అధిష్టానం కోరడంతో ఆయన పార్టీలోనే కొనసాగారు. చివరివరకు కాంగ్రెస్ పార్టీ నేతగానే ఉన్నారు.

రేపటి నుంచి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు

మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులు   ఒక్కో క్లాస్ వ్యవధి అరగంటకు మించకుండా   దూరదర్శన్ , టీశాట్ ల ద్వారా విద్యార్థులందరికీ అందుబాటులో   కరోనా కారణంగా జూన్ లో ప్రారంభం కావల్సిన విద్యాసంవత్సరం సెప్టెంబర్ నుంచైనా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే అనేక ప్రైవేట్ స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఆన్ లైన్ క్లాసులు రేపటి(సెప్టెంబర్ 1) నుంచి ప్రారంభిస్తున్నారు.    మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు దూరదర్శన్, టీశాట్ ద్వారా డిజిటల్ తరగతులను నిర్వహిస్తారు. ఈ మేరకు టైమ్ టేబుల్ ను కూడా విడుదల చేశారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులను నిర్వహిస్తారు. అయితే ఒక్కో క్లాసు వ్యవధి అరగంట ఉండాలని నిబంధనలు విధించారు. ఇక ఇంటర్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులను నిర్వహిస్తారు.    కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు నష్టపోకుండా ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నామని టీచర్లు, తల్లిదండ్రులు విద్యార్థులు క్లాసులు వినేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

సుప్రీం కోర్టు ఒక్క రూపాయి జరిమానాపై స్పందించిన ప్రశాంత్ భూషణ్ 

కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కు సుప్రీం కోర్టు ఈరోజు ఒక్క రూపాయి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. తాజాగా కొద్దిసేపటి క్రితం ఈ తీర్పు పై స్పందించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఒక్క రూపాయి లాంఛన జరిమానా చెల్లించేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. అయితే ఈ తీర్పుపై రివ్యూ కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేస్తానని కూడా ఆయన తెలిపారు. తనకు న్యాయవ్యవస్థ మీద అపార గౌరవం ఉందనీ.. అయితే తాను ట్వీట్లు పెట్టడం వెనుక సుప్రీంకోర్టును గానీ, న్యాయవ్యవస్థను గానీ అగౌరవపరిచే ఉద్దేశం తనకు ఎంత మాత్రం లేదని ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు.   సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ట్విటర్లో చేసిన ఆరోపణలపై కోర్టు ధిక్కారం కింద ప్రశాంత్ భూషణ్‌ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వచ్చేనెల 15 లోగా ఒక్క రూపాయి జరిమానా చెల్లించాలనీ.. లేని పక్షంలో మూడు నెలలు జైలు శిక్ష లేదా మూడేళ్లపాటు ప్రాక్టీస్‌పై నిషేధం తప్పదని సుప్రీంకోర్టు తన తీర్పులో హెచ్చరించింది.  

తమ వాళ్ళకే బిల్లులు క్లియర్.. వైసీపీ ప్రభుత్వం పై రఘురామకృష్ణరాజు ఫైర్ 

ఏపీలో అధికారంలో ఉన్న వైసిపికి తలనొప్పిగా తయారైన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తమ వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు రూ. 25 వేల కోట్ల వరకు బకాయి పడిందని అయన చెప్పారు. అయితే ఒక సామాజికవర్గానికి సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు చెల్లించడం లేదని అయన విమర్శించారు. కనీసం ఉపాధి హామీ పనులు చేసిన వారికి కూడా డబ్బులు చెల్లించలేదని అంతేకాకుండా కేవలం తమ బంధువులైన కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారని అయన చెప్పారు.   తమ పార్టీలో విలువలు అనేవి కేవలం మాటలకే పరిమితమయ్యాయని... అయితే విలువలు అనేవి చేతల్లో కూడా ఉండాలని అయన తమ పార్టీ నాయకులకు హితవు పలికారు. కాంట్రాక్టర్ల కష్టాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడం లేదని రఘురామరాజు అన్నారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం కలలు కంటున్న మూడు రాజధానులు అనేది కేవలం భ్రమ మాత్రమేనని అయన ఎద్దేవా చేసారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన ఆయన చాలారోజుల పాటు కోమాలో ఉండి, కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ప్రణబ్ ముఖర్జీ కొన్నివారాల కిందట మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో కొంత కాలంగా కోమాలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిశారు.   ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని చెబుతున్నానని, కొద్దిసేపటి క్రితమే తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినట్లు అభిజిత్ వెల్లడించారు. ఆసుపత్రి వైద్యులు శ్రమపడినా ఫలితం దక్కలేదని, దేశవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు నిర్వహించినా ఫలితం దక్కలేదని తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

విధినిర్వహణలో భాగంగా 500 కిలోమీటర్లు సైకిల్ పై వెళ్లిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్

నాన్సీ గ్రేస్ అగస్టా వేక్ (30 ఆగస్టు 1912- 7 ఆగస్టు 2011) పట్టుదల, విధినిర్వాహణలో అంకితభావం ఉన్నవారిని అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఒక మహిళా అధికారి తాను అందజేయాల్సిన సమాచారం  అందించడానికి ఏకంగా ఐదువందల కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించడం ఆమెకు తన వృత్తి పట్ల ఉన్న అంకిత భావానికి  తార్కణం. ఆ మహిళా అధికారి నాన్సీగ్రేస్.  రెండో ప్రపంచయుద్ధ సమయంలో స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెడల్స్ అందుకున్న ధైర్యశాలి. ఆమె జీవితచరిత్రను పుస్తకరూపంలోకి ప్రముఖ రచయతలు తీసుకువచ్చారు.   న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లోని రోసెనాథ్‌లో 30 ఆగస్టు 1912లో నాన్సీ జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఎల్లావేక్, చార్లెస్ ఆగస్టన్. ఆరుగురు పిల్లల్లో చిన్నది నాన్సీ. వారి కుటుంబం ఆస్ట్రేలియా వెళ్లి ఉత్తరసిడ్నిలో స్థిరపడింది.   సిడ్నీలోని హోస్ హోల్డ్ ఆర్ట్స్ పాఠశాలలో చదువుకున్న నాన్సీ 16ఏండ్ల వయసులోనే ఇంటి నుంచి వెళ్ళిపోయి నర్సు గా చేరారు. ఆ తర్వాత న్యూయార్క్ వెళ్ళింది. అటు నుంచి లండన్ వెళ్ళి అక్కడ జర్నలిస్టుగా ట్రైనింగ్ తీసుకున్నారు. 1930లో పారిస్ లో యూరోపియన్ కరస్పాండెంట్ గా హార్ట్స్ పత్రికలో ఆమె పనిచేశారు. పత్రికల్లో వచ్చే హిట్లర్ గురించి, నాజీ ఉద్యమం గురించి చదివి స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటీవ్ లో చేరి అనేక కార్యక్రమాల్లో శిక్షణ పొందారు. 1944లో జాన్ హింద్ ఫార్మర్ గా శిక్షణ పొందిన ఆమె ప్యారాచూట్ ద్వారా ఫ్రాన్స్ లో ప్రవేశించారు.   స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమె తాను సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించడానికి ఎంతో కష్టపడేవారు. అప్పట్లో రేడియో ద్వారా మాత్రమే సమాచారాన్ని పంపించే వీలు ఉండేది. ఒకసారి దాదాపు 500కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేసి తాను సేకరించిన సమాచారాన్ని లండన్ కు పంపించారు. ఇందుకోసం ఆమె 72గంటలు కష్టపడ్డారు. అమెకు కొంతమంది జర్మన్లు సహకారం అందించారు. యుద్ధం తర్వాత ఆఫీసర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ గా నియమించబడ్డారు. అంతేకాదు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్, యుకె దేశాల నుంచి అవార్జులు అందుకున్నారు. ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్ మ్యూజియంలో ఆమె అందుకున్న  పతకాలన్ని భద్రపరిచారు.    ఆస్ట్రేలియా ప్రముఖ రచయిత రస్సెల్ బ్రాడ్డాన్ నాన్సీ వేక్ జీవితకథ ఆధారంగా ది స్టోరీ ఆఫా ఎ వేరీబ్రేవ్ ఉమెన్ అన్న పేరుతో పుస్తకం రాశారు. ఆమె ది వైట్ మౌస్ పేరుతో బయోగ్రఫీ రాసుకున్నారు. మరో ఆస్ట్రేలియా రచయిత పీటర్ ఫిట్జ్ సిమోన్స్ ఎ బయోగ్రఫీ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ వార్ హీరోయిన్ అన్న పేరుతో పుస్తకం రాశారు. ధైర్యశాలిగా పేరుగాంచిన నాన్సీ తన 99వ ఏటా 7 ఆగస్టు 2011లో మరణించారు.

ఏపీలో రుణంపై రణం.. రంగుల కోసమేనా! అంతా మీరే చేశారు..

అమరావతిపై పోరు సాగుతుండగానే ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య అప్పులపై వార్ ముదురుతోంది. కేంద్రం ఇచ్చిన వెసులుబాటుతో జగన్ సర్కార్.. మరిన్ని అప్పులు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. దీన్నే అస్త్రంగా తీసుకుని  టీడీపీ ఎదురు దాడి చేస్తోంది. ఏడాదిలోనే లక్ష కోట్ల రుణం తీసుకున్న వైసీపీ సర్కార్.. మరిన్ని అప్పుల కోసం ప్రయత్నించడం దారుణమంటోంది టీడీపీ. జగన్ సర్కార్ అడ్డగోలు నిర్ణయాలు, విధానాలతో ఖజానాకు చిల్లు పడి ఇప్పటికే ప్రజలపై భారం పడిందని ఆరోపిస్తోంది. లక్ష కోట్లు తెచ్చి ఎక్కడ పెట్టారో చెప్పాలంటున్న టీడీపీ.. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడానికి.. తొలగించడానికే ఖర్చు చేశారని ఆరోపిస్తోంది. ఇరిగేషన్, వ్యవసాయం వంటి ముఖ్యమైన రంగాలకు నిధులే ఇవ్వని ప్రభుత్వం.. లక్ష కోట్లు ఏం చేసిందో చెప్పాలని ప్రతిపక్షం నిలదీస్తోంది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారని, జగన్ సర్కార్ విధానాలతో ఏపీకి తీరని నష్టం జరుగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.    2014లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 90 వేల కోట్ల అప్పుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2.5 లక్షల కోట్లకు రుణం పెరిగింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తూనే ఉంది. 15 నెలల కాలంలోనే లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకున్నారని టీడీపీ చెబుతోంది. తాజాగా కేంద్రం ఇచ్చిన ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు అవకాశంతో మరిన్ని అప్పులు చేసేందుకు వీలుగా చట్ట సవరణ చేసింది జగన్ సర్కార్. ఇప్పటివరకూ రాష్ట్రాలు తమ జీఎస్‌డీపీలో 3.5 శాతం మేరకు అప్పులు తెచ్చుకునేందుకు వీలుంది. కానీ కరోనా ప్రభావంతో ఆదాయం తగ్గినందున.. ఎప్‌ఆర్‌ఎం పరిమితిని పెంచుకునేందుకు కేంద్రం వీలు కల్పించింది. తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్‌ అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న 3.5 శాతం పరిమితి ఐదు శాతానికి పెరగబోతోంది. దీంతో ఏటా మరో రూ.20 వేల కోట్ల రూపాయలు అధికంగా అప్పులు తెచ్చుకునే అవకాశం ఏపీకి ఉండనుంది. అంటే వచ్చే నాలుగేళ్లలో మరో 80 వేల కోట్ల రుణం తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఇతరత్రా మార్గాల్లోనూ ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పులు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే ఇప్పుడు ఏపీలో రాజకీయ సమరానికి కారణమైంది.    జగన్ సర్కార్ చేసిన చట్ట సవరణపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రజలపై అదనపు భారం పడిందని, మరిన్ని అప్పులు చేస్తే పరిస్థితి దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విపక్ష నేతలు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం అప్పులు తెస్తే ఓకే గాని.. సొంత పబ్లిసిటీ ఈవెంట్లకు, వైసీపీ రంగులు వేయడానికి అప్పులు చేయడమేంటనీ మండిపడుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం విపక్షాల ఆరోపణలను ఖండిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం తమకు అందుబాటులో ఉన్న ఆప్షన్‌ను మాత్రమే వాడుకుంటున్నట్లు చెబుతోంది. అన్ని రాష్ట్రాల మాదిరే తాము ముందుకు వెళుతున్నామని, కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడిందని కవర్ చేసుకుంటుంది. బకాయిలు చెల్లించలేని స్థితిలో ఉన్న కేంద్రమే.. ఆర్థిక అవసరాల కోసం రాష్ట్రాలకు మరో రకంగా అవకాశం ఇచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత ఐదేండ్లలో టీడీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించడం వల్లే గడ్డు పరిస్థితి వచ్చిందని కౌంటరిస్తున్నారు. మూడున్నర లక్షల కోట్ల అప్పు చేసి.. ప్రజా ధనాన్ని దోచుకున్న టీడీపీ కూడా అప్పులపై మాట్లాడటం విడ్డూరంగా ఉందంటున్నారు వైసీపీ నేతలు. అధికార, విపక్షాల వాదనలు ఎలా ఉన్నా.. ఎడాపెడా చేస్తున్న అప్పులతో తమపై భారం పడుతుందనే ఆందోళన ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు అడ్డగోలు ఖర్చులు చేయకుండా నియంత్రణ పాటిస్తేనే ఆర్థిక కష్టాలనుంచి గట్టెక్కవచ్చని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

శ్రీశైలం పవర్ ప్లాంట్ లో ప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలి.. ప్రధానికి రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనానికి దారి తీసిన శ్రీశైలం పవర్ ప్లాంట్ లో ప్రమాదంపై సీబీఐతో పాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(CEA)తో  విచారణకు అదేశించాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. పవర్ ప్లాంట్ దుర్ఘటనలో క్రిమినల్ కోణం ఉందని వాస్తవాలు అన్నీ బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన ప్రధానికి కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదం వల్ల ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు వందల కోట్ల ఆస్తి నష్టం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుతు సరఫరా చేసే ఈ ప్లాంట్ లో ప్రమాదం జరగడం వల్ల కొందరికి లాభం జరుగుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణి, ప్లాంట్ ప్రమాదంపై వాస్తవాలు సీబీఐ విచారణ తోనే నిజాలు బయటకు వస్తాయని రేవంత్ తన లేఖలో పేర్కోన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాల కారణంగా జెన్కో ట్రాన్స్కో సంస్థలు నష్టాల్లో కూరుకపోయాయని, టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపాలని ఆయన కోరారు.   శ్రీశైలం దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ గతంలోనూ రేవంత్ ప్రధానికి లేఖ రాశారు. ప్రమాద సంకేతాలపై సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చినా వారు స్పందించ లేదని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సిబ్బంది ప్రాణాలు, వేల కోట్ల రూపాయల ప్రజా సంపద కాలి బూడిద అయ్యిందన్నారు. ఈ మొత్తం అంశంపై నిజానిజాలు బయటకు రావాలంటే.. దీనిపై నిస్పాక్షింగా విచారణ జరగాలన్నారు. సీబీఐ విచారణ జరిపించాలని.. బాధిత కుటుంబాలకు రూ. కోటి సాయం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గతంలోనూ ప్రధానికి రేవంత్ రెడ్డి లేఖ రాశారు.    అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిఐడీ విచారణలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సిబ్బంది స్పందిస్తున్నారు. శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో బ్యాటరీలు మార్చాలని రెండేళ్లుగా కోరుతున్నా కూడా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఇంజనీర్లు సిఐడీ టీమ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రమాదానికి పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అవసరమైతే సీఎం జగన్‌ ను కలుస్తా: బాలకృష్ణ

హిందూపురం అభివృద్ధి కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈరోజు హిందూపురం ప్రభుత్వాసుపత్రిని బాలకృష్ణ సందర్శించారు. ఇటీవల బాలకృష్ణ హిందూపురం ఆసుపత్రికి రూ.55 లక్షల విలువ చేసే కొవిడ్ వైద్యపరికరాలు, మందులను ప్రకటించారు. ఈరోజు ఆయన స్వయంగా వాటిని ఆసుపత్రికి అందజేశారు.   ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం విషయంలో ఎంత దూరమైన వెళతానని, దానిని జిల్లాగా ప్రకటించాలని, అవసరమైతే సీఎం జగన్‌ ను కూడా కలిసి కోరుతానని తెలిపారు.   మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కూడా ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కంటే కూడా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలపైనే దృష్టి సారిస్తున్నారని అన్నారు. రాజధాని లేకున్నా టీడీపీ హయాంలో తెలంగాణ కంటే ఏపీ ఆదాయం ఎక్కువగా ఉండేదని చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలసి పని చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. కష్ట కాలంలో పార్టీలకు అతీతంగా అందరూ కలసి పని చేయాల్సి ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు.

ఒక్క రూపాయి జరిమానా కడతారా?.. జైలుకు వెళ్తారా?

కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కు అత్యున్నత న్యాయస్థానం ఒక్క రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబర్‌ 15 లోగా కోర్టులో రూపాయి డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. డిపాజిట్‌ చేయకపోతే మూడు నెలల జైలు శిక్షతోపాటు, మూడేళ్ల పాటు ప్రాక్టీస్ పై నిషేధం ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది.    న్యాయ వ్యవస్థను, సుప్రీంకోర్టు పని తీరును విమర్శిస్తూ జూన్ 27, 29 తేదీల్లో ప్రశాంత్ భూషణ్ వివాదాస్పద ట్వీట్లు చేశారు. దేశంలో అధికారికంగా ఎమర్జెన్సీ విధించకపోయినా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, గత ఆరేళ్లలో సుప్రీం కోర్టు పోషించిన పాత్ర, నలుగురు ప్రధాన న్యాయమూర్తులు ఇందుకు బాధ్యులని ట్వీట్‌ లో పేర్కొన్నారు.   మరో ట్వీట్‌లో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే తీరుని తప్పబట్టారు. ఎలాంటి మాస్క్, హెల్మెట్‌ ధరించకుండా నాగ్‌పూర్‌ లోని రాజ్‌భవన్‌లో ఓ బీజేపీ నేతకు చెందిన రూ.50 లక్షల విలువైన బైక్‌ ని నడిపారని.. హెల్మెట్‌ లేకుండా ప్రధాన న్యాయమూర్తి ఎలా బండి నడుపుతారంటూ ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు.  ఈ ట్వీట్లను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం.. ఈ ట్వీట్లు కించపరిచే విధంగా, కోర్టు ధిక్కార స్వభావంతో ఉన్నట్లు ఆగస్టు 14న ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పింది. అయితే, సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పేందుకు గడువు ఇచ్చినప్పటికీ ప్రశాంత్ భూషణ్ అందుకు అంగీకరించలేదు. అవి తాను నిజాయితీతో వ్యక్తం చేసిన అభిప్రాయాలని, అందువల్ల తాను క్షమాపణ చెప్పబోనని ప్రశాంత్ భూషణ్ తేల్చి చెప్పారు.   ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసు వాదనల సందర్భంగా జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ పనితీరు పట్ల ప్రశాంత్ భూషణ్ జోక్యం చేసుకున్నారని తెలిపారు. వాక్ స్వాతంత్ర్యాన్ని కాదనలేం కానీ ఇతరుల హక్కులను కూడా గౌరవించాలన్నారు.   కాగా, ప్రశాంత్‌ భూషణ్‌ ఇప్పుడు ఒక్క రూపాయి జరిమానా చెల్లిస్తారా? లేక మూడు నెలల జైలు శిక్షతో పాటు, మూడేళ్ల పాటు ప్రాక్టీస్ కి దూరంగా ఉండటానికి సిద్దమవుతారా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. 

139 మంది అత్యాచారం కేసులో ట్విస్ట్.. డాలర్‌ బాయ్‌ ఒత్తిడి మేరకే వారిపై కేసులు

తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి ఫిర్యాదు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ 139 మందిలో పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఉండటంతో.. ఈ విషయం పెను సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ కేసులో ట్విస్ట్ వెలుగుచూసింది. డాలర్‌ బాయ్‌ అనే వ్యక్తి ఒత్తిడి వల్లనే తాను ప్రముఖులపై కేసులు పెట్టానని బాధిత యువతి చెప్పింది.   నిజానికి ఈ కేసు వెలుగులోకి రాగానే ఈ కేసుపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. బాధిత యువతిని కొంత మంది తప్పుదోవ పట్టిస్తున్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, ఈ కేసులో పలువురి ప్రముఖుల పేర్లు వినిపించడంతో.. వారిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కేసుకి తమకి సంబంధం లేదని, కావాలనే మా పేర్లు ఇరికించారని ప్రముఖులు చెప్పుకొచ్చారు. అంతేకాదు, డబ్బులు డిమాండ్ చేస్తూ మాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, పోలీసులు తమకి న్యాయం చేయాలని కోరారు. దీంతో ఈ కేసు మలుపు తిరిగి, డాలర్‌ బాయ్‌ అనే పేరు తెరమీదకి వచ్చింది. ఈ డాలర్‌ బాయ్‌ అనే వ్యక్తి యువతిని ట్రాప్ చేసి, ప్రముఖుల నుండి డబ్బులు గుంజడం కోసం ఇదంతా చేపిస్తున్నాడన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆ అనుమానాలే నిజమయ్యాయి. బాధిత యువతి ఆ డాలర్‌ బాయ్‌ బండారం బయట పెట్టింది.   బాధితురాలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. "డాలర్‌ బాయ్‌ ఒత్తిడి మేరకే కొందరి పేర్లు పెట్టాల్సి వచ్చింది. నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించాడు. చిత్ర హింసలకు గురి చేశాడు. నాలా మరో ఇద్దరిని కూడా ట్రాప్ చేశాడు. నాపై లైంగికదాడి జరిగింది వాస్తవమే. కానీ సెలబ్రిటీలు లేరు. నేను బయట 50 శాతం వేధింపులకు గురైతే, 50 శాతం డాలర్ బాయ్ వేధించాడు. అనవసరంగా నా వల్ల ఇబ్బంది పడ్డవారికి క్షమాపణలు చెబుతున్నా." అని చెప్పుకొచ్చింది.   కాగా, డాలర్‌ బాయ్‌ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అతని వల్ల బాధితురాలికి జరిగిన అన్యాయం తప్పుదోవ పట్టడంతో పాటు, పలువురు ప్రముఖులు, వారి కుటుంబసభ్యులు మానసిక వేదనికి గురయ్యారు. అంతేకాదు, మరో ఇద్దరు యువతులను కూడా అతను ట్రాప్ చేశాడని తెలుస్తోంది. ఇలాంటి వారి మూలంగా భవిష్యత్ లో ఎవరైనా తమకి అన్యాయం జరిగిందని చెప్పాలన్నా భయపడే పరిస్థితి నెలకొందని, కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి.

కరోనాపై గెలిచిన టీడీపీ నేత అచ్చెన్న.. త్వరలోనే డిశ్చార్జ్  

మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే అచ్చెనాయుడు కరోనా కోరల బారినుండి బయటపడ్డారు. తాజాగా ఆయనకు చేసిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ గా తేలింది. కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా బారినపడగా ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరితగతిన కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు. తాజాగా వచ్చిన ఈ రిపోర్ట్ తో ఇటు టీడీపీ శ్రేణులు అటు ఆయన కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన ఈరోజు.. రేపట్లోగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడికి శుక్రవారం నాడు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళవద్దని కూడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 70 రోజుల పాటు అచ్చెన్నాయుడు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

గాలిపటంతో పాటు గాలిలోకి చిన్నారి

తైవావ్ పతంగుల పండుగలో ఊహించని సంఘటన జరిగింది. ఆ సంఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మూడేళ్ల చిన్నారి గాలిపటంతో సహా ఆకాశంలోకి ఎగిరి కొన్ని క్షణాల పాటు చెక్కర్లు కొట్టి కిందికి రావడం ఆశ్యర్యాన్ని కలిగించింది.   ప్రతి ఏటా జపాన్ లోని సముద్రతీర పట్టణమైన నాన్లియోవోలో పతంగుల పండుగ జరుగుంది. వివిధ ఆకారాల్లో, సైజుల్లో ఇక్కడ గాలిపటాలను ఎగురువేస్తారు. చిన్నాపెద్దా అంతా సంతోషంగా గాలిపటాలు ఎగురువేస్తున్న సమయంలో మూడేళ్ల చిన్నారి గాలిపటంతో సహా గాలిలోకి ఎగిరింది. అమాంతం గాలిలోకి కొన్ని మీటర్ల ఎత్తువరకు ఎగిరిన ఆ చిన్నారి గాలిపటంతో సహా కొద్ది క్షణల పాటు గాలిలోనే చెక్కర్లు కొట్టింది. అంతా నివ్వెరపోయి చూస్తుండగానే గాలిపటాన్ని గట్టిగా పట్టుకుని ఆ చిన్నారి వేసిన కేకలతో అందరూ అప్రమత్తం అయ్యారు. నారింజ రంగు గాలిపటం చివరన వేలాడుతూ గాలిలో మెలికలు తిరిగిన ఆ దృశ్యాన్ని వీడియోలో రికార్డు అయ్యింది. అక్కడ ఉన్నవారికి అందనంత ఎత్తుకు ఎగిరిన గాలి పటం గాలివాటానికి తిరిగి నేలపైకి రావడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది.    గాలి పటం తోక చిన్నారికి చుట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ పాపాయికి ఎలాంటి గాయలు తగలలేదని, అయితే చాలా భయపడిందని నిర్వాకులు వెల్లడించారు. ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గాలిపటాలు ఎరుగవేసే సమయంలో వాటికి దూరంగా ఉండాలని ఈ సంఘటన తర్వాత కైట్ ఫెస్టివల్ నిర్వాహకులు హెచ్చరికలు జారీ చేశారు.

అమిత్ షా ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్

కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత అనారోగ్యంతో మళ్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా ఆసుపత్రి నుంచి ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు.   ఆగస్టు 2న అమిత్ షా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరి 12రోజుల చికిత్స తర్వాత ఆగస్టు 14న డిశ్చార్జి అయ్యారు. అయితే నాలుగురోజుల తర్వాత తిరిగి అనారోగ్యం బారిన పడటంతో ఆగస్టు 18న ఎయిమ్స్(ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ )లో చేరారు. అత్యంత నిపుణులైన వైద్యబృందం ఆధ్వర్యంలో చికిత్స తీసుకున్న తర్వాత ఆయన కోలుకున్నారు.  కరోనా నుంచి కోలుకున్న తర్వాత తిరిగి అనారోగ్యంబారిన పడటంతో ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

కేసీఆర్ అవినీతి పై కేంద్రం కన్ను.. త్వరలోనే జైలుకి: సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్ 

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. కేసీఆర్ సర్కార్ హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రంజాన్ సమయంలో కరోనా పాజిటివ్ కేసులను తగ్గించి చూపించిన సర్కార్.. హిందువుల పండగైన గణేశ్ ఉత్సవాల సందర్భంగా కేసులు పెరిగాయని చెప్పడం హిందూ సమాజం పై చేస్తున్న కుట్ర అని ఆయన అన్నారు. గడచిన మూడు రోజులుగా వినాయక నిమజ్జనాలను కూడా అడ్డుకుంటున్నారని అయన విమర్శించారు. కేసీఆర్ సర్కార్ రంజాన్ సందర్భంగా కేసులను తగ్గించి చూపే ప్రయత్నం చేసి... ఇప్పుడు గణేశ్ నవరాత్రుల సందర్భంగా కేసులను పెంచి చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.   అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అక్రమాలు, అవినీతికి పాల్పడిందని.. అందులో భాగంగా ప్రాజెక్టుల అంచనాలను పెంచుతూ, కమీషన్లు తీసుకుంటూ కేసీఆర్ కుటుంబం, అక్రమాలకు తెగబడుతూ బడా కంపెనీలకు దాసోహమైందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సీఎం కేసీఆర్ పాల్పడుతున్న అవినీతిపై కేంద్రం ఒక కన్ను వేసిందని, వారి ఆర్ధిక లావాదేవీలన్నిటిని ఎప్పటికప్పుడు గమనిస్తోందని.. త్వరలోనే కేసీఆర్ జైలుకెళ్ళటం కూడా ఖాయమని బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేసారు.    అంతేకాకుండా కరోనా మహమ్మారి కట్టడిలో కేసీఆర్ పభ్రుత్వం పూర్తిగా విఫలమై చేతులెత్తేసిందని, దీంతో పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇదే విషయాన్నీ గవర్నర్‌ ప్రస్తావించగా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆమెను విమర్శించే స్థాయికి టీఆర్‌ఎస్‌ నాయకత్వం దిగజారిందని సంజయ్ విమర్శించారు. కరోనా విషయమై ఇప్పటికే పలు సందర్భాల్లో గవర్నర్‌ లేఖలు రాసినప్పటికీ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను తెలంగాణ సర్కార్ విస్మరించడం వల్ల అనేక రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయన అన్నారు. నిరుద్యోగ భృతిని తెలంగాణ సర్కార్ పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వడంలేదని, కేంద్రం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌ల్లో కేసీఆర్‌ మాట్లాడేది ఒకటైతే.. తర్వాత కేంద్రం మెచ్చుకుందని చెప్పుకుంటూ రాష్ట్ర మంత్రులు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని.. ఎందుకిలా చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.

సౌత్ చైనా సముద్రంలో భారత్ యుద్ధనౌక

నోటితో నవ్వి నొసలుతో వెక్కిరించే తత్వం డ్రాగన్ కంట్రీ సొంతం. దశాబ్దాలుగా ఇదే తీరును అవలంభిస్తూ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతుంది. గత కొద్దినెలలుగా భారత్ చైనా సరిహద్దుల్లో దాగుడుమూతలు ఆడుతూ యుద్ధానికి సిద్ధం అన్న సంకేతాలను పంపుతోంది. అయితే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత్ ఈసారి చైనా ఆటలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. శాంతిని కాంక్షిస్తూ యుద్ధవాతావరణాన్ని చల్లపరిచేందుకు చైనా అధికారులతో భారత్ జరుపుతున్న ద్వైపాక్షిక చర్చలు సరైన ఫలితాలను ఇవ్వడంలేదు. చర్చలు ఫలవంతం కాకుంటే పరిస్థితులు మరోవిధంగా ఉంటాయని ఇప్పటికే భారత్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.    చైనాతో యుద్ధం అంటూ వస్తే ఈ సారి గట్టి గుణపాఠమే చెప్పాలన్న లక్ష్యంతో భారత్ సైన్యం ఉంది. ఇందులోభాగంగానే భారతవైమానిక దళంలో అత్యంత శక్తివంతమైన రాఫెల్ లాంటి యుద్ధవిమానాలను చేర్చుతోంది. మరోవైపు నౌకాదళాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్లుతోంది. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం సాధించాలన్న చైనా ప్రయత్నాలను పసికట్టి డ్రాగన్ కంట్రీ ఎత్తులకు భారత్ పై ఎత్తు వేసింది. దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకను పంపింది. అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని మలక్కా జలసంధి సమీపంలో ఈ యుద్ధనౌక మోహరించింది. భారత్ కు మద్దతుగా దక్షిణ చైనా సముద్రంలో అమెరికా కూడా తన యుద్ధనౌకలను మోహరించింది. కొద్దిరోజుల కిందటే ఇక్కడ అమెరికా, భారత్ కలిసి నావికా దళ విన్యాసాలను నిర్వహించాయి.    అయితే దక్షిణ చైనా సముద్రంలో ద్వీపాలను కృత్రిమంగా ఏర్పాటుచేసిన చైనా లిబరేషన్ ఆర్మీ భారత్,  అమెరికా యుద్ధనౌకలు రావడాన్ని వ్యతిరేకిస్తోంది.

కరోనా రోగుల్లో అకస్మిక మరణాలను నివారిస్తున్న మందు

కోవిద్ 19 వైరస్ ను అరికట్టడమే ప్రస్తుతం ప్రపంచమానవాళి ముందున్న అతి పెద్దసవాల్ గా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న వ్యాప్తిని నివారించడంతో పాటు కోవిద్ సోకినవారిలో అకస్మిక మరణాలను నివారించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు వైద్య పరిశోధకులు. ఈ నేపథ్యంలో కరోనా సోకినవారిలో రక్తం గడ్డకడ్డడం, రక్తనాళాల్లో వచ్చే వాపు కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని గుర్తించారు. దీన్ని నివారించేందుకు సాధారణ వ్యక్తుల్లో రక్తం గడ్డకట్టినప్పుడు రక్తనాళాల్లో రక్తప్రసారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా రక్తాన్ని పలుచగా చేసేందుకు ఇచ్చే ఔషధాన్ని కోవిద్ రోగులకు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటున్నాయి అని వైద్యలు అంటున్నారు. రక్తాన్ని పలుచన చేసే ఎల్ఎమ్ డబ్ల్యూహెచ్(లో మాలిక్యూలర్ వెయిట్ హెపారిన్) మందును కరోనా రోగులకు ఇస్తున్నారు. ఇది అకస్మిక మరణాలను నివారిస్తోందని గుర్తించారు. చర్మం కిందిపొరలకు ఇచ్చే ఇంజెక్షన్ ద్వారా ఈ మందుకు రోగి శరీరంలోకి పంపిస్తారు. ఇప్పటివరకు కోవిద్ వైరస్ సోకిన వారిలో దాదాపు 90శాతం అసక్మిక మరణాలను ఈ మందు నివారించిందని వైద్యలు వెల్లడించారు.   ఊపిరితిత్తులపై ప్రభావం చూసే కోవిద్ వైరస్ రక్తనాళాల్లో వాపు, రక్తం గడ్డకట్టడం వంటి ప్రమాదాలకు కూడా కారణం అవుతోంది. దాంతో కరోనా రోగుల్లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని నివారించడానికి కరోనా రోగులకు చికిత్సలో భాగంగా ప్రొఫైలాక్టిక్ థెరపీలో దేశవ్యాప్తంగా ఎల్ఎమ్ డబ్ల్యూహెచ్ మందును ఉపయోగిస్తున్నారు. ఈ ఔషధం ఉపయోగించడం వల్ల  రికవరీ రేటు ఎక్కువగా ఉంటుందని వైద్యలు అంటున్నారు. కరోనా వచ్చిందని  భయపడకుండా చికిత్స చేయించుకుంటే చాలావరకు నయం అవుతుంది.

దీపావళి నాటికి అదుపులోకి కరోనా.. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చల్లని కబురు

కరోనా తో భారత్ అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. భారత్ లో గడచిన 24 గంటలలో 78,761 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ విషయం పై మాట్లాడుతూ కరోనా వైరస్ మనకెన్నో కొత్త విషయాలు నేర్పిందని అన్నారు. ఈ వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఉండాలంటే మ‌న జీవన‌శైలిలో వివిధ‌ మార్పులు చేసుకుంటూ, తగిన జాగ్ర‌త్త‌ల‌తో ప్రజలు మెలగాలని అన్నారు.    అనంత్‌కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషన్ ఫస్ట్’ వెబినార్ ‌లో మంత్రి మాట్లాడుతూ రాబోయే దీపావళి నాటికి వైర‌స్ వ్యాప్తిని కొంత‌వ‌ర‌కూ అదుపులోకి తీసుకురాగ‌లుగుతామ‌ని ఆశాభావం వ్యక్తం చేసారు. అలాగే, ఈ ఏడాది చివరి నాటికి కరోనాను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ కూడా రెడీ అవుతుందన్నారు. డాక్ట‌ర్ దేవీ ప్ర‌సాద్ శెట్టి, డాక్ట‌ర్ సీ ఎన్ మంజునాథ్ త‌దిత‌ర నిపుణులు తెలిపిన విధంగా కొంతకాలం త‌రువాత కరోనా కూడా మిగిలిన వైర‌స్‌ల మాదిరిగానే ఒక సాధరణ స‌మ‌స్య‌గా మిగిలిపోతుంద‌ని అయన అన్నారు.