షాకింగ్ న్యూస్.. హైదరాబాద్ మురుగు నీటిలో కరోనా..
posted on Aug 19, 2020 @ 6:41PM
ఏది పట్టుకోవాలన్నా.. ఏది ముట్టుకోవాలన్నా ఎక్కడ కరోనా సోకుతుందో అని భయపడి ప్రజలు కనీసం అడుగు బయట పెట్టని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో బయటి ఫుడ్ కూడా ఎవాయిడ్ చేసి ఇంటి భోజనం తో జనం సరిపెట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగర ప్రజలకు సీసీఎంబీ మరో చేదు వార్త తెలిపింది. నగరంలోని మురుగు నీటి ట్రీట్ మెంట్ ప్లాంట్ల వద్ద నుండి సేకరించిన నీటిలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించామని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు.
కరోనా సోకినా ప్రతి మనిషిలో కూడా 35 రోజుల వరకు వైరస్ ఉండే అవకాశం ఉందని, ఇది మల మూత్ర విసర్జన ద్వారా మురుగునీటిలో కరోనా వైరస్ ఉండవచ్చని రాకేష్ మిశ్రా తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో కరోనా కేసులు బయటపడనప్పటికీ.. అక్కడ ఇన్ఫెక్షన్ బారిన పడినవారు ఉండవచ్చని అన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 2 లక్షల మంది విసర్జితాలలో వైరస్ విడుదలైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధన ప్రకారం అసలు లక్షణాలు లేకుండానే కరోనా వచ్చి హాస్పిటల్ లో చేరకుండానే తగ్గిపోతున్న వారి సంఖ్య కూడా ఏమి తక్కువ కాదని అందువల్లనే మన దగ్గర వైద్య సదుపాయాలు తక్కువగ్గా ఉన్న కూడా కరోనా తో నెట్టుకు రాగలుగుతున్నామని తేల్చింది. దీంతో ఇన్నాళ్లు కేవలం దగ్గు, తుమ్ములు, తుంపర్ల ద్వారానే కరోనా వ్యాపిస్తుందని తేలగా ఇప్పుడు మల, మూత్ర విసర్జన ద్వారా కూడా వస్తుందని సీసీఎంబీ తన తాజా పరిశోధన ద్వారా షాకింగ్ న్యూస్ తెలిపింది. దీంతో నగరంలో ప్రవహించే నాలాల్లోని మురుగు నీటి ద్వారా కూడా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని తాజాగా హెచ్చరించింది. సీసీఎంబీ, ఐఐసిటీ కలిసి చేసిన పరిశోదనల్లో ఈ విషయం తేలినట్లు అధికారికంగా ప్రకటించారు.