అన్నికేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష
posted on Aug 20, 2020 @ 10:00AM
నిరుద్యోగులకు శుభవార్త
నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు
ఆన్ లైన్ పరీక్షలు, మూడేండ్ల వరకు స్కోర్ కార్డ్ వాలిడిటీ
నిరుద్యోగ యువతకు అదనపు ఖర్చు, శ్రమ తగ్గించే ప్రయత్నం
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై బ్యాంక్ ఉద్యోగం కోసం ఒక పరీక్ష, రైల్వే జాబ్ కోసం మరో పరీక్ష ఇలా అనేక రకాల ఉద్యోగాల కోసం రకరకాల పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. రెండు వేరువేరు ఉద్యోగాల పరీక్షలు ఒకే రోజు ఉన్నాయంటూ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఏదో ఒక జాబ్ సాధించాలన్న పట్టుదలతో అనేక పరీక్షలకు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని నాన్ గెజిటెడ్ పోస్టులు, పబ్లిక్ సెక్టార్ లోని బ్యాంక్ ఉద్యోగాలు దాదాపు ప్రతి ఏటా భర్తీ చేసే లక్షా25వేల ఉద్యోగాల ను ఒకే పరీక్ష ద్వారా నియామాలు చేసేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు వీలుగా నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీని ఏర్పాటుచేశారు. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ మూడేండ్ల వరకు వర్తిస్తుంది. దేశంలోని దాదాపు 20 సంస్థల్లోని ఉద్యోగాలు ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు.
ఊరికి దగ్గరలో, నచ్చిన భాషలో
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాయాలంటే రాష్ట్ర రాజధాని, ముఖ్యపట్టణాల్లోనే రాయాల్సి ఉంటుంది. ఇది గ్రామీణ నిరుద్యోగ యువతకు ఖర్చు, శ్రమతో కూడిన అంశం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు. గ్రామీణ యువతకు అవకాశాలు మెండుగా కల్పించేలా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను వారికి దగ్గరలో ఉండే సెంటర్ నే పరీక్ష రాయడానికి ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాదు తమకు నచ్చిన భాషలో రాసుకునే వీలు కల్పిస్తున్నారు. ఈ నిర్ణయం గ్రామీణయువతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల దిశగా నడిపించేలా ఉంది.
1517కోట్ల కేటాయింపు
నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) ఏర్పాటుకూ ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ ఇందుకోసం 1517.57కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. ఢిల్లీలో ఈ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఉంటుంది. సెక్రటరీ స్థాయి అధికారి ఏజెన్సీకి చైర్ పర్సన్ గా ఉంటారు. ఈ ఏజెన్సీ నిర్వాణకు మూడేండ్లకు 1517.57 కోట్ల రూపాయలను కేటాయించారు. దేశంలో ప్రతి ఏటా భర్తీ చేసే 1.25 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2.50కోట్లమంది ప్రతిఏటా పోటీ పడుతున్నారు. ఇకపై ఈ ఏజెన్సీ ద్వారానే 1.25లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా మొదటిదశలో వెయ్యి పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేస్తారు. గ్రామీణ ప్రాంత యువతకు అందుబాటులో ఉండేలా జిల్లాల్లోనూ పరీక్ష కేంద్రాల కోసం మౌలికసదుపాయాలు కల్పిస్తారు.