గోదావరి మధ్యలో చిక్కుకు పోయిన టీడీపీ ఎమ్మెల్యే...
posted on Aug 19, 2020 @ 6:51PM
గోదావరిలో వరద ఉధృతి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో గోదావరి జిల్లాలలో పలు గ్రామాలు, లంకలు నీట మునిగాయి. తాజాగా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పడవలో బాడవ గ్రామానికి వెళ్లి వస్తుండగా మధ్యలో సాంకేతిక లోపం తలెత్తి మర పడవ గోదావరిలో యలమంచిలి మండలం చించినాడ వద్ద గోదావరిలో నిలిచిపోయింది. అంతేకాకుండా నదిలో ఉధృతికి పడవ కొంతదూరం కొట్టుకుపోయిందని సమాచారం.
మంగళవారం కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, యలమంచిలి లంక, బాడవ గ్రామాలు గోదావరి వరదతో పూర్తిగా జలదిగ్భంధం అయ్యాయి. ఈ గ్రామాల్లో ప్రజలు పూర్తిగా పడవలపై రాకపోకలు సాగించే పరిస్థితి నెలకొంది. దాదాపు 1733 ఇళ్లు వరద నీటిలో ఉన్నాయని తహసీల్దార్ ఎల్.నరసింహారావు తెలిపారు. దీంతో ముంపుకు గురైన ఈ లంక గ్రామాల్లో పర్యటించేందుకు ఎమ్మెల్యే వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం.