ఏపీలో కర్రీ పాయింట్లకు కూడా తప్పని పన్ను పోటు.. సంక్షేమ పథకాల కోసమేనట
కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం కోసం కొత్త కొత్త దారులు వెతుకుతున్నాయి. దీని కోసం ఒక పక్క కరోనా వ్యాప్తి కొనసాగుతుండగానే వైన్ షాపులు ఓపెన్ చేసి రెండు తెలుగు రాష్ట్రాలు కొంత వరకు ఆదాయాన్ని పెంచుకున్నాయి. ఇపుడు తాజాగా ఏపీలోని జగన్ సర్కార్ వృత్తి పన్ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు కొన్ని సవరణలు చేస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే దిశగా కొన్ని కేటగిరీలకు వృత్తి పన్నును పెంచుతూ ప్రభుత్వం ఈ సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. సినిమా నిర్మాతపై పన్ను విధించడమే కాక ఆ నిర్మాత తీసే సినిమాలో జూనియర్ ఆర్టిస్టులపైనా అదే పన్ను.. డ్యాన్సర్లపైనా పన్ను.. కూరలు విక్రయించే వీధుల్లోని కర్రీ పాయింట్లపైనా పన్ను. ఆర్థిక పరమైన కష్టాలతో అప్పుల వేట కొనసాగిస్తున్న ఏపీలోని జగన్ సర్కారు "సంక్షేమ పథకాల అమలు కోసం నిధులు కావాలి" అని స్పష్టంగా చెబుతూ కొత్త పన్నులు విధించింది. తాజాగా వృత్తి పన్ను విధింపును క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు పన్ను వసూలుకు పకడ్బందీగా నిబంధనలు రూపొందిస్తూ మరో జీవోను కూడా జారీ చేసింది. దీంతోపాటు వృత్తి పన్ను చెల్లిస్తేనే లైసెన్సులు, రెన్యువల్స్, ఇతర అనుమతులు ఇవ్వాలంటూ సంబంధిత శాఖలన్నింటినీ ఆదేశించింది. నిర్మాత నుంచి జూనియర్ ఆర్టిస్టు దాకా సినిమా, టీవీ పరిశ్రమకు సంబంధించిన వారెవరినీ వదలకుండా అందరిపైనా ఒకే రీతిలో రూ.2500 వృత్తి పన్ను విధించారు. ప్రొడ్యూసర్లు, డిస్ర్టిబ్యూటర్లు, డైరెక్టర్లు, సినిమాటోగ్రఫీ ఫిల్మ్ ప్రాసెసర్లు, ఫొటోగ్రఫీ డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు, గీత రచయితలు, నటులు, కథా రచయితలు, గాయకులు, రికార్డిస్టులు, ఎడిటర్లు, ఔట్‌డోర్ ఫిల్మ్ యూనిట్లు, అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్లు, కెమెరామెన్లు, స్టిల్ ఫొటోగ్రాఫర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ కెమెరామెన్లు, అసిస్టెంట్ రికార్డిస్టులు, అసిస్టెంట్ ఎడిటర్లు, డ్యాన్సర్లు ఇలా ఎవ్వరిని వదలకుండా ప్రతి ఒక్కరూ రూ.2,500 వృత్తిపన్ను చెల్లించాలని ఆ జీవోలో పేర్కొన్నారు.
జిల్లా, రాష్ట్ర స్థాయి సహకార సంఘాలకు రూ.2500 వృత్తి పన్నును విధించింది. వీడియో లైబ్రరీ, వే బ్రిడ్జి ఆపరేటర్లకు రూ.2500 మేర వృత్తి పన్నువిధించింది. వృత్తి పన్ను చెల్లింపుదారుల జాబితాలోకి కొత్తగా కర్రీ పాయింట్లను కూడా చేర్చారు. క్యాంటీన్లు, రెస్టారెంట్లు, టేక్ అవే ఫుడ్ పాయింట్ల సరసన కర్రీ పాయింట్లను కూడా చేర్చి ఏడాదికి రూ.2500 వృత్తి పన్ను చెల్లించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఏదైనా సంస్థ నుంచి రెమ్యునరేషన్ పొందుతున్న వారూ పన్ను చెల్లించాలని జీవోలో పేర్కొన్నారు. అయితే పబ్లిక్ టెలిఫోన్ ఆపరేటర్లను వృత్తి పన్ను నుంచి మినహాయించింది. రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో పాటు వృత్తి పన్ను వసూళ్లు కూడా పడిపోవడంతో ఈ సవరణలు చేసినట్టు ఆ జీవోలో పేర్కొంది.
గతంలో ఈ పన్ను వసూళ్ల బాధ్యతను కేవలం వాణిజ్య పన్నుల శాఖ ఒక్కటే చూసుకునేది. అయితే తాజాగా వృత్తి పన్ను వసూలు బాధ్యతను కూడా 18 శాఖలకు అప్పగించారు. ఇప్పుడు సంబంధిత రంగాలను పర్యవేక్షించే శాఖలకే అప్పగించి, వృత్తి పన్ను కడితేనే అనుమతులు ఇవ్వాలని తాజాగా ఆదేశించారు. ఓవైపు ప్రతి నెలా ఆదాయం తగ్గుతున్నప్పటికీ రైతు భరోసా, వాహనమిత్ర, అమ్మ ఒడి, నాడు నేడు, టెలీ మెడిసిన్, మహిళలకు సున్నా వడ్డీ రుణాల పథకాల వంటివి అనేకం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటికి భారీస్థాయిలో నిధులు అవసరం అవుతున్నందున వృత్తి పన్ను రేట్లు సవరించడం తప్పనిసరైందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.