అప్పట్లో చంద్రబాబు నా ఫోన్ ట్యాప్ చేయించిన ఆధారం ఇదిగో.. టీడీపీకి సజ్జల కౌంటర్
posted on Aug 20, 2020 @ 9:56AM
ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అటు న్యాయమూర్తుల ఫోన్లు ఇటు విపక్ష నేతల ఫోన్లు కూడా వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ నేతలు అంటున్నారు.
తాజాగా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు తన ఫోన్ ను ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారం ఇదిగో అంటూ ఒక ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు. ఇదే ఆధారాన్ని తాము కోర్టులకు కూడా సమర్పించామని అయన చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని గగ్గోలు పెడుతున్న చంద్రబాబు ఇలాంటి ఆధారాలు ఎందుకు చూపించడం లేదని అయన ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వ టైంలో తన ఫోన్ ట్యాప్ జరిగిందని వైసీపీ నేత సజ్జల చేసిన ఈ ఆరోపణలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.