పేరుకు పేదల పథకం... కానీ వైసీపీ పెద్దలకు దోచిపెట్టే పథకంలా మారింది
posted on Aug 20, 2020 @ 10:57AM
పేదలకు ఇళ్ల స్థలాల పథకం పేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ భూముల కొనుగోలుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశానని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
"పేరుకు పేదలకు ఇళ్ళస్థలాల పథకం... కానీ అది వైసీపీ పెద్దలకు దోచిపెట్టే పథకంలా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో నివాసయోగ్యం కాని ముంపు ప్రాంతాలను... ఎకరా రూ.5 లక్షలు చేయని ఆవభూములను ఎకరా రూ.45 లక్షలకు ప్రభుత్వంతో కొనిపించి వైసీపీ నేతలు తమ కమీషన్లను కోట్లలో దండుకున్నారు." అని చంద్రబాబు విమర్శించారు.
"ఇలాంటి స్కామ్ లు రాష్ట్రమంతా చోటు చేసుకున్నాయి. ఈ పథకం పేదల కోసమా? ప్రజాధనాన్ని పార్టీ నేతలకు దోచిపెట్టే పథకమా? అందుకే ఈ భూముల కొనుగోలు పై సమగ్ర దర్యాప్తు జరిపించి, ప్రజాధనాన్ని కాపాడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసాను" అని చంద్రబాబు తెలిపారు.
కాగా, పేదలకు ఇళ్ల స్థలాల పథకం మొదటి నుండి విమర్శలకు వేదికైంది. వివాదాస్పద స్థలాలను, ముంపు ప్రాంతాలను, విలువ లేని స్థలాలను ఎంపిక చేసి కొందరు పెద్దలు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఆవ భూములు నివాస యోగ్యం కాదని హెచ్చరించినా, ఆ నివేదికను పక్కన పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని.. టీడీపీ, బీజీపీ సహా ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం మౌనం వహించటం విమర్శలకు దారి తీస్తోంది.