ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నోటీసులు
posted on Aug 19, 2020 @ 6:00PM
సామాగ్రి అపహరణ కేసులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి, గుంటూరు అర్బన్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శంకర్ విలాస్ సెంటర్‌లోని డీబీ ఫ్యాషన్ పై కొందరు దౌర్జన్యం చేసి.. తాళాలు పగలగొట్టి రూ. కోటీ యాభై లక్షల విలువ చేసే సామాగ్రిని అపహరించారు. దీనిపై బాధితులు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు పట్టించుకోలేదు. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఎస్పీ కూడా స్పందించలేదు.
అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో బాధితుడు కొప్పురావూరి శివ ప్రసాద్ చివరికి హైకోర్టును ఆశ్రయించాడు. తన షాపులో సామాగ్రిని అపహరించిన వారికి ఎమ్మెల్యే మద్దాలి గిరి మద్దతు ఉందని, ఎమ్మెల్యే వత్తిడి కారణంగానే పోలీసులు మౌనం వహిస్తున్నారని బాధితుడు శివ ప్రసాద్ తన పిటిషన్ లో ఆరోపించాడు. తన షాపును వారు ఆక్రమించుకునేందుకు చూస్తున్నారని, అందులో భాగంగానే తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం ఎమ్మెల్యే మద్దాలి గిరితో సహా పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి నోటీసులు జారీ చేసింది.