ఫోటో జర్నలిస్టులను ఆదుకోవాలి: బండి సంజయ్ కుమార్
posted on Aug 19, 2020 @ 4:23PM
వంద పదాలు వర్ణించలేని భావాన్ని ఒక ఛాయాచిత్రం వర్ణింపజేస్తుంది. అంతటి అపురూప, మహోన్నతమైన కళ ఫొటోగ్రఫీ. ఓ ఫోటోను ఆకట్టుకునే విధంగా ఫ్రేంలో బంధించాలంటే ఆ ఫోటోగ్రాఫర్ ఎంతో సృజనాత్మకతను జోడించాలి. అటువంటి ఫోటోగ్రాఫర్లందరికి హ్యాట్సాఫ్. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్ లకు పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
విషాద సంఘటనలే కాదు.. ఆహ్లాదకరమైన దృశ్యాలను అందించి.. మనస్సులను రంజింప చేసి శక్తి ఫోటోకు ఉంది. మనస్సులను తుళ్లిపడేలా చేసి..మైమరిచేలా చేసే ఫోటోలు కూడా అనేకం ఉన్నాయి. అంతట ఔచిత్యం ఉన్న ఫోటోగ్రఫీ నేడు సాంకేతికతను అద్దుకుని మరింత కొత్తగా ముందుకు సాగిపోతోంది అంటూ అంతర్జాతీయ ఫొటోగ్రఫీ సందర్భంగా ఆయన ఫొట్రోగ్రఫిలో వస్తున్న ఆధునికతను ప్రస్తావించారు.
సమాజ అభివృద్ధిలో ఫొటో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిది. పత్రికా రంగంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమైంది. ఒక ఫొటో ద్వారా వార్తా విషయం మొత్తాన్ని తెలియజేయడంలోనే ఫొటోగ్రాఫర్ల ప్రావీణ్యం దాగుంది. ప్రస్తుతం మనమందరం ఎదుర్కొంటున్న కరోనాపై చేస్తున్న యుద్ధంలో ఫొటో జర్నలిస్టులు కూడా ముందు వరుసలో ఉన్నారు. అనుక్షణం ప్రజలకు సమాచారం అందించడమే లక్ష్యంగా వీడియో జర్నలిస్టులు పనిచేస్తున్నారు. వారందరి సేవలకు ధన్యవాదాలు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఫొటో జర్నలిస్టును పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి డబుల్‌బెడ్రూంల కేటాయింపులు జరగకపోవడం శోచనీయమన్నారు సంజయ్. జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఆ హామీని నిలబెట్టుకోకపోవడం జర్నలిస్టులను విస్మరించడమే అన్నారు. కరోనా వార్తల సేకరణలో ఫొటో జర్నిలిస్టులు, జర్నలిస్టుల ప్రాణాలకు తెగించి వార్తలను అందిస్తున్నారు, వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారితో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. శుభకార్యాలు నిలిచి ఫొటోగ్రాఫర్లకు ఉపాధి లేక, పెట్టిన పెట్టుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, కెమెరాలకు ఈఎంఐలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఫొటోగ్రాఫర్లను ప్రభుత్వం గుర్తించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.