వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ 10 వేల సాయం.. కేసీఆర్ ప్రకటన

వరద ముంపు బాధిత కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సాయం ప్రకటించారు. హైదరాబాద్‌ లో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల సాయం చేయనున్నట్లు వెల్లడించారు. రేపు ఉదయం నుంచే ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు.    హైదరాబాదులో భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలతో హైదరాబాద్‌ ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం కురిసిందని అన్నారు. బస్తీ, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడ్డారని విచారం వ్యక్తం చేశారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాదులో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ.1 లక్ష ఇవ్వనున్నట్లు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేల చొప్పున సాయం చేయనున్నట్లు ప్రకటించారు.    దెబ్బతిన్న రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తామన్నారు. మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. పేదలకు సాయం అదించడం కోసం మున్సిపల్‌ శాఖకు రూ.550 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.సీఎం రీలీఫ్ ఫండ్ కు విరివిగా విరాళాలు అందించాలని కేసీఆర్ కోరారు.   కాగా, వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్ ని ఆదుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వరద సాయంగా రూ.10 కోట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆ రాష్ట్ర సీఎం కె. పళనిసామి ఓ లేఖ రాశారు. భారీ వర్షాలతో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలలో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమిళనాడు ప్రజల తరఫున తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 కోట్లు ప్రకటిస్తున్నట్టు లేఖలో తెలిపారు.

లోకేష్ పర్యటనతో సర్కార్ షేక్! వరదలపై సీఎం ఏరియల్ సర్వే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. పదేండ్ల తర్వాత కుండపోత వానలు కురవడంతో భారీగా నష్టం జరిగింది. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వేలాది ఇండ్లు నేలకూలయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలు నరకం చూశారు. మోకాళ్ల లోతు వరదలోనే కొన్ని కాలనీలు రెండు మూడు రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణమ్మ ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాలన్ని జలమలమయ్యాయి. దివిసిమ నీట మునిగింది. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలో పంట నష్టం భారీగా జరిగింది.    వరద నివారణ చర్యల్లో వైసీపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. వరదలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన జగన్ సర్కార్.. వరద బాధితులను ఆదుకోవడంలోనూ చేతులెత్తేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. సాయం కోసం బాధితులు కేకలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వైసీపీ ప్రజా ప్రతినిధుల జాడే లేకుండా పోయింది. వరదల సమయంలో అధికార పార్టీ నేతలు అందుబాటులో లేకపోవడంపై తీవ్ర విమర్శలువస్తున్నాయి. వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతున్నా వైసీపీ నేతలు స్పందించకపోవడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ తీరుపైనా ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.    వరద బాధితులు కష్టాల్లో ఉన్నా అధికార పార్టీ నేతలు అడ్రస్ లేకుండా పోగా.. టీడీపీ మాత్రం బాధితులకు బాసటగా నిలిచింది. యువనేత నారా లోకేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారికి భరోసా ఇచ్చారు. రైతులతో మాట్లాడి పంట నష్టంపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. మోకాళ్ల లోతు నీటిలోనూ నడుచుకుంటూ బాధితుల దగ్గరకు వెళ్లి .. వారి సమస్యలు తెలుసుకున్నారు నారా లోకేష్. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించారు. మూడు రోజుల క్రితం గుంటూరు, కృష్ణా జిల్లాలోని  వరద బాధితులను పరామర్శించారు. మంగళగిరి.  తాడేపల్లి నియోజకవర్గంలో తిరిగి కృష్ణానది వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టపోయిన  రైతులతో మాట్లాడి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లోనూ  పర్యటించి వరద బాధితులకు భరోసా ఇచ్చారు నారా లోకేశ్.     నారా లోకేష్ రాకతో వరద బాధితులకు  ధైర్యం వచ్చింది. అధికార పార్టీ నేతలు తమను పట్టించుకోలేదని లోకేష్ కు వారు చెప్పుకున్నారు. లోకేష్ పర్యటించిన అన్ని ప్రాంతాల్లో ఆయన్ను కలిసేందుకు రైతులు, ప్రజలు ఎగబడ్డారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. వరద బాధితుల సమస్యలు విన్న లోకేష్.. రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. రైతు నీళ్ళల్లో ఉంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఆకాశంలో విహరిస్తున్నారని మండిపడ్డారు.గత  ఏడాది నష్టపోయిన రైతులకు ఇంకా నష్ట పరిహారం అందలేదని లోకేష్ విమర్శించారు. ఇప్పుడు కనీసం నష్ట పరిహారం అంచనా కూడా జరగడం లేదని చెప్పారు. రైతుల కోసం టీడీపీ పోరాడుతుందని,  చిట్ట చివరి రైతుకి న్యాయం జరిగే వరకు అండగా ఉంటుందని నారా లోకేష్ హామీ ఇచ్చారు.   వరద ప్రాంతాల్లో నారా లోకేష్ పర్యటన అధికార వైసీపీని షేక్ చేసింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బహిర్గతమైంది. వరద నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు పెరగడం, నారా లోకేష్ విమర్శలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో దిద్దుబాట చర్యలకు దిగింది జగన్ సర్కార్. హడావుడిగా వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు సీఎం జగన్. కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద తీరును ఆయన పరిశీలించారు. అధికారులతో వరద నష్టంపై సమీక్ష చేశారు. వరద ప్రాంతాల్లో లోకేష్ పర్యటన వల్లే జగన్ ప్రభుత్వంలో కదలిక వచ్చిందనే చర్చ జనాల్లో జరుగుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో చర్చ జరుగుతుండటంతో తమకు డ్యామేజీ జరిగిందని వైసీపీ నేతలే చెబుతున్నారు. వరదల  సమయంలో తమ పార్టీ నేతల తీరు చాలా దారుణంగా ఉందని కొందరు నేతలు ఓపెన్ గానే ఆరోపిస్తున్నారట.   మొత్తంగా వరద బాధితులను ఆదుకోవడంలో మొద్దునిద్రలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని కదిలించడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రైతుల సమస్యలు తెలుసుకున్న తర్వాత ఆయన చేసిన ఆరోపణలు సర్కార్ కు సూటిగా తగిలాయంటున్నారు. అందుకే వరదలు వస్తున్నా అధికారులతో సమీక్షలు పెట్టని సీఎం జగన్ .. హడావుడిగా ఏరియల్ సర్వే చేశారంటున్నారు. వరద ప్రాంతాల్లో నారా లోకేష్ పర్యటన, ఆయన చేసిన ప్రసంగాలు టీడీపీకి మైలేజీ ఇస్తున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.

మీలాగా అక్కడకు ఇక్కడకు గ్లాసులు మోయలేదు.. కొడాలి నాని దుమ్ముదులిపిన టీడీపీ నేత

మాజీ సీఎం చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ పై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలపై టీడీపీ నాయకురాలు దివ్య వాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్ ను విమర్శించే వారికి ఆవగింజలో అరవయ్యో వంతు అయినా దానికి తగిన అర్హత ఉందా అని ఆమె ప్రశ్నించారు. ఎంబీఏ చదివి, ప్రపంచబ్యాంకులో పని చేసిన రికార్డు లోకేష్ సొంతమన్నారు. ఒక విజన్ ఉన్న నాయకుడి కుమారుడిగా లోకేష్ కు కష్టపడే స్వభావం ఉందన్నారు. ‘‘అయినా మీలాంటి ఇంగిత జ్ఞానం, సంస్కారం లేని వ్యక్తులతో మాటలు పడుతున్నారు. ఏమండోయ్ కొడాలి గారు.. పుట్టుకతో బంగారు స్ఫూన్‌తో పుట్టిన వ్యక్తి లోకేష్. అయన పార్టీలు మార్చే వ్యక్తి కాదు. వీళ్లకు వాళ్లకు గ్లాసులు మోసిన వ్యక్తి కూడా కాదు. అలాగే సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారే వ్యక్తి కూడా కాదు. అసలు ఇవన్నీ ఎందుకని ఆయన యూఎస్‌కు వెళితే...50 లక్షల డాలర్లు సంపాదించుకొనే సత్తా ఆయనకు ఉంది. అయినా తనను తాను తగ్గించుకుంటూ.. అందరితో కలిసిపోతూ... పని చేసుకుంటూ లోకేష్ వెళుతున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు.    ‘‘ప్రజలు నమ్మి పట్టం కట్టారు. మీమాటలు, వికృత చేష్టలతో వారు వేదనను అనుభవిస్తున్నారు. దయచేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకండి. అప్పు చేసి పప్పుకూడులా... ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. ఇక సీఎం కూడా బాధ్యతగా వ్యవహరించడం లేదు’’ అంటూ దివ్యవాణి తీవ్ర విమర్శలు చేశారు.

హరీషే విపక్షాలకు ఆయుధమా! సిద్ధిపేటే కారు కొంప ముంచనుందా?

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పన్నెండు రోజుల్లో గడవు ముగియనుండటంతో అభ్యర్థుల, పార్టీల నేతలంతా గడపగడప తిరిగి ఓట్లు అడుగుతున్నారు. మూడు ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ముఖ్యనేతలంతా దుబ్బాకలోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ కు మాత్రం మంత్రి హరీష్ రావే అంతా తానై వ్యవహరిస్తున్నారు. కారు పార్టీ ఆశలు కూడా ఆయనపైనే ఆధారపడి ఉన్నాయని చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావే విపక్షాలకు ప్రధానంగా మారినట్లు దుబ్బాక పొలిటికల్ సీన్ కనిపిస్తోంది. హరీష్ రావు టార్గెట్ గానే.. ఆయన వల్లే దుబ్బాక వెనకబడిందనే ప్రచారాన్ని ఎక్కువగా చేస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. విపక్షాల వాయిస్ కు జనాల నుంచి స్పందన వస్తుండటంతో అధికార పార్టీలో ఆందోళన పెరుగుతుందని చెబుతున్నారు. ట్రబుల్ షూటరే టీఆర్ఎస్ కు ట్రబుల్ గా మారారనే చర్చ కూడా జరుగుతోంది.    దుబ్బాక నియోజకవర్గం సిద్ధిపేట జిల్లాలో ఉంది. జిల్లా మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. అయితే జిల్లా మెత్తాన్ని పట్టించుకోకుండా సిద్ధిపేట నియోజకవర్గంలోనే మంత్రి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయన్నది విపక్షాల ఆరోపణ. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. సిద్ధిపేట, దుబ్బాక తనకు రెండు కండ్లు అంటున్న హరీష్ రావు.. ఇప్పటివరకు ఒక కన్నునే ఎందుకు కాపాడుకున్నారని ప్రశ్నిస్తున్నారు. సిద్ధిపేటలాగా దుబ్బాక ఎందుకు లేదని హరీష్ రావును నిలదీస్తున్నారు. సిద్ధిపేటలో రోడ్లు అద్దాల్లా మెరుస్తుంటే.. దుబ్బాక నియోజకవర్గంలో ఎందుకు బీటలు పడ్డాయో హరీష్ రావు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాకు వచ్చిన నిధులన్ని సిద్ధిపేటకే ఖర్చు పెట్టారని రేవంత్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు ప్రజల్లోకి బాగా వెళుతున్నాయని అంటున్నారు. సిద్ధిపేటతో పోలుస్తూ దుబ్బాకలో అభివృద్ధిపై నియోజకవర్గ ఓటర్లు చర్చించుకుంటున్నారని, ఇది తమకు కలిసివస్తుందని హస్తం నేతలు ఆశలో ఉన్నారు.   ఇక బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావుతో పాటు కమలం నేతలు కూడా హరీష్ రావునే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదని.. దుబ్బాక పాలిట శాపమని ఘాటుగా విమర్శిస్తున్నారు . దుబ్బాక నియోజకవర్గాన్ని మొదటి నుంచి కేసీఆర్ కుటుంబం నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తున్నారు రఘునందన్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణలో గజ్వేల్ రైతులకు ఎక్కువ ప్యాకేజీ ఇచ్చి.. దుబ్బాక రైతులకు తక్కువ ఇచ్చారనే విషయాన్ని ప్రచారంలో చెబుతున్నారు. సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో వేల  కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతూ.. పక్కనే ఉన్న దుబ్బాకను ఎందుకు వలిదేశారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి మద్దతుగా  ఉంటున్న యువత కూడా హరీష్ రావు లక్ష్యంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవన్ని తమకు ప్లస్ అవుతాయని కాషాయ నేతలు ధీమాగా ఉన్నారు.    దుబ్బాకలో మారుతున్న రాజకీయ సమీకరణలతో గులాబీ పార్టీలో గుబులు పెరుగుతుందని తెలుస్తోంది. ట్రబుల్ షూటర్ అనుకుంటున్న హరీష్ రావే తమకు ట్రబుల్ గా మారే అవకాశం ఉందనే చర్చ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతల్లోనూ జరుగుతుందట. హరీష్ రావుపై జనాల్లో మంచి పేరున్నా.. సిద్దిపేట లాగా దుబ్బాకలో అభివృద్ధి పనులు చేపట్టలేదన్న అంశం తమకు ఇబ్బందిగా మారుతుందని అధికా ర పార్టీ నేతలు లోలోపల ఆందోళన చెందుతున్నారట. ఈ పరిస్థితిని గమనించే హరీష్ రావు మరింత స్పీడ్ పెంచారని, ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నారని  చెబుతున్నారు.

మహిళా మంత్రిపై నోరు జారిన మాజీ సీఎం.. ధర్నాకు దిగిన ప్రస్తుత సీఎం  

మధ్యప్రదేశ్ మాజీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ తాజాగా మహిళా మంత్రి ఇమార్తి దేవీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని దబ్రా నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో కమల్‌నాథ్ మాట్లాడుతూ.. శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్‌లో మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ఇమార్తి దేవీని "ఐటమ్" అని కమల్‌నాథ్ సంబోధించారు. దీంతో ఒక్కసారిగా ఆయనపై తీవ్రమైన రాజకీయ దాడి మొదలైంది. ఉపఎన్నికకు సంబంధించిన సభలో కమల్‌నాథ్ మాట్లాడుతూ... ‘‘ఇక్కడి నుంచి సురేశ్ రాజే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన చాలా సాదాసీదా వ్యక్తి. అయితే ఆమె అలాగా కాదు. ఆమె పేరేమిటి? ఆమె గురించి నా కంటే మీకే బాగా తెలుసు. ఆమె ఐటమ్’’ అంటూ కమల్‌నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.   సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడు, మాజీ సీఎం ఓ మహిళా కేబినెట్ మంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై సీఎం శివరాజ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ ఆ కామెంట్లను చూసి ఒక్కసారి షాక్‌కు గురయ్యా. ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న కమల్‌నాథ్ ఓ మహిళా మంత్రిని అగౌరవపరిచేలా మాట్లాడటం ఏమిటి? ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటు. మహిళలను, దళితులను అగౌరవ పరిచేలా అయన వ్యాఖ్యలున్నాయి.’’ అని శివరాజ్ సింగ్ మండిపడ్డారు. అంతేకాకుండా కమల్ నాథ్ కామెంట్స్ కు నిరసనగా ఈరోజు సీఎం శివరాజ్ సింగ్ ధర్నాకు సిద్ధమయ్యారు.   మరోవైపు మంత్రి ఇమార్తి దేవీ మాట్లాడుతూ... ‘‘అసలు నా తప్పేంటి? ఓ పేద కుటుంబంలో పుట్టడమే నా తప్పా? నేను దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తిని. అందులో నా తప్పేముంది? ఇలాంటి వ్యక్తులకు పార్టీలో స్థానమివ్వకూడదని సోనియా గాంధీని కోరుతున్నా. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై కథన చర్యలు తీసుకోవాలి" అని ఇమార్తి దేవి కమల్‌నాథ్ పై మండిపడ్డారు.

అచ్చెన్నకు ఏపీ టీడీపీ పగ్గాలు.. తెలంగాణకు మళ్లీ రమణే..

తెలుగుదేశం పార్టీ కమిటీలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని నియమించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా మళ్లీ ఎల్.రమణకే అవకాశం కల్పించారు. తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని నియమించారు.    27 మందితో టీడీపీ సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేయగా, 25 మందితో టీడీపీ పొలిట్ బ్యూరో ఏర్పాటు చేశారు.  కొత్తగా ప్రకటించిన కమిటీల్లో ఆరుగురిని ఉపాధ్యక్షులుగా నియమించిన చంద్రబాబు.. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా మరో 8మందిని ప్రకటించారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావును, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్‌రావు ను నియమించారు.    పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొండా ఉమ, ఫరూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్ కుమార్ గౌడ్ ను నియమించారు. పొలిట్ బ్యూరోలో నారా లోకేష్, అచ్చెన్నాయుడు, ఎల్.రమణ ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఉంటారు.   కాగా, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని నియమించానున్నారని కొద్దిరోజుల నుండి ప్రచారం జరిగింది. ఊహించినట్టుగానే చంద్రబాబు అచ్చెన్నాయుడుని అవకాశం కల్పించారు. ఆయనైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళాన్ని బలంగా వినిపిస్తారన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో కూడా ఉంది. అయితే, తెలంగాణ టీడీపీ అధ్యక్ష విషయంలో మాత్రం పార్టీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశముంది. రమణను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు.. చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినా.. మళ్లీ ఆయనకే అవకాశం కల్పించడం చర్చనీయాంశమైంది.

పింక్ డైమండ్ కథేంటో తేల్చండి మహాప్రభో.. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు లేఖ 

గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ఆభరణాల్లోని పింక్ డైమండ్ మాయమైందని అప్పటి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో వైసిపి నాయకులు విజయ సాయి రెడ్డి ఐతే ఏకంగా చంద్రబాబు ఇంట్లో వెతికితే దొరుకుతుందని కూడా సీరియస్ కామెంట్స్ చేసిన సంగతి కూడా తెలిసిందే.   ఐతే తాజాగా తిరుమల శ్రీవారి ఆభరణాల్లో మాయమైనందంటున్న పింక్‌ డైమండ్‌ కథేంటో తేల్చాలని తిరుపతికి చెందిన న్యాయవాది విద్యాసాగర్‌ కేంద్ర విజిలెన్స్‌ కమిషన్ ‌(సీవీసీ) కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయన చీఫ్‌ విజిలెన్స్ ‌ కమిషనర్‌కు ఆదివారం ఒక లేఖ రాశారు. శ్రీవారి ఆభరణాలలో అసలు పింక్‌ డైమండ్‌ ఉందా లేదా.. జెనీవా లో వేలం వేసిన వజ్రం తిరుమల శ్రీవారిదో కాదో సీబీఐ లేదా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) తో విచారణ జరిపించాలని అయన కోరారు. ఒకవేళ ఈ డైమండ్‌ విదేశాలకు వెళ్లి ఉంటే దానిపై దర్యాప్తు చేయడానికి స్థానిక పొలిసు అధికారుల పరిధి సరిపోదని.. కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఈ పని చేయగలవని అందుచేత వాటితోనే దర్యాప్తు చేయించి అసలు సంగతేంటో తేల్చాలని అయన ఆ లేఖలో కోరారు.   "తిరుమల ఆలయంలో ప్రధాన అర్చకుడిగా నలభై ఏళ్లపాటు చేసిన రమణ దీక్షితు లు స్వామి వారికి మైసూర్‌ మహారాజులు బహుకరించిన పింక్‌ డైమండ్‌తో కూడిన ఆభరణాలను తానే అలంకరించానని అప్పట్లో మీడియాకు చెప్పారు. అయితే ఆ డైమండ్‌ దేశం దాటి వెళ్లిందని, స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో దానిని రూ.500 కోట్లకు వేలం వేశారని కూడా అయన ఆరోపించారు. చాలా కాలం క్రితం అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి.. విజిలెన్స్‌ అధికారి రమణకుమార్ తో స్వామివారి ఆభరణాలపై విచారణ జరిపించింది. ఆయన ముందు కూడా రమణ దీక్షితులు, నరసింహ దీక్షితులు పింక్‌ డైమండ్‌ ఉండాలని చెప్పారు. తన నివేదికలో రమణకుమార్‌ దీనిని ప్రస్తావించారు. కానీ ఆ తర్వాత ఆయన మాట మార్చి.. తనను ఇద్దరు అర్చకులు తప్పుదోవ పట్టించారని చెప్పారు. 2009లో అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూ ర్తి వాధ్వాతో స్వామివారి ఆభరణాలపై విచారణ చేయించారు. ఆ తర్వాత రాష్ట్రప్రభుత్వం కూడా విడిగా జగన్నాథరావు కమిషన్‌తో ఇదే అంశంపై విచారణ జరిపించింది. ఈ రెండు విచారణ సంఘాలు లోతుగా విచారణ జరిపి అక్కడ పింక్‌ డైమండ్‌ అనేది లేనే లేదని తేల్చాయి. ఇదే సమయంలో ఆర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థకు చెందిన చెన్నారెడ్డి అనే అధికారి కూడా దీనిపై విచారణ జరిపి స్వామివారికి మహారాజాలు సమర్పించిన ఆభరణాల్లో కొన్ని కనిపించడం లేదని నివేదిక ఇచ్చారు. అయితే పింక్‌ డైమండ్‌ ఉందని రమణ దీక్షితులు అప్పట్లో ఫొటో లు కూడా చూపించారు.   దీంతో ఎవరి మాటలను నమ్మాలో ఇటు ప్రజలకు, అటు భక్తులకు అర్థంకాని సమస్యగా మారింది. ఒకవేళ రమణ దీక్షితులు కనుక అబద్ధం చెబుతుంటే ఎవరి ప్రోద్బలంతో అయన లా చెబుతున్నారో కూడా తేలాలి. తాజాగా తిరుమల ఆలయానికి అనుబంధంగా ఉన్న కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజులస్వామి ఆలయంలో ఇటీవల ఆభరణాలు, కిరీటాలు చోరీ అయిన ఘటనలు కూడా వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపించి ఇందులో నిజానిజాలు వెలికి తీసి భక్తుల అనుమానాలు నివృత్తి చేయాలి" అని విద్యాసాగర్‌ సీవీసీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

పండుగలని వదిలేస్తే.. కేరళ మూల్యం చెల్లించుకుంది.. కేంద్ర మంత్రి హెచ్చరిక.. 

భారత్ లో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు కేరళలో జనవరిలోనే నమోదైన సంగతి తెలిసిందే. అయితే వెంటనే కఠినమైన చర్యలతో ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి కూడా చేసి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అయితే తాజాగా ఓనం పండుగ సందర్భంగా నిబంధనలను సడలించడంతో.. ఈ నెల ప్రారంభం నుంచి 17వ తేదీ వరకూ కేరళలో వచ్చిన కరోనా కేసులు 1.35 లక్షలకు పైగానే నమోదయ్యాయి. మొదటి నుండి కట్టడి చేసి ఇపుడు ఓనం సందర్భంగా నిబంధనలను సడలించడంతో.. తగిన మూల్యం చెల్లించుకుందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్దన్ వ్యాఖ్యానించారు. పండుగల సమయంలో.. ప్రయాణాలను అనుమతించి తప్పు చేశారని, దీంతో ప్రజలు మూకుమ్మడిగా పండగలు చేసుకునేలా నిబంధనలను సడలించారని ఆయన విమర్శించారు. దీంతో ఓనమ్ పర్వదినాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభించింది. దీంతో రోజువారీ కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయి.   ఇప్పుడు దేశవ్యాప్తంగా దసరా - దీపావళి పండుగ సీజన్ మొదలైంది. రాష్ట్రాలూ కోవిడ్ ప్రణాళికల్లో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదు" అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. "ఓనమ్ సమయంలో చూపించిన నిర్లక్ష్యానికి ఇప్పటికే కేరళ నష్టపోయింది. రాష్ట్ర పరిధిలో వివిధ రకాల సేవలను తిరిగి ప్రారంభించడం, ప్రయాణాలు, వాణిజ్య కార్యకలాపాలు, పర్యాటక ప్రాంతాలు తిరిగి తెరవడం తదితర కారణాలతోనే కేరళలో కేసులు పెరిగాయి" అని సోషల్ మీడియాలో నిన్న జరిగిన "సండే సంవాద్" కార్యక్రమంలో భాగంగా తనకు ఎదురైన ప్రశ్నలకు హర్ష వర్దన్ సమాధానమిచ్చారు.   కేరళ రాష్ట్ర ఉదంతాన్ని మిగిలిన రాష్ట్రాలు ఉదాహరణగా తీసుకుని కరోనా కట్టడిపై మరింత దృష్టి పెట్టాలని ఆయన కోరారు. అంతేకాకుండా వచ్చే పండగ సీజన్ తో పాటు త్వరలో శీతాకాలం కూడా కలిసి రానుండడంతో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం నియమించిన ఒక కమిటీ హెచ్చరించిన కొన్ని గంటలలోనే హర్షవర్దన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఏ మతం కూడా ప్రాణాలను పణంగా పెట్టి, పండగలను జరుపుకోవాలని చెప్పలేదని, వీలైనంత వరకూ ప్రజలు ఇంటికే పరిమితం కావాలని ఆయన సూచించారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయన అన్నారు. దాదాపు 46 రోజుల తరువాత మనదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షల లోపునకు తగ్గడం శుభ పరిణామమని అయన అన్నారు.  

‘కమలవనం’లో చేరిన కొత్త పుష్పం!

ఖుష్బూ రాకతో హిందుత్వ పవిత్రత పెరిగిందా?   నజత్‌ఖాన్ బీజేపీలో చేరారు. ఆమెకు ఆ పార్టీ అగ్రనేతలు కండువా కప్పి, విశాల హిందూ సంస్కృతీ-సంప్రదాయ పరిమళం వెదజల్లే  ‘కమలవనం’లో ఆహ్వానించారు. ఎవరో నజత్‌ఖాన్ పార్టీలో చేరితే ఏందిట? ఇంకా కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే.. ‘ అయితే ఇప్పుడేం జేద్దామంటవ్ మరి’? అని వ్యంగ్యంగా అడగనూవచ్చు. నిజమే. ఏ నజత్‌ఖానో, ముమైత్‌ఖానో పార్టీలో చేరితే దానికింత ఉపోద్ఘాతం ఎందుకన్న అనుమానం, బుద్ధిజీవులకు రావచ్చు. కానీ చేరింది అగ్రనటి ఖుష్బూ కాబట్టి, ఆ మాత్రం ఉపోద్ఘాతం ఇవ్వక తప్పదు. అసలు నజత్‌ఖాన్ ఉరఫ్ ఖుష్బూ బీజేపీలో చేరితే మీకెందుకు అంత కడుపుమంట అని ప్రశ్నించవచ్చు. ఖుష్బూ బీజేపీలో చేరితే హిందుత్వ సిద్ధాంత బలం పెరిగిందని, ఏకంగా పార్టీనే పవిత్రమయిపోయిందని సంతోషించక, అదేదో హిందూత్వ సిద్ధాంతం మైలపడిందన్న ఆ గావుకేకలేమిటని నిలదీయవచ్చు. తప్పులేదు. ఎవరి దృష్టి కోణం వారిది!   అవును. నిజమే. మామూలు నజత్‌ఖాన్..  అదే ఖుష్బూ బీజేపీలో చేరితే, ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఎందుకంటే దేశంలో చాలామంది ముస్లిములు, ఆ పార్టీలో చేరుతున్నారు కాబట్టి! మరి మన నజత్‌ఖాన్ గురించే ఎందుకింత గొడవ చేస్తున్నారన్న ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తాయి. అందుకు కారణాలు వివరించడం అవి తెలిసిన వారి ధర్మం!  ముందే చెప్పినట్లు.. మన నజత్‌ఖాన్ అందరిలాంటి మహిళ కాదు. అదేదో సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పినట్లు ‘సింహం గడ్డం గీసుకోదు. నేను గడ్డం గీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్’ వంటి పవర్‌ఫుల్ లేడీ ఆమె. ‘అంత లావు’ మహిళా నాయకురాలు  చేరితే..  బీజేపీ ఏదో అపవిత్రమవుతుందన్నట్లు, హిందుత్వవాదులు చేస్తున్న గోల వెనుక కారణమేమిటో చూడాలి కదా? మరి ఆ ముచ్చట కూడా వినేద్దాం.   ఇప్పుడు కమలతీర్థం తీసుకున్న ఖుష్బూ.. ఒకప్పుడు డిఎంకె నుంచి బయటకువచ్చి, అలా కాంగ్రెస్ వీధిలో నడుచుకుంటూ, ఇప్పుడు ‘కమల విహార్’ ముందు నిలిచింది. ఒకప్పుడు ఆమె బీజేపీని దూదేకినట్లు ఏకేశారు. అదన్న మాట సంగతి!  మీకు తెలుసు కదా.. బీజేపీ అంటే హిందూత్వకు, ఇంకా భారతీయ సంస్కృతీ సంప్రదాయానికి  పూర్తి హక్కుదారు! కాకపోతే మనం కొనే వస్తువుల ‘షరతులు వర్తిస్తాయి’ అన్న మాట మాత్రం ఆ పార్టీలో ఎక్కడా ఉండదు. ఏది తనకు అవసరం అనుకుంటే, ఆ రకంగా ముందుకు వెళుతున్నందన్నమాట! అలాంటి ఖుష్బూ అనే పెరియార్ వారసురాలయిన, ఈ  విప్లవ నారీమణి చివరాఖరకు మన ప్రధాని నరేంద్రుడినీ విడిచిపెట్టలేదు.   మోదీ గారు కూడా తెలుసుకదా? భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు పరిరక్షించేందుకే, కళ్లు తెరచిన కమలం పార్టీకి పెట్టనికోట. అలాంటి మోదీ మొన్నామధ్య, అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణ శంకుస్థాపనకు వెళ్లారు. దానిని వామపక్షాలు ఆక్షేపించాయి. సరే వామపక్షీయులంటే నిఖార్సయిన సెక్యులరిస్టులు కాబట్టి, వారికి ఒక మతంపై.. ప్రత్యేకించి హిందూమతంపై కొంచెం ‘ఎక్కువ అభిమానం’ కాబట్టి, వారు ఆవిధంగా ఆక్షేపించడంలో పెద్ద వింతేమీ లేదు.   కానీ, వారిని మించి... మన ఖుష్బూ, అదే మన నజత్‌ఖాన్ మాత్రం,  మోదీగారి అయోధ్య సందర్శనపై ఒక టన్ను వ్యంగ్యాస్త్రాన్ని ట్వీటారు. ‘వావ్.. ఇప్పుడు దేవుడైన రాముడి కంటే, మోదీ పెద్దవాడయ్యాడన్నమాట. కలియుగం మరి’ అని బోలెండంత వ్యంగ్యాన్ని కుమ్మరించారు. అంతకముందు.. తమిళనాట బీజేపీ, దొడ్డిదారిన అధికారం హస్తగతం చేసుకోవాలన్న కల కలగానే మిగిలిపోతుందని, ఇదే ఖుష్బూ జోస్యం చెప్పారు. ఓసారి ఉత్తరాది నటులంతా మోదీని కలిశారు. అప్పుడు ఈ నాయకీమణి తమిళులు గుర్తుకురాలేదా అని అవహేళన చేశారు. ఇక మోదీ అండ్ అమిత్‌షా నానా కష్టాలు పడి, ప్రాంతీయ పార్టీలను ప్రసన్నం చేసుకుని మరీ పాస్ చేయించిన, పౌరసత్వ బిల్లుపైనా ఈ నజత్‌ఖాన్ చెలరేగిపోయారు. తమిళ బీజేపీ నేత రాజాపై కత్తులుదూశారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని విరుచుకుపడ్డారు.   ఖుష్బూ అక్కయ్య చేసిన అన్నేసి దూషణలను మర్చిపోయి, సాదరంగా తన ‘కమలవనం’లోకి ఆహ్వానించిన బీజేపీ విశాల హృదయానికి జోహారులర్పించాల్సిందే. డిఎంకె నుంచి కాంగ్రెస్‌లో చేరిన  ఇదే కుష్బూ.. ఇప్పుడు నా సొంత ఇంటికి వచ్చినట్టుందని సంతోషపడ్డారు. నిజమే. సదరు నజత్‌ఖాన్ ఆ ప్రకారం,  సొంతిల్లయిన కాంగ్రెస్ నుంచి, ఇప్పుడు బీజేపీ అనే అద్దె ఇంటికి చేరారన్న మాట. అది వేరే విషయం. బాగానే ఉంది. కానీ, భారతీయ సంస్కృతి, వైవాహిక వ్యవస్థ, మహిళల వేషధారణపై తనకంటూ కొన్ని సిద్ధాంతాలున్న భాజపా-దాని మూలవిరాట్టయిన సంఘ్.. ఇప్పుడు ఖూష్బూ తమ పార్టీలో చేరినందున, ఆ సిద్ధాంతాలు  మార్చుకుంటాయా? లేక ఖుష్బూ నమ్మిన పెరియార్ సిద్ధాంతాన్నే మార్చుకోమని చెబుతాయా? అన్నదే ప్రశ్న. అంటే.. పెళ్లి కాకపోయినా మహిళలు గర్భం దాల్చవచ్చని ప్రవచించిన ఖుష్బూ సిద్ధాంతాన్ని, ఆమెను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కమలదళాలు అంగీకరించినట్టే కదా?  రేపు బీజేపీ గళధారులకు, ఏ మీడియానో ఇదే ప్రశ్న వేస్తే ఏం జవాబిస్తారన్నదే ఆసక్తికరం!   భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే తమ ఊపిరిగా  పనిచేస్తున్న సంఘ్‌పరివారంలో , బీజేపీ  ఒక సభ్యురాలు.   ఇప్పుడు అదే సంస్కృతీ సంప్రదాయ విలువల వస్త్రాపహరణం చేసిన.. కుష్బూ అనే మహా సంస్కరణవాదికి, బీజేపీ మోతుబరులు కండువా క ప్పి రెడ్‌కార్పెట్ వేయడమే హాశ్చర్యం. బాలికలు యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి కాకుండానే, తమకు నచ్చిన వారితో కలసి ఉంటూ గర్భం దాల్చినా తప్పులేదని వాదించిన ఈ విప్లవ పుష్పం..ఇప్పుడు ‘కమలవనం’లో చేరింది. కాబట్టి ఇక ఆ ‘కమలవనం’, సంప్రదాయబద్ధంగా శోభిల్లడం ఖాయం!   అంతేనా? మహిళలు పొట్టి దుస్తులు వేసుకోవచ్చని, సంప్రదాయం-సంస్కృతి అనే పాతచింతకాయ కబుర్లు చెప్పి, మహిళల స్వాతంత్య్రాన్ని హరించవద్దన్న నజత్‌ఖాన్ ఇప్పుడు ‘కమలవనం’లో చేరినందున.. బహుశా భాజపా కూడా తన సిద్ధాంతాన్ని మార్చుకోవాలనే,  కొత్త విప్లవాన్ని తీసుకువచ్చినా ఆశ్చర్యం లేదు. హిందుత్వవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించే పెరియార్ వారసురాలినని సగర్వంగా ప్రకటించుకున్న ఖుష్బూ చేరికతో.. తమిళనాట అధికారం చేపట్టాలన్న కల నెరవేరటం సంగతి ఎలా ఉన్నా.. భారతీయ సంస్కృతి-సంప్రదాయాలకు బీజేపీ ఒక్కటే పెద్ద పీట వేస్తుందని భావిస్తున్న వారి భ్రమలు పటాపంచలు చేసి, తానూ ‘ఆ తానుముక్కనే’నని ముసుగుతీసి నిరూపించుకున్న భాజపా రాజకీయాన్ని అభినందించాల్సిందే. అయినా... ముంతాజ్‌మాస్మా ఖాటూన్.. ఉరఫ్ మమతాబెనర్జీకి సంకీర్ణ సర్కారులో కొలువిచ్చినప్పుడు లేని మొహమాటం, ఇప్పుడు తమిళ నజత్‌ఖాన్‌ను పార్టీలో చేర్చుకున్నప్పుడు ఎందుకంట? మరి అంతేగా.. అంతేగా?!   కొసమెరుపు: భాజపా సిద్ధాంతాలంటే వల్లమాలిన గౌరవం-నమ్మకం  ఉన్న, ఓ తెలుగు మహిళా పారిశ్రామికవేత్త.. ఖుష్బూ బీజేపీలో చేరిక తర్వాత వ్యక్తం చేసిన సందేహాలు, అవసరాలకు అనుగుణంగా మార్చుకునే ఆ పార్టీ సిద్ధాంతాలు- రాజకీయావసరాలపై వ్యక్తీకరించిన ఏహ్యభావమే ఈ కథనానికి స్ఫూర్తి. అందుకే ఈ కథనం ఆమెకే అంకితం.  -మార్తి సుబ్రహ్మణ్యం

పార్టీపై పట్టు పోయిందా! జగన్ చెప్పినా చల్లారని సెగలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో క్రమశిక్షణ లోపించిందా? వైసీపీ నేతలు హైకమాండ్ ను ఖాతరు చేయడం లేదా? పార్టీపై వైఎస్ జగన్ పట్టు కోల్పోయారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అవి నిజమేనని తేలుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ నాయకులు కుమ్ములాటలకు పాల్పడుతున్నారు. ఏదో ఒక వివాదంతో ఆరోపణలు, సవాళ్లు చేసుకుంటున్నారు. స్వపక్షంలో విపక్షంలా బాహాబాహీకి దిగుతున్నారు. ఆధిపత్యం చేలాయించేందుకు గ్రూపు తగాదాలకు తెరలేపుతున్నారు. ప్రధానంగా వలస నేతలు, పాత నేతల మధ్య వివాదాలు అగ్గిరాజేస్తున్నాయి. పార్టీ హైకమాండ్ ను నేతలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అధినేత జగన్ చెప్పినా కొందరు నేతలు డోంట్ కేర్ అంటున్నారట. వైసీపీలో జరుగుతున్న పరిమాణాలతో పార్టీపై జగన్ పట్టు కోల్పోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.    పౌరుషాల గడ్డ గుంటూరు జిల్లా పల్నాడులోనూ వైసీపీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. తన నియోజకవర్గంలోకి ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులును అడుగు పెట్టనివ్వకుండా ఎమ్మెల్యే రజనీ, ఆమె అనుచరులు ప్రయత్నించారని సమాచారం. గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారివద్దకు ఎంపీ వెళుతున్నారని రజనీ వర్గం ఆరోపిస్తోంది.  ఎమ్మెల్యే విడదల రజనీ అనుచరులు భూసేకరణ సమయంలో రైతుల వద్ద లక్షల్లో కమీషన్లు దండుకుంటున్నారని ఎంపీ లావుఅధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని ఎమ్మెల్యే రజనీ పార్టీ అధిష్టానానికి తెలియచేసారు. తన ఫోన్లను పోలీసులతో కలిసి ఎంపీ ట్యాపింగ్ చేయించారని రజనీ ఆరోపిస్తున్నారు. వివాదం ముదరడంతో ఏం చేయాలో తెలియక వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. జగన్ చెప్పినా ఇద్దరు నేతలు వినడం లేదని పార్టీ నేతలే చెబుతున్నారు.     కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీలో మూడు ముక్కలాట జరుగుతోంది. మూడు వర్గాలు ఆధిపత్యం కోసం  కత్తులు దూస్తున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశి, డీసీసీబీ చైర్మెన్ యార్లగడ్డ మధ్య రాజీకి జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటున్నారు. కలిసి పనిచేయండని వంశి, వెంకట్రావుల చేతులు కలిపి జగన్ పంపించినా  వారు కలవడానికి ఇష్టపడటం లేదు. జగన్ సమావేశం తర్వాత కూడా వల్లభనేని, యార్లగడ్డలు ఒకరిపై ఒకరు కాలు దువ్వూతూనే ఉన్నారు. తానే వైఎస్సార్‌సీపీకి అసలు నాయకుడినని.. వంశీ అద్దె నాయకుడని యార్లగడ్డ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు.  వంశీతో కలిసి పని చేయనని సీఎం జగన్ కి చెప్పేశానని కూడా చెబుతున్నారట. వంశీ దొంగ ఓట్లతో గెలిచాడని చె యార్లగడ్డ ఆరోపిస్తుండటం.. వల్లభనేని వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పార్టీ సీనియర్‌ నాయకుడు దుట్టా రామచంద్రరావు, ఎమ్మెల్యే వంశీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.    ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఆమంచి, ఎమ్మెల్యే కరణం వర్గాలు బలప్రదర్శనకు దిగుతున్నాయి. రెండు వర్గాల హంగామాతో ప్రభుత్వ కార్యక్రమమైనా, పార్టీ కార్యక్రమమైనా హై టెన్షన్‌ తలపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమంచే ఎమ్మెల్యేగా హడావుడి చేస్తున్నారని కరణం వర్గీయులు ఆరోపిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కరణం అధికారిక కార్యక్రమానికి వెళ్లినా తన వర్గీయులతో నానా యాగీ చేయించేవారని ఆక్రోశిస్తున్నారు. ఇటీవల  ఎమ్మెల్యే కుమారుడు కరణం వెంకటేష్ ఆమంచిని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి.  దర్శి నియోజకవర్గ వైసీపీలోనూ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మధ్య  పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రకాశం జిల్లా నేతల మధ్య సఖ్యతకు జిల్లా మంత్రి ప్రయత్నిస్తున్నా కొలిక్కి రావడం లేదట.    విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ టీడీపీ నుంచి వైసీపీలో చేరడంతో రాజకీయం రాజుకుంటుంది. సీనియర్‌ నాయకుడు కోలా గురువులు వర్గంతో పాటు మరో వర్గం  ఉంది. ఇప్పటివరకు ఎమ్మెల్యే వాసుపల్లిని వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు ఆయన వెనక తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఉన్న వైరంతో ఇప్పుడు తమపై కక్ష సాధింపు చర్యలు చేపడుతారనే భయం వారిని వేధిస్తుందట. గతంలో కార్పొరేటర్ల టిక్కెట్ల కోసం  పార్టీలో కుమ్ములాటలు కలకలం రేపాయి.  మరోవైపు ఎమ్మెల్యే కుమారులు కార్పొరేటర్లుగా పోటిచేస్తారన్న ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల కోసం అధికార పార్టీలో కార్పొరేటర్ల మధ్య పోటి పెరుగుతోంది. అంతర్గత కుమ్ములాటలు అగ్గిరాజేస్తున్నాయి.    చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే రోజా మధ్య  విభేదాలు ముదురుతున్నాయి. నగరిలో రోజాకు వ్యతిరేకంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ ఉన్నారు. అయితే కేజే కుమార్ భార్య కేజే శాంతిని రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ నియమించడం వైసీపీలో కాక రేపుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతోనే కె జె కుటుంబానికి ఈ అవకాశం దక్కినట్లు గా రోజా వర్గం భావిస్తోంది.తనకు చెక్ పెట్టేందుకే తన ప్రత్యర్థి వర్గానికి కీలక పోస్టులను మంత్రి పెద్దిరెడ్డి ఇప్పిస్తున్నారని రోజా ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. పెద్దిరెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు నగరి ఎమ్మెల్యే సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రోజాకు నచ్చ చెప్పలేక.. అటు సీనియర్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డితో మాట్లాడలేక వైసీపీ ముఖ్య నేతలు ఇబ్బంది పడుతున్నారని  సమాచారం.    సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో హైకమాండ్ సుప్రీంగా ఉంటుంది. కాని  వైసీపీ నేతలు పార్టీ నిర్ణయాలకు భిన్నంగా ప్రవర్తిస్తుండటం చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్న క్రమశిక్షణ ఇప్పుడు వైసీపీ సర్కార్‌లో ఎందుకు కనిపించడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. ఏపీలో అధికార పార్టీ నాయకుల్లో క్రమశిక్షణ లేకుండా పోతోందని,, వారిని గాడిలో పెట్టడంలో జగన్ విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా ఏపీలో వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో పార్టీపై... ముఖ్యమంత్రి జగన్ పట్టు కోల్పోయినట్లు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పార్టీ నేతలను కంట్రోల్ చేసే స్థితిలో జగన్ లేరని చెబుతున్నారు.

డల్లాస్..ఖల్లాసాయె!

తెరాస నేతలపై జనం తిరుగుబాటు   సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు           ‘‘ఇయ్యాల హైదరాబాద్‌ల వానపడితే లోతట్టు ప్రాంతాల్ల నీళ్లు. అసెంబ్లీ ముందట నీళ్లు. ముఖ్యమంత్రి ఇంటిముందట నీళ్లు. గవర్నర్ ఇంటి ముందట నీళ్లు. ఇదంతా ఎవరి పుణ్యమండి? హైదరాబాద్‌ల వానపడగానే కార్లన్నీ బోట్లయిపోతయని చెప్పిన. పడవలయిపోతయని చెప్పిన. నేను ఒక్కటే చెబుతా ఉన్న. హైదరాబాద్‌లో వానకాలంల పేదల ఇళ్లకు, బస్తీలకు నీళ్లు రావద్దంటే ఖర్చు పెట్టాల్సిన సొమ్ము 11 వేల కోట్ల రూపాయలు. 25 నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప, ఈ నగరం బాగుపడే పరిస్థితి లేదు. ఇది ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చేయాల. కేసీఆర్ గానీ, టీఆర్‌పార్టీ గానీ వందశాతం పట్టినపట్టు విడవకుండా పనిచేసే పార్టీ. ఇయ్యాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గల్లీ గల్లీ తిరిగిన్రు. మీ సమస్యలు తెలుసుకొన్నరు. అన్నీ క్రోడీకరించిన్రు. నేను కంటున్నది ఒకటే కల. ఆ కల చేసి తీరతానని చెబుతున్న. మేం కనే హైదరాబాద్ ఒక విశ్వనగరం కావాలె. అద్భుతమైన పట్టణం కావాలె. అమెరికాలో డల్లాస్ కంటే గొప్పనగరం కావాలె. కేసీఆర్ ఏం చెప్పినా మొండోడని మీకు తెలుసు. పానం పోయినా సరే, ఈ జంటనగరాలను బ్రహ్మాండంగా చేస్తానని మనివి చేస్తా ఉన్నా’’- ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాఏళ్ల క్రితం చేసిన ప్రసంగం.   అలాంటి డల్లాస్ ఇప్పుడు బురద నీటితో ఖల్లాసయిపోయింది. జంట నగరాల్లో పడుతున్న భారీ వర్షాలతో, జనజీవనం అతలాకుతలమవుతోంది. నగరం నరకమవుతున్న దృశ్యాలు, రాదార్లు గోదార్లవుతున్న చిత్రాలు జనంలో కేసీఆర్ సర్కారుపై, వ్యతిరేకతను పెంచుతున్నాయి. అపార్టుమెంట్ల సెల్లార్లలో వచ్చి చేరిన నీటిలో.. అనకొండలు పాకుతుంటే, మధ్యలో మొసళ్లు కూడా జలకాలాడుతున్న దృశ్యాలు నగర జనంలో సర్కారుపై ఆగ్రహాన్ని పెంచుతున్నాయి. మనిషి ఎత్తు  మునిగిన కాలనీలు, మురికివాడలు, బస్తీలను చూసి ఉంటే కేసీఆర్.. బహుశా ఈ మహానగరాన్ని డల్లాస్‌తో పోల్చి ఉండేవారు కాదేమో?!   ప్రజలు తమ కష్టాలు తీర్చలేని తెరాస సర్కారుపై ఆగ్రహంతో, అంత బాధల్లోనూ సోషల్‌మీడియాలో విడుదల చేస్తున్న.. కేసీఆర్, కేటీఆర్ పాత హామీల వీడియోలు.. జనం నిలదీతతో బిక్కచచ్చిపోతున్న తెరాస ప్రజాప్రతినిధుల దృశ్యాలు.. మంత్రులను సైతం ఖాతరు చేయకుండా మహిళలు  నిగ్గదీస్తున్న ఫొటోలు పరిశీలిస్తే.. తెరాసపై ప్రజల ఆగ్రహజ్వాల ఏ స్థాయిలో ఉందో ఆ వీడియోలే చెబుతున్నాయి.   తాజాగా మళ్లీ కురుస్తున్న భారీ వర్షాలతోపాటు, మొన్నటి వర్షాలకు చేదుజ్ఞాపికంగా  నిలిచిన నీళ్లు-  బురద,  కలసి వెరసి.. తెరాస నేతలపై ప్రజల తిరుగుబాటుకు కారణమవుతోంది. తమ వద్దకు పరామర్శకో, ఫొటో సెషన్‌కో వస్తున్న ప్రజాప్రతినిధులను, ప్రజలు గుక్కతిప్పుకోకుండా నిలేసి నిగ్గదీసి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న తీరు.. తెరాసకు రాజకీయ శరాఘాతమే!  తమ వద్దకు ఎవరూ రాలేదని కొందరు, పాలు-నీళ్లు లేకుండా అలమటించిపోతున్నామని ఇంకొందరు, మా కష్టాలను పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వస్తున్నారని మరికొందరు,  తెరాస నేతలను ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ తరహా నిలదీతలో మహిళలే ముందున్నట్లు సోషల్‌మీడియాలో వస్తున్న వీడియోలు స్పష్టం చేస్తున్నాయి.   ఇటీవల ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, బోటులో స్థానికులను పరామర్శించేందుకు ఓ కాలనీకి వెళ్లారు. అక్కడ అపార్టుమెంటు పైఅంతస్తులో చిక్కుకున్న మహిళలు సంధించిన ప్రశ్నలకు ఎమ్మెల్యే వద్ద జవాబు లేదు. ఇక్కడ ఎవరు ఇల్లు కట్టుకోమని చెప్పారని ఎమ్మెల్యే స్థానికులను ఎదురు ప్రశ్నిస్తే.. పర్మిషన్ ఎవరిచ్చారు? దీన్ని మేం కట్టుకున్నామా? ఓట్లు అడిగేటప్పుడూ ఇట్లనే వచ్చి వెళతారా? అని శరపరంపరగా ప్రశ్నల వర్షం కురిపించిన వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.   అటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తలసాని కూడా సందర్శన సందర్భంగా స్థానికుల ఆగ్రహానికి గురయ్యారు. ఇక పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై మహిళలు సైతం.. రాయలేని విధంగా దుర్భాషలాడి, అక్కడికి వచ్చిన మునిసిపల్ కమినర్‌పై విరుచుకుపడ్డారు. బూతులు లంకించుకున్నారు. అయినా పాపం కమిషనర్ మౌనంగా వాటిని భరించాల్సి వచ్చింది. వర్షంలో కొట్టుకుపోయిన తన కుటుంబసభ్యుడిని,  నాలుగురోజులైనా గాలించలేని అసమర్ధ ఎమ్మెల్యే పదవి ఎందుకంటూ స్థానికులు బూతులు మాట్లాడుతూ, తాము తీసిన వీడియోను ఎమ్మెల్యేకే పంపించారు. అది ఇప్పుడు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.   దీన్నిబట్టి.. సహాయ కార్యక్రమాలలో సర్కారు వైఫల్యాన్ని,  ప్రజలు తెరాస ప్రజాప్రతినిధులపై ఆగ్రహ రూపంలో తీర్చుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. బహుశా.. ప్రజాగ్రహాన్ని చూసిన తర్వాతనే.. గ్రేటర్ ఎన్నికల విజయంపై,   ఒక్క తెరాస నాయకుడు కూడా.. మునుపటి మాదిరిగా ధీమా వ్యక్తం చేస్తూ ప్రకటనలివ్వడం మానేసినట్టుంది. ఈ సందర్భంగా.. సోషల్‌మీడియాలో నెటిజన్లు వ్యంగ్యంగా రూపొందించిన ఓ  పోస్టింగ్ ఆసక్తికలిగిస్తోంది. గత ఎన్నికల ముందు ఇంటింటికీ నీరు ఇవ్వకపోతే మళ్లీ ఓట్లు అడిగేది లేదన్న కేసీఆర్ హామీ.. ఈ విధంగా నెరవేరిందంటూ, తమ ఇళ్లలో చేరిన వాన నీటి ఫొటోలు పెట్టి వైరల్ చేస్తున్న పరిస్థితి. -మార్తి సుబ్రహ్మణ్యం

హమ్మయ్య.. హక్కుల కమిషన్‌కు జగనన్న ఓకే!

‘ధిక్కరణ’ వచ్చే వరకూ నిద్రపోతున్న అధికారులు   ఏబీ వెంకటేశ్వరరావు కేసులోనూ అదే నిర్లక్ష్యం   ఎట్టకేలకూ హెచ్చార్సీకి  నోటిఫికేషన్ జారీ   సర్కారుకు తప్పిన కోర్టు ధిక్కారం   రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకూ ఏర్పడని ఏపీ మానవ హక్కుల కమిషన్‌పై, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చివరాఖరకు స్పందించింది. దానితో సర్కారు కోర్టు ధిక్కరణ గండం నుంచి బయటపడినట్టయింది. మానవ హక్కుల కమిషన్‌ను నియమించాలని ఏపీ హైకోర్టు ఆదేశించి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకూ జగన్మోహన్‌రెడ్డి సర్కారు దానిపై దృష్టి సారించలేదు. హక్కుల కమిషన్ విభజన కాకపోవడం, ఏపీ హెచ్చార్సీని ఏర్పాటుచేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో స్పందించిన ప్రభుత్వం ఎట్టకేలకు, హెచ్చార్సీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది.   మానవ హక్కుల కమిషన్ అనేది.. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక బలమైన న్యాయసాధనం. అక్కడ సామాన్యుడు తమ కష్టం చెప్పడానికి ఫీజులేమీ చెల్లించనక్కర్లేదు. ఒక్క అర్జీ పెట్టుకుంటే చాలు. హక్కుల కమిషన్ స్పందిస్తుంది. కాకుమాను పెదపేరిరెడ్డి... ఉమ్మడి రాష్ట్ర హక్కుల కమిషన్ యాక్టింగ్ చైర్మన్‌గా ఉన్నప్పుడయితే, పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా సుమోటోగా తీసుకుని అధికారులకు నోటీసులిచ్చి, కమిషన్‌కు పిలిపించిన సందర్భాలున్నాయి.   అంత ప్రాముఖ్యం ఉన్న హక్కుల కమిషన్ ఏపీకి ఇప్పటివరకూ నియమించలేదు. దానితో బాధితులు హైదరాబాద్‌లో ఉన్న, ఇంకా విడిపోని హక్కుల కమిషన్ కార్యాలయానికి వస్తున్నారు. ఆ విధంగా గత 9 నెలల నుంచి ..హైదరాబాద్ లోని హక్కుల కమిషన్ కార్యాలయంలో ఏపీకి సంబంధించిన కేసులు, ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. అటు ఏపీకి చెందిన ఉద్యోగులు కూడా, ఇంకా హైదరాబాద్‌లోనే పనిచేస్తున్న పరిస్థితి ఏర్పడింది. మూడు నెలల్లో హక్కుల కమిషన్ నియమిస్తామని, స్వయంగా ఏపీ అడ్వకేట్ జనరల్.. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్న బెంచికి హామీ ఇచ్చి నెలలు దాటిపోయింది. దానితో కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా వేశారు.   దీనితో స్పందించిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. హక్కుల కమిషన్ నియామకానికి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.  ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులతో కూడిన హెచ్చార్సీలో నియమితులయ్యేందుకు ఆసక్తి ఉన్న వారు.. అక్టోబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని, ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాష్ పేరుతో నోటిఫికేషన్ విడుదలయింది. ఇప్పటికయినా హక్కుల కమిషన్‌పై ప్రభుత్వం స్పందించడం సంతోషమే.   అయితే తాజా నోటిఫికేషన్‌ను పరిశీలిస్తే... అధికారులకు, ఎవరైనా  ప్రభుత్వ గొంతుపై కత్తి పెట్టినప్పుడే, లేదా గొంతుమీదకు వచ్చినప్పుడే పాత ఫైళ్లు గుర్తుకొస్తాయన్న విషయం మరోసారి స్పష్టమయింది. నిజానికి హెచ్చార్సీ నియామకంపై, హైకోర్టు ఆదేశాలిచ్చి కొన్ని నెలలు దాటిపోయాయి. అయినా దానిని నియమించకపోవడంతో, కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయాల్సి వచ్చింది. దీనితో అప్పటికప్పుడు కదిలిన అధికారులు, వాయువేగంతో హెచ్చార్సీ ఫైలును దుమ్ముదులిపి, నియామకానికి సంబంధించి, నోటిఫికేషన్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.   సీనియర్ ఐపిఎస్ అధికారి, డీజీ అయిన  ఏబీ వెంకటేశ్వరరావు కేసునే తీసుకుందాం. ఆయన కేసులో కూడా ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు. ఆయనకు సస్పెన్షన్ కాలంలో రావలసిన జీతం, ఇతర ఆర్థిక ప్రయోజనాలతోపాటు, నిర్ణీత గడువులో వివరణ తీసుకోవాలనే మూడు అంశాలతో హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే.. ప్రభుత్వం వాటినేమీ అమలు చేయలేదు. దానిపై ఏబీవీ మళ్లీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఆ గడువు కూడా ముగిసింది. అప్పటివరకూ ఆయనకు సగం జీతం ఇచ్చిన ప్రభుత్వం, కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన తర్వాత దానిని కూడా నిలిపివేసింది. అంటే ఇది కక్షసాధింపుగానే కోర్టు భావించే అవకాశాలు లేకపోలేదు. ఈ అధికారి విషయంలో కూడా అధికారులు సరైన విధంగా స్పందించకపోవడంతో, ప్రభుత్వం మరోసారి ధిక్కరణ కేసు ఎదుర్కోవలసి వచ్చింది. అదే ధిక్కరణ పిటిషన్ వేయకముందే మేల్కొని, కోర్టు ఆదేశాలు అమలుచేసి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదు.   నిజానికి ఇలాంటి కీలక అంశాలలో.. ప్రభుత్వ పరువు పోకుండా- ఉన్నతాధికారులు కోర్టు మెట్లు ఎక్కకుండా.. అధికారులే పర్యవేక్షించి, సమన్వయం చేస్తుండాలి. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫలితంగా, ప్రభుత్వం అప్రతిష్టపాలు కావలసివస్తోందన్న వ్యాఖ్యలు, అటు న్యాయవాద వర్గాల్లో కూడా వినిపిస్తున్నాయి. తాజాగా హెచ్సార్సీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ ఏదో.. హైకోర్టు విధించిన గడువులోగా ఇచ్చి ఉంటే, కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయ్యేది కాదని, అటు వైసీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.   హెచ్చార్సీ-ఏబీ వెంకటేశ్వరరావు వేసిన ధిక్కరణ పిటిషన్లు పరిశీలిస్తే... ఉన్నతాధికారులకు-ప్రభుత్వ న్యాయవాదుల మధ్య సమన్వయం లేదా? లేక ప్రభుత్వ న్యాయవాదులు చెప్పే సూచనలను, అధికారులు పాటించడం లేదా? పోనీ .. ముఖ్యమంత్రి దృష్టికి,  కోర్టులకు సంబంధించి కీలకమైన అంశాలను తీసుకువెళ్లడంలో సీఎంఓ విఫలమవుతోందా? అసలు ఇవేమీ కాకుండా.. సీఎం ఆదేశాల ప్రకారమే, ఈ వ్యవహారాలు నడుస్తున్నాయా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. నిజం ‘జగన్నాధుడి’కెరుక? -మార్తి సుబ్రహ్మణ్యం

టీఎస్ సర్కార్ కు దెబ్బ మీద దెబ్బ! కారుకు కౌంట్ డౌనేనా? 

తెలంగాణలో ఆరున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కార్ కొనసాగుతోంది. విపక్షాలు బలంగా లేకపోవడంతో పాలనంతా సీఎం కేసీఆర్ అనుకున్నట్లే జరుగుతోంది. కొత్త పథకాలు, ప్రాజెక్టులన్ని ఆయన ఎజెండా ప్రకారమే రూపుదిద్దుకుంటున్నాయి. విపక్షాల ఊసే లేకుండా అన్నింటా తన ముద్ర వేసుకుంటున్నారు గులాబీ అధినేత. అయితే ఎదురే లేకుండా సాగుతున్న టీఆర్ఎస్ పాలనకు కొన్ని రోజులుగా రివర్స్ సీన్లు కనిపిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ప్రాజెక్టుల కాల్వలకు గండ్లు, విద్యుత్ కేంద్రాల్లో మంటలు. కాళేశ్వరం పంపులు బంద్, మునిగిన కల్వకుర్తి పంపులు.. ఇలా వరుసగా భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో కేసీఆర్ సర్కార్ ప్రతిష్ట మసక బారుతున్నట్లు చెబుతున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో కారు పార్టీ నేతల్లో కలవరం కనిపిస్తోంది.    ఇటీవల శ్రీశైలం లెఫ్ట్‌‌ పవర్‌‌ హౌస్‌‌లో అగ్ని ప్రమాదంతో హైడల్‌‌ పవర్‌‌ జనరేషన్‌‌ పూర్తిగా నిలిచిపోయింది. పవర్‌‌ స్టేషన్‌‌లో రిపేర్లు పూర్తి చేశామని, త్వరలోనే కరెంట్‌‌ ఉత్పత్తి మొదలు పెడుతామని జెన్‌‌కో ఆఫీసర్లు చెప్తున్నా.. అది ఇంకా వినియోగంలోకి రాలేదు. ఇంతలోనే శ్రీశైలంపైనే ఆధారపడి నిర్మించిన కల్వకుర్తి పంపుహౌస్‌‌ నీట మునగడం దుమారం రేపుతోంది. కల్వకుర్తి పంపులు మునగడంతో  శ్రీశైలం నుంచి ఆ ఏడాది చుక్క నీటిని కూడా వినియోగించుకోలేని దుస్థితి తలెత్తింది. ప్రభుత్వం దూరదృష్టితో కాకుండా కొందరు కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికి ప్రాధాన్యం ఇవ్వడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వస్తున్నాయి.   2015 సెప్టెంబరులో కూడా ఎంజీఎల్‌ఐ మొదటి లిఫ్టు పూర్తిగా మునిగిపోయింది. అప్పట్లో ఎంజీఎల్‌ఐ నిర్వహణ విషయంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అప్రోచ్‌ కెనాల్‌ నుంచి సర్జిఫుల్‌ షట్టర్లు బిగించకుండా నిర్లక్ష్యం వహించినందుకే మోటార్లు నీట మునిగాయని పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అయినా కల్వకుర్తి పంపులపై నిర్లక్ష్యంగా ఉండటం ఆందోళన కల్గిస్తోంది.ఇక ఈ సీజన్ లో జూలైలోనే కృష్ణా నదికి వరదలు వచ్చినా కల్వకుర్తి పంపులు ఆన్ కాలేదు. కరోనాతో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో 10 రోజులు పాటు భారీగా వరద పోతున్నా నీటిని ఎత్తిపోయలేకపోయారు. వరదలు వచ్చే సమయంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్ దగ్గర సరిపడా ఉద్యోగులను కూడా నియమించుకోలేని దుస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం విప7ాలు ఆరోపించడం అధికార పార్టీని ఇబ్బందుల్లో పడేసింది.    రెండు నెలల క్రితం ఆగస్టులో శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది ఉద్యోగులు చనిపోయరు. 220 కేవీకి డీసీ కరెంటు సరఫరాకు బ్యాటరీలు బిగించే సమయంలో ప్యానల్ బోర్డులో మంటలు వచ్చి అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్ లో సమస్యలపై ఎన్నిసార్లు చెప్పినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఉద్యోగులు ఆరోపించారు. పవర్ ప్లాంట్ లో మరమ్మత్తు పనులు ఇంకా జరుగుతున్నాయి. మంటలతో ఎంత నష్టం జరిగిందన్న విషయం ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పలేదు. సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే మంటలు వచ్చినట్లు ఉద్యోగులు కూడా ఆరోపించారు. ప్రమాదం వెనుక నిర్లక్ష్యం, అవినీతి ఉందనడానికి సాంకేతిక ఆధారాలున్నాయని కాంగ్రెస్ తెలిపింది. శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. సీఎం కేసీఆర్ మాత్రం సీఐడీ విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై దర్యాపు ఇంకా సాగుతూనే ఉంది.   ఇక సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి మూడు గండ్లు.. ఆరు లీకులుగా మారింది. లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిన ప్రాజెక్టు నాసిరకం పనులతో డేంజర్ గా బెల్స్ మోగిస్తోంది. ప్రారంభించిన నెలల్లోనే కాల్వలకు గండ్ల పడుతున్నాయి. కొండపోచమ్మ జలాశయం కాలువ వద్ద  కాంట్రాక్టర్లు నిర్మించిన వంతెన  ఒక్కసారిగా కుప్పకూలింది. జలాశయం కుడికాలువ ద్వారా సంగారెడ్డికి నీటిని విడుదల చేసే కాలువ గేట్ల వద్దకు వెళ్లేందుకు వీలుగా జలశాయం కట్టపై నుంచి ఈ వంతెను నిర్మించారు. కట్టిన మూడు నెలలకే కూలిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.     సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ నుంచి మల్లన్న సాగర్ కు నిటిని తరలించే సోరంగంకు తోగుట మండలం ఎల్లారెడ్డి పేట వద్ద   గండి పడింది. ఈ సొరంగం నుంచే నీరు కొండ పొచమ్మ సాగర్ వెళుతోంది.  సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కేవలం నాలుగేళ్లలోనే 15 టీఎంసీల సామర్థ్యంతో కొండ పోచమ్మ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను నిర్మించారు. అయితే నాసిరకం పనులతోమర్కుక్ మండల శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు కొన్ని రోజులకే గండిపడింది. జలాశయం నుంచి బయటపడిన నీరు గ్రామాన్ని ముంచెత్తింది.పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేయడం వల్లే గండ్లు పడుతున్నాయని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వలకు గండ్లు.. పవర్ జనరేషన్ లో కీలకమైన విద్యుత్ కేంద్రాల్లో మంటలు.. పంపు హౌజుల్లోకి వరదలు.. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలతో అదికార పార్టీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని విపక్షాలు చెబుతున్నాయి. ఏకపక్షంగా సాగే పాలన ఎక్కువ రోజులు ఉండదని, అక్రమాలన్ని  ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయంటున్నారు. ప్రజాక్షేత్రంలోనూ కేసీఆర్ కు గుణపాఠం తప్పదని విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.

దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీకి ప్లాన్ సిద్ధం చేసిన కేంద్రం.. ముందుగా వారికే..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు వ్యాక్సిన్ పై పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని చివరి దశ ట్రయల్స్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మనదేశంలో వ్యాక్సిన్ పంపిణీ కోసం కార్యాచరణను సిద్ధం చేసింది. అంతేకాకుండా మొట్టమొదటిగా ఈ వ్యాక్సిన్ ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై కూడా స్పష్టమైన ఒక అవగాహనకు వచ్చింది. దేశంలోని దాదాపు 30 కోట్ల మందికి మొదటగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి, వృద్దులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.   దేశంలోని 2 కోట్ల మంది రక్షణ సిబ్బంది, 70 లక్షల మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, 26 లక్షల మందికి పైగా సాధారణ ప్రజలు (50 ఏళ్లకు పైబడినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు వ్యక్తులు) ఈ జాబితాలో ఉన్నారు. దీనికోసం బూస్టర్ డోస్ తో కలిపి మొదటి విడతలో 60 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయని కేంద్రం భావిస్తోంది. మొదటి దశలో వ్యాక్సిన్ అందుకునేవారి జాబితా అక్టోబరు నెలాఖరుకు గాని లేదంటే నవంబరు మొదటివారం నాటికి గాని సిద్ధమవుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

న్యూజిలాండ్ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన జసిండా

న్యూజిలాండ్ ప్రధానిగా జసిండా ఆర్డర్న్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ నెల 17న జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం న్యూజిలాండ్‌లో అధికారంలో ఉన్న జసిండా ఆర్డర్న్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జసిండా ఆర్డర్న్.. భారీ మెజార్టీతో గెలిపించినందకు ప్రజలకు కృతజ్జతలు తెలిపారు. తదుపరి మూడు సంవత్సరాల్లో చేయాల్సిన పని చాలా ఉందని, న్యూజిలాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కరోనా ఏర్పరచిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.    కాగా, కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధానిగా జసిండా ఆర్డర్న్ కు ప్రజల్లో మంచి పేరుంది. అగ్రదేశాలు సైతం కరోనా దెబ్బకి అల్లాడిపొతే, జసిండా ఆర్డర్న్ సమర్థవంతంగా మహమ్మారిపై పోరాడి న్యూజిలాండ్ ని కరోనా ఫ్రీ కంట్రీగా చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.

గడువు ముగిస్తే వేటేసినట్టా! వైసీపీ సంబరాలెందుకు? 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని పదవులకు గడువు ఉంటుంది. గడువు ముగిశాక ఆ పోస్టులను వేరేవారితో భర్తి చేస్తారు. కొన్ని సార్లు పాతవారినే మళ్లీ నియమిస్తారు. పార్లమెంట్, అసెంబ్లీ స్టాడింగ్ కమిటీల్లోనూ అంతే. కొన్నిసార్లు ఏడాదికో కమిటీ వేస్తారు. కొన్ని సార్లు ఒకే కమిటీని రెండు, మూడు ఏండ్ల పాటు కొనసాగిస్తారు. కొన్ని సార్లు కమిటీల చైర్మెన్లను మాత్రమే మారుస్తారు. ఇంకొన్ని సార్లు చైర్మన్లుగా పాత వారికే రెన్యూవల్ ఇస్తూ.. కమిటీలో సభ్యులను మారుస్తుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్ ను మార్చడాన్ని పెద్ద విషయంగా ప్రచారం చేస్తోంది. గతంలో ఎప్పుడూ జరగనట్లుగా కలరింగ్ ఇస్తోంది.     పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్ గా ఉన్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజును మార్చడంపై వైసీపీ సంబరాలు చెసుకుంటోంది. కొంత కాలంగా వైసీపీని చెడుగుడు ఆడుతున్నారు రఘురామ కృష్ణం రాజు. జగన్ సర్కార్ వైఫల్యాలు, వైసీపీ నేతల అక్రమాలపై ఆయన చేసే ఆరోపణలు, విమర్శలు జనాల్లోకి వెళుతున్నాయి. దీంతో ఆయనకు కౌంటర్ ఇవ్వలేక దిక్కులు చూస్తోంది వైసీపీ. ఇప్పుడు రఘురామ ప్లేస్ లో పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్ గా మరో ఎంపీని లోక్ సభ స్పీకర్ నియమించడంతో వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రఘురామ పై వేటు పడిందని ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే స్పీకర్ ఆయన్ను చైర్మెన్ గా తప్పించారని చెబుతున్నారు.    వైసీపీ ప్రచారానికి అసలు జరిగిన దానికే పొంతనే లేదని తెలుస్తోంది. పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్ గా ఏడాది క్రితం రఘురామను నియమించారు. ఇప్పుడు దాని గడువు ముగిసింది. దీంతో స్పీకర్ మరొకరిని నియమించారు. లోక్ సభలో పార్టీల బలాబలాల ఆధారంగా ఈ నియామకాలు జరుగుతుంటాయి. ఇదే విషయాన్ని వివరిస్తూ వైసీపీ బండారాన్ని బయటపెట్టారు రఘురామ కృష్ణం రాజు. తనను పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి తొలగించాలని మూడు నెలల క్రితమే వైసీపీ ఎంపీలు స్పీకర్ కు లేఖ రాశారని చెప్పారు. అయితే మధ్యలో తొలగించడం కుదరదని స్పీకర్ అప్పుడే చెప్పారని తెలిపారు. తాజాగా తన పదవి కాలం అయిపోవడంతో కొత్త వారిని నియమించారని చెప్పారు. ఇది ఎప్పుడూ జరిగేదేనని.. వైసీపీ నేతలు ఎందుకు సంబరపడుతున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు రఘురామ.    వైసీపీతో కొన్ని నెలలుగా విభేదిస్తున్నారు రఘురామ కృష్ణం రాజు. జగన్ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయినా రఘురామను పార్టీ నుంచి సస్పెండ్ చేయని వైసీపీ..పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆయన్ను తప్పించాలని ప్రయత్నించింది. మూడు నెలల క్రితమే ఆ పని చేసినా స్పీకర్ ఒప్పుకోకపోవడంతో సాధ్యం కాలేదు. ఇప్పుడు రొటిన్ గా మార్పు జరిగినా తామే వేటు వేయించామన్నట్లుగా వైసీపీ విష ప్రచారం చేస్తుందని రఘురామ చెప్పారు.     ఎంపీ రఘురామరాజుపై మరో ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు. త్వరలోనే ఎంపీపై అనర్హత వేటు పడుతుందని చెబుతున్నారు. జగన్ అనుకూల మీడియాలో దీనిపై వార్తలు కూడా వస్తున్నాయి. వైసీపీ కొత్త ప్రచారంపైనా ఘాటుగా స్పందించారు రఘురామ రాజు. తనను ఎవరూ తొలగించలేరని స్పష్టం చేశారు. ఎవరు ఎవరిని తొలగిస్తారో త్వరలోనే తెలుస్తుందన్న నర్సాపురం ఎంపీ.. పదవి నుంచి తొలగించడమంటే అది పూర్తిగా వేరుగా ఉంటుందని.. దాని సంగతి ప్రజలే చూస్తారని హెచ్చరించారు. తనపై అనర్హత వేటు పడుతుందని ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలకు మరో సవాల్ విసిరారు రఘురామరాజు. సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేసారు. అమరావతి రాజధాని అంటూ రిఫరెండంగా ఎన్నికలకు వెళ్తే సీఎం వైఎస్ జగన్‌ పైనే 2 లక్షల మెజార్టీతో నేను గెలుస్తానని చెప్పారు. దమ్ముంటే సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.   రఘరామరాజు విషయంలో గతంలోనూ వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. వైసీపీ గుర్తుపై గెలిచిన రఘురామ రాజు తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని మంత్రి బాలినేనితో పాటు కొందరు వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వారి ఆరోపణలకు స్పందించిన రఘురామ తాను రాజీనామాకు సిద్ధమని..  అయితే ఉప ఎన్నికను అమరావతి రాజధానిగా రెఫరెండంగా తీసుకోవాలని సవాల్ చేశారు. రఘురామ సవాల్ ను స్వీకరించేందుకు అధికార పార్టీ వెనకడుగు వేసింది. దీంతో అమరావతిని రెఫరెండంగా తీసుకుంటామనే ధైర్యం చేయలేక రఘురామ సవాల్ నుంచి వైసీపీ నేతలు పారిపోయారనే విమర్శలు వచ్చాయి.

దుబ్బాక వైపు కన్నెత్తి చూడని రాములమ్మ.. కారణం అదేనా?

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్‌ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర నాయకత్వాన్ని మొత్తం దుబ్బాకలో ప్రచారానికి దింపింది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ, దుబ్బాకలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే, దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఫైర్‌ బ్రాండ్‌ విజయశాంతి కంటికి కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.    విజయశాంతి గతంలో మెదక్ ఎంపీగా పనిచేశారు. మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ఆమె కీలక నేత. అలాంటిది, ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంటే ఆమె కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.    దుబ్బాక ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరఫున విజయశాంతిని నిలపాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు తొలుత వార్తలొచ్చాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో స్థానికంగా ఆమెకున్న పట్టు, ఆమె వ్యక్తిగత ఇమేజ్ తో ఉపఎన్నికలో సులభంగా గెలవొచ్చని  రాష్ట్ర నాయకత్వం భావించిందని.. దీనికి ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనికి స్థానిక నేతల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవ్వడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీనికితోడు మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి చివరి నిమిషంలో కాంగ్రెస్ లో చేరడంతో స్థానిక సమీకారణాలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు టికెట్ ఇచ్చారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురైన విజయశాంతి దుబ్బాక వైపు కన్నెత్తి కూడా చూడటంలేదని తెలుస్తోంది.   మరోవైపు, విజయశాంతి ఇక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటారని, ఇకపై సినిమాల్లో నటించేందుకు పూర్తి సమయం కేటాయిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. గతంలో లేడీ అమితాబ్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి చాలా ఏళ్ళ విరామం తర్వాత.. మహేష్‌ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరూ మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఆ మూవీ అనంతరం ఆమెకు వరస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఆమె రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమయ్యారని, ఇకపై సినిమాల్లో నటించేందుకు పూర్తి సమయం కేటాయిస్తారని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర ఘర్షణ.. మధ్యలో బలైన పోలీసు అధికారులు 

గుంటూరు జిల్లా పల్నాడు పౌరుషాలకు పెట్టింది పేరు. అటువంటి చోట ఇద్దరు అధికార వైసీపీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు సర్కార్ కు తలనొప్పిగా మారింది. గత కొంత కాలంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తి వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోకి అదే ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులును అడుగు పెట్టనివ్వకుండా చేయాలని ఎమ్మెల్యే రజనీ, ఆమె అనుచరులు రెండుమూడు సార్లు ప్రయత్నించారని సమాచారం. దీనికి కారణం.. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారివద్దకు ఎంపీ వెళుతున్నారనీ, వారితో ఎక్కువగా సఖ్యతతో మెలగుతున్నారనీ ఎమ్మెల్యే కోపమట. ఈ ప్రయత్నంలో భాగంగా తన అనుచరులతో ఎంపీ కారును అడ్డుకునేలా ఎమ్మెల్యే చేయడంతో ఈ వివాదం తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది.   ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే విడదల రజనీ అనుచరులు తమ నియోజకవర్గంలో భూసేకరణ సమయంలో రైతుల వద్ద లక్షల్లో కమీషన్లు దండుకుంటున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని ఎమ్మెల్యే రజనీ పార్టీ అధిష్టానానికి తెలియచేసారు. ఆ ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలో జరిగిన అక్రమ తవ్వకాలపై కూడా ఎంపీ విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఆ అక్రమ తవ్వకాలు ఎమ్మెల్యే రజనీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని కూడా ఎంపీ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.   ఇది ఇలా ఉండగా.. గత కొద్దిరోజులుగా తనతోపాటు తన పీఏ, మరో ముఖ్య అనుచరుడి ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టి.. తాము ఎవరెవరితో మాట్లాడుతున్నామనే కాల్‌ డేటాను గురజాల డీఎస్పీ, సీఐలు సేకరించారని ఎమ్మెల్యే రజనికి తెలిసింది. ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా ఎంపీ తమ ఫోన్ల పై నిఘా పెట్టిన విషయాన్ని సీరియస్‌గా తీసుకుని.. ఈ విషయాన్ని ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత దృష్టికి ఆమె తీసుకెళ్లారట. దీంతో ఆ ఇద్దరు అధికారులపై రాత్రికిరాత్రే వేటు పడింది. ఎమ్మెల్యే కాల్‌డేటా సేకరించిన పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ డీఎస్పీ, సీఐలను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే తమకు ఆ ఫోన్ నంబర్లు ఎవరివో తెలియవనీ, ఎంపీ సూచన మేరకే అలా చేశామనీ ఆ ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నతాధికారులతో మొర పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.   అయితే ఈ మొత్త్తం వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచేందుకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ప్రయత్నించారని తెలుస్తోంది. అంతేకాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్‌ పై ఎంపీ నిఘా పెట్టించిన విషయం బయటకు పొక్కితే అటు పార్టీ.. ఇటు ప్రభుత్వం పరువు పోతుందని భావించిన పెద్దలు.. అసలు విషయం బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారు. ఇద్దరు పోలీసు అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించినందుకే వారిపై చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారులు చెప్పడం ఇక్కడ విశేషం.

ఏడుకొండలవాడి సొమ్ముపై కన్నేసిన జగన్ సర్కార్..!

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే సేవా ట్రస్టులకు వచ్చే విరాళాలను "అధిక వడ్డీ కోసం" రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని టీటీడీ పెద్దలు నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఏ నెలకు ఆ నెల అప్పులు చేస్తూ పీక‌ల్లోతూ అప్పుల్లో ఉన్న ఏపీ ప్ర‌భుత్వాన్ని ఆదుకునేందుకు చేతనైన సాయం చేసేందుకు టీటీడీ పెద్దలు తీర్మానించారు. దీంతో తిరుమ‌ల శ్రీ‌వారి సొమ్మును వాడుకునేందుకు రంగం సిద్ధ‌మ‌యిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసిన ఏడుకొండ‌ల వాడి సొమ్మును విత్ డ్రా చేసి, ఆ డబ్బుతో ఏపీ ప్ర‌భుత్వ బాండ్ల‌ను కొనుగోలు చేయాల‌ని టీటీడీ పాల‌క‌మండ‌లి నిర్ణ‌యించింది.   మొద‌ట కేంద్ర ప్ర‌భుత్వ సెక్యూరిటీస్ లో డిపాజిట్ అని నిర్ణ‌యం తీసుకొని.. తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వ సెక్యూరిటీలు అని స‌వ‌ర‌ణ చేయ‌టం ద్వారా నిధుల కొరతతో సతమతమవుతున్న సర్కార్ నెత్తిన పాలు పొసే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో తిరుమల శ్రీ‌వారి సొమ్మును రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జానా అవ‌స‌రాల కోసం వాడుకునేందుకే ఈ త‌తంగం అంతా న‌డిపించార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతుంది.   ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ‘‘టీటీడీ అన్నదాన ట్రస్టు, బర్డ్‌ ట్రస్టు, గోసంరక్షణ ట్రస్టు... ఈ మూడు ట్రస్టుల రోజువారీ కార్యకలాపాలు వడ్డీ సొమ్ములతోనే నడుస్తున్నాయి. అందువల్ల, అధిక వడ్డీ కోసం సెక్యూరిటీలలో సొమ్ము డిపాజిట్‌ చేయాలి’’ అంటూ ఒక వింత కారణం చూపించారు. మొత్తానికి "ట్రస్టుల రోజు వారీ కార్యకలాపాలకు వడ్డీయే దిక్కు" అని టీటీడీయే చెబుతోంది కాబట్టి, అయితే.. ప్రతినెలా లేదా మూడు నెలలకొక సారి వడ్డీ డబ్బులు చేతికందితే ఉపయోం ఉంటుంది. అయితే ఈ వెసులుబాటు బ్యాంకు డిపాజిట్లకే ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల కనీస సమయం 5 సంవత్సరాలు. అదే గరిష్ఠంగా అయితే 40 ఏళ్లు.. కానీ సర్వసాధారణంగా సెక్యూరిటీలలో 15 సంవత్సరాలు డిపాజిట్‌ చేస్తారు. అయితే వీటిపై మధ్యలో వడ్డీ చెల్లించే వెసులుబాటు ఉండదు. కాలపరిమితి పూర్తైన తర్వాత ఒకేసారి వడ్డీతో కలిపి డబ్బులు చెల్లిస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో 15 - 20 సంవత్సరాలకు పెట్టుబడి పెడితే... అవి మెచ్యూరిటీ అయ్యేనాటికి పరిస్థితి ఏంటో ఎవరు చెప్పలేరు. టీటీడీ ఆమోదించిన తీర్మానంతో ఆ ఏడుకొండలవాడి సొమ్మును సర్కారు వారు ఎంచక్కా వాడుకోవచ్చు!   ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముకు ప్రస్తుతం గరిష్టంగా 5.5 శాతం మాత్రమే వడ్డీ లభిస్తోందని…అదే బాండ్ల ద్వారా 7 శాతం లభించే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ముందుగా కేంద్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి అని మొదలు పెట్టి, తరువాత రాష్ట్ర ప్రభుత్వ బాండ్ల పేరుతో ఏపీ స‌ర్కార్ ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని అంచ‌నా వేస్తున్నారు. వచ్చే డిసెంబరులో భారీ ఎత్తున టీటీడీ ఫిక్సిడ్ డిపాజిట్ లు మెచ్యూర్‌ అవుతున్న నేపథ్యంలో ఈ నిధులను ప్రభుత్వ ఖజానాకు తరలించే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే తిరుమల శ్రీ‌వారి భూముల విక్ర‌యం చేసే ప్రయత్నం పై భారీగా వ్య‌తిరేక‌త రావ‌టంతో వెన‌క్కి త‌గ్గిన రాష్ట్ర ప్ర‌భుత్వం… ఇప్పుడు బాండ్స్ పేరుతో శ్రీ‌వారి ఆస్తుల‌ను వాడుకునే ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌రు ఫ‌లిస్తాయో వేచి చూడాలి.