మాకు సన్మానం చేస్తున్నవారికి త్వరలో రెట్టింపు సన్మానం.. జేసీ సంచలన వ్యాఖ్యలు
posted on Oct 9, 2020 @ 5:39PM
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి జగన్ సర్కార్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తాడిపత్రి గనుల శాఖ కార్యాలయానికి దివాకరరెడ్డి వచ్చారు. అయితే జేసీ వచ్చిన సమయానికి ఆఫీసులో గనుల శాఖ ఏడీ లేకపోవడంతో జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. తాను వస్తున్నట్టు తెలుసుకుని ఏడీ పారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. తాను మళ్లీ సోమవారం వస్తానని అయన స్పష్టం చేశారు.
అయితే చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన.. అధికార పార్టీపై, అలాగే అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం తన కుటుంబంతో దూరంగా ఉంటున్నానని.. తనకు లైవ్ లీ హుడ్ జరగడమే కష్టంగా ఉందని అయన చెప్పుకొచ్చారు. తన భార్య, చెల్లి పేరుతో గనులు ఉన్నాయని.. అయితే ఆ గనులను శోధించడానికి కొన్ని వాహనాల్లో 50 నుంచి 60 మంది వచ్చారు. వారిని చూసి ఇంతకీ వీళ్లెవరబ్బా..? అని అనుకున్నానని జేసీ అన్నారు.
"వైజాగ్ నుంచి నక్సలైట్లు ఏమైనా గనులకు వచ్చారా..? లేక పోలీసులు.. నక్సలైట్ల కోసం గాలిస్తున్నారేమో అనుకున్నానని అన్నారు. అదే ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో పాటు ఇతర నేతలకు కూడా గనులున్నా.. నా భార్య పేరుతో ఉన్న గనులను మాత్రమే పరిశీలించారు. వ్యక్తిగతంగా నా కుటుంబంపై కక్ష సాధించేందుకే ఆ అధికారులు ఇదంతా చేశారు. ఇప్పటికే ప్రభుత్వం నా కుటుంబాన్ని అన్ని రకాల బాధలకు గురిచేసింది. ఏమీ లేకుండానే ఎస్సీ, ఎస్టీ యాక్ట్ పెట్టి నా బ్రదర్‌ను లోపల వేశారు. ఈ కేసులన్నీ కేవలం కక్ష సాధింపులో భాగమే" అని జేసీ దివాకరరెడ్డి తెలిపారు.
"ఇప్పటి వరకూ జగన్ సర్కార్.. దివాకరరెడ్డిని టచ్ చేయలేకపోయింది. బహుశా నేనెప్పుడూ జగన్‌ను.. మా వాడు.. మా వాడు అంటున్నా కదా. ఆ సంబంధంతోనే ఏమీ చేయలేదు. అయితే తాజాగా గనులను క్లోజ్ చేసేందుకు వారు స్కెచ్ వేస్తున్నారు. ఈ గనులు తప్ప నాకు ఇతర ఆస్తిపాస్తులేమీ లేవు. అందులో వచ్చే ఆదాయంతోనే అన్నం వండుకుని తింటున్నాము. అది కూడా లేకుండా మాడ్చి చంపడానికే చూస్తున్నారు. కొద్ది రోజుల్లోనే మైనింగ్ కూడా లేకుండా చేయాలనే సంకల్పంతో వాళ్ళు ఉన్నారు." అని జేసీ తెలిపారు.
"నా భార్యకు పెరాలసిస్ వచ్చి.. ప్రస్తుతం నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గనుల పర్మిట్ల కోసం మరోసారి వస్తాను. ఇక్కడే కూర్చుంటా.. మైనింగ్‌కు పర్మిట్ ఇవ్వకుంటే అన్నం లేకుండా మాడి పైకి పోతాం. దాంతో వాళ్ల కోరిక కూడా నెరవేరుతుంది. ఇక్కడే కూర్చుని నిరాహారదీక్ష చేస్తా. సోమవారం కూడా గనుల శాఖ ఏడీ గారు దొంగ క్యాంపుకు పోతే పోనీ ఏం చేస్తారు. నాకు సత్కారం చేయడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. ఇటువంటి ఎన్నో సత్కారాలు అనుభవించిన పెద్దవాణ్ని. అందరికీ చెబుతున్నా.. ఇపుడు మీరు నాకు సత్కారం చేస్తారు. అందుకు రెట్టింపు సత్కారం మీకు కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది. అపుడు నాకు సత్కారం చేసే పెద్దవాళ్లకు సత్కారం చేసి మా రుణం తీర్చుకుంటాం.. ఇంతకంటే ఘనమైన సత్కారం తీర్చుకోకతప్పదు" అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
గనుల శాఖ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన సమయంలో పోలీసుల వయ్వహారించిన తీరు పట్ల అయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలం మారుతోందని, జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. పోలీసులు ట్రాన్సఫర్లకు బయపడి ఊడిగం చేస్తున్నారని, పోలీసులు ఇలా బానిసల్లా ఎందుకు బతుకుతున్నారో అర్థంకావడంలేదని అయన అన్నారు. "మా ప్రభుత్వం వస్తే... మేం కాదు, మా కార్యకర్తలే మీ సంగతి చూసుకుంటారు. చాలా తొందర్లోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వస్తుంది... అప్పుడు వచ్చే పాలకులు ఇప్పటివాళ్లకన్నా నాలుగింతలు దుర్మార్గులు వస్తారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి?" అని అయన ప్రశ్నించారు. మీరంతా ఓ నియంత చెప్పినట్టు చేస్తున్నారు, ఆ నియంత ఎంతకాలం ఉంటాడో తెలుసా? ముస్సోలిని, హిట్లర్ వంటి మహామహులైన నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు మాకు సన్మానం చేసిన అధికారులు త్వరలో అంతకు రెట్టింపు సన్మానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అయన అన్నారు.