పాతబస్తీలో బతుకమ్మ సందడి! గ్రేటర్ ఎన్నికల ఎఫెక్ట్
posted on Oct 10, 2020 @ 2:17PM
తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణి ప్రారంభమైంది. గత నాలుగేండ్లుగా దసరా ముందు బతుకమ్మ చీరలను పంచుతున్నారు. అయితే ఈసారి గ్రేటర్ హైదరాబాద్ లో బతుకమ్మ చీరల పంపిణిలో సందడి కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలు ఎక్కువ హడావుడి చేస్తున్నారు. కరోనా భయపెడుతున్నా పట్టించుకోకుండా అట్టహాసంగా చీరల పంపిణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓల్డ్ సిటీలోనూ జోరుగా చీరల పంపిణి జరుగుతోంది. గతంలో డివిజన్ కు ఒకటి, రెండు చోట్ల మాత్రమే చీరల పంపిణి జరిగేది. కాని ఈసారి కాలనీలు, గల్లీలో సభలు పెట్టి చీరల పంచుతున్నారు నేతలు. ఓల్డ్ సిటీలో ఎంఐఎం నేతలు కూడా చీరల పంపిణిలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనంతటికి త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే కారణమంటున్నారు. బతుకమ్మ చీరల పంపిణిని తమకు అనుకూలంగా మలుచుకుంటా ఎన్నికల ప్రచారం మెదలుపెడుతున్నారు కొందరు నేతలు.
ఓల్డ్ సిటీలో బతుకమ్మ చీరల పంపిణి హడావుడి కనిపించడం కొత్తగా కనిపిస్తోంది. నిజానికి హిందువులు జరుపుకునే దసరా పండగ సందర్భంగా పంచే బతుకమ్మ చీరలను వేరే మతస్తులకు ఇవ్వడంపై మొదటి నుంచి ఆరోపణలున్నాయి. రంజాన్ , క్రిస్టమస్ సమయంలో ఆయా వర్గాల వారీకే దుస్తులు పంపిణి చేస్తున్నారని, దసరాకు మాత్రం అన్ని వర్గాల వారికి ఇవ్వడమేంటనీ కొందరు ప్రశ్నించారు. అయినా కేసీఆర్ సర్కార్ మాత్రం తన తీరు మార్చుకోలేదు. ప్రతి ఏటా దసరా ముందు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులుగా ఉన్న మహిళలందరికి చీరను కానుకగా ఇస్తోంది. గత నాలుగేండ్లుగా చీరల పంపిణి జరుగుతున్నా... ఓల్డ్ సిటీలో పెద్ద హడావుడి ఉండేది కాదు. పాతబస్తీలో పట్టున్న ఎంఐఎం నేతలు చీరల పంపిణిని పెద్దగా పట్టించుకునే వారు కాదు.
ఈసారి మాత్రం గతానికి భిన్నంగా ఓల్డ్ సిటీలో కొత్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంఐఎం ప్రజా ప్రతినిధులు, నేతలు బతుకమ్మ చీరల పంపిణిలో జోరుగా పాల్గొంటున్నారు.గల్లీ గల్లీకి సభలు ఏర్పాటు చేసి హంగామా చేస్తున్నారు. ఎెంఐఎం పార్టీ సీనియర్లు, ముఖ్య నేతలు కూడా బతుకమ్మ చీరల పంపిణిలో పాల్గొంటుండటం చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ ఎన్నికల కోసమే వీరంతా చీరల పంపిణిలో పాల్గొంటున్నారనే చర్చ పాతబస్తీలో జరుగుతోంది. ఓల్డ్ సిటీలో ఎక్కువగా పేదలు ఉంటారు. వారికి సర్కార్ ఇచ్చే బతుకమ్మ చీరను పెద్ద కానుకగా భావిస్తారు. ఇదే సెంటిమెంట్ ను తమకు ప్రయోజనం కలిగేలా నేతలు మలుచుకుంటున్నారు. చీరలు పంపిణి చేస్తూ.. లబ్దిదారుల ఓట్లను తమకు మద్దతుగా
మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో ఓల్డ్ సిటీలో ఈసారి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఓ వర్గం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓల్డ్ సిటీలో సరికొత్త దృశ్యాలు కనిపించేలా ఉన్నాయి. ఎంతకైనా ఎన్నికల కోసం పార్టీలు ఏమైనా చేస్తాయనడానికి, నేతలు తమకు నచ్చని పనులు కూడా చేస్తారన్నదానికి హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిణామాలే ఉదాహరణగా నిలుస్తాయని మరికొందరు చెబుతున్నారు.