మహారాజా కళాశాలని భ్రష్టు పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి
posted on Oct 10, 2020 @ 4:29PM
విజయనగరం మహారాజా కళాశాల ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. మహారాజా కళాశాల చారిత్రక నేపథ్యం ఉన్న విద్యాసంస్థ అన్నారు. వందేళ్ల క్రితమే విశాఖలోనూ విద్యాసదుపాయాలు లేని రోజుల్లో విజయనగరం మహారాజా కళాశాల ప్రముఖ విద్యాకేంద్రంగా బాసిల్లిందని తెలిపారు. వీవీ గిరి వంటి ప్రముఖుడు రాష్ట్రపతి హోదాలో ఆ కళాశాలకు విచ్చేశారని గుర్తుచేశారు.
ఇప్పటి ప్రభుత్వ హయాంలో ఆ కళాశాలని భ్రష్టు పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ కళాశాల పూర్వ విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారన్న ఆయన.. వారు ఇళ్లల్లో కూర్చుని వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలతో సరిపెట్టకుండా, రోడ్లపైకి వచ్చి పోరాడాలని రఘురామకృష్ణరాజు సూచించారు.
"అర్ధరాత్రి ఎవర్నో తీసుకువచ్చి ట్రస్టులో కూర్చోబెట్టి తప్పు చేశారు. మా ప్రభుత్వం ఆ తప్పును సరిదిద్దుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఈ పరిస్థితిని మార్చాల్సింది మహారాజా కళాశాల పూర్వ విద్యార్థులే. ట్రస్ట్ నియామవళి ప్రకారం ఎవరికైతే అర్హత ఉందో, ఆ నిజాయతీపరుడైన ట్రస్టీని మళ్లీ తీసుకువచ్చేవరకు పోరాడండి. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలను, సింహాచలం దేవస్థానంలో జరిగే అన్యాయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. న్యాయం తప్పకుండా జరుగతుంది." అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.
మరోవైపు.. మహారాజా కళాశాల అధ్యాపకులు, పూర్వ అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు, మహారాజా కళాశాల పరిరక్షణ సమితి ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు. మహారాజా కళాశాల పరిరక్షణకు సమష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా మహారాజా కళాశాల రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ శివరామమూర్తి మాట్లాడుతూ.. మహారాజా కళాశాలను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం అన్యాయమని, ఈ నిర్ణయంతో పేద విద్యార్థులకు విద్య దూరమైనట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు.
మహారాజా కళాశాల పరిరక్షణ కమిటీ చైర్మన్ సురేష్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. మహారాజా కళాశాలను ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తానికి మహారాజా కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయం.. పోరాటానికి దారితీసే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.